ఆరాధన-3 (ధారావాహిక నవల)
-కోసూరి ఉమాభారతి
హూస్టన్ లో సాండల్-వుడ్స్ సిటీలోని మా స్టూడియోలో పన్నెండేళ్ళగా నిబద్దతతో శిక్షణ పొందుతున్న సౌమ్య, ప్రియాంక లు కూచిపూడి రంగప్రవేశం’ కార్యక్రమాలకి.. ఆరు నెల్లగా రేయింబవళ్ళు ప్రాక్టీస్ లు చేస్తున్నారు. వారి కుటుంబాలు కూడా కళల పట్ల, నా పట్ల గౌరవంగా మసులుకుంటారు. ‘రంగప్రవేశ ప్రదర్శన’ విషయంగా కూడా అన్ని పద్దతులు పాటిస్తారు.
రెండువారాల పాటు ఇండియా నుండి వచ్చిన వాద్య బృందంతో రిహార్సల్స్ నిర్విఘ్నంగా జరిగాయి. నా నృత్య శిక్షణ పద్దతిని కొనియాడారు మా వాద్యబృందం కళాకారులు. శిష్యురాళ్ళని చక్కని నర్తకీమణులుగా తీర్చిదిద్దానన్నారు. క్రమశిక్షణతో శిక్షణ సాగిస్తున్నందుకు శిష్యురాళ్ళని అభినందించారు.
***
వారం రోజుల తేడాతో జరగనున్న సౌమ్య, ప్రియాంకల రంగప్రవేశ కార్యక్రమాల ఆహ్వాన పత్రికలు బే-పోర్ట్ డాన్స్ స్టూడియో శిష్యుల కుటుంబాలకు పంచాను. వారివురి గురించి, వారి పన్నెండేళ్ళ నిర్విరామ శిక్షణ గురించి ప్రస్తావిస్తూ.. సంప్రదాయ నృత్య ప్రదర్శనకి .. నిబద్దత, క్రమశిక్షణల అవశ్యకతనిపెద్దవాళ్ళకి అర్ధమయ్యేలా వివరించాను.
క్లాస్ అయ్యాక.. ‘కూచిపూడి రంగప్రవేశం’ ప్రాధాన్యతని గురించే చెప్పాలని అనుకుంటుండగా… ముఖపుస్తకంలో .. నా తమ్ముడి నాగేంద్ర ప్రసాద్ గురించి నేను పెట్టిన పోస్ట్ విషయంగా కుతూహలంగా అడిగింది… పదిహేనేళ్ళ కుసుమ్.
“మీ బ్రదర్ సినిమా ఆక్టర్, నిర్మాత కూడానా? ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మీరు పెట్టిన ఫోటోలు చాలా బాగున్నాయి ఆంటీ.” అన్నది.
దాంతో మిగతా కొందరు కూడా “మేమూ చూసాము.” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నాకు నవ్వొచ్చింది. ఓ రకంగా సంతోషమనిపించింది. మా తమ్ముడు గురించి చెప్పాలంటే మరి ఆనందమే కదా.
“మా నాన్నగారికి కళలంటే ఉన్న మక్కువ.. నా పై ఎంతటి ప్రభావం చూపిందో, మా తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ పై కూడా అంతే ప్రభావం చూపిందని అనుకుంటాను…
ప్రసాద్ బి.కాం (హానర్స్) చదివాడు. కరాటే లో బ్లాక్బెల్ట్, కాలేజీ బాడీ బిల్డర్ టైటిల్ సాధించాడు. ఫార్ములా రేస్ కార్స్, బగ్గీస్ నిర్మించేవాడు. ఇంట్లో తెలియకుండా, మద్రాస్ కార్ రేసెస్ లో పాల్గొనేవాడు కూడా….” అనగానే .. ఫక్కున నవ్వింది నీలా.
అందరం ఆ అమ్మాయి వంక చూశాము. “సారీ.. మా అన్నయ్య కూడా ఇలాగే.. మాకు తెలియకుండా ‘మౌంటేన్ క్లైమ్బింగ్’ వెళ్తుంటాడు. ఆ తరువాత ఎప్పటికో తెలుసుకుని అమ్మ గొడవ గొడవ చేస్తుంది. అది జ్ఞాపకం వచ్చి నవ్వాను. మీరు చెప్పండి ఆంటీ.” అంది మరో స్టూడెంట్ నీలా.
