దోని గంగమ్మ – హృదయంపై కొలువయ్యే గోదారమ్మ!

(ప్రపంచ కథా వేదికపై ప్రధమ బహుమతి పొందిన రత్నాకర్ పెనుమాక రాసిన “దోని గంగమ్మ” కథపై చిరు పరామర్శ)

-వి.విజయకుమార్

          ప్రపంచ స్థాయిలో కథ అనగానే ముందుగా గుర్తొచ్చే కథ గాలివాన. పాలగుమ్మి పద్మరాజు గారి ఆ కథని అవార్డు సినిమాల్ని గ్రేట్ ఎక్సపెక్టేషన్స్ తో చూసి వెలితికి గురైనట్టే కథ చదివాక నాకు అప్పట్లో నిజం చెప్పొద్దూ కొంచెం వెలితిగా ఫీలయ్యాను. నిజానికి కథా ప్రపంచంతో నాకున్న అనుబంధం బహుశా నన్నలా ఫీలయ్యేలా చేసి ఉండొచ్చు.

          ప్రపంచ స్థాయి పోటీల్లో రత్నాకర్ పెనుమాక గారి కథ చదవబోయే ముందు ప్రి ఆక్యుపైడ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏమీ లేకుండా నేరుగా కథ చదివాను. విచిత్రం ఏమిటంటే రత్నాకర్ కథ నన్ను కట్టి పడేసింది. ఇంత సీదా సాదాగా కథ రాసే శిల్పాన్ని చాలా కొద్ది సంవత్సరాల్లో భలేగా పట్టేశారు రత్నాకర్. గౌతమీ తీరం సమీక్ష చేసే నాటికి రత్నాకర్ అప్పుడప్పుడే కథా ప్రపంచంలోకి అడుగిడుతున్నారు. మూడు నాలుగేళ్ళ కాలంలోనే కథా ప్రపంచంలో తనదైన శైలినీ, శిల్పాన్నీ సృష్టించుకుని అవార్డుల్నీ, రివార్డుల్నీ అందుకోవడం ఒక అలవాటుగా చేసుకున్నారు. అందుకే అవార్డులవే వస్తాయిగానీ కథలో తనకంటూ ఒక ఒరవడి ఉండాలనే ఉద్దేశమే తప్ప అవార్డు తాపత్రయం ఎక్కడా కనపడదు ఈ కథలో!

          కథల పోటీ అనగానే యుద్ధానికి సన్నద్ధమవ్వడంలా వంట పోటీల్లో పాల్గొనేందుకు రకరకాల మసాలా దినుసులు ఘాటుగా దట్టించేసేలా ప్లాన్ చేసుకోవడం ఆనవాయితీ. కథ కొక ప్లాట్, కథ కొక నడకా, నడతా, ఒక గొప్ప ముగింపూ అంటూ శాస్త్రబద్ధంగా ఒక చట్రంలో రాసుకు పోయే కథలు అదేమిటో విచిత్రంగా చాలా యాంత్రికంగా అనిపిస్తాయి. బాగా పాతకాలపు కథలు చూడండి. చెకొవ్, సోమర్ సెట్ మామ్, ఓ హెన్రీ, మపాసా, టాల్స్స్టాయ్ కథలు హృదయాన్ని చాలాకాలం పట్టి వేధిస్తాయి. అదే సమయంలో ఒక శిల్పంలో, ఒక చట్రంలో, సీసాలో పట్టిన భూతంలా కథనంలోని వాక్యాలన్నీ ఆత్మల్లా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడే కథలన్నీ గాల్లో కలిసిపోతే ఇలాంటి కొద్ది కథలు జీవిత పర్యంతం కోర్కెలు తీరని ప్రేతంలా హృదయాన్ని ఆవరించి వుంటాయి. టాగోర్ కథలు బెంగాలీయులను ఎంతగా కదిలించాయో తెలియదు కానీ తెలుగు వాడి హృదయాన్ని పట్టి కుదిపేసాయి. ఇంక శరత్ తెలుగు వాడి మూలుగుల్లో గాఢంగా చొరబడిపోయాడు.

