అన్యాయం చేస్తే చావు తప్పదు

-కందేపి రాణి ప్రసాద్

          అనగనగా ఒక అడవి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలున్నాయి.  ఆ చెట్లనిండా పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయి. పావురాయి, పిచ్చుకలు, కాకులు, రామచిలుకలు, గోరింకలు ఇలా రకరకాల పక్షులకు నెలవుగా ఉండేవి. చెట్ల మీద గూళ్ళు కట్టుకున్న పక్షు లన్నీ జాతి భేదం మరచి అన్యోన్యంగా ఉంటాయి. ఒకరినొకరు ఆనందంగా పలకరించు కుంటాయి.
 
          పొద్దున్న లేవగానే ఎవరి పిల్లలకు వాళ్ళు జాగ్రత్తలు చెప్పుకుని బయటకు వెళు తుంటాయి. ‘కిచకిచ’ మని ఒకరు, ‘కావుకావు’ మని ఒకరు, రకరకాల భాషలు మాట్లాడు కున్నా బాషా బేధాలు కానరావు. కొన్ని పక్షులు సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చినా మిగతా పక్షులన్నీ ఎంతో ప్రేమతో చూసుకుంటాయి. గూడు కట్టు కోవడానికి ఏ చెట్టు అనుకూలమో చూసి చెపుతాయి. ఏ ప్రాంతం అయితే శత్రువులైన వేటుగాళ్ళ బాధ ఉందో వివరిస్తాయి. ప్రాంతీయ భేదాలు లేకుండా విశ్వ మానవ సౌభ్రాత్రుత్వంతో కలసి ఉంటాయి.
 
          ఏ సంఘంలోనైనా అందరూ మంచివాళ్ళే ఉంటే సమస్యలు ఎందుకొస్తాయి. కొంత మంది దురాశపరులు ఈర్ష్యాపరులు ఉంటారు. వాటి ఆలోచన ఎప్పుడూ ప్రక్కన వాళ్ళను ఇబ్బంది పెట్టటమే. ఎవరైనా సంతోషంగా ఉంటే సహించలేక ఏదైనా కీడు తలపెట్టే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ చెట్టు మీదా ఒక కాకి ఉండేది.
 
          ఈ కాకికి అసూయ ఎక్కువ. ఎవరైనా బాగున్నారంటే సహించలేదు. అదే చెట్టు పై ఒక పిచ్చుకల జంట ఉంటుంది. ఆ రెండు పిచ్చుకలూ చాలా అన్యోన్యంగా ఉంటాయి. ఈ అడవి దగ్గర్లోని గ్రామాల్లోకి వెళ్ళి ధాన్యం తిని వస్తుంటాయి. కొత్తగా పెళ్ళయింది కాబట్టి సరదాగా ఉంటుంటాయి.
 
          పిచ్చుకలు ఒకరోజు చక్కని గుడ్లను పెట్టాయి. వాటిని చూసుకని తెగ మురిసి పోయాయి. పిచ్చుకల సంతోషం చూసి కాకి సహించలేక పోయింది. ఎప్పుడైనా ఆవకాశం దొరకకపోతుందా అని ఎదురు చూడసాగింది. 
 
          ఒక రోజు రెండు పిచ్చుకలూ బయటకు వెళ్ళాయి. గూట్లో నాలుగు గుడ్లు ఉన్నాయి. కాకి మొల్లగా ఎవరూ చూడకుండా గూట్లోకి వెళ్ళింది. గుడ్లను ముక్కుతో పోడిచేసి చిదురు చిదురు చేసి వచ్చేసింది. అప్పటికి కాకికి మనశ్యాంతి కలిగింది.
 
          సాయంత్రం ఇంటికి వచ్చిన పిచ్చుకల జంట చిద్రమైపోయిన గుడ్లను చూసుకుని ఏడ్చాయి. ఇలా ఎవరు చేశారో వారికి హృదయం లేదనుకున్నాయి. మేమెవరికి అపకారం చేయలేదే! మమ్మల్నిలా ఏడిపిస్తే వారికేమి లాభం వస్తుంది. అని పరిపరి విధాల అనుకు ని బాధ పడ్డాయి చెట్టు మీద ఉన్న మిగతా పక్షులన్నీ ఊరడించాయి.
 
          కొన్ని రోజులకు పిచ్చుకల జంట మరల గుడ్లను పెట్టింది. తమ గుడ్లను చూసుకుని ఆనందపడ్డాయి. ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాయి. గుడ్లను వదిలి ఎక్కడికీ వెళ్ళకూడదు అనుకున్నాయి. మగ పిచ్చుక మాత్రమే ఆహారానికి వెళ్ళాలని అనుకున్నది. ఆడపిచ్చుకను ఇంట్లోనే ఉండి కాపలా కాయమని చెప్పింది. అలాగేనని తల ఊపింది  ఆడ పిచ్చుక.
 
