నా జీవన యానంలో- రెండవభాగం- 46

-కె.వరలక్ష్మి

          ‘‘పరిపూర్ణత సాధించిన మనసు అద్దంలా అన్నిటినీ స్వీకరిస్తుంది. కాని దేన్నీ తనతో ఉంచుకోదు’’ అంటారు స్వామి చిన్మయానంద. ‘‘జీవితాన్ని మరీ తీవ్రంగా తీసుకోవద్దు, ఎందుకంటే అది నిన్ను అనుక్షణం దహించివేస్తుంది’’ ఒక ఫ్రెంచి సూక్తి.

          ఇలాంటివన్నీ చదివేటప్పుడు ఆచరణ సాధ్యాలే అన్పిస్తాయి. కాని నిజజీవితంలోకి వచ్చేసరికి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’. 2009 జూన్ 26 న ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళేడు, అతనిదొక విజయంతో నిండిన పెద్ద విషాద గాధ.

          ఆ సంవత్సరం కాసిన ఎండలకి వొంట్లోని ఓపికంతా ఆవిరైపోయింది.

          జూలై 13 ఉదయాన్నే ఆకాశం మేఘావృతమై… సన్నని జల్లు.. చల్లని గాలి… మనసు కొంత భారంగా… కొంత తేలికగా… కోరిక అన్ని హృదయశల్యాలకూ మూలం అని తెలిసీ కాంక్షల బాధల బరువులన్ని నెత్తికెత్తుకుంటాం. అంతా రైలు ప్రయాణమే అయిన ప్పుడు అనురాగాలెక్కడ లభిస్తాయి? లభించినట్లు భ్రమ కలిగిస్తాయంతే! బాదర బందీలు, ఎటాచ్ మెంట్స్ లేని జీవితం జీవించడం ఎప్పటికైనా అలవడుతుందా? బతుకంతా పలు ప్రశ్నల మయమైపోయింది.

          నేను లేవడం, నూకలు వెయ్యడం కాస్త ఆలస్యమైతే నా కిటికీ పక్కన చేరి కిచకిచల జుగల్ బందీ చేసే పిచ్చుకల మీద అంతులేని అనురాగం పెంచుకున్నాను. మనుషుల ప్రేమగానాల్లో ఎన్నెన్ని మోసాలు! ఎన్ని అపశృతులు!

          ‘‘మీకింకా ప్రతిభా పురస్కారం రాలేదేమిటి?’’ అన్నాడు మాకు దగ్గర్లోని యూనివర్సటీ ప్రొఫెసర్ ఒకాయన.

          ‘‘ఏమో!’’ అన్నాను నేను అయోమయంగా,

          ‘‘మీకన్నా తక్కువ రాసిన, తక్కువ గుర్తింపు ఉన్న మీ ఫ్రెండ్ కి వచ్చిందే! (ఆమె పేరు ఇక్కడ చెప్పడం లేదు). ఆమె లాంటి ఫ్రెండ్ ఉండీ మీకా సూత్రాలు తెలీకపోతే ఎలాగ? పరిచయాలు పెంచుకోవడం, ఆ ముసుగులో పనులు చేయించుకోవడం తెలీక పోతే ఎలాగ?’’ అన్నాడు. సాహిత్యలోకంలో అలాంటివి ఉన్నాయని తెలిసినందుకు మొదటి సారిగా సిగ్గనిపించింది.

          ‘‘నాకు కొన్ని నియమాలున్నాయి. ఏ గుర్తింపైనా దానికది వస్తేరానీ. అంతేకాని ఈ పైరవీల గుర్తింపులు నాకొద్దు’’ అన్నాను.

          ‘‘ఈ పైరవీల ప్రపంచంలో అదెలాసాధ్యం? అసలే మీరు ఆధిపత్య కులాలకు చెందినవారు కాకపోయె. వెనకబడిన కులాల వాళ్ళకు ప్రయత్నించకుండా ఎవరు పిలిచి పట్టం కడతారు?’’ అన్నాడు. నాకెందుకో ఆ సంభాషణ అంతగా రుచించలేదు. మౌనంగా ఉండిపోయాను.

