యాత్రాగీతం

హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-1)
రోజు -1

-డా||కె.గీత

ప్రయాణం:
మొదటిసారి హవాయిలో బిగ్ ఐలాండ్ ని చూసొచ్చిన అయిదేళ్ళకి గానీ మళ్ళీ హవాయికి వెళ్ళడానికి కుదరలేదు మాకు. అందుకు మొదటి కారణం వెళ్ళిరావడానికి అయ్యే ఖర్చు కాగా, రెండోది అందరికీ కలిసొచ్చే సెలవులు లేకపోవడం. ఏదేమైనా ఇక్కడ జూలై నెలలో కాస్త ఖరీదెక్కువైనా వేసవిలో పిల్లలందరికీ సెలవులు కావడంతో ఈ సారి అందరినీ తీసుకుని వెళ్ళాం. ఎలాగైనా కుటుంబంతా కలిసి వెళ్తే ఉండే ఆనందమే వేరు. పిల్లలు ఎదుగుతుంటే పరీక్షలని, సెలవుల్లేవని, దూరాభారాలని వాళ్ళు లేకుండా చేసిన ప్రయాణాల్లో నాకు ఏదో వెలితిగా ఉంటుంది. ఏ కొత్త ప్రదేశాన్ని చూసినా మనసు బాధతో మూలుగుతూ ఉంటుంది.

          ఇంత క్రితం బిగ్ ఐలాండ్, ఒవాహూ ద్వీపాల్ని చూసాం కదా! ఈ సారి హవాయిలో ఉన్న మరేవైనా ద్వీపాలు చూసి రావాలని నిర్ణయించుకున్నాం. ముందుసారి మేం చూసిన బిగ్ ఐలాండ్ తో సమానమైన ప్రాచుర్యం కలిగిన మావీ ద్వీపాన్ని ఈ సారి ఎంచుకున్నాం. ఎప్పటిలానే కాస్ట్ కో ప్యాకేజీ టూరుని ఎంచుకున్నాం. కాలిఫోర్నియా నించి అందరికీ రానూపోనూ విమాన టిక్కెట్లు, ద్వీపాల మధ్య విమాన టిక్కెట్లు, హోటళ్ళు, బ్రేక్ ఫాస్టులు, రెంటల్ కార్లు కలిపిన పేకేజీలో దాదాపు పదహారున్నర వేలు అయ్యింది. కారు పార్కింగు ఫీజులు వేరే కట్టాలి. ఇక భోజనాలు, స్థానిక టూర్లు సరేసరి అవన్నీ విడిగా కొనుక్కోవలసిందే. ఇక కాస్ట్ కో ప్యాకేజీ కావడం వల్ల, ఎప్పటిలా ఈ ప్యాకేజీ టూరులో కూడా హవాయి కేంద్రమైన హనాలూలూ ఉండే ఒవాహూ ద్వీప సందర్శన కూడా కలిపి ఉంది. అంటే మొత్తం ఎనిమిది రోజుల టూరులో ఐదురోజులు మావీ ద్వీపంలో, మూడు రోజులు ఒవాహూలోనన్నమాట.

          అవి కోవిడ్ తగ్గి అప్పుడప్పుడే జనానీకం బయటికి వస్తున్న రోజులు కావడంతో అందరం కోవిడ్ వేక్సినేషన్లు వేసుకుని ఉంటేనే ప్రయాణానికి అనుమతించారు. అలాగే కోవిడ్ టెస్టింగ్ సెంటర్లకి వెళ్ళి నెగిటివ్ రిపోర్టు తెచ్చుకుంటేనే విమానం ఎక్కే అవకాశం ఉంది మాకు. ఇక ప్రయాణమంతా మాస్కులు ధరించడం తప్పనిసరి.

          మొత్తానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని, అందరం కలిసి ప్రయాణానికి సన్నద్ధ మయ్యాం. పెద్ద లగేజీలకి అదనంగా డబ్బులు కట్టాల్సి రావడంతో ఎవరికి వాళ్ళకి కేరియాన్ లగేజీగా ఒక్కో చిన్న సూట్ కేసు మాత్రం సర్దుకున్నాం. సిరి కూడా ఈ ప్రయాణంలో తన సూట్ కేసుని తనే లాక్కుంటూ సందడి చేసింది.

          అయితే ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఎయిర్పోర్టుకి బయలుదేరేటప్పుడే తిప్పలు మొదలయ్యాయి. ఎయిర్పోర్టుకి అందరం కలిసి వెళ్ళేందుకు ముందుగా బుక్ చేసుకున్న వ్యానతను ఏదో కారణాంతరాల వల్ల కేన్సిల్ చేసాడు. చివరి నిమిషంలో ఊబర్ లో రెండు కార్లు బుక్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది.

