వెనుతిరగని వెన్నెల(భాగం-63)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవు తుంది.
***
ప్రభు సాయంత్రానికి తిరిగి వచ్చేడు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి గానీ, వాళ్ళు మాట్లాడిన మాటల గురించి గానీ ఒక్క మాట కూడా ఎత్తకుండా దిగులుగా ఉన్న తన్మయి పక్కనే కుర్చీ జరుపుకుని కూచుని తల మీద లాలనగా చెయ్యి వేసి “ఏరా, కొబ్బరి బొండాం ఏమైనా తాగుతావా?” అన్నాడు.
తన్మయి ఆ చేతినలాగే పట్టుకుని నిశ్చింతగా కళ్ళుమూసుకుంది. ప్రభు వాళ్ళ అమ్మా, నాన్నా అన్న మాటలు ఏవీ తనతో చర్చించలేదు. అంటే వాళ్ళు ప్రభుతో చెప్పకపోయైనా ఉండాలి, లేదా ప్రభుకి తెలిసీ తనకి అవన్నీ ప్రస్తావించడం ఇష్టం లేకపోయైనా ఉండాలి. ఏదేవైనా తన మనసు బాధ పెట్టే పని ప్రభు చెయ్యనందుకు సంతోషంగా అనిపించింది.
“పాపని చూసిరాక పోయావా?” అంది నెమ్మదిగా.
“అక్కడినుండే వస్తున్నానురా. బంగారు తల్లి అలా నిద్రావస్థలోనే ఉంది” అన్నాడు మెల్లగా బాధ పలుకుతున్న గొంతుతో.
తన్మయికి తెలుసు తన ఎదురుగా బాధ పడితే తన ఆరోగ్యానికి మంచిది కాదని ప్రభు దు:ఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ ఉన్నాడని. తన్మయికి కళ్ళ నిండా నీళ్ళు కమ్ముకున్నాయి. పాప క్షేమంగా ఉండాలని, సంపూర్తిగా ఎదిగి, కళ్ళు తెరిచి బయటి ప్రపంచంలోకి రావాలని అనుక్షణం తమలో తాము ప్రార్థన చేస్తూనే ఉన్నారిద్దరూ. అయినా అనుకోనిదేదైనా జరుగుతుందేమోనని భయం వెయ్యసాగింది. ఈ బాధ వల్ల సరిగా తినక, నిద్రపోక కలుగుతున్న నీరసం మరొక వైపు క్రుంగ దీస్తోంది. ఇప్పుడిప్పుడే కుట్ల నొప్పి కూడా బాగా బాధ పెడ్తూంది తన్మయికి. కడుపు మీద, లోపల కండరాలు బిగబడుతున్న నొప్పితో బాటూ పాప గురించిన బాధ కడుపులో నుంచి తన్నుకు రాసాగింది.
బహుశా: కడుపు తీపి అంటే ఇదేనేమో!
ఈ ప్రపంచంలో కన్న పిల్లల మీద ఉన్న మమకారం ఎవరిమీదా ఉండదు అనుకుంటా!
గడియారం వైపు చూసింది. ఆరయ్యింది.
ప్రతీ రోజూ సాయంత్రం జ్యోతి, బాబు ఇద్దరూ వచ్చి కాస్సేపుండి వెళ్తున్నారు.
ఇవేళ ఇప్పటికింకా రాలేదెందుకో!
“అన్నట్టు మర్చిపోయా అంటూ” ప్రభు జేబులో నుంచి ఒక చిన్న నంబర్లు నొక్కే ఫోను రిసీవరు లాంటిది తీసి చూపించేడు.
ప్రశ్నార్థకంగా చూస్తున్న తన్మయితో “మొబైల్ ఫోను, కొత్తగా వచ్చింది. ఆఫీసు వాళ్ళు ఇచ్చేరు.” అన్నాడు.
ఇంకా అలాగే చూస్తున్న తన్మయితో “నువ్విక్కడి నుంచే ఇంటికి ఫోను చెయ్యొచ్చు” అని చేతికి ఇచ్చేడు.
