జీవితం అంచున -22 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          పీక్స్ ఆఫ్ స్ట్రెస్ ఎలా వుంటుందో నాకు అనుభవంలోకి తెచ్చింది అమ్మ.

          అమ్మ ఆరోగ్య పరీక్షలు, స్పెషలిస్ట్ అప్పాయింట్మెంట్లు, స్కాన్లు, అమ్మ పాస్పోర్ట్ రెన్యువల్, ఆ పైన వీసాకి అప్లై చేయటం…అన్నీ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలే. అమ్మ వీసా మెడికల్స్ గురించైతే చెప్పలేని ఆందోళన. ఏ మాత్రం తేడాగా వున్నా వీసా రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమ్మను కనిపెట్టుకుని వుండటం, అమ్మకి కాపలా కాయటం, ఆమె నొచ్చుకోకుండా జాగ్రత్త పడటం ఒక ఎత్తు.

          వృద్దులకు, పసిపిల్లలకు మధ్య తేడా వుండదన్న విషయాన్ని నిరూపించింది అమ్మ.

          పసిపిల్లలకు “అడుగో బూచి..” అని భయపెట్టి భోజనాదులు పెట్టినట్టుగా ఇంట్లో పసిపిల్లగా మారిన అమ్మకు నేనొక పెద్ద బూచీనైపోయాను. అమ్మ దృష్టిలో నేను ఒక పెద్ద విలన్ని. నేను తిరిగి ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతానా అని అమ్మ ఎదురుచూసేంతగా.

          ఒక్క క్షణం నేను  కనుమరుగయితే అమ్మ కాశికి, యాదమ్మకి, వంట మనిషికి నా పైన పితూరీలు చెబుతుంది. అంతవరకూ ఇబ్బంది లేదు కాని ఒక రోజున ముఖ్యమైన పనుల మీద నేను బయటకు వెళ్ళగానే, ఏనాడూ మేడ దిగని అమ్మ గబగబా క్రిందకు వెళ్ళిపోయి కంగారు కంగారుగా కనిపించిన కారులో లిఫ్ట్ అడిగి పాలవాడి దుకాణానికి వెళ్ళిపోయింది. ఆ కారు మా ఎక్స్-టెనెంట్ కారు. తన పాత ఇంటి ఓనరన్న గౌరవంతో ఆమె అడిగిన చోట దించాడు. అదాటుగా అమ్మ కారులో వెళ్ళటం చూసిన కాశి కంగారుగా నాకు కాల్ చేసాడు.  నేను పనుల మధ్యలో ఇంటికి పరిగెత్తుకెళ్ళాల్సి వచ్చింది.

          మరోసారి నేను బాగా కావలసిన బంధువుల పెళ్ళికి వెళ్దామంటే తను రానంది. ఎంత నచ్చచెప్పినా ససేమిరా రానంది. ఇక తప్పని పరిస్థితిలో నేను అటు వెళ్ళగానే, ఇంటికి తాళం వేసేసి కిందకు వెళ్ళి గేటు ముందు నిలుచుందిట. కాశి కళ్ళబడకుండా వెళ్ళటమెలాగో తెలీక మా ఇంట్లో అద్దెకు వున్న ఒకరి స్కూటర్ పైన ఎక్కడో దింపమని అడిగింది. అతను స్కూటర్ పైన అమ్మ కూర్చోలేరని వెళ్ళి ఆటో తెస్తానంటే కాదని స్కూటర్ ఎక్కి కూర్చొంది.

          ఎనభై ఐదేళ్ళ అమ్మను అతను భయపడుతూ చెప్పిన చోట దించేసి వెంటనే నాకు ఫోను చేసి చెప్పాడు. నేను అతనితో కాశిని కూడా తీసుకెళ్ళి అదే చోట దింపమని చెప్పి, వెంటనే కాశికి ఫోను చేసి అమ్మను ఆటోలో ఇంటికి తిరిగి తీసుకు వెళ్ళమని చెప్పాను. అశాంతిగా  వధువు నెత్తిన నాలుగు అక్షతలు వేసేసి, పెళ్ళి భోజనం చేయకుండా ఇంటికి చేరుకున్నాను.

          అమ్మ అక్కడ ఓ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ పాలు పోసేవాళ్ళు ఎక్కడ వుంటారని వాకబు చేస్తోందట.

          అవకాశం దొరికినప్పుడల్లా అలా వెళ్ళిపోవటం, పైగా అలా వెళ్ళినప్పుడల్లా చేతిలో చేతి రుమాలులో కనీసం పదివేలు కట్టుకుని వెళ్ళటం పరిపాటి అయిపోయింది. అమ్మ మైండ్లో అతను కోవిడ్ తో బాధపడుతున్నట్లుగా రిజిస్టర్ అయిపోయాడు. అతనికి ఏదో విధంగా డబ్బు అందచేయాలన్న ధ్యాస తప్ప మరేం లేదు.

