పేషంట్ చెప్పే కథలు – 31

పొగచూరిన సంస్కృతి

ఆలూరి విజయలక్ష్మి

          నైటీ వేసుకుని సోఫాలో కూర్చుని రిమోట్ కంట్రోల్ మీటల్ని నొక్కుతూ కాసేపటి కోసారి టి.వి. ఛానెల్స్ ని మారుస్తూ దీక్షగా ప్రోగ్రామ్స్ ని చూస్తూంది స్నిగ్ధ. చివరకు జి.టి.వి. లో వస్తూన్న సినిమాను చూస్తూ అప్పటిదాకా అలంకార ప్రాయంగా చేతిలో వున్న పుస్తకాన్ని ప్రక్కన పడేసింది. వంట మనిషి టీపాయ్ మీద ఉంచిన గ్లాసులోని పాలు ఎప్పుడో చల్లారిపోయాయి. ఏ.సి. చల్లదనం శరీరాన్ని స్పర్శిస్తూంది. డెక్ లో వినిపిస్తున్న బాలమురళి స్వరం తేనె సోనల్ని కురిపిస్తూ హృదయతంత్రుల్ని మీటుతూంది.

          అలిసిపోయి హాస్పిటల్ నుండి ఇంట్లోకి వచ్చిన శృతి బోల్ట్ పెట్టకుండా దగ్గరకు చేరవేసి వున్నా వీధి తలుపును, వంటింట్లో స్టవ్ మీద మరిగిపోతున్న పాలను చూసి పనిమనిషిని, వంట మనిషినీ వెదుక్కుంటూ స్నిగ్ధ రూమ్ లోకి వచ్చింది. సినిమా చూడడంలో నిమగ్నులై బాహ్య ప్రపంచాన్ని మరిచి కూర్చున్న ముగ్గుర్నీ చూడగానే కోపం ఎగసి వచ్చింది. ఆమె ఆ సమయంలో ఇంట్లోకి వస్తుందని ఊహించని పని వాళ్ళిద్దరూ గతుక్కుమని భయంతో బయటకు జారుకున్నారు.

          “నెల రోజుల్లో పరీక్షలు పెట్టుకుని టీ.వి. ముందు కూర్చున్నావా? నీతోపాటు వాళ్ళిద్దరూ ఇక్కడ చేరితే ఊరుకున్నావు. అసలు నీకు బాధ్యతేమైనా ఉందా?” తల్లి ఉరుముల్ని విననట్లు ముఖం పెట్టి నింపాదిగా టీ.వి.ని ఆఫ్ చేసి, ప్రక్కన పడివున్న పుస్తకాన్ని అయిష్టంగా చేతిలోకి తీసుకుంది స్నిగ్ధ. తన కేకల వల్ల ప్రయోజనం లేదని తెలుసు శృతికి. గుర్రాన్ని బలవంతాన నీళ్ళ దగ్గరకు తీసుకు వెళ్ళినప్పటికీ బలవంతాన నీళ్ళు త్రాగించలేమని తెలిసినా టీ.వి. పిచ్చిలో పడి కూతురు సరిగ్గా చదవక తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటుందనే నిజం ఆమెకు ఆగ్రహాన్ని కలిగిస్తూంది.

          తీరిక లేకుండా ఉదయం నుండి పనిచేస్తున్న శృతికి కోపాన్ని నిగ్రహించుకునే సరికి ఉన్నకాస్త ఓపిక హరించిపోయినట్లనిపించింది. చల్లటి నీటితో ముఖం కడుక్కుని, సోఫాలో వాలి ఐదునిమిషాలు సేదదీరి, కాస్త కాఫీ త్రాగి ఇంకా వేచివున్న పేషేంట్స్ ని చూసి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదామునుకుంటూ ఉండగా ఒక నడివయసామే, ఆమె వెనుక ఒక యువతి, ఆరేళ్ళ పాప లోపలికి వచ్చారు.

          “ఏంటి వెంకాయమ్మా చాలా రోజులకు కనిపించావు?” చిరునవ్వుతో ఆ నడివయసు స్త్రీ వంక చూసింది శృతి. ముఖమంతా పసుపురాసుకుని నుదుటి మీద రూపాయి కాసంత బొట్టుపెట్టుకుందామె. ఆమె పెట్టుకున్న ఎర్రరాళ్ళ దుద్దుల ధగధగ చెంపల మీద చిందు తూంది. “ఇది నా కూతురు. దీనిని చూచి కాస్త మంచి మందులు వ్రాసివ్వండమ్మా!” కూతురు రెక్క పుచ్చుకుని శృతి పక్కన వున్నా స్టూల్ మీద కూర్చోపెట్టిందామె. పచ్చని పసిమి ఛాయతో, చక్కటి కనుముక్కు తీరుతో, ఎన్నో రోజులుగా తిండి తినని దానిలా బలహీనంగా వున్నా నూకమ్మ వంక చూసింది శృతి.

