నిటారు

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

మణి వడ్లమాని

          “రండమ్మా ! రండి చూడండి, లోపలికి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి. నచ్చితేనే కొనండి. అందరూ మెచ్చే అన్ని రకాల బట్టలు ఇక్కడే ఉన్నాయి. శ్రీలీల చీరలు, రష్మిక చీరలు, అలాగే పాత సినీ తారలు అప్పట్లో వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి కట్టే చీరలో మా ఒక్క షొప్ లోనే దొరుకుతాయి. తప్పకుండా దయచేయండి ”

          ఆకట్టుకునే ఆమె మాటల చాతుర్యం చూసి అందరూ ఆ షాప్ లోకి వెళుతున్నారు. అదొక్కటే కాదు అక్కడ సరుకు కూడా అంత నాణ్యంగాను ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడి అందరిని షాప్ లోకి వచ్చేలా చేస్తోంది.అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఆ షాప్ ఓనర్ కూడా దానికి బాగా డబ్బులు ఇస్తాడు. మనిషి కూడా అందరితో కలగలపు గా మాట్లాడం అదనపు ఆకర్షణ అయింది.

***

          “అబ్బో ఎంత షోగ్గా తయారయింది”

          “అంతేనా ఆ మడత నలగని ఇస్త్రీ చీర, అసలు ఇంతయినా బాధ లేదే మొగుడు పోయాడని,”

          “అదిగాదే, ముందు అసలు కనిపించేది కాదు, ఎప్పుడయినా చూస్తిమా, ఈసూరో మంటూ, కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఉండేది. ఆ మొగుడు పోయినప్పుడు శవం మీద పడి ఆమె ఏడుస్తుందని అందరూ అనుకుంటాము కదా! ఏ విధంగా ఏడుస్తుందో అని ఊహించుకుంటాము, కానీ! ఈ వెఱ్రమ్మ గట్టిదే! అలా చేయలేదు, సరి గదా ఏడవలేదు”
అసలా వెఱ్రమ్మ మంగళ సూత్రం తీస్తే చూడాలనే వాళ్ళ ఉబలాటం పై నీళ్ళు జల్లినట్ల యింది.

          ఆ తంతు పొద్దు పోక ముందే తనంత తానే జరిపేసుకుందని, ఓ… ఒకటే, గుసగుసలు పోయారు.

          పైగా మొగుడు పొతే ఆమె ఎక్కడా ఏడ్వక పోవడం అందరకీ ఓ మిస్టరీ . ఆ మాటలు నచ్చని వాళ్ళు “అయినా ఒక్కళ్ళ గొడవ మనకెందుకు పాడు వెఱ్రమ్మ పైకి కనిపించేలా ఏడవాలా, ఆశకు మనుషులలో సైకో ప్రవర్తన ఎక్కువయింది. అసలే చిన్న వయస్సు, పైగా ఏక్సిడెంట్ జరిగింది. అదో రకమయిన షాక్ లో ఉండచ్చు. ఆ విషయం మెదడుకి ఎక్కి మనసు అవగతం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పాడులోకం అందరికి పోయే కాలం వచ్చిందని” వెఱ్రమ్మ తరఫున వకాల్త పుచ్చుకున్నారు.

          సన్యాసమ్మ మటుకు కూతురిని అన్న వాళ్ళని తిట్టిపోసింది. “అసలే అది దాని మొగుడుపోయిన బాధలో ఉంటె మీరందరూ ఓదార్చవలసినది పోయి నానా మాటలం టారా, ఏం మీ ఇళ్ళలో ముండ మోయరా, ఇలాంటివి జరగవా ” అంటూ అందరినీ తూర్పారబెట్టింది

          అంతే “అమ్మో ఈ సన్యాసమ్మ నోట్లో అసలు నోరు పెట్టలేం, దాని నోరుకి అడ్డు అదుపు లేదు. అయినా మనకెందుకు వాళ్ళింటి గొడవలని” అందరూ ఎవరికి వాళ్ళు గమ్మునున్నారు.

***

          అసలు వెఱ్రమ్మ ఎవరో? ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో? తెలుసు కోవాలంటే ముందు వాళ్ళ అమ్మ గురించి చెప్పుకోవాలి. సన్యాసమ్మ, మొగుడు కూతురు తో సహా ఎక్కడో తూర్పు నుంచి ఇక్కడకు వచ్చారు. సన్యాసమ్మ మొగుడు రిక్షాలాగే వాడు, దానితో పాటు తాగుడు, వేరే ఆడదానితో ఉండటం మాములే! ఇక అక్కడితో మొగుడుతో రోజు తగవులే. సన్యాసమ్మకి, అది చూసి వెఱ్రమ్మ మనసులోనే ఏదో గుబులు పడేది.
ఎప్పుడన్నా తండ్రి లేని రోజున “అమ్మా నాన్న లేకపోతెనే బావుంటుంది కదమ్మా” అనేది అమాయకంగా .

