ఎలుక మెడలో గంట

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-రామలక్ష్మి జొన్నలగడ్డ

          “హలో, పద్మ గారేనా?” అంది అవతల్నుంచి ఓ ఆడ గొంతు.

          “ఔనండీ!” అన్నాను.

          “నేను శ్యామల. ‘అవగాహన’ నుంచి. మీ సమస్యకు సొల్యూషన్ చాలా సింపుల్” అందామె.

          ‘అవగాహన’ ఒక వెబ్‌సైట్. జీవితంలో ఎంతటి క్లిష్ట సమస్యనైనా- అవగాహనతో పరిష్కరించొచ్చని ప్రబోధిస్తుంది. ఏ పుట్టలో ఏ పాముంటుందోనని- నేను నా సమస్యని సవివరంగా ఆ సైటుకి నిన్న మెయిల్ చేశాను. నేడు ఫోనొచ్చింది. జస్ట్ రెస్పాన్స్ కాదు. ఏకంగా సొల్యూషనేనట. అదీ చాలా సింపుల్‌ట.

          “థాంక్స్ ఫర్ ది క్విక్ రెస్పాన్స్. చెప్పండి” అన్నాను ఆత్రుతగా.

          “అత్తాకోడళ్ళ సమస్యని ప్రస్తావించినప్పుడు- ఆడదానికి ఆడదే శత్రువని మహిళ లనే తప్పు పడతారు చాలామంది. అది నిజం కాదు. అత్తాకోడళ్ళని మహిళలుగా కాదు- పురుషాహంకార వ్యవస్థకు ప్రతినిధులుగా చూడాలి” అంది శ్యామల.

          “ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకుందుకు” విసుక్కున్నాను మనసులో, పైకి, “పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం- అన్నట్లుంది మీ పరిశీలన” అన్నాను.

          శ్యామల తన ఆంతర్యం వివరించింది.

          నా అత్త పిల్లి. నేను ఎలుక. అత్త చెలగాటమైనా, నా ప్రాణసంకటమైనా-మేమిద్దరం నా భర్తకిచ్చే ప్రాధాన్యం వల్లనే!

          “రాజకీయ పరిభాషలో చెప్పాలంటే- పిల్లి కేంద్రం. ఎలుక రాష్ట్రం. మగాడు ఓటరు” అంది శ్యామల.

          చాలా లోతైన వ్యాఖ్య అది. “ఇది తెలుసుకుని నాకేం ప్రయోజనం?” అన్నాను.

          “పిల్లి మెడలో గంట కట్టే ఉపాయం- అత్తాకోడళ్ళ విషయంలో చెల్లదు. అక్కడ అత్తకి చాటుమాట్లుండవు. చెలగాటంలో ప్రాణసంకటమే కానీ, ప్రాణాపాయముండదు. తప్పించుకుందుకు ఎలుకకున్న మార్గం ఒక్కటే- అది తన మెడలో గంట!”

          “ఎలుక మెడలో గంటా? అది పిల్లినుంచి దాన్నెలా రక్షిస్తుంది?” అన్నాను.

          “నాలుగు గోడల మధ్య బంధించి తలుపులు మూస్తే పిల్లి పులై భయపెడుతుంది. ఎలుక మెడలో గంట- పిల్లిమీద అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది” అంది శ్యామల.

          ఆమె చెప్పేది వింటుంతే, ‘నా సమస్యకు ఇంత సులభ పరిష్కారమా?’ అను కుంటూ ఆలోచనలో పడ్డాను.

***

          ప్రభాస్ ఆఫీసుకెళ్ళాడు. పిల్లలు స్కూలు కెళ్ళారు. అత్తమామలు నిద్రపోతున్నారు. అంతవరకూ ఇంటిపన్లతో బిజీగా ఉన్న నాకు- ఓ గంట ఆటవిడుపు. ఆ తర్వాత మళ్ళీ  బొంగరం తిరగడం మొదలెట్టాలి.

          ఏమిటి ఈ జీవితం? ఎందుకీ జీవితం?

          ఇంజనీరింగు చదివి ఓ ఏడాది ఉద్యోగం వెలగబెట్టాక అమ్మా నాన్నా నా కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రభాస్‌ని చూశారు. తను నాకంటే మూడేళ్ళు పెద్ద. అక్కకి పెళ్లై అమెరికాలో ఉంటోంది. తండ్రి స్టాక్‌బ్రోకర్. తల్లి హోమ్ మేకర్. స్వంతిల్లు. పెద్దలు చెప్పారని నన్ను చూడకుండానే ఓకే చేశాడు ప్రభాస్. అందుకతణ్ణి మా ఇంట్లో తెగ మెచ్చుకుంటే- తప్పనిసరిగా అనిపించి నేనూ అతణ్ణి చూడకుండానే ఓకే అన్నాను.
జాతకాలు సరిపోయాయి. కట్నకానుకల్లేవు. నేను ఉద్యోగం వదిలేసి గృహిణిగా స్థిరపడా లన్నదొక్కటే షరతు. ఈ షరతు వినగానే నాకు ముగ్గురు గుర్తొచ్చారు.