          ఆ జూలైలో ఒకరోజు రచయిత గోపిని కరుణాకర్ ఫోన్ చేసి, తన కష్టాలన్నీ ఏకరువు పెట్టేడు, తన పాపాయికి హెల్త్ బాగా లేదని, 5 వేలు సర్దితే రెండుమూడు నెలల్లో తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ప్రగతినగర్ లో రచయితలంతా కలిసినప్పుడు ఒకే ఒకసారి పరిచయం, డైరెక్టర్ వంశీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నానని చెప్పేడు, ఈ కాస్త పరిచయానికే అప్పు అడుగుతున్నాడేమిటి? అనిపించినా, చంటిపిల్ల హెల్త్ ప్రాబ్లమ్ కదా! అప్పటికి నాకు పెన్షనే ఐదువేలు రావడం లేదు, అయినా అప్పటికప్పుడు ఎండలో బేంకుకెళ్ళి డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేను. అంతే! ఇప్పటికి పదిహేనేళ్ళు దాటింది. హైదరాబాద్లో ఏ సభలోనైనా నన్ను చూస్తే మొహం చాటేసి అట్నుంచి పోతాడు, అప్పటికి నాకు ఐదువేలంటే ఎక్కువేమరి! రచయితలంటే చాలా నమ్మదగిన వాళ్ళనే నా అభిప్రాయం అలా వమ్మైపోయింది.

          ఒక్క చేతి మీద సంసారాన్ని ఈదుకుని వచ్చినందుకో ఏమో ఆర్థికపరమైన విషయాలు చాలా ఇబ్బంది పెట్టేసేవి నన్ను. ఆగష్టు నెలలో రాజమండ్రిలో మా చిన్న చెల్లెలువాళ్ళ నాలుగో అమ్మాయికి పెళ్ళి కుదిరిందని పిలిస్తే వెళ్ళేను. నాకు చెరో పక్కా మా చెల్లీ, వాళ్ళాయనా కూర్చుని ఆ పెళ్ళికి మూడు లక్షలు సర్దమని అడిగేరు, ‘అంత డబ్బు నా దగ్గరెక్కడిది?’ అంటే మా అబ్బాయిని అడిగి ఇమ్మన్నారు. అప్పటికే వాళ్ళు ఇల్లు అమ్మేసుకున్నారు. అతను వ్యాపారాన్ని వదిలేసి ఖాళీగా ఉంటున్నాడు. తీర్చే మార్గంలేదు కాబట్టి ఇస్తే ఊరికే ఇవ్వాలి, నా అవసరాలకే నా పిల్లల దగ్గర ఎప్పుడూ చెయ్యి చాచలేదు, వాళ్ళకి ఇమ్మని, అందునా మూడు లక్షలు ఎలా చెప్పగలను? నేను మౌనంగా ఉండిపోయేసరికి ఇద్దరూ చెరో మాటల తూటాలు విసరడం మొదలు పెట్టేరు. ‘‘అందరి అవసరాలకి మేం ఆదుకున్నాం. మా అవసరాలకి ఎవరూ ఆదుకోవడం లేదు’’ అంది మా చెల్లెలు. అదేమిటంటే మా గీత పెళ్ళి, చిన్నమ్మాయి పెళ్ళి ఒకే సంవత్సరం లో జరగడం వల్ల డబ్బుకి కొంత ఇబ్బందైంది. చిన్నమ్మాయి పెళ్ళికి చాలా వరకు నగలు అమ్మేసినా ఇంకా 20 వేలు తక్కువైంది. ఆ విషయం విని మా చెల్లి వాళ్ళాయన నూటికి మూడు రూపాయల వడ్డీకి ఎవరి దగ్గరో తెచ్చేను అని ఇచ్చి రెండు నెలల తర్వాత అప్పు తీర్చేవేళకు నూటికి 5 రూ. లు చొప్పున వడ్డీ తీసుకున్నాడు. ఇలాంటి నిష్టూరాలు ఎంతో బాధిస్తాయి.

          ఆగష్టు 8-9 తేదీలలో నేషనల్ రచయితల సమావేశాలు నెల్లూరులో జరుపు తున్నాం రమ్మని పెరుగు రామకృష్ణ గారి నుంచి ఆహ్వానం అందింది.