          “నీ పేరేంటమ్మా?” మృదువుగా అడిగింది శృతి.

          “నూకమ్మ” మెల్లగా జవాబిచ్చింది నూకమ్మ.

          “భాధలేమైనా ఉన్నాయా?”

          “బాధల్లెందే హాస్పిటల్ కి ఎందుకొస్తాం అమ్మగారూ? నీరసం, ఆయాసం, గుండె చూడండి యెట్లా గణగణగణమని గడియారంలాగా కొట్టుకుపోతాందో! ఆకలి పుట్టదు. నిద్రపట్టదు. కంటి మీద కునుకుపడి ఎన్నాళ్ళయిందో!” నూకమ్మ చెప్పుకుపోతూంది.

          “ఎన్నాళ్ళ నుండి ఈ బాధలు?”

          “నెల రోజుల నుండి”

          జ్వరం, ఇతర బాధలు, వివరాలు, పెళ్ళి, పిల్లలు మొదలైన విషయాల్ని అడిగి తెలుసుకుంది శృతి.

          “ఈ పిల్ల నా కూతురేనమ్మగారూ! ఇది కడుపునపడగానే దీని బాబు జబ్బుచేసి చచ్చిపోయాడు” పాపను దగ్గరకు తీసుకుని చెప్పింది నూకమ్మ. చాలా నిర్లిప్తంగా, భర్త తాలూకు వియోగపు ఛాయాలేమీ లేకుండా చెప్తున్నా నూకమ్మ వంక ఆశ్చర్యంగా చూసింది శృతి. నూకమ్మ చెప్పింది విని వెంకాయమ్మ ముఖం చిన్నబోయింది.

          “దీని పెళ్ళైన ఏడాదికే దీని యజమాని కాలం చేశాడమ్మా! అప్పట్నుంచి దీన్ని, ఈ పిల్లదాన్ని నేనే పెంచుతున్నాను. ఎల్లకాలం దీనిని చాడడానికి నేను, ఈళ్ళబాబు ఉండబోతామా, పిల్లబతుకెట్లా వెళ్ళమారుద్దోనని ఆలోచనచేసి ఒక నెలకిందటే దీనికి మారుమనువు చేసాము’ గొంతుకకు ఏదో అడ్డుపడినట్లు ఆగింది వెంకాయమ్మ.

          “ఏ ఊరిచ్చారు? కాపురానికి అత్తవారింటికి వెళ్ళిందా?” పరిశీలనగా వెంకాయమ్మ వంక చూస్తూ అడిగింది శృతి.

          “పెళ్ళైన వెంటనే కాపురానికి తీసుకుపోయారు. అత్తారిల్లు మాపేటలోనే. తెలిసిన సంబంధమే” అటువైపు నుంచి సమస్యేమీ లేదని ధ్వనించేలా చెప్పింది వెంకాయమ్మ.

          “అమ్మాయిని గురించి అన్నీ తెలిసిన వాడేకదా! అతనికిదే మొదటి పెళ్ళా? ముందు పెళ్ళయిందా?’

          “ఆడికిదే మొదటి పెళ్ళి. చిన్నప్పట్నుంచి దీన్ని ప్రేమించానని, పెళ్ళి  చేసు కుంటానని ఎంతపడేవాడు. అప్పట్లో తిరంలేకుండా జులాయిగా తిరుగుతున్నాడని పిల్లనివ్వడానికి ఈల్లబాబు ఒప్పలేదు. అంతట్లో మా బంధువుల్లోనే చుట్టరికమోస్తే ముడేట్టేసాము. దీని పెళ్లయ్యాక అక్కడికెళ్లి కూడా పేమ, దోమ అంటూ నానా రభస జేశాడు. చివరికిలా బాబుకు ఒల్లుమంది ఆడికి దేహశుద్ధి చేస్తేగాని ఊరుకోలేదు. అల్లుడు చచ్చిపోయి పిల్ల నా ఇంటజేరినదగ్గర్నుండి మళ్ళీ ఆదేసొదా. ఇది పెళ్ళాడకపోతే సముద్రంలో పడి చస్తానని బెదిరించాడు. ఇప్పుడు కాస్తంత తిరంగా రోజుకో పదో పరకో సంపాయిస్తా నన్నాడు గదా పిల్లనివ్వరాదా అని ఇరుగుపొరుగు అంటే చివరికి నెల కిందటే ఆడికిచ్చి పెళ్ళిజేశాము. వెంకాయమ్మ చెపుతూంటే శ్రద్ధగా వింటూంది శృతి.