          ‘ఇంద్రా నూయీయో, నిర్మలా సీతారామనో కాకపోవచ్చు. మరీ వంటింటి కుందేలు మాత్రం కాకూడదు’ అంటుంది నా క్లాస్‌ మేట్ శోభ. ఇలా చదువవగానే అలా అమెరికాకి ఎగిరిపోయింది.

          ‘ఆడది కోరుకునే వరాలు రెండే రెండు- చల్లని సంసారం, చక్కని సంతానం’ అంటుంది అమ్మ. తనకి అర్థమైన మేరకు అదే మన సంప్రదాయం.

          ‘సుఖపడాలంటే సంపాదించే మొగుడూ, అనుభవించడానికి ఫ్రీటైమూ ఉండాలి. అత్తగారుండకూడదు’ అంటుంది బాల్య స్నేహితురాలు బృంద. నా  ఇంజనీరింగయ్యే సరికి తనకి పెళ్లై ఇద్దరు పిల్లలు. మామూలు ఆడపిల్లని. వాళ్ళని గుర్తు చేసుకున్నానే తప్ప- నిర్ణయాన్ని పెద్దలకే వదిలేశాను. ప్రభాస్‌తో పెళ్లైపోయింది. చూస్తూండగా పదకొండేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు బాబుకి పదేళ్ళు. పాపకి ఎనిమిది. అత్తింటివారికి వారసులనిచ్చాను. భర్తకి సుఖసంతోషాలనిచ్చాను. పిల్లలకి శిక్షణ ఇచ్చాను. మరి నాకేమిచ్చుకున్నాను?

          కొంతకాలంగా ఈ ప్రశ్న నన్ను వెంటాడుతోంది.

          శోభ అమెరికాలో పంజాబీ అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుని, ‘నే కోరుకున్న జీవితం ఇదే’ అంటుంది సంతోషంగా. బృంద విశాఖపట్నంలో ఉంటుంది. అన్ని పనులకీ మనుషులున్నారు. షాపింగు దానికి దినచర్య. ఎక్కడ ఏ ఫంక్షనైనా వస్తుంది. కట్టిన చీర మళ్ళీ కట్టదు. పెట్టుకున్న నగ మళ్ళీ పెట్టుకోదు. ‘నే కోరుకున్న జీవితం ఇదే’ అంటుంది గర్వంగా. ‘అనారోగ్యాల్లేవు. డబ్బుకిబ్బంది లేదు. పిల్లలు ఆణిముత్యాలు. నే కోరుకున్న జీవితం ఇదే’ అంటుంది అమ్మ తృప్తిగా. 

          నాకు సంతోషం లేదు. గర్వం లేదు. తృప్తి లేదు. ‘నే కోరుకున్న జీవితమేమిటి?’ అన్నదింకా ప్రశ్నగానే ఉంది, అత్తమామలు, భర్త, పిల్లలు- వీళ్ళకి సేవ!

          అందుకే నేను పుట్టానా? అందుకే పెరిగానా? అందుకే ఇంజనీరింగు చదివానా?
ఇలాంటాలోచన్లు పెళ్ళికిముందు రాలేదు. ఇప్పుడొచ్చాయంటే నా వైవాహిక జీవితంలో ఏదో అపశ్రుతి ఉండి ఉండాలి. ఆ అపశ్రుతి అత్తయ్యేనని తెలుసు. కానీ సవరించలేను. ఎందుకని?

          ‘ఉడికిందో లేదో తెలుసుకుందుకు అన్నమంతా అక్కర్లేదు. ఓ మెతుకు పట్టి చూస్తే చాలు’ అని సామెత. ఇందాకా జీవితంలో ఏం సాధించానో తెలుసుకుందుకు- ఒక్క రోజు చాలదూ! మచ్చుకి నిన్న….

***

          ప్రభాతవేళ.

          “ప్రేయసీ! నిన్ను అమృతంలా ఆస్వాదించాకనే నేను కళ్ళు తెరిచేది, మంచం దిగేది” అన్న ప్రభాస్ పలుకులు నాకు ప్రభాత పదములై మెలకువ తెప్పించాయి.
నిజానికప్పుడు ప్రభాస్ పలికింది ఒక్కటే పదం- ‘కాఫీ’ అని. ఆ పదం నా మెదడుని చిత్రదర్శినిగా (కెలైడోస్కోప్) మార్చి, అన్ని పదాలు స్ఫురింపజెయ్యడానికి కారణం పదకొండేళ్ళ వెనకాల ఉంది.