          ఆగష్టు 7 న ఉదయం 10 కి రాజమండ్రి స్టేషన్లో హౌరా – తిరుచ్చి ఎక్స్ ప్రెస్ ఎక్కి నెల్లూరు చేరుకునే సరికి సాయంత్రం 4.30  అయ్యింది. స్టేషనుకి పెరుగురామకృష్ణగారు తన కారులో వచ్చి నన్నూ, అదే ట్రెయిన్ లో వచ్చిన మరో బెంగాలీ రచయితను రిసీవ్ చేసుకున్నాడు. అతన్ని సింహపురి హోటల్లో దించి, నన్ను తన ఇంటికి తీసుకెళ్ళేడు, అప్పటికే వాళ్ళింట్లో కన్నడ కవయిత్రి ప్రొ. సుకన్యామారుతి వచ్చి ఉంది. పెరుగువాళ్ళ తల్లిగారు, భార్య సుజన అమ్మాయి నన్ను చాలా మర్యాదగా, ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. రాత్రి ప్రెస్ మీట్ అనంతరం అందరికీ ఆర్.డి. హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేసారు, దగ్గుమాటి పద్మాకర్ వాళ్ళ అమ్మాయితో వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఖాదర్ షరీఫ్ వెరైటీ టాకింగ్ ఒక పెద్ద కాలక్షేపం. రాత్రి పెరుగు వాళ్ళ మేడ మీది గదిలో వాళ్ళ తల్లిగారూ నేనూ నిద్రపోయాం.

          8న ఉదయం 5 కే తయారై సింహపురి హోటల్ దగ్గర ఉన్న బస్సును చేరుకు న్నాం. ప్రతిమ అప్పుడే వచ్చింది. ఇంకా పేర్లు తెలీని ఎవరెవర్నో పరిచయాలు చేసారు, బస్సు నడుస్తూండగా పేక్ చేయించి తెచ్చిన ఇడ్లీ, పొంగలి పేకెట్లు అందరికీ పంచారు. దారిలో నాలుగు రోడ్ల జంక్షన్ లో ఒక చోట మామిడిపళ్ళు కన్పిస్తే ఒక కేజీ కొనిపించు కున్నాను, మావైపు ఆగష్టు నాటికి మామిడిపళ్ళు ఉండవు.

          వర్షాలు లేక రోడ్డుకిరువైపులా భూములు ఆరిపోయి నెర్రలిచ్చి ఉన్నాయి. దారిలో పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు కారులో వచ్చి బస్సెక్కారు. ముందుగా నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు గుడికి చేరుకున్నాం. ఆలయం చూసి, ప్రసాదం తిని అక్కడి గెస్ట్ హౌస్ లో కాస్సేపు రెస్ట్ తీసుకున్నాక భోజనాలు వడ్డించారు. తిరిగి బస్సెక్కి ఉదయ గిరి మీదుగా చాలా దూరం ప్రయాణించి సాయంకాలానికి భైరవకోన చేరుకున్నాం. అక్కడి జలపాతం, చిన్నలోయ, రాతిలో చెక్కిన గుహాశివాలయాలు చూసాం. మరో చిన్న కొండ పైన ఉన్న యోగి విగ్రహం చూడాలని వెళ్ళేం. అంత పెద్ద మెట్లు ఎక్కిదిగడం కష్టమైంది. నేనైతే చెమటతో తడిసిపోయాను. ఎడమమోకాలు నొప్పి ప్రారంభమైంది, వెనక్కి వచ్చి క్రిష్ణవరం నవోదయా స్కూలుకు చేరుకునేసరికి పొద్దువాటారింది. అమ్మాయిల హాస్టల్ రూమ్స్ మాకు, అబ్బాయిల రూమ్స్ జెంట్స్ కి ఇచ్చారు. బాత్ రూమ్స్, బెడ్స్ ఏమీ బాగా లేవు. ఏదో అడ్జెస్టయ్యాం. రిఫ్రెష్షై అందరం అక్కడి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంకి వెళ్ళేం. హాస్టలు పిల్లలంతా స్టేజి ఎదుట కూర్చోగా మాలో కొందరు కవిత్వం చదివేరు. ఇంకొందరు ఉపన్యాసాలు ఇచ్చారు. అలసిపోయిన మాకెవరికీ ఆ కార్యక్రమం మీద మనసు నిలవలేదు. కేంటీన్లో భోజనాలు చేసివచ్చి నిద్రపోయాం. సుకన్యామారుతికి ఏర్పాట్లేవీ నచ్చక ఎవరో నెల్లూరు వెళ్తూంటే వాళ్ళ కారులో వెళ్ళిపోయింది.

