కనక నారాయణీయం -61

పుట్టపర్తి నాగపద్మిని

          శ్రీ చపలకాంత్ భట్టాచార్య లేచి, పుట్టపర్తిని వాటేసుకున్నారు.’తెలుగు భాష ఎంత మధురమైనదో యీరోజు నాకు అర్థమైంది. గ్రాంధికమైన తెలుగు భాషకూ, సంస్కృతానికీ పెద్ద తేడా లేదని పుట్టపర్తి రచన ద్వారా తెలిసింది. ఆయన అచ్చ తెనుగులో వ్రాసిన భాగం కూడా వారి నాట్యాభినయం సాయంతో అర్థమైనట్టే అనిపించింది. అది లేకున్నా, వారి పఠనం శక్తివంతం కావటం వల్ల, అదేమిటో, పుట్టపర్తి చదివినదంతా నాకు అవగతమైపోయినట్టే భావన. అదే కవిత్వం శక్తి, నిజమైన శక్తి. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారికి కృతజ్ఞతలు. మానవుడు, భాష, సాహిత్యం – వీటి కలయిక ఎంత అవసరమో, ఈ కలయిక ఎంత గొప్ప అద్భుతాలను సృష్టించగలదో, కవికీ, అతని పాఠకులకూ మాత్రమే తెలుస్తుంది. తెలుగు బెంగాలీ భాషలను దగ్గరగా చేర్చటంలో యీ పరిషత్తు కృషి కూడా అభినందనీయం. భవిష్యత్తులో ప్రముఖ సంస్థగా వెలుగొందగలదని నా నమ్మకం.’
ఇలా కలకత్తాలోనూ శివతాండవ నాట్యాభినయ ప్రదర్శనతో పుట్టపర్తి కీర్తి కాంతులు ఉత్తర భరత సాహిత్యాకాశాన మెరుపులు కురిపించాయి.

          సభ తరువాత, పుట్టపర్తి అభినందనల తీపి జ్ఞాపకాలతో కడపకు తిరుగు ప్రయాణ మయ్యారు.

***

          ఇంటికి రాగానే అత్తగారు శేషమ్మను చూసి ఆశ్చర్యపోయారు పుట్టపర్తి.పెట్టే బేడా ఇంట్లోకి చేర్చాడు సుబ్రమణ్యం.

          హైద్రాబాద్ నుంచీ ఆమె ఇక్కడికి వచ్చిందంటే ఏదో ముఖ్యమైన పనే ఉండవచ్చు ననుకుంటూ, “ఏమ్మా! బాగున్నారా మీరంతా?’ అని పలుకరించారు అత్తగారిని.

          ”ఆ..బాగానే ఉన్నామప్పా! కలకత్తాలో నీ కార్యక్రమం బాగా జరిగిందా?’ అంటూ అడిగిందామె కూడా ఆప్యాయంగా! ఆమె పుట్టిల్లు కూడా ధర్మవరమే కాబట్టి అనంతపురం యాస తో తేనె చిలకరించినట్టే ధ్వనిస్తుంది పుట్టపర్తికి ఆమె పలుకుబడి! అల్లుడైనా కొడుకులాగే ఆప్యాయంగా మాట్లాడటం ఆమెకు అలవాటు. ఆ పిలుపును ఆనందంగా స్వీకరిస్తారు పుట్టపర్తి. తనకు కాలం కలిసిరాని సమయాల్లో బిడ్డనూ, అల్లుడినీ కూడా కడుపులో పెట్టుకుని చూసుకున్న మాతృసమానురాలామె వారికి! ఒకవేళ ఆమె వారిని కాస్త కోప్పడ్డా, అది కూడా శిరోధార్యమే పుట్టపర్తికి!

          ఇప్పటివలె 1960లలో వార్తాపత్రికల్లో వార్తలంత వేగంగా చేరే పరిస్థితి లేదు కదా! ఇటువంటి సాహిత్య కార్యక్రమాల ప్రాధాన్యత కూడ పరిమితం కదా! అందువల్ల అక్కడ సభావిశేషాలు కడప దాకా రాలేదింకా!

          ‘బాగా జరిగిందమ్మా! ఏముందీ? ఎక్కడికి నేను పోయినా నన్ను శివతాండవ కవిగా ముందు గుర్తిస్తారు. తరువాతే తక్కినవన్నీ!’

          ‘మంచిదే కదయ్యా! భక్తి రచనే కాబట్టి, అందరికీ ఆమోదయోగ్యం కాబట్టి ఆ విధంగా నీ పేరు ప్రఖ్యాతికి రావడం మాకు కూడా సంతోషమే.’