          అది నేను పెళ్లై కాపురానికొచ్చిన మొదటి ప్రభాతవేళ. రేయి గడిచిన హాయికి వళ్ళేరగని నిద్రలో ఉన్న నాకు, “ప్రేయసీ! నిన్ను అమృతంలా ఆస్వాదించాకనే నేను కళ్ళు తెరిచేది, మంచం దిగేది” అన్న ప్రభాస్ పలుకులు మెలకువ తెప్పించాయి.
‘పాచినోటితో ఇదేం కోరిక’ అని మనసులో అనుకుని, “బ్రష్ చేసుకొస్తా, నువ్వూ బ్రష్ చేసుకు రా” అని మంచం దిగాను. మంచం దిగుతాడనుకున్నాను. కానీ “నేను కాఫీ తాగడానికి, నువ్వెందుకూ బ్రష్ చేసుకోవడం?” అన్నాడు ప్రభాస్ కళ్ళు విప్పకుండానే.
అతడు ప్రేయసీ అన్నది కాఫీ నని అర్థం కావడానికి కొద్ది క్షణాలు పట్టింది.

          అతణ్ణి ఆట పట్టించాలని, ‘పిలచిన బిగువటరా’ అన్నాను రాగయుక్తంగా.
అతడింకా కళ్ళు తెరవకుండానే, ‘ఇప్పుడు నాక్కావలసింది పాట కాదు. కాఫీ!’ అన్నాడు.

          ‘నా పాట కాఫీయే’ అన్నాను.

          ‘పాట కాఫీ ఎలాగౌతుంది?’

          ‘అంటే కాఫీ రాగంలో వరస కట్టినదని అర్థం’

          ముచ్చట పడతాడనుకున్నాను. ‘కాఫీ రాగంలో పాడితే, పాట కాఫీ ఔతుందా? నాకు కప్పులో కాఫీ కావాలి’ అన్నాడు.

          ‘హౌ అన్‌రొమాంటిక్’ అనుకుని నిట్టూర్చాను. తర్వాత నెమ్మదిగా, ‘ముందు బ్రష్ చేసుకో. లేకుంటే కప్పులో నీ ప్రేయసి చీదరించుకుంటుంది” అన్నాను.

          “అమ్మో! ఏదో కవిత్వం ఒలకబోద్దామనుకున్నా కానీ, కాఫీని ప్రేయసి అనడంలో ఇన్ని చిక్కులున్నాయని తెలియదు. ఇకమీదట సూటిగానే అడుగుతాలే” అన్నాడు ప్రభాస్.

          భావుకతనైతే తెచ్చిపెట్టుకున్నాడు కానీ సరసత సహజంగా ఉండాలి కదా!
తర్వాత నుంచి అతడు మెలకువ రాగానే, ‘కాఫీ’ అన్న ఒక్క పదానికే పరిమితమయ్యాడు. నిద్రలేచేక కాఫీ మొదటి సిప్ అయ్యాకనే కళ్ళు తెరవడం అతడి ఫేవరేట్ మానరిజం.
పెరిగిన వాతావరణమో ఏమో- రాత్రి పడుకుని లేచేక బ్రష్ చేసుకోందే పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేను. అంతేనా, బెడ్ కాఫీ తాగేవాళ్ళని చూడ్డం కూడా వెలపరం నాకు.
అలాగని ఎదుటివాళ్ళని చిన్నబుచ్చలేం కదా! ఇలా ప్రభాస్‌కి కాఫీ ఇచ్చి అలా అక్కణ్ణించి వెళ్ళిపోతాను.

          నేనైతే కాఫీయే తాగను. అలాగని కాఫీ అంటే వెలపరం లేదు నాకు. ఇంట్లో అమ్మా, నాన్నా తాగుతారు. వాళ్ళకి చాలా సందర్భాల్లో నేనే కాఫీ పెట్టేదాన్ని.

          “తను తాగదు కానీ, మా మనవరాలి కాఫీముందు శాంతినివాస్ హొటల్ కాఫీ కూడా దిగదుడుపే!” అని మెచ్చేవాడు తాతయ్య. మా ఇంట్లో కాఫీగత ప్రాణి ఆయన.