అరచెయ్యంత పొడవున ఉన్న ఫోను మీద “మోటరోలా” అనే అక్షరాలున్నాయి.
సరిగ్గా లాండు ఫోను రిసీవరు సైజులో సగం ఉందా సెల్ ఫోను. కానీ బరువుగా ఉంది.
తన్మయి చిన్నగా నవ్వి “భలే ఉంది” అంది.
ఇంటికి ఫోను చెయ్యబోతూండగా బాబు పరుగెత్తుకొచ్చేడు “అమ్మా” అంటూ.
మంచంమ్మీద ఎక్కబోతున్న వాణ్ణి సున్నితంగా మందలించింది జ్యోతి.
“ఆ…ఆ…జాగ్రత్త అమ్మ కడుపు మీద పడకు” అంటూ.
తన పక్కనే కూచోబెట్టుకుంటూ మురిపెంగా వాడి తల సవరిస్తూ “ఏ నాన్నా! పొద్దుట్నించీ బాగా ఆడుకున్నావా?” అంది ప్రేమగా తన్మయి.
అంతలోనే తల్లి చేతిలోని ఫోను తన చేతిలోకి తీసుకుంటూ గబగబా నంబర్లేవో ఒత్తసాగేడు.
ప్రభు అప్పటిదాకా చిర్నవ్వుతో చూస్తున్న వాడల్లా చటుక్కున వాడి చేతిలో నుంచి ఫోను లాక్కుని బయటకు వెళ్ళిపోయేడు.
చిన్నబోయిన ముఖంతో ఏడుపు నిండిన కళ్ళని నిశ్శబ్దంగా తుడుచుకోసాగేడు బాబు. ఇంత చిన్న వయసులో చేతిలో వస్తువు లాక్కుంటే కాళ్ళు నేలకు తాటిస్తూ అరుస్తారు వేరే ఏ పిల్లలైనా. వయసుకి మించిన పరిణతి నిండిన వాడి గంభీరత్వానికి తన్మయికి ఒక పక్క ఆశ్చర్యమూ, వాడి పట్ల జాలీ, ప్రభు ప్రవర్తనకు బాధా ఒక్కసారిగా కలిగేయి తన్మయికి.
వాణ్ణి హత్తుకుని ముద్దుపెట్టుకుని “అది కొత్తగా వచ్చిన సెల్ ఫోనట నాన్నా. అలా నంబర్లు అన్నీ నొక్కెయ్యకూడదు మరి!” అంది అనునయంగా.
జ్యోతి పాపని చూసి రావడానికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడొక రణరంగం అయ్యేది.
నిశ్శబ్దంగా తలూపి తల్లిని పట్టుకుని అలానే పక్కన పడుకుని “అమ్మా! నువ్వు, చెల్లి ఇంటికి ఎప్పుడొస్తారు?” అన్నాడు బాబు.
బదులుగా తన్మయి వాడి వెన్ను నిమురుతూ “డాక్టరు గారు త్వరగా పంపేస్తారమ్మా బెంగ పడకు, అమ్మమ్మ ఉందిగా” అంది. నిస్సత్తువగా బాబు వెన్ను అలానే నిమురుతూ కళ్ళు మూసుకుంది తన్మయి.
జీవితం అడుగడుగునా గాయాలే. ఒక గాయం పూర్తిగా మానక ముందు మరొకటి. శరీరం, మనసు అన్ని చోట్లా గాయాలే. అనుక్షణం సమస్యలే. అన్ని వైపుల నుంచీ చుట్టుముడుతున్న సమస్యలు. తీవ్ర ఒరవడితో బాధా నదిలో కొట్టుకుపోతున్న తనకు దొరికిన చెట్టు కొమ్మ ఆసరా ప్రభు. కానీ కొమ్మ చుట్టూ అడుగడుగునా చేతులు గీరుకు పోతున్న ముళ్ళు. అయినా జీవితాన్ని గట్టెక్కించాలంటే రక్తసిక్త హస్తాల్ని నవ్వు ముసుగు వెనుక దాచుకోవాల్సి వస్తూంది.