          అదేమీ చిత్రమో కొన్ని రోజులకి ఆ తండ్రి కాస్త లారీ గుద్డేసి, చనిపోయాడు. ఇక అప్పటి నుంచీ కష్టపడి నలుగురిళ్ళల్లో పనులు చేస్తూ, అందరికి చేదోడు వాదోడుగా ఉండి కూతురిని పెంచింది. పదవ తరగతి వరకు చదివించింది.

          అప్పుడప్పుడు వెఱ్రమ్మ తన పేరును తలచుకుని ఏడ్చేది. “అందరూ నన్ను ఏడిపిస్తున్నారు నేను స్కూల్ కి పోనే” అని. అది చూసి “ఏడవకే, నాకు మూడు నాలుగు కాన్పులు పోయాయి. మా ఊరి దేవతగా కొలిచే వెఱ్రమ్మ పేరు పెట్టుకుంటాను అని మొక్కుకున్నాను. ఆ తల్లి మా ఊరిని కాపాడడానికి ప్రాణ త్యాగం చేసుకుందని అందుకు ఊర్లో అందరూ ప్రతి ఇంట్లోను ఆమె పేరు పెట్టి దీపం పెట్టుకుంటామని మొక్కుకు న్నారు. నా కానుపు నిలుస్తే నీకు ఆమె పేరు పెడతానని మొక్కాను” సన్యాసమ్మ కూతురి తో చెప్పింది.

          అప్పటి నుంచి వెఱ్రమ్మ తన పేరు గురించి ఇంక మాట్లాడలేదు. తన దగ్గరే ఇంట్లో ఉన్న వరుసకు మేనల్లుడయిన నాగేశ్వరరావు నిచ్చి, కూతురికి పెళ్ళి చేసింది, సన్యాసమ్మ అతగాడు దగ్గరున్న ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. చేసిది కాంట్రాక్టు పని అయినా, రెండు పూటలా భోజనం దొరికేది. పెద్దగా ఎవరితోనూ మాటలాడే వాడు కాదు.
అందుకే చాలా మందికి నాగేశ్వరరావు ఎవరో తెలియదు. కానీ వెఱ్రమ్మ మొగుడు, సన్యాసమ్మ అల్లుడని కొంత మందికి తెలుసు. అది కూడా ఫ్యాక్టరీకి పోవడానికి ఆ రోడ్డు మీద నుంచే పోవాలి. అక్కడుండే టీ బంక్ అతనికి, కొంచెం దూరంలో ఉండే సారాయి కొట్టులో వాళ్ళకి మాత్రమే అతను తెలుసు.

          కాకపోతే నాగేశ్వరు రావు మెతకమనిషి. వాదులాడటం తెలియని వాడు. డబ్బు కూడా తెచ్చి ఇంట్లోనే ఇచ్చేవాడు. తల్లి కూడా సంతోషంగానే ఉండేది కూతురి కాపురం చూసి. పదేళ్ళు గడిచాయి ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళకి . వెఱ్రమ్మ మటుకు ఎక్కువ బయటకు వచ్చేది కాదు. ఇంట్లోనే కూర్చొని, చీర కొంగులకి అందంగా కొచ్చులు వాటితో పాటుగా ఫాల్స్ కూడా కుట్టేది. పెద్దగ మాట్లడేది కాదు. అసలు మొదటి నుంచి అదే స్వభావం, దానికి తగ్గ మొగుడు ఆ నాగేశ్వర రావు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో కలవరు. వీళ్ళు ఏం తిని ఎట్లా బతుకుతారు? వీళ్ళ భవిష్యత్తు ఏమిటి ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఆగని కుతూహులం.

          విధికే కన్నుకుట్టిందో ఏమో ! నాగేశ్వర రావు ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు పొతే, చూడటానికి వచ్చిన పెద్ద ఆఫీసుర్లు వచ్చినప్పుడు, వాళ్ళ మొహం మీదనే అడిగేసింది. “మా అల్లుడికి డబ్బులు యెంత వస్తాయి? అంటూ లెక్కలేస్తుంటే”అందరూ తిట్టు కున్నారు. కొంతమంది అయితే చనువుగా “ఇప్పుడే అడిగాస్తావేంటి సన్యాసమ్మా, ఇంకా పీనుగ వెళ్ళనే లేదు రెండు రోజులు పోనీ” అంటే

          “బాబాబ్బు మీకేం అలానే అంటారు. ఏ ఆధారం లేని వాళ్ళము పీనుగ తీసుకు పోవడానికయినా డబ్బు కావాలి కదా అదా నోట్లో నాలుక లేనిది ! అందరం ఏడుస్తూ కూర్చొంటే, ఎలా గడుస్తుంది బాబు, అందుకే తప్పని సరి అయి అడుగుతున్నాను”. అంది

          అదీ నిజమే అనుకున్నారు వాళ్ళు

          ఆమె అడిగినట్లే పై ఆఫీసుర్లు కొంత డబ్బు ఇచ్చారు. అతనికి వచ్చే డబ్బులు తొందరగా వచ్చే ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు.