          అత్తారింట్లో ఐతే ప్రభాస్, అత్తయ్య, మామయ్య అంతా కాఫీగతప్రాణులే! ప్రభాస్‌కి లేస్తూనే బెడ్ కాఫీ కావాలి. ఎన్నింటికి పడుకున్నా సరే, కాఫీకోసమే తను ఐదింటికల్లా లేచిపోతాడు. అత్తయ్య ఆరింటికి లేచి, స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకొచ్చేసరికి ఏడౌతుంది. రాగానే కాఫీ కప్పు చేతికందాలి. మామయ్య ఆరింటికి లేచి పార్కుకెళ్ళి వాకింగు చేసొచ్చి- స్నానం, దైవప్రార్థన అయ్యేక ఏడున్నరకి కాఫీ అడుగుతాడు. బెడ్ కాఫీ, అత్తయ్యతో ఒకసారీ, మామయ్యతో ఒకసారీ- టిఫినయ్యేలోగా ప్రభాస్‌కి మొత్తం మూడు సార్లు కాఫీ కావాలి. అత్తయ్యకి విడిగా ఒకసారీ, మామయ్యతో ఒకసారీ- మొత్తం రెండు సార్లు. మామయ్యకి ఒక్కసారే! వాళ్ళు ముగ్గురూ కూర్చుంటే- ఎవరింట్లో కాఫీ ఎలా పెడతారో, ఏ హొటల్లో కాఫీ ఎలాగుంటుందో చెప్పుకుంటారు. వాటిలో కొన్ని జోక్సు కాబోలు, పడిపడి నవ్వుతుంటారు. నాకైతే వాళ్ళ జోక్సుకి నవ్వు రాక, వెర్రిమొహం వేస్తాను.
అత్తయ్యకది నచ్చదు. “అనగనగ రాగ మతిశయిల్లుచునుండు అంటారు. మన పద్మ కాఫీ మాత్రం నానాటికీ తీసికట్టు” అని ఓ చురకేసి నాతో చెలగాట మాడుతుంది.

          ‘కాఫీ పెట్టడం బాగా వస్తే, తనకీ ఈపాటికి కాఫీ అలవాటయుండేది” అని ప్రభాస్ తల్లికి వంత పాట. అప్పుడు మామయ్య ముసిముసి కంటే కాస్త ఎక్కువగానే నవ్వడం- వాళ్ళ చురకలకి ఆయన స్టైల్లో ప్రశంస!

          వళ్ళు మండిపోవాలి. కానీ నిగ్రహించుకునేదాన్ని. కారణం అమ్మ పెంపకం.
‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అన్న సామెతలో పేదవాడంటే అమ్మకి  సంబంధించి నంతవరకూ ఆడదే!

          ‘ఆడపిల్ల ఆడ పిల్లే కానీ, ఈడ పిల్ల కాదు’ అని నమ్మేవాళ్ళలో అమ్మది- నారాయణ, శ్రీ చైతన్యల లెవెల్ రాంకు. రాక్షస మంత్రి చంద్రగుప్తుడి కోసం విషకన్యని తయారు చేసినట్లు- అమ్మ నాకు ‘ఆడది ఎదగడం అత్తింట్లో ఒదగడానికే’ అన్నట్లు శిక్షణ ఇచ్చింది. ‘నీటికి నాచు తెగులు. మాటకి మాట తెగులు’ అన్న హెచ్చరికని ఉగ్గుపాలతో రంగరించింది. అలా నాకు- ఎవరైనా నామీద జోకేసినా, నన్ను కామెంట్ చేసినా పట్టించు కోకపోవడం- చిన్నప్పుడే అలవాటైంది. ఐతే- పైకి ఏమనకపోయినా మనసులో కొంత అలజడి పుడుతుంది కదా! నన్ను నేను సమాధానపర్చుకుందుకు, ‘నేను పరిణతి చెందిన మహాజ్ఞానిని. వాళ్ళు అల్పులు’ అని సరిపెట్టుకునేదాన్ని.

          నిజం చెప్పొద్దూ- అప్పుడు నాకు ఎదుటివాళ్ళ మీద కోపం కాదు, జాలి పుట్టేది.
అలాగనుకోవడంలో ఇంకో లాభముంది. ఎదుటివాళ్ళ విసుర్లకు మనలో స్పందన లేకపోతే- వాళ్ళకి ఉక్రోషం వస్తుంది. మనిషిని రెచ్చగొట్టడంలో కోపంకంటే శక్తివంత మైనది ఉక్రోషం. వాళ్ళు రెచ్చిపోతే, అదే మనకి కిక్కు! ఐతే నాకు ఉక్రోషం లేదంటే నన్ను నేను మోసం చేసుకోవడమే! అత్తింట్లో నాకెక్కువగా ఉక్రోషం తెప్పించేది కాఫీయే!
ఫ్లాస్కులో పోసుంచితే పనికిరాదు. వాళ్ళకి అప్పటికప్పుడు పెట్టిన తాజా కాఫీ కావాలి.
తను తాగదు కదా, మనం కాళీయే కదా, మనమే పెట్టుకోవచ్చు కదా- అని ఒక్కరూ అనుకోరు.

          ఇద్దరేమో మగాళ్ళు. ఒకామె అత్తగారు. అదీ సంగతి!