“తమ్ముణ్ణి మేము ‘బాబు’ అని పిలుస్తాము. హైదరాబాదులో మొట్టమొదటి టి.వి & ఫిల్మ్ ఎడిటింగ్ స్టూడియో స్థాపించిన అనతికాలంలోనే రాష్ట్రంలోని ఉత్తమ స్టూడియోగా ప్రసిద్దికెక్కింది విరాజిత స్టూడియోస్.
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి పౌరాణిక సీరియల్ ‘భోజరాజు కథలు’, ‘అసలే పెళ్ళైన వాడిని’ సినిమా నిర్మాతగానే కాక ఓ నటుడుగా, నిర్మాతగా, ఎడిటర్ గా మరెన్నో సీరియల్స్, టెలి ఫిల్మ్స్ తీసి స్థిరపడ్డాడు.
రామానాయుడు గారి ‘సర్పయాగం’, ‘శశిరేఖా శపథం’, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘సమ్మక్క-సారక్క’ చిత్రాలలో నటించాడు. ఉత్తమ నటుడుగా, విలన్ గా, ఫిలిం కౌన్సిల్ అవార్డ్లు అందుకుని, ఓ ఫిక్షన్ సీరియల్ కి ‘బంగారు నంది’ గెలుచు కున్నాడు. మణిశంకర్ వంటి మేటి దర్శకుడు, హీరోయిన్ సౌందర్యకి మొదటి చిత్రాల అవకాశాలు మా తమ్ముడు నిర్మించిన చిత్రాలే.
ఇక ప్రస్తుతం ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారంలో ఉన్నాడు నాగేంద్ర ప్రసాద్.” అంటూ ముగించాను.
అందరూ చాలా ఆసక్తిగా విన్నారు. “అయితే మీరే కాక మీ ఫామిలిలో ఇతర ఆర్టిస్ట్స్ ఇంకా ఉన్నారన్నమాట.” అంది మియా.
అంతా మా నాన్నగారి ప్రభావం, ప్రోత్సాహం. మా నాన్నగారి గురించి మరో మారు చెబుతాను. మీరంతా మాత్రం .. కొత్తగా నేర్చుకున్న అడుగులు, శ్లోకాలు చక్కగా ప్రాక్టీస్ చేయండి.” అని వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరబోతున్న నా వద్దకు వచ్చింది మియా.
అందరూ నిష్క్రమించాక.. మాతృదినోత్సవ వేడుక సందర్భంగా డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందన్న తన సూచనకి క్షమాపణ కోరింది. “మేడమ్, వచ్చే యేడు వరకు నేను మిమ్మల్ని ఈ విషయంగా తొందర పెట్టను.” నవ్వుతూ మాటిచ్చింది.
సరైన సమయం అనిపించి, రాగిణి తల్లి మాలిని గురించి ప్రస్తావించాను.
క్షణామాగి.. “నాకు తెలుసును మేడమ్. నేను, అభినవ్ కూడా వారి నడుమ సంధి కుదర్చడానికి ప్రయత్నిస్తున్నాము. మాలిని మాత్రమే పని చేసి సంపాదిస్తుంది కదా. ఆర్ధిక సమస్యలే ఉన్నట్టున్నాయి. అన్నివిధాలా సాయపడాలని అనుకుంటున్నాము.” అని మియా అనడంతో కాస్త తేలికయింది మనసు.
***
డ్రైవ్ చేస్తుండగా నా శిష్యురాలు ప్రియాంక నుండి ఫోన్ అందుకున్నాను. స్పీకర్ మీద ఉంచి, “ ఏమిటమ్మా ప్రియా, రంగప్రవేశం ప్రోగ్రాముకి అంతా రెడీ కదా.. మూడే రోజుల తరువాత నీవు ఫ్రీ అయిపోతావు. డాన్స్ ప్రాక్టీస్ నుండి నీకు కావాల్సినంత విరామం..
పోతే, ప్రోగ్రామ్ తరువాత విందుభోజనమట.. నీ ఎంగేజిమెంట్ ప్రకటన అట. బాగుందిరా. కోరినవన్నీ నెరవేర్చుకున్నావుగా.” అన్నాను సంతోషంగా.