          పక్కింటి పావురం వచ్చి అర్జంటుగా హాస్పిటల్ కు వెళ్ళాలి తోడు రావా అని బతిమాలింది. ఆడ పిచ్చుక దాని బాధను చూసి సరేనని వెళ్ళింది. నెమలి మామ ఆసుపత్రి పక్క చెట్టు మీదే ఉంటుంది. అందుకే పావురానికి తోడుగా వెళ్ళింది. హాస్పిటల్ లో చూపించుకుని ఇంటికి ఇద్దరూ వచ్చారు.
 
          ఆడ పిచ్చుక గబగబా లోపలికి వెళ్ళేసరికి గుడ్లన్నీ సొన కారుతూ నేల మీద పడి ఉన్నాయి. అయ్యో ‘ఎంత పని జరిగింది’ అంటూ గుండెలు పగిలేలా రోదించింది. సాయంత్రానికి మగ పిచ్చుక వచ్చేసరికి ఆడపిచ్చుక ఏడుస్తూ ఎదురొచ్చింది. విషయం తెలుసు కొని ఇద్దరూ ఏడ్చారు. అసలు ఎవరిలా చేస్తున్నారు. మనమంటే ఎవరికీ కక్ష లేదే ఆనుకుని బాధపడ్డారు.
 
          ఇలాగే మరో రెండు మూడుసార్లు జరిగింది, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. ఒక ఉపాయం ఆలోచించిన పిచ్చుక ఊర్లోకి వెళ్ళింది. అక్కడ చెట్లలో ఇరుక్కుపోయిన గాలి పటాలను చూసింది. వాటికున్న దారాన్ని చూసింది. ఆ దారాన్ని తెంపుకుని తెచ్చింది. తమ గూటికి అడ్డంగా ఆ మాంజా దారాన్ని ఉచ్చు పడేలా కట్టింది. ఈ దెబ్బతో దొంగ ఎవరో తేలుతుంది అని అనుకున్నది.
 
          మరల కొన్ని రోజులకు ఆడపిచ్చుక గుడ్లకు జన్మనిచ్చింది. గుడ్లు ఎప్పుడూ పిల్లలు అయ్యేదాకా ఉంచకుండా ఎవరో శత్రువులు చిదిమేస్తున్నారు. మాంజా దారాన్ని గూటికి అడ్డంగా కట్టింది కదా. ఆ దారం కనపడుకుండా ఆకులు పరిచింది. గుడ్లకు పరుపులా వేసుకున్నది అనుకున్నారు. ఈసారి ఎక్కడికీ పోకుండా చూడాలని గట్టిగా నిర్ణయించు కున్నాయి.
 
          ఒకవేళ తెలియకుండా వచ్చినా దానికి మరణం తప్పదు. పిచ్చుకలు మాత్రం రోజూ దారాన్నీ జాగ్రత్తగా దాటుకుంటూ నడుస్తున్నాయి. “మాంజా దారంతో మనుష్యుల గొంతే కోసుకుపోతుంది. మన పక్షులెంత” అని ఆడపిచ్చుకకు సమాధానంగా మగ పిచ్చుక అన్నది. ఆడపిచ్చుక అడిగింది – ఈ దారానికే శత్రువు చనిపోతుందా అని అనుమానం అందుకే మగ పిచ్చుక అలా సమాధానం చెప్పింది.
 
          పిచ్చుకలు రెండూ బయటికి వెళ్ళాయి. ఇంటి చుట్టు పక్కల వాళ్ళకీ జాగ్రత్తగా చూడమని చెప్పాయి. ఆ రోజు దూర ప్రాంతం నుంచి పక్షులు వలస పక్షులు వస్తున్నా యి. వాటివి తీసుకురావడానికి పిచ్చుకలు వెళ్ళాయి. అవి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు చాలా పక్షులు గుమిగూడి ఉన్నాయి.
 
          పిచ్చుకల జంట భయభయంగా తమ గూటి దగ్గరకు వెళ్ళాయి. మాంజా దారానికి ప్రాణాలు కోల్పోయిన కాకి కనిపించింది. అంటే రోజూ ఈ కాకి తమ పిల్లలను చంపేస్తుం దా అని ఆశ్చర్యపోయాయి. దానికి తగిన శిక్ష పడింది. అక్కడున్న వృధ్ధ పక్షులు ఇలా అన్నాయి. ఎప్పడైనా ఒకరికి అన్యాయం చేయాలని చూస్తే వారే బలయి పోతారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా చాలా మందికి అర్థం కావడం లేదు. అయినా చెప్పాల్సిందే. అందుకే చెబుతున్నాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.