“మనకు సమస్యలన్నీ తీరిపోతాయి నాన్నా! భయపడకు” అంది తనలో తను గొణుక్కుంటున్నట్లు. రోజూ అద్దాల పెట్టెలోని పాపాయికీ అదే చెప్తూంది. “భయపడకు తల్లీ భయపడకు! అమ్మ ఉంది నీకు తోడుగా. ఏ కష్టాన్నైనా కలిసి పంచుకునే అమ్మ ఉంది. త్వరగా కోలుకుని బయటి ప్రపంచంలోకి నువ్వెప్పుడు కళ్ళు విప్పుతావా అని ఆత్రంగా చూసే అమ్మ ఉంది.”
***
ఆసుపత్రిలో రోజులు భారంగా దొర్లసాగేయి. వనజ దాదాపు రోజు విడిచి రోజు వచ్చి ధైర్యం చెప్పసాగింది.
తన్మయికి తన మనస్సులో చెల రేగుతున్న అలజడిని వనజతో పంచుకోవాలని ఎంతో అనిపించినా చెప్పలేకపోతోంది.
ఏమని చెప్పాలి? మళ్ళీ పెళ్ళనే పేరుతో తనకే తెలియనంత లోతున సమస్యల్లో కూరుకుపోయింది తను. ఇక వనజకున్న సమస్యలతో బాటూ తన బాధలూ చెప్పి తనని మరింత బాధ పెట్టడం ఎందుకు?
ఒకప్పుడు తన విషయాలు ప్రతి ఒక్కటీ వనజతో పంచుకునేది. అసలు ఇది చెప్పచ్చు, ఇది చెప్పకూడదు అన్న ఆలోచన గానీ, వివేచన గానీ లేని వయసది.
బహుశా: వనజకి తన కష్టాలు చెప్పుకుంటే కలిగే సాంత్వన వల్ల ఏ దాపరికమూ ఉండేది కాదనుకుంటా. ఎంత సన్నిహితులైనా వయసు వచ్చే కొలదీ ముసుగులు, మొహమాటా లు వచ్చేస్తాయి మనుషుల మధ్య. కారణాంతరాలు ఏవైనా సరే.
“తనూ! ఒకప్పుడు ఏ బాదరబందీల్లేకుండా ఎంత హాయిగా ఉండే వాళ్ళమో కదా!” అంది హఠాత్తుగా వనజ.
అదే ఆలోచిస్తున్న తన్మయి ఆశ్చర్యంగా చూసి నిట్టూర్చింది.
మళ్ళీ వనజే అందుకుని “ఒకప్పుడు ఉండే ధైర్యం సన్నగిల్లిపోతూ ఉంది తనూ. ఒక పక్క పెరుగుతున్న బాధ్యతలు, కుటుంబ భారాలు. మరొక పక్క మానసిక ఆందోళ నలు. స్త్రీల జీవితాలే ఇంతేనేమో. మనకు తెలిసిన ఏ స్త్రీ అయినా సుఖపడ్డట్టు చూసేమా?” అంది.
తన్మయి వనజ చేతిని నిమురుతూ “వనా! నా వరకు నాకు నువ్వే ధైర్యం. నువ్వే ఇలా అధైర్యపడితే ఎలా” అంది.
“ఒకసారి ఆలోచిస్తే స్త్రీల జీవితాల్లో ఉన్నన్ని సమస్యలు పురుషులకు ఉండవేమో అనిపిస్తుంది. సమాజం, కుటుంబం స్త్రీలని ఒక విధంగా చూస్తే , పురుషులని మరొక రకంగా చూస్తాయి. ఒకే రకమైన సందర్భంలో పురుషులు ఉన్నపుడు, స్త్రీలు ఉన్నపుడు కలిగే పరిణామాలే వేరు. స్త్రీలకి కలిగే నిందలు, అవమానాలు, దుఃఖాలు పురుషులకి ఉన్నాయా? ” సాలోచనగా మళ్ళీ అంది వనజ.