          నేను కాఫీ పోసిచ్చేదాకా- కాఫీ డబ్బా, పంచదార డబ్బా, పాల ప్యాకెట్టు, కాఫీ కప్పు- వగైరాల్లో ఏ ఒక్కదానిపైనా భూతద్దం పెట్టి చూసినా వాళ్ళలో ఏ ఒక్కరి వేలిముద్రలూ కనిపించవు. ఇంటికెవరొచ్చినా కాఫీ నేనే పెట్టాలి. వచ్చినవాళ్ళు కాఫీని మెచ్చుకుంటే, “ఈరోజు మీ అదృష్టం” అంటుంది అత్తయ్య. 

          ఉక్రోషం రాకపోవడానికి నేను మానూ మ్రాకుని కాదుగా, ఎలాగో అదుపు చేసుకుంటా నంతే! ఈ అనుభవాలు కేవలం కాఫీ గురించి. వీటిని టిఫిను, వంట, ఇంటి సద్దుడు, పనిమనిషి పై అజమాయిషీ వగైరాలకు ఎక్స్‌టెండ్ చేస్తే- అదీ నా జీవితం….

***

          అన్నింటికీ మూలకారణం అత్తయ్య అని తెలుసు నాకు.

          ప్రభాస్, మామయ్య- ఇద్దరూ కూడా ఆమెని మెచ్చుకుందుకూ, ఆమె మెప్పు పొందడానికీ మాత్రమే తమ జీవితమన్నట్లు మసలుతారు. అత్తయ్య నన్నాదరిస్తే వాళ్ళూ నన్ను ఆదరిస్తారు. కానీ- ఆమెకు నా సేవలు కావాలి. మెచ్చుకోదు. నా ఒప్పులు తెలుసు. వాటిలో తప్పులెన్నుతుంది. తిట్టదు. కొట్టదు. వ్యంగ్యబాణాలు వేస్తుంది. అవి సూటిగా మనసుకి తగిలి గాయాల్ని చేస్తాయి. ఆ గాయాలకి మందు కావాలి. ఆ మందు ప్రభాస్ నుంచి ఆశించాను మొదట్లో.

          అతడు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు తల్లితోనే కబుర్లాడతాడు. రాత్రి ఏకాంతంలో నేనేమైనా చెబితే బుద్ధిగా విని ఊఁ అంటాడు. అదెంతసేపు  బుర్రలో ఉంటుందో కానీ, అటుతిరగ్గానే అవతలి చెవిలోంచి ఉఊఁ అంటూ బయటి కొచ్చేస్తుంది.
దుఃఖమొస్తుంది. కానీ ఏడ్వడం నాకిష్టముండదు. ఏడుపు బలహీనతకి సంకేతం. నాకు బలముంది. ధైర్యముంది. కానీ ఆ రెండూ నా దుఃఖాన్ని జయించడానికే ఖర్చైపో తున్నాయి.

          నేను వంట చేస్తే- ఇలా చెయ్, అలా చెయ్ అని ఆమడ దూరాన్నుంచి అత్తయ్య సలహాలు, సూచనలు. నచ్చితే తిని ఊరుకోవడం. నచ్చకపోతే, ‘కొందర్ని పుటమేసినా నేర్చుకోలేరు’ అని కామెంటు. నా షాపింగు కూరలకు మాత్రమే. తెచ్చినవాటికి వంకలు. ‘ఏం నేర్పారు తల్లీ నీకు మీ అమ్మా నాన్నా’ అని విసుర్లు. నాకు చీరలు తనే కొంటుంది. జాకెట్లు తనే కుట్టిస్తుంది. నా శరీరాకృతికి డ్రెస్సులు నప్పవని మాన్పించేసింది. కాదంటే ఇంట్లో పెద్ద రభస. అప్పుడు మామయ్య నన్ను రుసరుస చూస్తాడు. ప్రభాస్ వాళ్ళమ్మకు సారీ చెప్పమంటాడు. చెయ్యని తప్పుకి సారీ చెప్పడంకంటే- నా సరదాల్ని  చంపుకో వడమే మేలనిపించి అత్తయ్యకి పూర్తిగా లొంగిపోయాను. 

          ఒక్క పిల్లల పెంపకంలోనే కాస్త తేడా!

          అత్తయ్య పిల్లల్నెప్పుడూ ఎత్తుకోలేదు. వాళ్ళకి పాలు పట్టించలేదు. వాళ్ళచేత స్నానాలు చేయించలేదు. అవన్నీ ఎలా చెయ్యాలో మాత్రం- పిల్లలు చేతికి తగలనంత దూరాన నిలబడి నాకు చెబుతూంటుంది. చెప్పేటప్పుడు మామయ్యనీ, ప్రభాస్‌నీ అప్పుడప్పుడు పిలుస్తూంటుంది. ‘ఈరోజు నువ్వింతటివాడివయ్యేవంటే- మీ అమ్మ
ఎంత కష్టపడిందో కళ్ళారా చూడు’ అంటాడు మామయ్య.