          ఎలాగైతేనేం సజావుగా చేరి విమానాన్ని సమయానికి అందుకున్నాం. ముసుగు వీరుల్లా ఒక్కొక్కళ్ళం రెండేసి మాస్కులు బిడాయించుకుని ప్రయాణం చేసాం. ఐదు గంటల పాటు కాలంలో వెనక్కి ప్రయాణించి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మావీ ద్వీపాన్ని చేరుకున్నాం.

ఎయిర్పోర్టు & ఆహ్వానం: మావీ ఎయిర్పోర్టు మరీ బిగ్ ఐలాండ్ లాగా చిన్నది కాకుండా మధ్యస్థంగా ఉంది.

          ఎయిర్పోర్టు నించి బయటకు వెళ్తున్న దారిలో కొందరికి అక్కడున్న వారు ఎదురొచ్చి అందమైన ఊదారంగు దేవగన్నేరు పూల దండలతో అలంకరిస్తున్నారు. మాకూ వేస్తే బావుణ్ణని నవ్వుకుంటూ దారితీసేం. ఆశ్చర్యకరంగా మా ఫామిలీ పేరుతో ప్లేకార్డు, దండలు పట్టుకుని ఒకామె నిల్చుని ఉంది. మమ్మల్ని సాదరంగా అలోహా (స్థానిక భాషలో “హలో” అన్నమాట) పలకరించి ఒక్కొక్కరికి ఒక్కో దండ మెళ్ళో వేసింది. తరువాత తెలిసిందేవిటంటే ఈ సర్వీసుని ఆన్ లైనులో ముందే సత్య బుక్ చేసేడనీ, ఇందుకు గాను వంద డాలర్లు సమర్పించాడనీను.

          ఆ దండలేసుకుని ఫోటోలు తీసుకుని, ఎయిర్పోర్టు బయటికి వచ్చి రెంటల్ కారు సెంటర్ కి వెళ్ళడానికి ట్రాములో వెళ్ళాం. కారు చేతికొచ్చేసరికి ఒంటిగంటన్నర అయ్యింది. అక్కణ్ణించి మా రిసార్టుకి దాదాపు గంట డ్రైవ్ పడుతుంది. అప్పటికే అందరికీ ఆవురావురుమని ఆకలి వేస్తూంది. ఇక త్రోవలో కనబడ్డ మొదటి ఫుడ్ ట్రక్స్ దగ్గిర ఆగి ఏవేవో కొనుక్కుని తిన్నాం.

          వాలియా మేరియట్ బీచ్ రిసార్టు: రిసార్టుకి చేరుకునే దారిలో దూరంగా కొండలు, మధ్య అన్నీ బంజరు భూములు. మా బస వాలియా మేరియట్ బీచ్ రిసార్టుకి చేరుకునే సరికి చక్కని కొబ్బరి చెట్లు, కోడి జుత్తు పూల చెట్ల వంటి చెట్లు దర్శనమిచ్చాయి. రూముల్లోకి చెకిన్ అయేసరికి నాలుగైంది. చెకిన్ సమయంలో తలా ఒక పెద్ద చెక్క పూసల దండల వంటివి మెళ్ళో వేశారు. అలా పువ్వులు, పూసల దండలు ధరించి హవాయీ స్థానికుల రూపాల్లో గదులకి చేరేం. పొద్దుట్నించీ ప్రయాణంలో అలిసిపోయినా, బయటంతా చక్కగా వెచ్చగా ఉండడంతో, గదుల్లో చేరబడి కూర్చోకుండా కాస్త మొహాలు కడుక్కుని అరగంటలో బయటికి వచ్చి రిసార్ట్ ఆవరణలోనే ఉన్న ఇన్ఫినిటీ పూల్ లో జలకాలాటకు దిగేం.

          ఈ రిసార్టు ఇప్పటివరకు మేం చూసిన అన్నిటికంటే పెద్దది. అనేక స్విమ్మింగ్ పూల్స్, ఫుడ్ కోర్టులు, లాన్లతో బాటూ అందమైన సముద్ర తీరంతో అలరారుతూ ఉంది.

          స్విమ్మింగ్ కాగానే స్నానాలు కానిచ్చి, భోజనాలు గదులకు తెప్పించుకుని తిన్నాం. సలాడ్, చికెన్ స్ట్రిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రూట్ పై వంటివో తిన్నామనిపించి బయటికొచ్చి రిసార్టు ముందు ఆవరణలో పెద్ద పెద్ద చెట్లకి వేలాడదీసి ఉండి, చక్కగా పడుకోగలిగే పెద్ద సైజు గూడు ఉయ్యాళ్లలో సేదతీరేం.

          రాత్రి పూట ధగద్ధగమానంగా వెలిగిపోతూంది రిసార్టు. హాయైన, వెచ్చని వాతావరణంలో పిల్లలు పరుగులు తీసి ఆట మొదలుపెట్టేరు. నిద్రొచ్చే వరకు అక్కడే కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడిపేం.

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.