తను ఏ సందర్భంలో అలా మాట్లాడుతూందో గానీ, అవన్నీ తనకు సరిగ్గా వర్తిస్తాయి.
తన్మయి బాధగా తలూపింది. ఒక్కటి మాత్రం నిజం. ఈ విషయాలన్నీ వనజ పరిశీలనతో తెలుసుకుంటే, తను అనుభవపూర్వకంగా తెలుసుకుంది.
“అవును వనా! నా జీవితమే అందుకు పెద్ద ఉదాహరణ” అంది తన్మయి కళ్ళు మూసుకుంటూ.
“పోనీలే ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో గతించిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకో వడం, బాధ పడడం మంచిది కాదు. నీ మనసెరిగిన సహచరుడు నీకు లభించేడు. ఎటు వంటి ఆర్థిక సమస్యలూ లేకుండా నిలదొక్కుకున్నావు. అంతేచాలు. పాప త్వరగా పుంజుకుంటే ఉన్న ఇదొక్క కష్టమూ గట్టెక్కినట్టే.” అంది వనజ.
“ఒక పెద్ద కష్టం గట్టెక్కినట్లే” పైకి అంది గానీ, “కనీసం ఒక పెద్ద కష్టం గట్టెక్కినట్లే” అని అనుకుంది మనసులో తన్మయి.
***
తన్మయిని డిశ్చార్జి చేసినా ఆసుపత్రిలో పాపాయి దగ్గిరే ఉండ సాగింది.
ఆపరేషను వల్ల బాగా నడుము లాగినప్పుడల్లా బయట ఉన్న బల్ల మీదే నడుం వాల్చ సాగింది.
పెరిగిన గెడ్డంతో బాటూ దిగులుగా ఉన్న ప్రభు కళ్ళు చూస్తేనే పాప విషయంలో బాగా బెంగపెట్టుకున్నట్టు అర్థం అవుతూ ఉంది. కానీ తన దిగులు చూసి తన్మయి ఎక్కడ బాధ పడ్తుందో అని ప్రభు లోపల్లోపల కలవరపడడమూ గమనిస్తూ ఉంది. ఎప్పుడూ హుషారుగా ఉండే ప్రభు అలా దిగులుగా ఉండడం చూస్తే మరింత దు:ఖంగా ఉంది తన్మయికి.
తామిద్దరికీ పాపే వర్తమానమూ, భవిష్యత్తూ. ఇక దేని మీదా ఆసక్తీ, ధ్యాసా పోవడం లేదు. అయినా ఉద్యోగం తప్పని సరయ్యి ప్రభు వారానికోసారి వెళ్ళసాగేడు. కన్నబిడ్డ విషయంలో కడుపుతీపి, ప్రేమ తొలిసారి అనుభవవేద్యమవుతున్న ప్రభుకి తన కొడుకు మీద తనకి ఎంత మమకారం ఉంటుందో అర్థం చేసుకోగలగాలి. కానీ అతను అంత కంతకూ బాబు నించి దూరం కావడంలోనే మనశ్శాంతి ఉన్నట్టు ప్రవర్తించడం మాత్రం ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు తన్మయికి.
తను ఈ పెళ్ళి చేసుకుని తప్పుపని చేసిందా? తన పట్ల కనబరిచే ప్రేమలో కొద్ది వంతైనా బాబు పట్ల చూపించలేని కఠినాత్ముడిగా ఎందుకు తయారవుతున్నాడు ప్రభు?
ఇటువంటి వ్యతిరేకతలో బాబు మనసు గాయపడకుండా ఎలా పెంచుకురావాలి? ఇవన్నీ ఆలోచిస్తున్న కొలదీ ఒక విధమైన వైరాగ్యం కలగసాగింది తన్మయికి.
“అలా దిగులుగా కూచోకమ్మా అన్నీ అయ్యే అర్దుకుంటాయి. ఇంటికెల్లి కాస్త ఏవైనా తిందువురా. అల్లుడుగారిక్కడ ఉన్నారు కదా” అంటూ పిన్ని బలవంతంగా లేవదీసింది తన్మయిని.