          తల ఊపి,లోపలికి వెళ్ళీ పెరట్లో కాళ్ళూ చేతులూ కడుక్కుని తన కుర్చీలో కూర్చుంటూ ‘నాగా! ‘ అని కేకేశారు ముందు, మంచినీళ్ళు తెచ్చివ్వమని అడుగుదామ నుకుంటూ!

          ఇంతలో శేషమ్మే ఒక చేత్తో మంచినీళ్ళ చెంబు, మరో చేతిలో కాఫీ లోటా (గ్లాస్) పట్టుకుని వచ్చారు.

          “అక్కడంతా బాగున్నారామ్మా? మా మామగారూ, శాంతమ్మా అంతా?’

          “ఆ..బాగానే ఉన్నారు.’

          ‘ఏదైనా పనిమీద రావడమైందా ఏమిటి మీరు?’

          ‘ఉన్నట్టుండే రావలసి వచ్చిందప్పా మరి!’

          ఈ మాట వినగానే ప్రశ్నార్థకం పుట్టపర్తి మోములో!

          తాను కలకత్తాకు వెళ్ళినప్పుడు ఇల్లంతా బాగానే ఉందికదా? అంతలోపల ఏమై ఉంటుంది? అటు ఇద్దరు ఆడబిడ్డల పెళ్ళిళ్ళూ చక్కగా అయ్యాయి. అత్తగారిళ్ళల్లో వాళ్ళిద్దరూ బాగున్నారని అప్పుడప్పుడూ వచ్చే ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉంది. ఇక ఇక్కడ పిల్లలంతా బాగానే ఉన్నారు. భార్య కనకవల్లి కూడ ఇప్పుడు సంతోషంగానే ఉంది. తనకూ రాత కోతలతో సమయం ఇట్టే గడిచి పోతూ ఉంది. మరిప్పుడు అత్తగారు యీ విధంగా ఉన్నట్టుంది రావలసిన అత్యవసర పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు పుట్టపర్తికి.

          ఆయన ఆలోచనల్లో ఉండగా ఇటు వీధి గుమ్మం నుండి నాగపద్మిని వచ్చింది ఇంట్లోకి. అయ్యను దాదాపు పది రోజుల తరువాత ఇంట్లో చూడగానే తన కళ్ళల్లో మెరుపు కనిపించింది. గబుక్కున అవ్వ శేషమ్మ దగ్గరికి వెళ్ళి ఆనుకుని నిలబడింది చిన్న నాగ, అయ్యను దగ్గరగా చూస్తూ!

          పుట్టపర్తి ఇంతకు ముందే పిలిచారు కదా! శేషమ్మకు గుర్తుంది. అందుకే,’ఇదిగో మీ అయ్య! వచ్చీ రావడంతోనే నిన్నే పిలిచారే తల్లీ!’ అని చెంప మీద ముద్దుపెట్టు కుందామె!

          పుట్టపర్తి కూడా నవ్వుతూ లేచారు, తన ప్రయాణం సంచీ నుండీ ఒక శాలువా తీసి దగ్గరకు రమ్మని నాగపద్మినిని పిలిచి ఆ శాలువా తన చుట్టూ కప్పి చప్పట్లు చరిచారు.
శేషమ్మ చప్పట్లు కూడా తోడయ్యాయి.

          నాగ ఉబ్బి తబ్బిబ్బైపోతూ అమ్మకు యీ సత్కారం గురించి చెప్పాలనేమో ఇంట్ళోకి పరుగు పెట్టింది.

          పుట్టపర్తి మోములోనూ చిరునవ్వు మెరిసింది క్షణం పాటు!

          మళ్ళీ అంతలోనే అత్తగారి హఠాత్ రాకకు కారణం తెలుసుకోవాలని గుర్తుకు వచ్చి ఆమె వైపు చూశారు.

          ‘ఏమి చెప్పేదయ్యా? అనుకోకుండా కనకకు కడుపు పోయింది పాపం. బిడ్డ ఎంత కష్టపడిందో! పిల్లలెవరూ ఇంట్లో లేకపోయేసరికి బావిలో నీళ్ళు తోడేందుకు పోయిం దంట! అప్పుడేమయిందోగానీ ఇంట్లోకి రాగానే..!’ ఆగిపోయిందామె!

          పుట్టపర్తి నిశ్చేష్టులైపోయారు. కానీ అత్తగారిముందు, గాంభీర్యాన్ని సడలింప జేయకుండా, నెమ్మదిగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నారాయన! ఆ కాలం పరిపాటి అది.
సంతోషమైనా దు:ఖమైనా విపరీత స్పందనలకు అతీతం. ముఖ్యంగా మగవాళ్ళకు!
కలకత్తా సంతోషవార్త తాలూకు ఆనందం ఆవిరైపోయింది.