          సేవలు చేసేది నేను. కానీ అప్పుడు ప్రభాస్ మా పిల్లల్లో తనని చూసుకుంటాడు. నాలో అత్తయ్యని చూస్తాడు. అలా ఆ నా సేవలు అత్తయ్య ఖాతాలోకెళ్ళిపోతాయి. తల్లి పట్ల అతడికున్న ఆరాధనాభావాన్ని పెంచకుంటూ పోతాయి. ఎంతలా అంటే- అతడి ముందు పిల్లలకి సేవలు చెయ్యడాన్ని నా మనసు భరించలేదు.

          పిల్లల్నెలా పెంచాలో, ఎలా పెంచకూడదో రెండింట్లోనూ నాకు స్ఫూర్తి అమ్మ. అలా అబ్బాయి నాకు మగమహారాజు కాదు. అమ్మాయి ఆడ పిల్ల కాదు. ఆ ఇంట్లో నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నది పిల్లల్ని మాత్రమే. వాళ్ళు – అమ్మా అనిపిలిచినా, నన్ను చూసి నవ్వినా, నావంక ఆరాధనాభావంతో చూసినా, దుఃఖాన్ని పంచుకున్నా- ప్రతీదీ నా మనసు పై చెరగని ముద్ర వేసే గొప్ప అనుభూతి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు నా ప్రాణం. 

          అత్తయ్యకి తెలుసు నాకూ పిల్లలకీ ఉన్న అనుబంధం. అందుకేనేమో వాళ్ళనీ నాకు దూరం చెయ్యాలని చూసేది. వాళ్ళు తనవద్దకొస్తే, నా మీద చాడీలు చెప్పేది. నన్ను చెడ్డగా చిత్రించడానికి ప్రయత్నించేది. పిల్లలు కదా, ఒకోసారి నమ్మేవారు. నావద్దకొచ్చి నిలదీసేవారు. నాకొళ్ళు మండిపోయేది. ఐనా అలవాటైన సహనంతో-
వాళ్ళ అవగాహన పెరిగేలాగానూ, తార్కికంగానూ నిజాలు వివరించేదాన్ని. ఐతే అత్తయ్యని దుష్టురాలని పొరపాటున కూడా వాళ్ళ వద్ద అనేదాన్ని కాదు. మంచి చెడుగా కనబడ్డం ఒక జబ్బనీ, అదామెకు ఉన్నదనీ నచ్చజెప్పేదాన్ని. ఆమె చెడు మాట్లాడినా, చెడ్డగా ప్రవర్తించినా-ఆమె అనారోగ్యానికి జాలి పడాలే తప్ప, కోప్పడరాదనేదాన్ని.ఆమెకు వైద్యం జరుగుతోందనీ, ఎప్పటికైనా స్వస్థురాలవుతుందనీ నమ్మబలికేదాన్ని. పిల్లలకి కథలు చెప్పేటప్పుడు- వాటిలో దుష్టపాత్రల ప్రస్తావన వచ్చినప్పుడు- పిల్లలకి అత్తయ్య స్ఫురించేలా చూసేదాన్ని. అత్తయ్య మీద నాకున్న కసినంతా, ఆ పాత్రల ద్వారా  తీర్చుకునేదాన్ని. ఏ కథలో దుష్టపాత్రని వర్ణించినా పిల్లలకి బామ్మ గుర్తుకొచ్చేది. నేను మాత్రం, ‘మీ బామ్మకైతే అనారోగ్యం! వీళ్ళకేం రోగం? వీళ్ళ బుద్ధే అంత!’ అని  తేల్చేసే దాన్ని.

          చేస్తున్నది తప్పో ఒప్పో- ఎదుగుతున్న నా పిల్లలు నాక్కాకుండా పోకూడదన్న తాపత్రయమది!

          ఇంత ప్రయత్నించినా కూడా, మా ఇంటి వాతావరణంలో నా పిల్లలు నాక్కాకుండా పోయేవారే! ఐతే పిల్లలతో అనుబంధానికి అన్నింటికీ మించినది స్పర్శ! 

          ఇంకా మామయ్యేనా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరకు తీసుకుంటాడేమో కానీ అత్తయ్యకి వాళ్ళు ఇంచుమించు అస్పృశ్యులు. అదీ ఆ పైన నా మాతృస్పర్శా- వాళ్ళను నాకు దూరం కాకుండా కాపాడాయి. 