ఇంటి దగ్గిర తన్మయికి జడ దువ్వి వేస్తూ “అక్కా! పాపకి ఉజ్జోగం, ఇద్దరు పిల్లలని చూసుకోవడం కష్టం కదా. బాబుని నీ కాడ ఉంచుకుని సదివించరాదూ, ఇక్కడ నువ్వు ఒక్కదానివీ అయిపోయేవు కదా” అంది.
బాబుని ఇక మీదట వదిలిపెట్టమని ప్రభు తల్లిదండ్రుల మాటలు తెలిసి మాట్లాడు తూందో, తెలియకుండానే మాములుగా మాట్లాడుతూందో అర్థం కాలేదు తన్మయికి.
తన్మయి ఏదో అనేలోగా “ఇప్పుడిప్పుడే కాస్త మనశ్శాంతిగా ఉంటన్నాను. మళ్ళీ పిల్లల బాధ్యతలు నెత్తికెత్తుకోవడం నా వల్ల కాదమ్మా. అయినా ఒకప్పుడంటే మీ బావగారు తోడున్నారు కాబట్టి చంటిపిల్లాణ్ణి పెంచగలిగేం. ఇప్పుడు గభాలున ఏ ఒంట్లో బాలేక పోయినా పరుగులెత్తే ఓపిక లేదు నాకు” అంది జ్యోతి.
“అదేటక్కా..” అనేదో అనబోతున్న చెల్లెలితో
“నీకు పిల్లలు లేరు కదా, మీరు పెంచుకోండి” అంది జ్యోతి.
తన్మయి వెంటనే “నా కొడుకుని నేను పెంచుకోగలను పిన్నీ” అని అక్కణ్ణించి పెరట్లోకి వచ్చేసింది.
తల్లిని తప్పుపట్టలేదు తను. పిల్లల బాధ్యత చిన్న బాధ్యత కాదు. కానీ తనకి సహాయం అవసరమైన ఇటువంటి క్లిష్ట సమయంలో ఇలాంటి సమాధానం తల్లి నుంచి ఎదురయ్యినందుకు బాధ వెయ్యసాగింది. తనెప్పుడూ తన జీవితం ఇలా అవుతుంద నుకోలేదు. ఒక జీవితానికి ఇన్ని సమస్యలొస్తాయని తనెక్కడా విన్నట్టు కూడా లేదు.
అయినా తనకే ఇవన్నీ ఎందుకు ఎదురవుతున్నాయి? తన జీవితం అల్లకల్లోలం అయ్యిందన్న బాధ వల్లే ఆరోగ్యం క్షీణించి తండ్రి మరణించేడు. ఉన్న సమస్యలు చాలవన్నట్టు అనుకోని పరిస్థితుల్లో డెలివరీ రెండు నెల్ల ముందుగానే అయింది. పూర్తిగా ఎదగలేదని పాపని ఇంక్యుబేటర్ లో పెట్టాల్సి వచ్చింది. ఒక పక్క బాబుని స్కూలు మానిపించాల్సి వచ్చింది. మరో పక్క ప్రభు తల్లిదండ్రులు వచ్చి బాబుని తీసుకురావొ ద్దని గొడవ పెట్టి వెళ్ళేరు.
తన్మయి గట్టిగా ఊపిరి తీసుకుంది.
సమస్యల సుడిగుండాల మయమైన తన జీవితాన్ని తనే సంయమనంతో చక్క దిద్దుకోవాలి. ఎవరి సహాయం కోసమూ తనెప్పుడూ ఎదురు చూడకూడదు. దృఢంగా నిర్ణయించుకున్నాక కాస్త మనసు తేలికపడ్డట్లయ్యింది తన్మయికి. పాప ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా మిగతా విషయాలన్నీ చక్కబెట్టుకోవాలి.
“తన్మయీ! బాలెంతవి చలిగాల్లో బయట తిరగొచ్చా, లోపలికిరా” అనరిచింది జ్యోతి లోపల్నించి.