          ‘అత్తగారిగా నేనీమాటలు నీకు పెద్దరికంగానే చెబుతున్నానప్పా! ఏమీ అనుకోవద్దు. గుడిపాటవ్వ ఇంట్లో పడుకుని ఉంది తను. వారం రోజులయిందంతే! నాకు సుబ్రమణ్యం తెలిగ్రాం ఇస్తే ఉన్నపాటున వచ్చేసినాను. కోలుకోవడానికి పది పదహైదు రోజులు పడుతుందిలే! నేనెన్ని రోజులుండగలను చెప్పు? అక్కడ మీ అయోమయం మామగారితో వేగడం కష్టం. పైగా శాంతకు ఉద్యోగంకదా! నేనొచ్చి వారమైంది. నువ్వు వచ్చిన వెంటనే నేనూ బయలుదేరుదామనుకుంటున్నా! తులజకూ, నాగకూ వంటింటి పని అప్పజెప్పు. నీ రాత కోతలు నువ్వే చూసుకో లేదా కొన్ని రోజులు వాయిదా వేయి. కనకకు విశ్రాంతి అవసరమిప్పుడు. నీకేమి చెబుతానప్పా ఇంక?’

          మౌనమే శరణ్యమైంది పుట్టపర్తికి.

***

          అనుకున్నట్టుగానే శేషమ్మ మరుసటిరోజే హైద్రాబాద్ కు ప్రయాణమైపోయింది.
ఇంట్లో తెలియని నిస్తేజం నిండుకుని ఉంది. అప్పుడప్పుడు గుడిపాటవ్వ వాళ్ళ గదిలో పడుకుని వున్న కనకవల్లిని పలుకరించి వస్తూనే ఉన్నా, తెలియని అపరాధ భావం మనసులో పుట్టపర్తికి!

          తనకేనాడూ సంసారం గురించి ఆలోచించే అలవాటే లేదు. ఆడా, మగా అన్నీ తానై సంసార రధాన్ని నడిపించే ఇల్లాలు కనకవల్లి. ఎవరైనా అంటూ ఉంటే వినడమే గానీ, స్త్రీలకు సంబంధించి ఇటువంటి ఇబ్బందుల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరు మగవాళ్ళ వలెనే తనకూ తెలియదు.

          అసలు కూరగాయల ధర వరలు గానీ, బట్టల నాణ్యత గురించిన పరిజ్ఞానం కానీ తనకు చాలా దూరం. కనకవల్లి మీద అన్నీ వదిలేసి, ఎప్పుడూ తన సాహిత్య లోకాల్లో విహరించడమొక్కటే తనకు తెలిసిన విద్య. అందరూ అనుకుంటున్నట్టు కనకవల్లి వంటి అర్ధాంగి దొరకటం కేవలం తన అదృష్టమే! కాకపోతే మొదటి పెళ్ళి భయంకరంగా విఫలమైనవాడికి పిల్లనిచ్చేందుకు ఏ తల్లిదండ్రులు ముందుకు వస్తారు? శేషమ్మ దంపతులు కేవలం తన తండ్రిగారి పేరు ప్రఖ్యాతులు, తిరుమల తాతాచార్యులవారి వంశానికి చెందిన ప్రతిష్టను చూసి అంగీకరించారప్పట్లో! సరైన ఉద్యోగమూ గట్రా లేని సమయంలో కనకవల్లి వంటి ఇల్లాలు తన జీవితంలో ప్రవేశించటం తన అదృష్టం నిస్సందేహంగా! ఆమెను కాపాడుకోవాలంతే!

          ఈ ఆలోచనలిటు ప్రయాణిస్తూ ఉండగానే, యధాలాపంగా పుట్టపర్థి తన గదిలో భద్రపరచుకుని ఉన్న విజయనగర చరిత్రకు సంబంధించి తాను ప్రత్యేకంగా ఒక చోట పెట్టుకున్న సామగ్రిలోనుంచీ, ‘అళియ రామ భూపాలుడు’ అన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. కారణమేమిటో తెలియదు కానీ అళియ రామరాయలంటే తనకు చాలా ఆరాధన. చరిత్రకారులు అతన్ని అహంభావిగా, రాజ్య కాంక్ష కలిగినవానిగా క్రూర కర్కశ హృదయునిగా చిత్రీకరించినా అతని సాహసం, రాజనీతి అద్భుతమని పుట్టపర్తి నిశ్చితాభిప్రాయం. ఆ పుస్తకం మొదటి పుటల్లోనే కనిపించిన ఒక చిత్రం, పుట్టపర్తిని తన చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి లాక్కుపోయింది. ఇంతకూ అదెవరి చిత్రం?

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.