అదే కావాలి

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-బి.హరి వెంకట రమణ

          “ఇవేమి షిఫ్టులు రా నాయనా అర్ధరాత్రి కాడ రోడ్డు దిగి ఇంటికి వెళ్ళాలంటే ప్రతి రోజూ ప్రాణాలు ఉగ్గబెట్టుకు వెళ్ళాల్సొస్తోంది” బస్సు తమ ఊరి దగ్గరకు సమీపిస్తుంటే పైకే అనేసింది వెంకట లక్ష్మి.

          చీకటిని చీల్చుకుంటూ వెళుతోన్న బస్సు వల్ల అమావాస్య రోజులని తెలుస్తోంది.
రోడ్డుకు అటూ ఇటూ వున్న తుప్పలు, చెట్లు అన్నీ నల్ల రంగే పులుముకొని వున్నాయి.
బస్సు సరిగ్గా మరిడిమాంబ గుడి ముందు ఆగింది. గుడి లోపల చిన్న లైటు, అమ్మవారి ముందర దీపం వెలుగుతున్నాయి.

          “ముసిల్ది రాలేదేమి , ఓర్నాయనో ఇప్పడు ఇంటి వరకు ఒక్కదాన్నే నడుసుకొని
ఎల్లాలా ?” కొంచెం భయంగా బయటకే అంది. తిరిగి వెనక్కు చూస్తే కంపెనీ బస్సు ఆ చీకట్లో ముందుకు వెళ్ళిపోయింది. 

          “దిక్కుమాలిన వూర్లో వీధి లైట్లు కూడా శుభ్రంగా వెలిగి సావవు, ఒక వేళ వెలిగినా ఈ
తాగుబోతు గుంటలు వాటిని రాయిచ్చుకుని రప్పిచ్చుకుని మండ బెట్టేస్తుంటారు”
మనసులో వున్నది ఎవరూ లేని చోట పైకి అనేయడమే వెంకట లక్ష్మి అలవాటు. ముసిల్దా నికి ఏమొచ్చింది ? వొంట్లో బాగోలేదా ? పొద్దున్నే చెరువు పనికి వెళ్ళింది కదా. వొచ్చాక అన్నం తిన్నాది. టీవీలో పాస్టర్ గారి ప్రార్ధన విన్నాది . దానికి బాగుందనే కదా ఈ షిఫ్టుకు బయలుదేరింది. లేదంటే ఈ లంపటం అంతా తనకెందుకు. ఒక రోజు జీతం కట్టయ్యి పోయినా పర్లేదు.

          ఉండటానికి వంద కొంపల వూరు గానీ , ఇక్కడున్నంత రాజకీయం ఎక్కడా ఉండదు. పైగా గుంట నా కొడుకులకు పగలు రాత్రి తేడా లేకుండా తాగుడు, గంజాయి అలవాట్లు. ఆడది కనపడితే చాలు ఆబగా చూడటం. వెంకట లక్ష్మి పాల కేంద్రం దాటి వెళుతోంది. నడక వేగం పెంచింది. హ్యాండ్ బాగ్ లోంచి ఫోన్ తీసి పట్టుకుంది.
ఇంకొంచెం దూరం వెళితే అంగన్వాడీ కేంద్రం, అది దాటి రెండు మలుపులు తిరిగితే
ఇంటికి చేరిపోయినట్లే. 

          చీకట్లో రెండు ఆకారాలు ఇవతలకు వొచ్చాయి. బలంగా వున్నాయి. ఫోన్ తీసి అమ్మకు చేసింది.. రింగవుతోంది గాని ముసిల్ది తీయటం లేదు.

