నా అంతరంగ తరంగాలు-20
-మన్నెం శారద
అద్భుతమైన రంగస్థల , సినిమా నటి తెలంగాణ శకుంతల!
హైదరాబాద్ వచ్చిన కొత్త రోజులు!
సోమాజీ గూడాలో మేం అద్దెకున్న ఇంటి పక్కనే ఉండేవారు తెలంగాణా శకుంతల.
ఆఁ ఇల్లు ఈ ఇంటి కాంపౌండ్ వాల్ ని ఆనుకుని వున్న చిన్న రేకు షెడ్. ఈ మాట చెబుతున్నది కేవలం ఆఁ నాడు ఆమె ఆర్ధిక పరిస్థితి వివరించడం కోసమే. చులకన చేయడం కోసం ఎంతమాత్రం కాదు.
ఆమె మహారాష్ట్రకు చెందినవారు.
ఆమెకు నాటకాల్లో నటించడమే భుక్తి, ఆశక్తి!
ఆమె ఇంట్లో ఒక పెద్ద సన్నజాజీ చెట్టు ఉండేది. ఆఁ చెట్టు మానుకట్టి మొత్తం అంతా మావైపు ఒరిగి ఆకు కనిపించకుండా విరగబూసేది.
మా ఇల్లుకలావిడ వెంటనే ఆఁ పూలన్నీ కోయి తల్లీ, పూజకి పనికొస్తాయి!” అని ఊదరగొట్టేసేది.
“ఆఁ చెట్టు మనది కాదుకదండీ, చూస్తే ఏమంటారో “అన్నాను అప్పటకీ కొంత మొగమాటంగా.
“ఆ…ఆవిడెక్కడుంటుంది ఇంట్లో.. కొయ్యమ్మా!”అంటూ ఓ పెద్ద స్టీల్ గిన్నె తెచ్చి నా మొహానకొట్టి బుడి బుడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది.
ఇక చేసేదేముంది!
నా మొగమాటాన్ని వెయ్యినొక్కసారి కసిగా తిట్టుకుని గిన్నె తీసుకుని స్టూలెక్కి కన్నీళ్ళు రాని ఏడుపుతో అన్నీ కోసి గిన్నె తీసుకుని ఆవిడకిచ్చి మా పోర్షన్ లోకి అపరాధి లా దొంగ మొహం పెట్టుకుని వచ్చేదాన్ని.
అప్పటికే రెండు జతల ఎర్రబడిన కళ్ళు ముక్కుదగ్గరకొచ్చి ముడి పడి నన్ను తీవ్రంగా చూడటం గ్రహించి చూడనట్లు వంటగదిలో దూరి వాళ్ళ కోపానికి కారణమైన సెకండ్ కోటా ఫిల్టర్ కాఫీ వాళ్ళిద్దరికీ ఇచ్చి వారి శాపానికి గురి కాకుండా నన్ను నేను రక్షించుకునేదాన్ని.
అందులో ఒకరు అలుగుయే యే ఎరుగని శాంతమూర్తి మా నాన్నగారయితే మరొకరు ఎప్పుడు శపిద్దామా అని గ్లాసుడు నీళ్ళు పట్టుకు నా చుట్టూ తిరిగే మా ఆయన!
కాఫీ విషయానికొచ్చేసరికి ఇద్దరూ ఒకటే!
సరే!
ఏం మొత్తుకున్నా పూలు కోయడమనేది నా దినచర్యలో ఒక భాగమయి పోయింది.
సాయంత్రం రాగానే వాటిని మాల కట్టడంతో సహా!
పాపం శకుంతల గారు నేను కోయడం చూసినా ఒక్కరోజూ ఒక్కమాట అని ఎరగదు.
తర్వాతంటే సినిమాల్లోకొచ్చి గయ్యాళి పాత్రలు వేసి హడల గొట్టింది గానీ ముందంతా సక్కుబాయి లాంటి వేషాలు కట్టి కన్నీళ్ళు పెట్టించిన అనుభవమాయే!
నేను ఆఫీసుకెళ్ళే సమయానికి ఒక్కోసారి ఆమె కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి నాతోపాటూ వస్తుండేవారు.
నేను దొంగపూలు (పూలు దొంగ వెలా అవుతాయి?) కోసిన దొంగమొహంతో దొంగనవ్వు నవ్వేదాన్ని.
నిజానికి నాకు కళలంటే చాలా ఇష్టం.
ఆమె కూడా బదులుగా నవ్వి నేను ఎక్కడ పనిచేస్తున్నానో అడిగి తెలుసుకుని” నేను మీ ఆఫీస్ ఫంక్షన్స్ లో చాలా నాటకాల్లో నటించానండి. ” అని చెప్పారు.
మా ఆఫీస్ ఇర్రం అనే ముస్లిం సైనికాధికారి పాలస్ (ఎర్రం మంజిల్ )కాబట్టి అందులో వారి ప్రార్ధనల కోసం ఒక మసీదు ఉండేది.
అప్పటిలో ఆఫీస్ లో చాలా ముస్లిం స్టాఫ్ ఉండటాన వారు మధ్యాన్నం ప్రేయర్స్ కి వెళ్ళేవారు.
దానితో మన హిందూస్ నిషాన్ షెడ్డు అని ఒక పెద్ద గచ్చిబౌలి బస్ స్టాండ్ లాంటి ఒక హాల్ నిర్మించి ప్రతి శుక్రవారం ఒక గీతాకారుడ్ని పిలిచి ప్రసంగాలు ఇప్పించడం ఆనవాయితీగా మారిందట!
అప్పుడప్పుడు సదరు హాల్లో ఆఫీస్ మీటింగులు, ఫంక్షన్స్ కూడా జరుగుతుండేవి.