          ఇలాంటి వాతావరణంలో పుట్టింటి నుంచి కొంత ఉపశమనాన్ని ఆశించొచ్చు. కానీ నేను ఫోన్ చేస్తే చాలు, ‘ఆడదంటే సహనంలో భూమాత అనిపించావు. నువ్వు  కూతుర వడం నాకు గర్వకారణం’ అని ముందరికాళ్ళకి బంధమేస్తుంది అమ్మ. ఫోను సంగత లాగుంచితే, పుట్టింటికెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడూ అంతే! మా ఇంట్లో నన్ను ఆదర్శ భారత నారిగా పొగడ్డమే తప్ప అత్తింటివారి కుసంస్కారాన్ని ప్రస్తావిం చడం అరుదు.

          అమ్మమీద చెప్పలేనంత కోపమొచ్చేది. కానీ నన్ను శత్రువులా చూసే అత్తయ్యనే భరిస్తున్న నేను- నన్ను ప్రాణసమానంగా ప్రేమించే అమ్మపై అసహనాన్ని ప్రదర్శిం చడం అన్యాయమనిపించేది.

          ‘ఏ నాటి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?’ అనుకుని నిట్టూర్చేదాన్ని. అప్పుడు శ్రీశ్రీ గుర్తుకొచ్చి, ‘గర్జించు పద్మా, గాండ్రించు పద్మా, పర్జన్యశంఖం పూరించు పద్మా’ అన్న ప్రబోధం వినిపిస్తుంది మనసులో.

          “అమ్మా! అత్తయ్య కూడా ఆడదే కదా! సహనంలో భూమాత అని నిరూపించు కుందుకు ఆమెకూ ఓ అవకాశమివ్వనా?” అన్నానోసారి ఫోన్లో కొంచెం కసిగా.

          దానికి అమ్మ, “చూడమ్మా! నీ సహనాన్ని పరీక్షించడం నీ అత్తకి సంతోషాన్నిస్తోంది. ఆమె సహనాన్ని పరీక్షించడం నీకు సంతోషాన్నిస్తే నువ్వూ అల్లాగే చెయ్యి” అని ఫోన్ పెట్టేసింది.

          అందులో హెచ్చరికే కాదు. నా సంస్కారానికి గుర్తింపు కూడా ఉంది.

          అమ్మ తీరు అత్తయ్యకి తెలుసు. అందుకే ఇటీవల నన్ను పుట్టింటికి పొమ్మంటోంది. అది అభిమానం కాదు, శిక్ష! నేరస్థురాలిగా వెడితే- అమ్మ నాకక్కడ జైలరుగామారుతుంది. అందుకని వెళ్ళనంటాను. అత్త మరీ నొక్కిస్తుంది.

          ప్రభాస్‌కి చెబుతాను.

          తనకి నా సమస్య అర్థం కాదు, “మీ ఇంటికేగా వెళ్ళమంది. వెళ్ళి కొన్నాళ్లుండి రా” అన్నాడు.

          పుట్టింటికెళ్ళడం వరకే నా వంతు. తర్వాత తనెప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. నేను ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటే అమ్మానాన్నల గుండె బద్దలౌతుంది. అది అత్తయ్యకి తెలుసు. ఆ ఇంట్లోంచి పోవాల్సిన అగత్యం వస్తే, నేను పుట్టింటికి మాత్రం వెళ్ళ కూడదు. ఎక్కడికెళ్ళాలి? 

          అత్తయ్యను సహిస్తున్నాను. ఆ సహనానికి కారణం అసహాయత కాదు. సంస్కారం.
అత్తయ్యది కుసంస్కారం. అది నా సహనాన్ని జయించి నన్ను కుసంస్కారిని చెయ్య గలిగితే- అదామె విజయం. 

          హిరణ్యకశిపుడి ముందు ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదలనట్లే, నేనూ నా సంస్కారాన్ని వదలకూడదు. రోజులో పన్నెండు గంటలు. నెలలో ముప్పై రోజులు. ఏడాదిలో పన్నెండు నెలలు. అలా ఇప్పటికి పదకొండేళ్ళు. పిల్లలు పెద్దవాళ్లౌతున్నారు. వాళ్ళ పన్లు వాళ్ళు చేసుకోవడమే కాక నాకూ కొంత సాయం చేస్తున్నారు. ఇక నా వైవాహిక జీవితపు సింహావలోకానికి వెసులుబాటు వచ్చింది. 

          అంతే- ఏమిటీ జీవితం, ఎందుకీ జీవితం – అనే ఆక్రోశం నాలో మొదలైంది.
‘అవగాహన’ కు నా కథంతా మెయిల్ చేశాను….

***

          స్కూలు దూరమై పిల్లలు అలిసిపోతున్నారనీ, వాళ్ళ స్కూలుకి దగ్గర్లో ఇల్లు తీసుకుందామనీ ప్రభాస్‌కి చెప్పాను.