          తీయక పోయినా సరే “ఆ .. వొచ్చీసాను, ఇదిగో అంగలబడి దాటేస్తన్నాను” అని
మాట్లాడుతున్నట్టు ఏక్షన్ చేస్తోంది. ఈ లోగా మీదకు వొచ్చిన ఆకారాన్ని చూసి “ఏరా తమ్ముడూ” అంది. తమ్ముడు అన్న పదార్ధం నుంచి ఉలుకూ పలుకూ లేదు, వెంకట లక్ష్మి చేయి గట్టిగా పట్టుకుని ఆమెను వెనక్కు తిప్పి గట్టిగా వాటేసుకుని, నోరు  మూసేసా డు. ఆ గాభరాకి ఫోను కింద పడిపోయింది. “అమ్మా” అని గట్టిగా అరుద్దాము అనుకుంది.
కానీ నోరు మూసి వుంది కదా పెగలలేదు. తమ్ముడూ అని పిలిచిన వాడి దగ్గర మందు వాసన. మరొకడున్నాడు గాని ఉలుకూ పలుకూ లేదు, అటు ఇటూ గాభరాగా  చూస్తున్నా డు.

          ఇద్దరూ అంగన్వాడీ గేటు వైపు లాక్కెళుతున్నారు. నెత్తి మీద కర్రదెబ్బ ఫట్.. మని పడింది.

          “అమ్మా …” అన్న కేక వినిపించింది.

* * *

          దుస్తుల కంపెనీలో పనిచేస్తుంది వెంకట లక్ష్మి, తనే కాదు ఆ టౌన్ ని ఆనుకున్న
ఒక వంద గ్రామాలలో ఆడోళ్ళంతా అందులోనే పనిచేస్తారు. కుట్టుపని వొచ్చిన వాళ్ళంతా చేరిపోయారు, కుట్టింది విదేశాలకు సరకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కంపెనీ ఇక్కడ వాళ్ళది కాదు. సూపెర్వైజర్లే ఇక్కడి వాళ్ళు. రోజంతా రంగు రంగుల బ్రాలు , లో దుస్తులు రక రకాల సైజులో కుట్టాలి. రోజుకు ఇంతని టార్గెట్టు. ఊర్లను కలుపుతూ బస్సులు తిరుగు తుంటాయి. రోజుకు రెండు షిఫ్టులు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఒక షిఫ్టు. మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది వరకు ఒకటి. పొద్దున్న డ్యూటీ అయితే అయిదింటికి బస్టాపులో ఉండాలి. రాత్రి డ్యూటీ పదికి కంపినీ దగ్గర దిగితే గ్రామాలకు చేరడానికి గంటైనా పడుతుంది. ముసిల్ది కర్రతో వొచ్చి బస్టాపు దగ్గర దిగబెడుతుంది. తీసుకెళుతుంది. పొద్దున్న షిఫ్ట్ అయితే ఇంత టిఫిన్ పట్టికెళిపోతుంది, ఇంటికి వొచ్చాక
మూడింటికి తిని పడుకుంటుంది. మధ్యాహ్నం షిఫ్ట్ అయితే శుభ్రంగా తినేసి, రాత్రికి కొంచెం టిఫిన్ పట్టికెలుతుంది, లేదంటే కేంటీన్ లోనే తినేయాలి, అదొక దండగమారి ఖర్చు.

          “ఏం చేస్తున్నావే బస్సు కాడకి ఎందుకు రాలేదు, కొంచెముంటే ఆ నా కొడుకుల
చేతిలో నలిగి పోదును, బతకనిద్దురో.. సంపీద్దురో తెల్దు”

          “వొంట్లే బాలేదే” అంది తల్లి కర్ర గోడ వారకు పెడుతూ.

          వెంకట లక్ష్మి మంచం మీదకు హ్యాండ్ బాగ్ విసిరేసి, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వొచ్చింది. మూసి వున్న ఇంటి కిటికీలు తెరిచింది. గాలి ఇంట్లోంచి వొచ్చి బయటకు వెళుతోంది. కొంచెం వొళ్ళు చల్లబడినట్లయ్యింది. తల్లి కొంచెం అన్నం, కూర కంచంలో తెచ్చింది, కానీ అదలా మూత పెట్టేసి కొంచెం మజ్జిగ కలిపి తాగింది. నైటీ లో మోకాళ్ళు దగ్గరకు లాక్కొని తల్లిని చూస్తోంది, ఆ చీకట్లో ఇంకా పెద్ద దానిలాగా కనపడుతోంది. ముసిలి అని పిలుస్తుంది గాని దాని వయసు యాభై కూడా దాటవు , కానీ వయసుకు మించిన పెద్దరికం. పదిహేనేళ్ళ కిందట మనవరాలు పుట్టినప్పుడే అది అమ్మమ్మ
అయిపోయిందది.