నేను హైదరాబాద్ వచ్చాకా మొదటిసారి నేషనల్ లెవల్లో IRC (Indian Road Congress ) మీటింగ్స్ భారీ ఎత్తున జరిగాయి.
దేశం మొత్తం సెక్రటరీలు వాళ్ళ కుటుంబాలతో సహా హైదరాబాద్ తరలి వచ్చారు.
వారికి స్టార్ హోటల్స్ లో విడిది, వారి కుటుంబాలకి సిటీలో ముఖ్య స్థలాలు చూపించడం చార్మినార్ దగ్గర షాపింగులు చేయించడం తదితర అరవ చాకిరీ మా లేడీ కొలీగ్స్ నెత్తిన పడింది.
నా నెత్తిన పెయింటింగ్ వర్క్ పెట్టి, రవీంద్ర భారతిలో వేయబోయే “క్షీర సాగరమధనం” నాటికకు వెనక మాటలు మాట్లాడి నాటకాన్ని పరిచయం చేసే భాగ్యం కలిగించారు.
సరిగ్గా అప్పుడే రిహర్సల్స్ కోసం ఆఫీస్ టైంకి ఒక అరగంట ముందుగా శకుంతల వచ్చి మా లేడీస్ వెయిటింగ్ రూమ్ దగ్గర చిరునవ్వుతో నిలబడేవారు.
ఆఫీస్ అవర్స్ లో ఎంతకాదన్నా మూడుసార్లన్నా అక్కడ తిష్ట వేసి అడ్డమైన కబుర్లు చెప్పుకుని ఎవర్నో ఒకర్ని ఆడిపోసుకుంటూ గాసిప్స్ చెప్పుకునే ఒక వర్గం శకుంతల గారిని చూడగానే కళ్ళు పెద్దవి చేసి చూడకూడనిది చూసినట్లు మ్రాన్పడి చూసేవారు.
ఆమె దిక్కు తోచని దానిలా మొగమాటంగా అలాగే నిలబడి పోయేవారు.
అక్కడ పనిచేసే మాకే ఆఁ రూమ్ లోకి వెళ్ళాలంటే జూ లో ప్రవేశించి నట్లు కాళ్ళు వణికేవి.
ఇక ఆవిడ సంగతి చెప్పేదేముంది!
ఎప్పుడైనా మేం అక్కడుంటే నేనూ నా లాంటి ఒక రిద్దరం కలిసి ఆమెని ధైర్యం చేసి లోనికి ఆహ్వానించి మా పక్కన కూర్చోబెట్టుకుని నాటకం వివరాలు గట్రా అడిగి తెలుసు కుని మానవ ధర్మం పాటించేవాళ్ళం.
అయితే మాలో కొందరు మహిళామణులు మమ్మల్ని కూడా వెలివేసినట్లు మిర్రి మిర్రి చూసేవారు.
అలా కొంచెం ఆమెతో పరిచయమై మేం మాట్లాడుకుంటూ రావడం గమనించిన మా ఓనరమ్మా నాకు సున్నితంగానే వార్నింగ్ ఇచ్చింది.
‘ఏంటి శారదమ్మా, నీకు ఆవిడతో స్నేహం! ఆమె నాటకాల మనిషి.. మొగుడు లేడు, ఆమె ఇంటికి ఎవరెవరో వస్తుంటారు. ‘అంటూ.
నాకు చాలా బాధా, కోపం రెండూ వచ్చాయి.
ఆమెకు భర్త వున్నాడో చచ్చాడో లేక వదిలేశాడో… అసలది మన సబ్జెక్ట్ కానే కాదు.
పోతే ఆమె రంగస్థల నటి ” ఆమెను నాటకాల్లో బుక్ చేసుకోవడానికి ఎవరెవరో కాంట్రాక్టర్స్ రావడం కూడా సహజం.
అది కూడా మనకు ఏమాత్రం సంబంధించని విషయం!
రవీంద్ర భారతిలో ఆనాడు ఆమె నటనని చూసి అందరూ సెభాష్ అన్నారు.
పొగడ్తలతో ముంచెత్తేరు.
ఆఁ నాటిక గురించి ఎంతో ఉద్వేగంగా మాట్లాడి పాత్రలని పరిచయం చేసిన నన్ను కూడా మా చీఫ్ ఇంజనీర్స్ అందరూ డయాస్ మీదకు పిలిచి వారితో పాటూ కూల్ డ్రింక్ ఆఫర్ చేసి ” ఈ అమ్మాయిని నేను ఎప్పోయింట్ చేశానని ఒకరంటే, నేనే ఈ అమ్మాయికి ప్రమోషన్ ఇచ్చానని మరొకరు, నాదగ్గర పనిచేస్తున్నదని బ్రిలియంట్ వర్కర్ ‘అని పొగడటం నేను ఏనాటికి మరచిపోలేని విషయం!
ఆఁ శకుంతల గారే సినిమాల్లోకి వచ్చి తనకి లభించిన పాత్రలమేరకు నటించి ఇండస్ట్రీని చెరిగి పారేసి తెలంగాణా శకుంతలగా ప్రసిద్ధి చెందారు.
ఎన్నో అవార్డులు తీసుకున్నారు.
అమ్మాయిని చదివించి పెళ్ళి చేసారు.
ఒకమనిషిని అందులో తోటి స్త్రీని వారు చేస్తున్న వృత్తి రీత్యా తక్కువచేసి చూడటం కన్నా హేయమైన పని మరొకటి వుండదు కదా!
వాళ్ళని మనుషుల్లోనే లెక్కేయాలంటారా???
*****
(సశేషం)
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.