“ఆంటీ.. అందుకు ముఖ్య కారణం మీరే కదా! మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. గత యేడు మీరు కలగజేసుకుని మా పేరెంట్స్ తో మాట్లాడి నా జీవితాన్ని చక్కబరిచారు. నేతన్ తో నా స్నేహాన్ని సహించని మా ఫ్యామిలీ ఇప్పుడు అతన్ని కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారంటే, మీ చలవే ఆంటీ. ఇప్పుడు అంతా హ్యాపీ. రేపు సాయంత్రం మేము ఏర్పాటు చేసిన ఓ చిన్న వేడుకకి మీరూ, అంకుల్, మీ పిల్లలు కూడా రావాలి. అందుకే అసలు ఈ ఫోన్.” అంది ప్రియాంక.
“అలాగేమ్మా. అంకుల్ కి చెప్పి నీకు కన్ఫర్మ్ చేస్తా.” అని ఫోన్ పెట్టేసాను. నాకింకా పది నిముషాల డ్రైవ్ ఉంది. ప్రియాంక గురించి ఆలోచించసాగాను. ఏడేళ్ళప్పుడు నా వద్ద డాన్స్ నేర్చుకునేందుకు వచ్చింది. ఆమె తల్లితండ్రులు తమ ఇద్దరు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు. చదువుల్లో, ఆటల్లో, పెళ్ళిళ్ళ విషయాల్లో తమ సూచనలు పాటించాలని ఆకాంక్షించారు.
ప్రియాంక చాలా తెలివైన పిల్ల. ఒకింత మొండిది కూడా. పెద్దల ఆంక్షలకి ఒక్కోమారు వాళ్ళు కూడా వివరణ ఇవ్వలేని ప్రశ్నలు వేస్తుంది. ఎదురు చెప్తుంది. స్వతంత్రత కోరుకుంటుంది. నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. 7వ తరగతిలో నేతన్ అనే సీనియర్ కుర్రవాడితో ఏర్పడిన స్నేహం… నాలుగేళ్ళ తరువాత విడదీయలేని ప్రేమగా మారిందని ఇంట్లోనూ ప్రియాంక చెప్పడంతో .. ఇల్లు నరకంగా మారిందని నావద్ద ఎన్నో మార్లు వాపోయేది. తన తల్లితండ్రులతో నన్ను మాట్లాడమని పలుమార్లు ఆ అమ్మాయి కోరినా .. సంకోచించాను.
ఆమె స్నేహితుడు ‘నేతన్’ మెడికల్ కాలేజీలో చేరాక అక్కడికి దగ్గరలో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు. నేతన్ తో ఆమె ప్రేమ విషయంగా తల్లితండ్రులతో గొడవ పడ్డప్పుడల్లా, ప్రియాంక అతని ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది.
ఆ కుటుంబం పడుతున్న క్షోభ నన్ను బాధించేది.
ఎట్టకేలకు ప్రియాంక తల్లితండ్రులే స్వయంగా నన్ను జోక్యం చేసుకోమని, కూతురికి బుద్ది చెప్పమని, తమ తరఫున మాట్లాడి బెదరించమన్నట్టుగా సూచించారు.
నేను వారికే నచ్చజెప్పాలని ప్రయత్నించాను. కాలం మారిందని, పెద్దలు తమ పిల్లలతో స్నేహంగా ఉంటేనే మంచిదని మనవి చేశాను. ఇరవై ఏళ్ళు పైబడిన ప్రియాంక .. తాను ప్రేమించిన వాడితోనే తన జీవితం అని నిర్ణయించుకుందని, నేతన్ కూడా ఆమెని అన్నేళ్ళగా ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకుని వ్యవహరిస్తేనే కుటుంబానికి మంచిదని అన్నాను. పిల్లల్ని వెలివేయకుండా దగ్గరికి తీసుకొని దీవించమని .. నా అభిప్రాయంగా వారికి చెప్పాను.
ఆ తరువాత రెండునెలలకి అంతా చక్కబడిందని తెలిసింది. తల్లితండ్రుల ఇష్టానుసారం కూచిపూడి రంగప్రవేశం చేస్తానని, మెడిసిన్ లో చేరుతానని వారికి మాటిచ్చింది ప్రియాంక. కథ సుఖాంతం అయినందుకు సంతోషమనిపించింది నాకు.
*****
(సశేషం)