          ఇక్కడ శరత్ దాకా వచ్చి ఎందుకు ఆగిపోయానంటే, శరత్ కథలో పాత్రలు రచయిత చెప్పినట్టు వినవు. ఆ పాత్రలే రచయితను నడిపిస్తాయేమో అన్నట్లుగా ఉంటాయి. వాటి వాంటన్ స్వభావం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కథ మొదలు పెట్టినప్పుడు, అది ఎంత గొప్ప కథ అయినా ఏదో ఒక ముగింపుకి దారితీస్తుందన్న అంచనా ప్రతి చదువరికీ ఉంటుంది. ఏవో కొన్ని కథలు తప్ప చదువరికి చాలా ముగింపులు అర్థం అవుతూనే ఉంటాయి. కానీ శరత్ చంద్రుడు అలా దొరకడు. ఆ పాత్ర తనెలా ముగించుకుంటుందో రచయితకే తెలియదు అన్నట్టుగా ఉంటుంది.

          రత్నాకర్ కథ చాలా కాలం తర్వాత ఇటువంటి ఫీలింగ్ నే కల్పించింది. కథను రచయిత నడపడు. గోదారి మీద దోనిలా అలవోకగా నడుస్తూ దానికదే నడుస్తూ ఉంటుంది. ముగింపు దానికదే చూసుకుంటుంది. గోదారి జిల్లాల యాసలో కొంచెం రొమాంటిక్ గా సాగిన ఈ కథలో కథ నడిపిన తీరు అద్భుతం అనిపించింది. దోని, లాకులూ, లంకలూ, గోదారి ఒడ్డూ తెలియని వేరే ప్రాంత వాసులకు కూడా గంగమ్మ తెలుస్తుంది. గంగమ్మ హృదయం తెలుస్తుంది. చలం ఒక సందర్భంలో పతివ్రతల పేర్లు చెప్పమంటే సీతా, సావిత్రీ, సక్కుబాయీ అంటాడు తప్ప ఇంటి పక్కనే గుడిసెల్లో అసంఖ్యాకంగా కనబడే ఇలాంటి సీతా సావిత్రులు గుర్తుకే రారు మనకంటాడు. ఈ అమలిన శృంగార మూర్తి గంగమ్మలో ఎవరికి ఏమి కనపడతాయో తెలియదు కానీ నా మట్టుకు నాకు పవిత్ర ప్రేమకు నిలువెత్తు శిఖరంలా అత్యున్నతంగా కనపడింది. పెనుమాక సృష్టించిన ఈ మహా శిల్పం ఎన్ని అడుగుల ఎత్తో తెలియదు గానీ కథా ప్రపంచంలో ఈ నలుపు రాతి జీవ శిల్పం కలకాలం నిలిచిపోతుంది.

          తాగొచ్చి చితక బాదే భర్త చచ్చాక కూడా పర పురుషుడ్ని కన్నెత్తి చూడని వాళ్ళు  బడుగు జీవితాల్లో కోకొల్లలు. అటువంటి గంగమ్మను తీసుకొచ్చి ఈ కథలో ప్రాణ ప్రతిష్ట చేశారు రత్నాకర్. గంగమ్మ నిజానికి రెడ్డి గారికి ఉంపుడు గత్తె గానే జనాల నోళ్ళలో నానుతూ ఉంటుంది. చూడటానికి ఎంకిలా ఉన్నా, దోని గెంటుకుంటూ పొట్ట పోసుకునే గంగమ్మ పెళ్ళయ్యాక మూడేళ్ళకే మొగుడు పోయి ఒంటరిగా గోదారొడ్డు మీద గుడిసెలో మోడులా బతుకుతుంది. పడవ ఎక్కేవాడూ దిగేవాడూ నల్లని శిల్పంలా నలభయ్యేళ్ళ వయసులో అడవిగాచిన వెన్నెల్లా బతికే గంగమ్మ మీద కన్నెయ్యని దొరబాబు ఒక్కడు కూడా ఉండడు. కానీ చుట్ట రెడ్డి గారి ప్రాపు కింద బతుకుతుందని వినికిడి. కానీ గంగమ్మని అడిగినప్పుడు, “ఒరేయ్ చిన్నిగా అదేం లేదురా, ఆరికి నా పాట అంటే ఇట్టం, నాకు ఆరి మాట అన్నా ఆరు చుట్టీ చుట్టన్నా ఇట్టం…మా మజ్జిన అలాంటియేం లేవు” అంటుంది. తాడోడుతో చెబుతూ గంగమ్మ గురించి, “అంటే కొంతమంది మజ్జిన ఏ పడక సమ్మందం ఉండదు… కానీ ఒకలంటే ఒకలికి చెప్పలేనంత ఇట్ట ముంటది…ఆడ మగ మజ్జిన సెక్స్ కోరికలు చచ్చిపోయాక పుట్టీదే నిజమైన ప్రేమరా. ఈళ్ళది అలాంటిది” అని చెప్పిన మాటలు గుండెల్ని హత్తుకుంటాయి.