          ‘నీకు ఇష్టమయ్యే ఈ పెళ్ళి చేసుకున్నావా?” నూకమ్మను అడిగింది శృతి.

          “నా ఇష్టం ఎవరు పట్టించుకుంటారమ్మగారూ! నేనంటే పడి చస్తన్నానంటున్నాడు గందా, నా కూతురిని, నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడు కుంటాడని నమ్మాను. అంత వరకే” విషాదం సుళ్ళు తిరిగిందామె స్వరంలో.

          “అత్తవారింట్లో అంతా నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఇంట్లో ఎవరెవరుంటారు?’

          “బాగానే చూసుకుంటున్నారు. అత్తమ్మ, మామ, ఇద్దరాడబడుచులు, ఇద్దరు మరుదులు, అంతా ఇదంటే ఇష్టంగానే వుంటారు” వెంకాయమ్మ జవాబిచ్చింది.

          “మీ ఆయన ప్రేమగా వుంటున్నాడా?” శృతి ప్రశ్నకు జవాబివ్వకుండా మౌంనంగా తలదించుకుంది నూకమ్మ.

          “ప్రేమ ప్రేమ అని ఊరేగే గందా దీన్ని మనువాడింది?” శృతి ప్రశ్నతో వెంకాయమ్మకు మొదటిసారి కూతురి కాపురం గురించి అనుమానం కలిగింది.

          “ఏమో! యెట్లా ఉంటున్నారో?! ఆళ్ళింట్లో వుంటున్నారు. నేను చూడ్డంలేదు గదా!” వెంకాయమ్మ స్వరం బలహీనంగా ఉంది.

          నూకమ్మను పరీక్ష గదిలోకి తీసుకువెళ్ళి పూర్తిగా పరీక్షచేసి ఆమె బాధలకు శారీరకమైన కారణమేమి లేదని నిర్ధారించుకుంది శృతి.

          “నూకమ్మా! నువ్వు దేనికో దిగులు పడుతున్నావు. నీకు ఒంట్లో జబ్బేమీలేదు. దిగులు వల్లే నీకీ బాధలన్నీ” శృతి చెప్పింది విని నూకమ్మ గుండెలోని దుఃఖం చిక్క బడింది.

          “నీ దిగులుకు కారణమేమిటో తెలిస్తే ఆ దిగులు పోగొట్టడానికి మార్గమేమన్నా ఉందేమో ఆలోచించవచ్చు. ఊరికె యిన్ని మందులు వ్రాసిస్తే నీ బాధలు తగ్గవు కదా!” అనునయంగా అడిగింది శృతి. ఒక నిమిషం మౌనంగా వుంది, తడిగా అయి మసకబారిన కళ్ళను తుడుచుకుని చెప్పసాగింది నూకమ్మ.

          “పెళ్ళయ్యేదాకా ప్రేమ ప్రేమ అంటాన ఎంటబడి నా ప్రాణం తీసేశాడు గదా ఇన్నేళ్ళూ! ఇప్పుడేం రోగమొచ్చిందో, నేను కాపరానికెళ్ళిన మొదటిరోజుకాణ్ణించీ ఇసిత్రంగా చేస్తున్నాడు. భయంకరమైన మాటలాడుతున్నాడు” పెను విపత్తేదో మీద బడబోతున్న భీతి కదలాడిందామె కళ్ళల్లో.

          మా అమ్మకు తెలిస్తే నా ఖర్మమిట్లా కాలిపోయిందని ఏడుస్తుందని ఇందాక చెప్పలేదు. ఇంకిదంతా అనుభవించడం నా వల్ల కాదమ్మగారూ! నేను చచ్చిపోతాను” వెక్కివెక్కి ఏడవసాగింది నూకమ్మ.

          “ఎందుకలా చేస్తున్నాడు? మీరు ఒప్పుకున్నా కట్నకానుకలేమైనా ఇవ్వలేదా?’

          “అదేం కాదమ్మగారూ? ఆళ్ళడిగినయ్యన్నీ పెట్టింది మా అమ్మ” ఒక క్షణం నిజం చెప్పడానికి తటపటాయిస్తూ ఆగింది నూకమ్మ.