* * *

          దానికి ఏ వయసులో పెళ్ళయిందో తను ఆలోచించలేదు గాని, తనకు మాత్రం పది తరువాత సెలవులకు హాస్టల్ నుంచి వొచ్చినపుడు పెళ్ళి చేసేసింది. అప్పటికే పెళ్ళిళ్ళ కు వంటలు చేసే తండ్రి ఓ రోజు ఇద్దరు ఆడ పిల్లల్ని దీని ఎదాన వొదిలేసి చెప్పా పెట్ట కుండా మాయమైపోయాడు. కొందరు చచ్చి పోయాడన్నారు, మరికొందరు వారణాసి వెళ్ళిపోయాడన్నారు, లేదు విజీవాడలో వున్నాడు హోటల్ లో పనిచేస్తున్నాడేమో అన్నారు.

          ఏడ్చింది, అప్పుడే పెళ్ళి వొద్దంది , కానీ వినలేదు. మంచి సంబంధం ఆస్తి, పాస్తీ వున్నాయంది. ఆడికింత వొండి పెడితే చాలంది.

          పెళ్ళయ్యింది, ఎక్కడో ఒక పూట ప్రయాణం చేస్తే వొచ్చే కొండలవతల వూరు.
పెళ్ళయ్యాక తెలిసింది, మొగుడుకి పని గండం ఉందని, దగ్గర్లో ఎవరూ ఆడికి పిల్ల నివ్వరు కాబట్టి మాకు మాయ మాటలు చెప్పి చేసుకున్నారని. ఆడపడుచు, అత్త , మావ, దాని మొగుడు పిల్లలు అందరూ అక్కడే వుంటారు. ఆస్తులూ లేవు, పిండాకూడు లేవు. ఆడపడుచుదే పెత్తనం, అదిక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలో రెసెప్షనిస్టు , మాటకారి, మొగుడు దద్దమ్మ. ఇంటిల్లి పాదికి ఆవిడే ఆధారం. కూర్చొని తినడానికి కుదరదు, దగ్గర్లో వున్న షాపులో పని చూసాను వెళ్ళమంది. 

          వెళ్ళేది, వొచ్చేది. ఒక పువ్వులు లేవు, సినిమా లేదు, షికారు లేదు, శుభ్రమైన కూర అన్ని రోజులూ వండరు , టిఫిన్ లు వుండవు. “ఛీ .. ఇదా జీవితం” అని తిట్టుకొని ఒకరోజు షాపులో జీతం ఇచ్చాక చేతి సంచిలో ఎన్ని బట్టలు పడితే అన్నే తీసుకొని ఇంటికి వొచ్చేసింది. వొచ్చాక తల్లిని దులపరించి పారేసింది.

          వారం రోజులు తినడం , పడుకోవడం, తరువాత పాత స్నేహితురాళ్ళని కలిసింది.
ఒకదాని జీవితం బాగుంటే మరోదానిది బాగోదు. సెంటర్లో కుట్టు పని ఉచితంగా నేర్పుతు న్నారంటే వెళ్ళింది. తరువాతి నెలకు కడుపుతో ఉందని తెలిసింది.

          “కడుపు రావాలంటే మొగుడు నచ్చాలని లేదు కదా” అంది. అప్పటికే చెల్లి పెళ్ళి కూడా అయిపోయింది , తనకు చేసిన పొరపాటు దానికి చేయలేదు, దాన్ని దగ్గరలోనే ఇచ్చుకుంది. కూడుకు, గుడ్డకు లోటులేని అత్తోరు దానికి.

          తల్లి రంగుల కంపెనీలో పనికి వెళ్ళడం మొదలు పెట్టింది.

