మాటలు – చేతలు

-కందేపి రాణి ప్రసాద్

          ఒక కుందేలు తన పిల్లలతో సహా బొరియలో నివసిస్తోంది. ఈ బొరియ చెట్టు కిందనే ఉన్నది. చెట్టు మీదుండే పక్షులన్నీ కుందేలుతో స్నేహంగానే ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కుందేలు కూడా వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు స్నేహాలు బాగుండా లని కుందేలు కోరుకుంటుంది.
 
          కుందేలుకున్న నాలుగు పిల్లలు ఆటలు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటాయి. దగ్గర్లో ఉన్న పొలాల్లో ఆడుతూ ఉంటాయి. మొక్క జొన్న చేలల్లో దాగుడు మూతలు ఆడుతాయి. మొక్కజొన్న మొక్కలు ఏపుగా పెరిగి గుబురుగా ఉన్నాయి. చెట్టు వెనకా దాక్కుని కుందేలు పిల్లలు ఆటలాడతాయి. కంది పంటల్లో తిరుగుతూ కంది కాయలు తినేస్తుం టాయి. మొక్క జొన్న, జొన్న పోలాల్లో కంకులు తింటుంటాయి. కడుపు నిండా తింటూ ఆటలు ఆడుకుంటూ సరదా పడుతుంటాయి.
 
          ఇదిలా పొలాల్లో ఆడుకుంటుండగా పై నుంచి పక్షులు ఎగిరిపోవడం చూశాయి. అబ్బా!, ఇది ఎలా ఎగురుతున్నాయి, చక్కగా ఎగురుకుంటూ ఎన్నో ప్రాంతాలు చూసి వస్తున్నాయి. ‘వీటి అదృష్టం ఎంత బాగుందో’ అని మురిసి పోయాయి.
 
          మనం కూడా అలా ఎగిరితె ఎంత బాగుంటుందో కదా! అనుకున్నాయి కుందేలు పిల్లలు. మనం ఎప్పుడూ పోలాల్లో, మైదానాల్లో మాత్రమే తిరుగుతుంటాము. కానీ పక్షులకు అన్ని ప్రాంతాలూ చూసే అవకాశం ఉన్నది అని వాటిలో అవి మాట్లాడుకుంటూ నిస్పృహగా మారాయి.
 
          ఒకరోజు పక్షులతో మాట్లాడుతున్నపుడు కుందేలు పిల్లలు తమ మనసులో మాటను చెప్పాయి. “మాక్కూడా ఆకాశంలో ఎగరాలని చాలా కోరికగా ఉన్నది” అంటూ తమ కోరికను బయట పెట్టాయి. “ఓస్ ఇంతేనా! ఇదెంతసేవు రెక్కలు టపటపలాడిస్తే ఎగిరేయచ్చు” హుషారుగా చెప్పాయి పక్షులు. “కానీ మాకు రెక్కలు లేవుగదా! మేమెలా ఎగరగలం” అన్నాయి కుందేలు పిల్లలు. “మా వీపు మీద కూర్చుని ఎగరవచ్చు.” పక్షులు సరదాగా చెప్పాయి.
 
          పక్షుల మాటలు విన్న కుందేలు పిల్లలు ఎగిరి గంతేశాయి. “అయితే మమ్మల్ని ఎప్పడు తీసుకెళతారు”? అంటూ మూకుమ్మడిగా అడిగేశాయి. “మీరెప్పుడు తీసుకెళ్కమంటే అప్పుడే తీసుకెళతాం. ఇదేమీ పెద్ద పని కాదు” అని పక్షులు చెప్పాయి.
 
          “అవును గానీ ఇంతకీ మా బరువును మీరు మోయగలుగుతారా ? “ అనుమానంగా ఒక కుందేలు పిల్ల అడిగింది . “ఏమీ పర్లేదు. మీ బరువు పెద్ద లెక్కే కాదు” అని పక్షులు చెప్పడంతో కుందేలు పిల్లలు ఎగిరి గంతేశాయి.
 