మారుమాట్లాడకుండా లోపలికి వచ్చింది తన్మయి.
డాక్టరు రౌండ్లకి వచ్చేరని ఆసుపత్రి నుంచి ఫోను చేసేడు ప్రభు. పిన్ని ఇచ్చిన కర్చీఫు చెవులకి కట్టుకుంది తన్మయి.
“మేం రేపు బయలుదేరుతావమ్మా. ఇంటి కాడ పన్లు ఎక్కడియ్యక్కడ ఉండిపోయే యి” అంది పిన్ని.
జ్యోతి మాటలకి నొచ్చుకుందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
కృతజ్ఞతగా పిన్ని చేతులు పట్టుకుని “పన్లు చక్కబెట్టుకుని వారంలో వచ్చెయ్యి పిన్నీ” అంది.
“అమ్మ ఉంది కదమ్మా, ఇక్కడ నేనుండి పెద్దగా ఉపయోగమూ లేదు. పాపని ఇంటికి తీసుకొచ్చేక వొస్తానులే” అంది.
రిక్షాలో ఆసుపత్రికి బయలుదేరింది తన్మయి.
కూడా గేటు దాకా వచ్చిన పిన్ని రిక్షా వీథి మలుపు తిరుగుతూండగా వాకిట్లో అలాగే నిలబడి తను వెళ్ళిన వైపే చూస్తుండడం గమనించగానే ఆప్యాయత పొంగుకొచ్చింది తన్మయికి. కళ్ళని కమ్ముకున్న నీటిపొరల మధ్య అస్పష్టంగా కానవస్తూ కళ్ళోత్తుకుంటున్నట్టున్న పిన్ని రూపాన్ని చూస్తూ తల రిక్షాలో నుంచి బైట పెట్టి, చెయ్యి ఊపింది.
***
నాలుగు వారాలు గడిచేయి.
డాక్టరు గారు వచ్చి చూసి “ఇవేళ రూముకి షిఫ్టు చేసేద్దాం పాపని. అంతా బావుంటే మరో వారం రోజుల్లో డిశ్చార్జి చేసేస్తాను.” అన్నారు.
అప్పుడే వచ్చిన ప్రభు ఆ నాలుగు వారాల్లో మొదటిసారి చిరునవ్వు నవ్వేడు. “థాంక్యూ సో మచ్ డాక్టర్ గారూ” అని నమస్కరించేడు.
పుట్టిన నెల్లాళ్ళ తర్వాత ఒడి చేరిన పాపాయిని మురిపెంగా గుండెలకు హత్తుకుని కూచుండి పోయింది తన్మయి. సంతోషంతో కళ్ళు ధారాపాతం కాసాగేయి.
ప్రభు పాపని చేతుల్లోకి తీసుకుని తన్మయంగా చూడసాగేడు. నిద్రపోతున్న పాప చిన్ని వేళ్ళని తన వేళ్ళతో తడుముతూ ఆనందంతో వెలిగిపోతున్న ప్రభు ముఖాన్ని చూసి సంతోషపడింది తన్మయి.
“హమ్మయ్య, గండం గడిచింది ఏడుకొండలవాడా” అని దణ్ణాలు పెట్టింది జ్యోతి.
బాబు హుషారుతో గెంతసాగేడు.
ప్రభు గబగబా విషయాన్ని తల్లిదండ్రులకి సెల్ ఫోన్లో ఆనందంగా చెప్పసాగేడు.
మత్తుగా నిద్రపోతున్న పాపకి మొదటిసారి తన దగ్గిర పాలు పెట్టే ప్రయత్నం చేసింది తన్మయి. ఎవరో నేర్పించినట్టు గబగబా అందుకుని తాగుతున్న పాప జుట్టుని మురిపెంగా సరిచేసింది. ముఖంమీద పడ్తున్న పలచని జుట్టు , పేలవంగా ఉన్న కాళ్ళు, చేతులు తడుముతూ “ఏం భయపడకు తల్లీ, మెల్లగా పుంజుకుందువుగాని” అని మెల్లిగా పాప చెవిలో గొణిగింది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.