          9వ తేదీ ఉదయాన్నే లేచి రెడీ అయ్యాం. కేంటీన్లో ఆ స్కూలు పిల్లలే మాకు టిఫిన్స్ వడ్డించారు. ఆ నవోదయా పిల్లల డిసిప్లిన్, కలిసిపోవడం నాకు చాలా నచ్చింది, ఉదయ గిరిలో బస్సు ఆపి కృష్ణదేవరాయల కాలం నాటి శిథిల ఆలయాన్ని చూసాం, వెనక కొండల వరుస, విశాలమైన ప్రాంగణంలో ప్రాకారాల మధ్య గోపురాలు కూలిపోయిన, శిల్పాలు పగలగొట్టబడిన శిథిలాలయం. నా కాలునొప్పి ఎక్కువైంది. కుంటుకుంటూ నడక. ప్రతిమ, మౌళి, షరీఫ్, జొన్న విత్తుల శ్రీరామ చంద్రమూర్తి నాతో నెమ్మదిగా నడుస్తూ అక్కా… అక్కా అంటూ జొన్నవిత్తుల చాలా ఫోటోలు తీసాడు.

          అక్కడికి దగ్గర్లోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ కి నడిచి వెళ్ళేం. అక్కడి సెమినార్ హాల్లో సభ. అటు మొదటిసారి వెళ్ళడం వలన కాబోలు జ్యోతి ప్రజ్వలనం, పుస్తకావిష్కరణ నాచేత చేయించారు. అదేం పెద్ద విషయం కాదు నా దృష్టిలో, కాని, తన చేత చేయించలేదనో ఎందుకో నా ఫ్రెండ్ అలిగి బైటికెళ్ళిపోయింది. సభ ముగిసాక ఆ కాలేజ్ కేంటీన్లో భోజనాలు చేసి తిరిగి బస్సెక్కాం, సాయంకాలానికి నెల్లూరు చేరుకున్నాం. దారి పొడవునా నా ఫ్రెండ్ మొహం ముడుచుకునే ఉంది. 8.50 కి సింహపురి ఎక్స్ ప్రెస్ ఎక్కి 10 ఉదయానికి ఇంటికి చేరుకున్నాను. పెరుగు రామకృష్ణ అడిగితే పై ప్రయాణం గురించి రాసి ఆంధ్రజ్యోతికి పంపేను.

          ఆగష్టు 30 న కాకినాడ విద్యుత్ నగర్ లో ఉన్న ఐడియల్ కాలేజ్ లో జరిగిన శ్రీ శ్రీ శతవసంతాల సభకు చిరంజీవి నీకుమారిగారు పిలిస్తే వెళ్ళోచ్చేను.

          సెప్టెంబర్ ఒకటి నుంచీ ఎడతెరిపి లేని వాన ప్రారంభమైంది అవాళ్టి వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చిత్తూరు వెళ్ళడానికి ఉదయం హైదరాబాద్ లో ఎక్కిన హెలికాఫ్టర్ రాడార్ మీంచి మాయమైంది. మూడు ఉదయం వార్తల్లో తెలిసింది. నిన్న రాజశేఖర రెడ్డి ఎక్కిన హెలికాఫ్టర్ నల్ల మలకొండల్ని గుద్దుకొని క్రాష్ అయిపోయిందని, నామరూపాలు లేకుండా శకలాలై పోయిన అందరి శరీరభాగాల్ని, మాంసపు ముద్దల్ని ఏరితెచ్చి ఐదు మూటలుగా కట్టి హైదరాబాద్ కి తరలించారట. ఇప్పుడు చరిత్రగా మిగిలిన ఆ సంఘటన ఆ నాడు చాలామందిని దుఃఖంలో ముంచేసింది. రెండు రోజుల్లో గుండె ఆగీ, ఆత్మహత్య చేసుకునీ 162 మంది మరణించారట. ఎప్పుడూ హరితాంధ్ర అనీ, నీటి ప్రాజెక్టులనీ, వర్షాలు కురవాలనీ కలవరించిన, ఎక్కువ శాతం ప్రజల మనసుల్ని దోచుకున్న సి.యం. ఆ వర్షానికే బలైపోయాడు.