          సంతోషంగా ఇంటికి వెళ్ళిన కుందేలు పిల్లలు తమ తల్లితో ఈ విషయం చెప్పాయి. “అమ్మా మేము పక్షులతో పాటు ఆకాశంలో ఎగురుతాము” అంటూ మొహాలు వెలిగి పోతుండగా చెప్పాయి. “పక్షులతో మీరెలా ఎగురుతారు? అంటూ అమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ‘పక్షి వీపుమీద కూర్చోబెట్టుకుని ఎగర వచ్చట, అయ్యో నీకీ విషయం తెలీదా?’ అన్నట్లు అమ్మను చూస్తూ కుందేలు పిల్లలు చెప్పాయి.
 
          ‘చూడండి పిల్లలూ! పక్షి బరువుతో మాత్రమే అవి పైకెగరగలుగుతాయి. మీరు వాటి వీపు మీద కూర్చంటే బరువు ఎక్కవై ఎగరలేవు. లేదా కొద్దిగా ఎగిరాక బరువు మోయలేక మిమ్మల్ని వదిలేయవయ్ఛ ‘ అని హితవు పలికింది కుందేలు. కానీ పిల్లలు అదేమీ వినకుండా మొండికేశాయి. “పక్షులు మమ్మల్ని తీసుకెళతానని చెప్పాయి. నువ్వెందుకు వద్దంటున్నావు” అంటూ ఏడుపు మొదలు పెట్టాయి.
 
          కుందేలు పిల్లల్ని అనునయిస్తూ ఇలా చెప్పింది. “మిమ్మల్ని తీసుకెళ్ళటానికి పక్షులు ముందుకు రావడం సంతోషంగా ఉన్నది. స్నేహధర్మం పాటించడం మంచిదే కానీ మన భద్రత చూసుకోవడం కూడా ముఖ్యం. పూర్వకాలంలో ఒక తాబేలు కూడా మీలాగే ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్నది అందుకే ఎప్పుడూ తొందరపాటు కూడదు. ప్రాణాలు పోయే పనుల్లో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి. పక్షులు నీకు సహాయం చెయ్యాలనుకున్నాయి. అయినప్పటికీ మన జాగ్రత్త కూడా మనం చూసు కోవాలి. ఏ పనైనా మాటల్లో చెప్పడం వేరు. చేతల్లో చెయ్యడం వేరు. ఇందుకు ముందు ఎప్పుడైనా పక్షులు ఇలా తమ మీద ఏ జంతువునైనా ఎక్కంచుకుని తిరగడం చూశారా! లేదు కదా ! మరి ఎవరూ చేయని పనిని చేసేటప్పుడు ఎంతో ఆలోచన చేయాలి. మీరు చిన్న పిల్లలు కాబట్టి ఈ ఆలోచనలు చెయ్యలేరు. అందుకే మీకు ఈ విషయాలు చెప్తు న్నాను.”
 
          పిల్లలు గ్రిలుగా వింటున్నాయి. కానీ పూర్తిగా అర్థం అయీ కానట్లుగా ఉన్నది. మొత్తానికి ఏదో ప్రమాదం జరగచ్చు అన్న విషయం అర్థమవుతున్నది. ఎలా ప్రమాదం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లలు చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత మాట్లాడాయి.
 
          “అమ్మా! మాకు పూర్తిగా తెలియక పోయినా నీవు చెప్పిన మాట వింటామమ్మా. మా గురించి జాగ్రత్తలు అమ్మ కాక మరెవరు తీసుకుంటారు. అందుకే నువ్వెలా చెప్తే మేమలా చేస్తాం” కుందేలు పిల్లలు ధృఢంగా చెప్పాయి.
 
          కుందేలు తన పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. “ఏ పనైనా అంచనా వేసినట్లే జరగాలని లేదు. మన శరీరం బొరియల్లో నివసించడానికి అనువుగా ఉటుంది. ఎవరికి తగ్గ పని వారు చేసుకోవాలి. పక్షులు బొరియల్లో నివసించగలవా? లేదు కదా! మన శక్తి సామార్థ్యాలను బట్టి పనులు చేసుకోవాలి. ఒకరిని చూసి ఆశ పడకూడదు. మీరు నా బంగారు తల్లులు. చెప్పిన మాట చక్కగా అర్థం చేసుకుంటారు” అని కుందేలు పిల్లలను తీసుకుని బొరియలోకి వెళ్ళింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.