          నేను ఇండియా వచ్చేసరికే తన మూడు తులాల బంగారు హారం, ఒక జత చెవుల దుద్దులు, పూజా మందిరంలోని కొంత వెండి సామగ్రి మాయమయ్యాయి. నెలసరి అద్దె డబ్బుల వసూళ్ళ/ఖర్చుల లెక్కల్లో చాలా తేడా వుంది.

          ఒక్క మనిషి మైంటేనెన్స్ కి అవసరమైనంత వరకే తనకు అందేలా మిగతా డబ్బు బ్యాంకు అకౌంటులో పడే ఏర్పాటు చేయమని అమ్మాయిలు, స్నేహితులు నాకు సలహా ఇచ్చేవారు. చిన్నప్పటి నుండి బాగా కష్టపడి, డబ్బు ఆర్జించి ఆస్తిపాస్తులు కూడబెట్టిన శ్రమజీవి అమ్మ. డబ్బు విలువ బాగా ఎరిగిన ఆమెను కట్టడి చేయాలనిపించక వాళ్ళ సలహాను కాదని తోసిపుచ్చి నేను తనకు డబ్బు పుష్కలంగా అందే ఏర్పాటు చేసాను. కాని దాని వలన అమ్మ అపాత్రదానం చేయటమో, డబ్బు అజ లేకుండా పోవటమో జరిగింది.

          కాశీని మాయమయిన నగల వివరాలు అడిగితే, అమ్మ నేను రావటానికి వారం ముందు పది వేల పైకంతో పాటు హారం చేతి రుమాలులో కట్టుకుని చేతిలో పట్టుకుని తిరిగేదని చెప్పాడు. ఒకసారి ఎదిరింట్లో పాల ప్యాకెట్లు వేస్తున్న పాలవాడిని చూసి ఆ కట్టను బాల్కనీలో నుండి అతని కోసం రోడ్డు మీదకు విసిరిందని చెప్పాడు. అదృష్టం బావుండి అప్పుడే బయటకు వచ్చిన కాశీ అది చూసి కట్టను తీసి జాగ్రత్త పెడితే, తిరిగి ఇచ్చేవరకూ ఊరుకోలేదట.

          కాశి ఇంట్లో కెమెరాలను ఒకసారి రీప్లే చేసి చూడమని నాకు సలహా ఇచ్చాడు. బహూశా పది రోజుల బ్యాకప్ వుందనుకుంటా. నేను వచ్చి మూడు రోజులు అయ్యే పోయింది. ఆ వెనుక వారం రోజులను అమ్మ ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ కాశి చాలా ఓపికగా రీప్లే చేసి చూసాడు.

          ఒకచోట అమ్మ చేతిలో డబ్బుని సోఫా ఎదురుగా వున్న టేబుల్ మీద పెట్టి వదిలేసింది. ఆ వెనుక కొద్ది సేపటికి పనిమనిషి యాదమ్మ వచ్చి అలవాటుగా డస్టింగ్ చేస్తూ ఆ నోట్లను అదే టేబుల్ పైన పక్కనే వున్న న్యూస్పేపర్ కిందకు నెట్టేసింది. పని అయ్యాక వెళ్ళిపోయే ముందు రోజూలాగే అవాల్టి న్యూస్పేపర్ ను డబ్బుతో పాటుగా తీసుకెళ్ళి బాల్కనీ పక్క సందులో వున్న బల్ల పైన పడేసి వెళ్ళిపోయింది. ఆ స్పాట్లో కెమెరాలు లేవు. యాదమ్మ చాకచక్యానికి నేను, కాశి ఆశ్చర్యపోయాము. ఎంతటి నమ్మినబంటు…? అయినా నమ్మినవారినే కదా ఎవరయినా దగా చేయగలరు..!

          మరో చోట వాష్ ఏరియాలో అమ్మ యాదమ్మకి డబ్బు ఇవ్వటం, తను గిన్నెలు తోముతూ ఆ డబ్బుని జాకెట్టులో పెట్టుకోవటం కనిపించింది. జీతమేమో అనుకున్నాను. కాని కాశి పనివాళ్ళకు జీతాలు తన ముందే ఇస్తుందని, బహూశా పాలవాడికి అందిస్తానని చెప్పి యాదమ్మ తీసుకుని వుంటుంది అన్నాడు.

          రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావని కాశి కెమెరాలో చూపించినా యాదమ్మ మొండికేసింది. తను డబ్బుని గమనించకుండా న్యూస్పేపర్ లోకి తోసానంది. ప్రతిరోజూ సాయంత్రం అమ్మ చదివేసిన పేపర్ బయట పెట్టటం తన అలవాటంది.