          ఆ సెప్టెంబర్ లో పేరుపొందిన స్టేజి ఆర్టిస్ట్ ప్రసాదమూర్తి రాజమండ్రిలో హఠాత్తుగా మరణించాడు. అతను జగ్గంపేట పాలసేకరణ కేంద్రంలో పనిచేసేటప్పుడు వాళ్ళ కోసం నా చేత ఒక నాటకం రాయించాలని తపన పడేవాడు. విశాఖ రేడియోలో వర్క్ చేసిన కాకరపర్తి సత్యనారాయణమూర్తి నా రచనల గురించి మంచిగా చెప్పడమే కాదు ప్రసాద మూర్తితో కలిసి మా ఇంటికి వచ్చారు. అప్పటికి నా భర్త మోహన్ అనారోగ్యంతో మంచం మీద ఉండడంతో నాటకం రాయడం సాధ్యపడలేదు, కాని, ప్రసాదమూర్తి అప్పుడప్పుడు వచ్చి ఆత్మీయంగా పలకరించి వెళ్ళేవాడు. కమల కళావాహిని సంస్థ వారు వారి ప్రథమ వార్షికోత్సవంలో ప్రసాదమూర్తికి నివాళి కార్యక్రమాన్ని కాకినాడ సూర్య కళామందిర్ లో సెప్టెంబర్ 20న ఏర్పాటుచేసి వక్తగా నన్ను పిలిచారు. జ్యోతి ప్రజ్వలన, వెంకట్ కి సన్మానం కూడా నా చేతే చేయించారు. ఎంతో మర్యాదగా ట్రీట్ చేసారు. సభానంతరం మాధవసేవ నాటిక వేసారు.

          సెప్టెంబర్ 25న మా చిన్న తమ్ముడి కొడుకు పెళ్ళి జరిగింది. మోహన్ లేని తేడాని గుర్తుచేస్తూ నన్నెవ్వరూ అక్షతలు వెయ్యడానికి  కూడా పిలవలేదు. ఆ పెళ్ళి కోసం హైదరాబాద్ వచ్చిన నేను మా అబ్బాయి ‘అరుణాచలం’ వెళ్ళే ప్రయాణం ఉందంటే ఆగిపోయాను. అక్టోబర్ 13 న రాత్రి 8 కి కాచిగూడా స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కాం.

2009 లో ప్రచురింపబడిన నా రచనలు :

జనవరి చినుకు మంత్లీలో ‘ఎవరు హోప్ లెస్ ఫెలో’ కథ

జనవరి పున్నమి సాహిత్య సంచికలో ‘అమ్మానాన్నా విడిపోయారు’ పోయెం

జనవరి కవితాలో ‘రెండు రెక్కలు – ఒక ఆకాశం’ పోయెమ్

8.3.09 ఆంధ్రభూమి డైలీలో ‘ఖడ్గధార పై నాన్న’ పోయెమ్

22.3.09 వార్త ఆదివారం బుక్కులో ‘నిర్వేదం’ పోయెమ్

29.3.09 ఆంధ్రజ్యోతి ఆదివారం బుక్కులో ‘క్షతగాత్ర’ కథ

26.5.09 సాక్షీ ఫేమిలీ లో ‘కుంకుడు చెట్టు’ స్కెచ్

15.4.09 నవ్య వీక్లీలో ‘చుక్కాని లేని నావ’ కథ

15.08.09 ఆంధ్రభూమి ప్రియదర్శినిలో ‘ఒక స్వప్నం – ఒక మెలకువ’ కథ

2009 నెల్లూరు పెన్నా రచయితల సావనీర్ లో ‘ఒక స్వప్నం – ఒక మెలకువ’ కథ

2009 జూలై – ఆగష్టు కవితాలో ‘భగ్ననిశ్శబ్దం’ పోయెమ్

2009 జూలై – ఆగష్టు ‘సమకాలీన భారతీయ సాహిత్య’ సాహిత్య అకాడమీ మేగజైన్ లో ‘నేను’ పోయెమ్ కి హిందీ అనువాదం ‘మై’ (శాంతసుందరి)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.