* * *

          బయట మైదానం నుంచి చల్లటి, హాయైన గాలి వేస్తోంది. తల్లి లెగిసి బిందెలో నీళ్ళు తాగి తనకి ఓ గలాసుడు ఇచ్చింది. జీవితమంతా ఇలా హాయైన గాలిలా ఉంటే బాగుణ్ణు, కానీ అది ఎండలు మండే వేసవిలా కాల్చేసింది తనని.

          అవతల చాప మీద తల్లి పడుకుంది.

          పదిహేనేళ్ళ కూతురు అన్నం సందకాడే తినేసి టీవీ చూసేసి మంచం మీద పడుకోనుంది. బొంత ఒకటి నేలమీద పరుచుకొని దుప్పటి కాళ్ళ వరకు కప్పుకుంది.

* * *

          మొగుడొచ్చాడు ఒక రోజు.

          “ఇక్కడ వుండేట్టయితేనే వుండు. మా పిల్ల రాదు మీ కాడకి” అంది తల్లి. అత్త రంగు ల కంపెనీలో పనిచేస్తే, పెళ్ళాం వొండి పెడితే మప్పితంగా తింటున్నాడు అల్లుడు.
ఉద్యాగానికెళ్ళమని వెంకటలక్ష్మి తిట్టి పోసింది. పగలంతా ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఇంటికి చేరుతున్నాడు. పని మాత్రం చేయటం లేదు.

          “బాబూ , మాకు వొచ్చేది మా ఇద్దరం తినడానికే సరిపోద్ది, పైగా దాని కడుపులో
ఇంకో ప్రాణి , నీకు రెండు చేతులతో వందనాలు చెబుతాను గాని మా ఇంటి నుంచి
దయచేయు తండ్రీ” అంది.

          అలా వెళ్ళిపోయినోడు మరి తిరిగి రాలేదు.

          ఆడ పిల్ల పుట్టింది, దానిని అంగన్వాడీలో వేసే వరకు ఇంటి పట్టునే ఉండేది “
అదెప్పుడయితే స్కూలుకు వెళ్ళడం మొదలు పెట్టిందో, తల్లితో రంగుల కంపెనీ
పనికి వెళ్ళింది. ఆ వాసనకు కడుపు తిప్పేసేది , పైగా అప్పుడపుడు వాంతులు. అలా కష్టపడి కొన్నాళ్ళు చేసాక, ఇదిగో ఈ లో దుస్తులు కుట్టే కంపెనీలో ఖాళీలు వున్నాయంటే చేరింది.

          మెడికల్ టెస్టులు చేసి, కంటి చూపు, జబ్బ సత్తువ ఉంటేనే తీసుకుంటున్నారు.
అప్పటి నుంచి ఈ అరవ చాకిరీ చేస్తూనే వుంది. ఎవరి కోసం, కూతురి కోసం, దానికి బంగారం చేయించింది, బట్టలు కొన్నాది. చీటీ వేసి డబ్బు కూడబెట్టింది.

          కంపెనీలో పని అంత సులువు కాదు, ఎగిరే దారాలు ఊపిరి తిత్తులలోకి  వెళ్ళి పోతాయి. కుట్టీ .. కుట్టీ నడుం విరిగి పోతాది. కానీ ఇంత కష్టపడిన తను పెద్ద తప్పు చేసేసింది. తన తల్లి తనకు ఏం చేసిందో, అదే తప్పు తనూ తన కూతురికి చేసేసింది.
అది గుండెల మీద కుంపటిలా భావించి తనని వదిలించుకుంటే, తను వూర్లో కుర్రోళ్ళు
సరిగాలేరు , ఇదసలే తింగరిది అని పదో తరగతి మధ్యలో దసరా సెలవలకి వూరు తీసికెళ్ళి పెళ్ళి చేసేసింది.

          “ఇప్పుడసలు కాపురమే చేయడు , పిల్ల మాదనిపించుకోవడానికి ఈ పెళ్ళి అంది “
పెళ్ళికొడుకు తల్లి.