          జాకెట్టులో పెట్టుకున్నది తనకు ఇచ్చిన జీతం అంది.

          కాశి జీతం అమ్మ అంత క్రితమే తన ముందే ఇచ్చిందని వాదించే సరికి,  డబ్బు అవసరమయి అమ్మ దగ్గర రెండు వేలు అడ్వాన్సు తీసుకున్నానంది.

          దొంగ పట్టు పడ్డా, వాడిని  దొంగంటే ఒప్పుకోడని ప్రత్యక్షంగా తెలిసింది నాకు. దొంగని తెలిసాక యాదమ్మతో పని చేయించుకోవటం ఇష్టం లేక తక్షణమే పని మాన్పించేశాను.

          కెమెరా సాక్ష్యాధారాలతో యాదమ్మ పైన పోలీసు కంప్లయింట్ చేయవచ్చు. ఇంట్లో పోయిన నగ, ఇతర వస్తువులు కూడా బహూశా యాదమ్మ ఇంట్లో దొరకవచ్చు. కాని పదేళ్ళుగా పని చేస్తున్న దాని పైన పోలీసు కంప్లయింట్ చేయాలనిపించలేదు. మేము ఇండియాలో ఉండకపోయినా, ఎప్పుడు వచ్చి పిలిస్తే అప్పుడు అభిమానంగా పరిగెత్తుకు వచ్చేది.

          ఇదివరకు ఎన్నో వస్తువులు అమ్మ పాలవాడికి ఇమ్మని  బలవంతంగా ఇస్తే, నాకు ఫోనులో విషయం చెప్పి మరీ తను ఆ వస్తువులు తనే వాడుకుంది. అమ్మ మైండ్సెట్ మొత్తం ఆకళింపు చేసుకుని ఆమె బలహీనతను అవకాశంగా వాడుకుంది.

          అమ్మ పిచ్చి వ్యామోహంలో పడి డబ్బు, ఇతర వస్తువులతో ప్రలోభ పెడితే ఎంత మంచివారయినా ఆశపడకుండా వుంటారా. అదీ పనిమనిషి స్థాయి ఆర్ధిక స్థోమతలో వున్నవారు నిజాయితీగా వుండాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది. అయినా అమ్మకి మతి స్థిమితం లేనప్పుడు ఎవరినీ ఏమీ అనే అవకాశం లేదు.

          నాకు వెంటనే కొత్త పనిమనిషి దొరకలేదు. వున్న పనులకు తోడు ఇదో కొత్త సమస్య. ఇన్ని సమస్యల మధ్య నర్సింగ్ కోర్సు పూర్తిగా మూలబడి పోయింది. కనీసం ఒక్క జూమ్ మీట్ అయినా అటెండ్ కాలేక పోయాను. మనశ్శాంతి కరువయ్యింది.

          ఇంట్లో ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

          అమ్మకు వీసా వచ్చేవరకూ నమ్మకం లేదు. వీసా వచ్చినా ఆస్ట్రేలియాకి విమానాలు ఎప్పటికి ప్రారంభమవుతాయో తెలీదు. ప్లేస్మెంట్ సరికి చేరుకోగలనో లేదో తెలియదు.

          ప్లేస్మెంట్ సమయానికి విమానాలు ప్రారంభమయినా అమ్మ నాతో ఆస్ట్రేలియా వస్తుందన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో అమ్మను వదిలి వెళ్ళలేను.

          డాక్టర్ సలహా మేరకు అమ్మకు ప్లేస్ మార్పు చాలా అవసరం.

          ఇన్ని సమస్యల చిత్రవధల మధ్య చదువు ఎలా తలకెక్కుతుంది…?

          అసలు ఈ నొసటన సమస్యలేనా, సెకండ్ ఇన్నింగ్స్ కూడా రాసి ఉన్నాయా…?

*****

(సశేషం)

Please follow and like us:

One thought on “జీవితం అంచున – 22 (యదార్థ గాథ)”

  1. తల్లులను అంటిపెట్టుకుని వుండి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశలో తమ జీవితాలను త్యాగం చేసే
    కూతుళ్లు మన సమాజంలో బహు అరుదుగా వుంటారు.అలాంటి అరుదైన స్త్రీమూర్తులలో అరుదైన
    వ్యక్తిత్వం మీది అని ఇది చదివాక అర్ధం అవుతున్నది.
    ఇక సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఎదురు చూడవలసిన్దే తప్ప ముందుగా వూహించెటట్టు వుండదు..సాహసం చెస్తే ఒకటి సాధించడం మరోటి కోల్పోవడం వూహించనక్కర లేని అంశాలు.

Leave a Reply

Your email address will not be published.