***

          ఇప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగించేది, బాగా ట్రెండ్ అయ్యే వార్త ఏమిటంటే వెఱ్రమ్మ గురించి.

          మన్ను తిన్న పాములా ఉండే వెఱ్రమ్మ ఇంత మాటకారిగా ఎలా మారింది. అదే అందరిని విస్తుపోయేలా చేసింది. ఎందుకంటె ఇదే వెఱ్రమ్మ పరిస్థితి కొంత కాలం క్రితం మరోలా ఉంది.

          ఆ నాగేశ్వరరావు పోయి మూడు నెలలయినా కాకుండా రోజు పోద్దునే తయారయి ఎక్కడకి పోతుంది అని ఆరాలుతీసే వాళ్ళకు ఒక నిజం తెలిసింది. అదేమిటంటే, ఆమె పక్కనే ఉన్న టౌన్ లో కి పోయి ఒక పెద్ద చీరల షాప్ లో పని చేస్తోందని. అయితే జనాలను మరింత విస్మయ పరిచిన విషయం ఏమిటంటే, మొగుడుండగా ఏమి తెలియ ని అమాయకురాలు అనుకున్న వెఱ్రమ్మ, ఇప్పుడు పెద్ద మాటకారి , అంతే కాదు పిల్ల వాడికి తల్లి తండ్రీ కూడా తనే అయింది. అదెలా సాధ్యం అని నోర్లు వెళ్ళబెట్టుకున్నారు ఊరి జనాలు. కొంత మంది ఆడవాళ్ళు భర్త మరణం తర్వాత పూర్తిగా మారిపోతారు వాళ్ళ లో ఉండే శక్తి చైతన్యం హరించుకుపోతాయి. చాలా మంది ఏమి చేతకాని వాళ్ళులాగ మిగిలిపోతారు. ఏదో చెప్పలేని నిర్లిప్తత అనాసక్తి వాళ్ళని ఆవహిస్తుంది.

          ఇందుకు విరుద్ధంగా కొందరు భర్త మరణం తర్వాత చాలా చురుకుగా మారతారు.
వాళ్ళ చూపులో మాటలో స్పష్టత వస్తుంది. మందకొడితనం తగ్గుతుంది. నూతనోత్తేజం కొత్త శక్తి వస్తాయి. ఆధారపడే గుణం పోతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. కనపడని సంకెళ్ళు విడిపోతాయి.

          వెఱ్రమ్మ రెండో టైపు. ఎప్పుడయితే కొడుకుని పెంచే బాధ్యత తన మీద ఉందొ తెలుసొచ్చేసరికి చురుకుగా ఉండ సాగింది. అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేది. పేపర్ చదవడం మొదలు పెట్టింది. అదే కాదు చీరలకు ఫాల్స్, కుచ్చులు కుట్టడంలో ప్రావీణ్యం ఉండడం ఓ వరమయింది.

          ఇదివరకులా కాదు జీవితం, తనకో బాధ్యత ఉంది. అది నెరవేర్చడానికి కష్టపడాలి, ఇలా స్తబ్దుగా ఉంటె కుదరదు. కోడి రెక్కల కింద పిల్లలని పెట్టుకున్నట్లు, తల్లి తనని ఇలానే పెంచింది.

***

          కొందరు కాల ప్రవాహంలో కొట్టుకు పోతారు. కొందరే కాలానికి ఎదురు నిలుస్తారు. ఆ కొందరిలో జీవితోత్సాహం కొత్తగా పుట్టుకు వస్తుంది.

          ఇప్పుడు వెఱ్రమ్మ కూడా అలానే మనుగడ సాగించాలి. మంచి స్కూల్ లో వేయాలి, తన కొడుకును బాగా చదివించాలి. అదే తన ధ్యేయం అనుకుంది. తమ బతుకులు ఇంతకన్నా మెరుగవాలి, అనుకున్న వెఱ్రమ్మ జీవితం మారిపోయింది. మరింత భాద్యతా యుతంగా ఉండసాగింది.

          అందరికీ ఆ మార్పు ప్రస్ఫుటంగా కనబడుతోంది.

          ముఖ్యంగా సన్యాసమ్మ పైకి మాటలలో చెప్పక పోయినా కూతురు, ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద నిలబడటం చాల సంతోషాన్ని కలుగ జేసింది. ఇక తను లేకపోయినా కూతురు బతక గలదు అన్న ధీమా వచ్చింది, అలా తనదైన సొంత వ్యక్తిత్వంతో వెఱ్రమ్మ, జీవితం ముందు ధైర్యంగా నిలబడగలిగింది.

*****

Please follow and like us:

2 thoughts on “నిటారు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. నిటారు ” కథ చాలా బాగుంది. పరిస్థితులు అవసరాలు మనుషులని సకరాత్మకంగా కూడా మార్చగలవని ,బాగా చెప్పారు రచయిత్రి.

  2. కథ చాలా బాగుంది. Message oriented. ఆత్మ స్థైర్యం తో ఎలా నిలబడలో చెప్పే కథ

Leave a Reply

Your email address will not be published.