          కథలో శృంగారపు ఛాయలున్నా, ఒక అమలిన శృంగారపు తాలూకూ వీచిక నిరంతరం హృదయంపై వీవెన వీస్తూ రాగ రంజితం చేస్తుంది. ప్రతీ పాత్రా దైహిక సుఖాల ఆరాటాన్ని ప్రదర్శిస్తూ పోయినా దోని గంగమ్మ హృదయంలో దాంపత్య బంధాల్లో స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సిన ఒక నమ్మకాన్నీ, ఒక పవిత్రతనూ, ప్రేమను పంచిన వ్యక్తి పట్ల ఆరాధనా భావాన్ని గుండెలు పట్టనంతగా పెట్టుకొని చలం నాయిక లను కూడా తలదన్నేలా శిఖరాయమానంగా అనిపిస్తుంది. ఒక దిక్కు లేని నిరుపేద, కూటికి పేద అయినా, గుణానికి ప్రపంచమే పట్టనంత గొప్పగా గంగమ్మ పాత్ర కనబడుతుంది. చుట్టరెడ్డి యాక్సిడెంట్లో హాస్పిటల్ పాలైనప్పుడు రహస్యంగా అక్కడికి వెళ్ళి చివరి క్షణాల్లో సేవ చేసుకుంటుంది. ఇది మీరాబాయి ఆరాధన అన్నట్టే ఉంటుంది తప్ప డబ్బు కోసమో రగిలి కోర్కెల ఉపశమనం కోసమో అనే ఉద్దేశం ఎక్కడా ఉండదు. కావాలంటే లక్షలు సొంతం చేసుకునే అబద్ధపు జీవితం గంగమ్మకు గోదారి ఒడ్డంత చేరువనే ఉంటుంది. అయినా తుళ్ళిపడదు. వరద పొంగులు చూసిన జీవితం తనది.

          చుట్టరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేని గంగమ్మ బతికున్న శవంలా మారి, సన్యాసి నిలా బతుకుతూ ఉన్నప్పుడు గానీ ఎవడో తన శరీరాన్ని కబళించినప్పుడు కూడా తుప్పు పట్టని నిప్పులా, జ్వలించే అగ్నిలా తనని తాను దహించుకు పోతున్నట్లే ఉంటుంది. మరణశయ్య మీద ఆసుపత్రిలో ప్రాణం లేని దేహంతో తాను పొందిన అనుభవాలను గుండెల్లో పెట్టుకొని వాటిని తలుచుకుంటూ యోగినిగా బతకడం నేర్చుకుంటుంది. దొంగతనం అంటగట్టినా, చుట్టరెడ్డి మరణం తర్వాత ఆత్మ లేని శరీరాన్ని ఎవడో పొందినా, గోదారి తల్లంత పవిత్రంగా, ఎవరూ పట్టించుకోలేనంత ఎత్తుల్లోకి ఎదిగి పోతుంది గంగమ్మ.

          ఆఫ్ట్రాల్ గంగమ్మ! దోని గెంటుకొని, అడ్డ పొగ తాగే వంపు సొంపుల మాంసపు శరీరం తప్ప ఇంకేమీ కాని ఈ ప్రపంచానికి ఒక పవిత్ర గోదారమ్మను చూపుతారు రత్నాకర్. ఈ కథ చదివాక, ఇంత పెద్ద బొట్టుతో, పచ్చని పసుపు పూసిన మోముతో ఊరి పొలిమేరలో కొలువైన గ్రామదేవతలా ఈ దోని గంగమ్మ మీ గుండెల్లో కలకాలం నిలిచిపోతుంది.

*****

Please follow and like us:

One thought on ““దోని గంగమ్మ” కథ పై పరామర్శ”

  1. ఎంత చక్కగా విశ్లేషించారు సార్ ఎంత బాగా అర్థం చేసు కున్నారు నా దోనిగంగమ్మని.ప్రతి అక్షరంలో మిమ్మల్ని నా గంగమ్మ ఎంత వెంటాడిందో తెలుస్తుంది సార్.అద్భుతమైన మీ సమీక్ష నేను మరిన్ని ఉత్తమ రచనలు చేయటానికి ఇంధనం సార్ .మీ సహృదయత కి చాలా చాలా కృతజ్ఞతలు సార్

Leave a Reply

Your email address will not be published.