కళాత్మక హృదయం

(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– ములుగు లక్ష్మీ మైథిలి

ఆమె చేతి వేళ్ళు
వెదురు బద్దలపై ప్రతిరోజూ
నెత్తుటి సంతకం చేస్తాయి
పంటి బిగువున బాధను బిగబట్టి
పక్షి గూడు అల్లుకున్నట్టు
ఎంతో ఓపికగా బుట్టలు అల్లుతుంది
ఆమె చేయి తాకగానే
జీవం లేని వెదురుగడలన్నీ
సజీవమైన కళాఖండాలుగా
అందంగా రూపుదిద్దుకుంటాయి

తనవారి ఆకలి తీర్చటం కోసం
రేయింబవళ్ళు ఎంతో శ్రమిస్తుంది
తెగిన వేళ్ళకు ఓర్పును కట్టుగా కట్టుకుని
తిరిగి మళ్ళీ బాధ్యతల గంపను
తలపై కెత్తుకుని జీవనయానం సాగిస్తూ
ఇంటింటా బుట్టెడు ప్రేమను పంచుతుంది
ప్లాస్టిక్ ఎన్ని ఆకృతులు దాల్చినా
తన ఒడిలో మహాలక్ష్మిలా కూర్చున్న
నవవధువును మంగళవాయిద్యాలతో
ఘనంగా అత్తింటికి పంపించే
శుభకరమైన సారెనందిస్తూ
మరో తల్లిలా మురిసిపోతుంది

వెదురుకెన్ని గాయాలైనా
మధురమైన వేణుగానం పలికించినట్టు
ఆమె చేతివేళ్ళకెన్ని కోతలైనా
పలురకాల అలంకార వస్తువులతో
జీవన రాగం వినిపిస్తుంది
వెదురెంత కఠినమైనా
తన చేతిలో హరివిల్లులా తలవంచిన
వెదురు ఉనికిని ఊరూరా చాటిచెపుతుంది
ప్రపంచీకరణతో పోటీ పడుతూ
కళాత్మకమైన వృత్తికి జీవకళనద్దుతుంది!

*****

Please follow and like us:

2 thoughts on “కళాత్మక హృదయం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)”

  1. “ఆమె చేతివేళ్ళకెన్ని కోతలైనా
    పలురకాల అలంకార వస్తువులతో
    జీవన రాగం వినిపిస్తుంది” ఎంత బరువైన భావం. అభినందనలు లక్ష్మీ మైథిలి గారు

  2. గొప్ప కవయిత్రి చేతిలో రూపు దిద్దుకున్న అద్భుత కవిత ఇది. “ఆమె చేతివేళ్ళు వెదురు బద్దలపై నెత్తుటివేళ్ళ సంతకం చేస్తాయి”.. ఈ వాక్యంలో ఒక స్త్రీ ఎంతటి కష్టాన్నైనా భరించగలదనే విషయాన్ని స్పష్టం చేశారు. రెండవ భాగంలో “ప్లాస్టిక్ ఎన్ని ఆకృతులు…మరో తల్లిలా మురిసిపోతుంది” వాక్యాలలో ఆమె బాధ్యతతో పాటు, బుట్ట యొక్క పవిత్రతను, సంప్రదాయంలో దాని విలువను స్పష్టం చేశారు. “వెదురెంత కఠినమైనా…హరివిల్లులా తలవంచిన”..ఎంత గొప్ప కవితా భావన. అంతేకాదు..చివరి భాగంలో మహిళలలోని గొప్పతనాన్ని అతి గొప్పగా ఆవిష్కరించారు. వెదురును పాషాణహృదయులతో పోలుస్తూ, ఆమె చేతిలో ఆ హృదయాలు కరిగి హరివిల్లులా అందంగా తయారవుతాయని, అంతటి శక్తిమంతమైనది స్త్ర్రీ అని అంతర్లీనంగా అభివర్ణించారు. ఇంతటి స్పూర్తికవనం వెలువరించడం మైథిలి గారికే సాధ్యం. ఆమెకు హృదయపూర్వక అభినందనలు

Leave a Reply

Your email address will not be published.