          ప్రభాస్ అత్తయ్యకి చెప్పాడు.

          అత్తయ్య అశ్చర్యపడినా “అక్కడ అద్దెలెక్కువ” అంది శాంతంగా. అది తుఫాను ముందరి ప్రశాంతత.

          “ఇల్లు చిన్నదైతే, అద్దె ఎక్కువుండదు” అన్నాను.

          “చిన్న ఇల్లంటే ఎంతమంది పడతారు?” అంది అత్తయ్య వెటకారంగా.

          “నేను, పిల్లలు- వస్తే ప్రభాస్….” అన్నాను- ప్రభాస్ రాడు అనే అవకాశం ఆమెకివ్వ కుండా.

          “అంటే మొగుణ్ణొదిలేసి వెళ్ళిపోతావా?” వెటకారంలో ఆవేశం చోటు చేసుకుంది.

          “అంటే, ప్రభాస్ రాడా?” అన్నాను.

          ఊహించని ఈ ప్రశ్నకి అత్తయ్య తికమకపడింది. “ఆలుబిడ్డల్ని వాడెందుకు కాదంటాడు? కానీ కొత్తింటికి అద్దె ఎక్కణ్ణించి తెస్తాడు?” అంది అత్తయ్య.

          ప్రభాస్ జీతంలో సింహభాగం అత్తయ్య చేతికే వెడుతుంది. ఇంటద్దె అత్తయ్య ఇవ్వదు.

          “నాన్న కడతానన్నాడు” అన్నాను ఠక్కున.

          ఖంగు తిన్న మొహం పెట్టింది అత్తయ్య. ఓ క్షణమాగి, “మా వారసుల చదువుకి వియ్యాలవారినడిగే దౌర్భాగ్యానికి నేనొప్పుకోను” అంది.

          “నా పిల్లల చదువుకి ఒకర్నడిగే దౌర్భాగ్యం నాకూ వద్దు. నేను నాన్నని అప్పుగా అడిగాను”

          “అడిగావు సరే! అప్పెవరు తీరుస్తారు? నా కొడుకునడిగితే నేనొప్పుకోను”

          “అప్పు నేను తీరుస్తాను” అన్నాను దృఢంగా.

          అత్తయ్య నిరసనగా చూసింది, “నీ తిండీ గుడ్డకే దిక్కు లేదు. నీ పిల్లల్ని చదివించ డానికి డబ్బు తెస్తావా? ఎలా” అంది.

          “ఇలా?” అంటూ గుప్పిట్లో ఉన్న లాకెట్ గొలుసుని మెడలో వేసుకున్నాను.

          ‘నీ అంతటిదానివి నువ్వని తెలుసుకుందుకు అవగాహన వెబ్‌సైట్ కావాలా- నువ్వనుకుంటే ఎప్పుడో నీ మెడలో వాలేదాన్ని కదా’ అంటోంది ఆ గొలుసులోని లాకెట్లో నా ఫొటో. ఆ లాకెట్- రేపు నేను చేరబోతున్న ‘క్విక్ సాల్వ్’ కంపెనీ స్టాఫ్‌గా నా ఐడెంటిటీ.
ఆ లాకెట్ గొలుసు- ఎలుక మెడలో గంటలా అనిపించింది నాకు….

*****

Please follow and like us:

One thought on “ఎలుక మెడలో గంట (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. రామలక్ష్మి జొన్నలగడ్డ గారి కధ ‘ ఎలుక మెడలో గంట ‘ పేరుతోనే పాఠకుల్ని ఆకట్టుకుంది! కధలో నాయిక పద్మ పెళ్ళికి ముందు షరతుకు ముగ్గురు హితుల్ని, ఒకరు తల్లి మరో ఇద్దరు స్నేహితుల్ని గుర్తుచేసుకుని, వారి జీవితాలను, వ్యక్తిత్వాలను సమయానుకూలంగా గుర్తుచేసుకుంటూ, ఉత్తమ పురుషలో కధానాయిక తన పాత జ్ఞాపకాలతో కథ సాగించిన తీరు శైలి చాలా బాగుంది. అలాగే.. ‘ కాఫీ ‘ చుట్టూ అల్లిన సంఘటనలు కూడా బాగా ఆకట్టుకున్నాయి! మొత్తంగా సగటు కుటుంబ జీవితాన్ని, వ్యక్తుల మనస్తత్వాలను కన్నులకు కట్టారు రచయిత్రి! చివరగా ‘ అవగాహన ‘ వెబ్సైట్ సలహా ఎలా పాటించారో ముగింపుగా చెప్పిన తీరు బాగుంది. కధ బహుమతికి అర్హమైనదిగా తోస్తుంది! రచయిత్రికి అభినందనలు!! 💐😊🤝🙏

Leave a Reply

Your email address will not be published.