          “పొద్దుపోయేదాకా ఎక్కడెక్కడో తిరిగి రౌడీ గుంపుతో కలిసి ఎక్కడో బూతు సినిమాలు చూసొస్తాడు. చూసొచ్చింది ఒంట బట్టించుకుని ఏటేటో చేస్తాడు. నన్నేటేటో చెయ్య మంటాడు. ఆడి వాలకం జూస్తేనే నా ఒళ్ళు చచ్చుపడి పోతుంది. ఆడి చేష్టలకి గుండె ల్లోంచి భయం ఎగదన్నుకొస్తాంది’ ఆమె మాటల్ని వింటున్న శృతి అలజడికి లోన యింది. సాంస్కృతిక కాలుష్యం ప్రవహించి ప్రవహించి ఈ పేదల బ్రతుకుల్ని కూడా తడుపుతూందనే వాస్తవం ఆమెను బాధించింది.

          “ఆడు చెయ్యమన్నా పనులు నేను చెయ్యకపోతే కొడతన్నాడు. భయంకరమైన మాటలాడుతున్నాడు. నిన్ను చంపేస్తానంటాడు కాసేపు. నీకు సొర్గం జూపిత్తానంటాడు కాసేపు. ఆడి మాటలిని నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అయినా, నాది దిక్కుమాలిన జాతకం, అందుకే రెండుసార్లు పెళ్ళిజేసుకుంటే, రెండుసార్లూ ఇలా తగలడింది.” బ్రతుకు మీద విపరీతమైన విరక్తితో చెప్తున్నా నూకమ్మ తల్లి తొంగిచూడడం గమనించి కళ్ళు తుడుచుకుంది.

          “వామ్మో! వామ్మో! అంతలేసి మాటలంటున్నాడా బికారెదవా? నా కూతురేంటి భోగం పిల్లనుకున్నడేంటి ఈ డెయ్యమన్న బోడేశాలన్నీ ఎయ్యడానికి?! ఈడన్నట్టల్లా ఆడకపోతే చంపెస్తాడా నా కూతుర్ని?! ఏదీ, దమ్ములుంటేచంపమను చూస్తాను” విషయం పూర్తిగా తెలుసుకుని సివంగిలా లేచింది వెంకాయమ్మ.

          అలా ఉద్రేకపడితే ఎలా? జాగ్రత్తగా ఏం చెయ్యాలో ఆలోచించు. అలా కూర్చో ముందు” బలవంతాన కూర్చోపెట్టి నర్స్ చేత మంచినీళ్ళు తెప్పించి ఇచ్చింది శృతి. కోపాన్నంన్చుకుంటున్న వెంకాయమ్మ ముఖంలో అంతులేని అశాంతి చోటుచేసుకుంది.

          “ఇంటింటికీ టీవీలు జారిపోయి పిల్లోళ్ళు టీవీల కతుక్కుపోయి చదువు చుచ్చుబండల్లేకుండా నాశనమవుతున్నారని, పెద్దవాళ్ళు పనిపాట్లు చేసుకోకుండా సోమరి గుంటల్లా కూర్చుంటున్నారని తెలుసుగాని ఇట్లాంటి ముదనష్టపు సినిమాలు, ఇట్లాటి ఇపరీతపు చేష్టల గురించి ఇనడం ఇదే. ఈ ఇస్టారు టీవీల బూతు తైతక్కలన్నీ మా కొంపలాగ్గూడా జేరిపోతే మా బతుకులీపాటిగానైనా ఉంటాయా?! డబ్బులేని మాకు మానం, మర్యాదా కూడా కరువైపోవా?!” ఆక్రోశం, ఆవేదన నిండిన స్వరంతో ప్రశ్నించింది వెంకాయమ్మ. ఈ విపరీత సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న శృతి వెంకాయమ్మ ప్రశ్నల ను విని ఆమె వంక విస్మయంతో చూచింది. ఒక నిమిషంలో సర్ధుకున్న వెంకాయమ్మ ఒక నిశ్చయానికొచ్చింది.

          “కొంచెం బలానికేదైనా టానిక్కు రాసివ్వండమ్మగారూ! ఆడి సంగతి నేను తెలుత్తాలెండి. నా కూతుర్నిట్లా చేసినాడని నేను ఊరికే వదలను. నలుగురి చేత గడ్డేట్టించి ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకమని చెప్తాను. అదాడి తలకెక్కకపోతే ఆడిమొకాన ఇడాకులు పడేసి నా కూతురిని నేను నా ఇంటికి తెచ్చుకుంటాను. నా బిడ్డ నాకు బరువేంగాదు. ఒసేబుల్లీ! నీకేం భయంలేదు. నా పేణం పెట్టి నిన్ను పెంచుకుంటాను గాని ఆ రాక్షసి చచ్చినాడికి నిను బలివ్వను గాక ఇవ్వను.” కూతురి భుజం చుట్టూ చెయ్యేసి అక్కున చేర్చుకుంది వెంకాయమ్మ.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.