          “పిల్లాడు హైద్రాబాద్లో ఉంటాడు, ప్రయివేటు కంపెనీ పని, పిల్లకు పందొమ్మిది
వొచ్చాకే కాపురానికంపుదాం”

          “మాకు పిల్ల ముఖ్యంగాని, కట్నాలు కాదంది”

          “పిల్లకు నేను అత్తనా? కాదు తల్లిని అంది”

          పెళ్ళిఖర్చులు , పెట్టి పోతలతో డబ్బంతా నాకించేసింది. పోనీలే దానికోసరమే కదా దాచినవే పిల్ల బాగుంటే అదే చాలు అనుకుంది. గుట్టు చప్పుడు కాకుండా ఊరి నుంచి వొచ్చాక, మెట్టెలు, తాళి తీసి దేవుడు పటం ముందు పెట్టి బడికి పంపింది.

          పంపి వారం తిరగలేదు, ఒక రోజు ప్రభుత్వాధికారులు, మహిళా పోలీసు, అంగన్వాడీ
టీచరు,హెడ్ మాస్టారు , గ్రామ సర్పంచు అందరూ ఇంటి దగ్గర దిగబడి పోయారు.
“మీ పిల్లకు ఇష్టం లేని పెళ్ళి చేసావు నేరం” అన్నారు. రెండురోజుల్లో పెళ్ళి కొడుకు తల్లిని, తండ్రిని, పిల్లాడిని పిలిపించారు. కేసు వివరాలు చెప్పారు, “జైలు కెళతారా పెళ్ళి రద్దు చేసుకుంటారా ?” అన్నారు.

          చివర్లో సర్పంచ్ కలుగ జేసుకొని మనూర్లో బాల్యవివాహం జరిగింది అంటే ఊరికి
చెడ్డపేరు కనుక నేను హామీగా పిల్లను డిగ్రీ వరకు చదివిస్తానని , ఈ పెళ్ళి చెల్లదని ఒక పత్రం రాద్దాం అన్నారు. అందరూ కూడబలుక్కొనే ఈ పని చేసారని అర్ధం అయ్యింది తనకు.

          పెళ్ళికొడుకు తల్లీ , తండ్రీ, పిల్లాడు, పిల్లా, తను , అందరూ సంతకాలు పెట్టారు.
“నల్ అండ్ వాయిడ్” పెళ్ళి ఇక చెల్లనట్లే అన్నారు.

          వివరం కనుక్కుంటే వూరినించి తిరిగి వొచ్చాక ముందుగా తన ఫ్రెండ్స్ కి తరువాత
క్లాస్ టీచర్ కి ఈ పెళ్ళి వ్యవహారం చెప్పిందట , విషయం ఇంత వరకు వొచ్చింది.
డబ్బంతా పోయినందుకు వారం రోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవడో చెయ్యి పట్టుకుంటాడని, బలవంతం చేస్తాడని, మోసం చేస్తాడని, పిల్లనెందుకు బలి చేయాలి, తల్లి తనని రాత్రి కాపాడినట్లే తనూ కూతురు వెంటే ఉంటుంది. ఒక్కసారి పిల్లను చూసుకోవాలనిపించింది, ఫోన్ లైటు ఆన్ చేసి కూతురి మొహం పై వేసింది, మంచి కలలు కంటుందేమో నిద్దట్లో నవ్వుకుంటుంది.

          “పొద్దున్న లేచి రాత్రి చేయి పట్టి లాగినోడి సంగతి తేల్చాలి, వాడికి తోడున్నోడికి వాతలు పెట్టాలి. ఇది కూడా వూరికి చెడ్డ పేరే కదా, సర్పంచు ముందు, మహిళా పోలీసు ముందు ఈ సంగతి తేల్చాలి. తమ కులపోడే కదా అని సర్పంచ్ మెహర్బానీలు చేస్తే దులపరించి పారేయాలి” అని పైకే అనేసి మొఖం మీదకి దుప్పటి లాక్కొంది వెంకట లక్ష్మి.

          ఇవేమి తెలియని నక్షత్రాలు మినుకు మినుకు మంటూ మానవజాతి పై వెలుగు
ప్రసరించాలని చూస్తున్నాయి.

*****

Please follow and like us:

One thought on “అదే కావాలి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

Leave a Reply

Your email address will not be published.