ఇగో—( అహం అడ్డు)

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

          రాత్రి జరిగింది మరిచిపోతే బెటర్‌……ఇదిగో కాఫీ; ఆలస్యంగా లేచారు కాబట్టి తొందరగా రెడీ అవ్వండి.’ అంటూనే న్యూస్యపేపర్‌లో దూరిపోయింది శారద. తను అప్పటికే రెడీ అయి వుందన్న విషయం అర్థమయ్యేసరికి నేనెప్పుడు లేచానో తెలిసింది నాకు. తను కూల్‌గా వుండడంతో నాకు గిల్టీగా అనిపించింది.అనవసరమైన రాద్దాంతం కదూ; మనసులో అనుకుంటూనే అద్దంలో నా మఖాన్ని నేను చూసుకున్నాను. కళ్ళు ఎరుపెక్కాయి.

          నిద్రలేకపోతే ఎరుపెక్కక ఏమవుతుంది? యాభై ఏళ్ళు దాటి ఏడాదయ్యింది. కానీ నాలో మారని మనస్తత్వం. 

          ఎందుకో తొలిసారిగా ఇబ్బందిగా అనిపించింది నాకు.

          ‘ మీరు రెడీయేనా? ’శారద పిలిచేసరికి ఆలోచనల్లోంచి బయటపడ్డాను.

          ‘ఆ…ఆ…వచ్చేస్తున్నా…;అంటూనే కారు కీస్‌ తీసుకొని బయటపడ్డాను. శారద ఎప్పటిలాగే వచ్చి కారులో కూర్చుంది. యూనివర్సటీ నుంచి మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరం. ఆ సమయాన్ని వృధా చేయకుండా పుస్తకంలో తల దూర్చింది. నేను మౌనంగా కారు నడుపుతూ శారదను పరిశీలనగా చూశాను. ఆమె ప్లెజెంట్‌గా కనిపిం చింది.పెదాల మీద చిరునవ్వు అలాగే వుంది. అది అందరికి సాధ్యం కాదు. సమస్య పట్ల స్పందించడం వేరు. ఘర్షణ వేరు. ఈ రెండింటిలో నేను ఎన్నుకున్న దారి ఓ పెద్ద గొడవకు దారి తీసింది. మా మధ్య గొడవలు మామూలుగానే జరుగుతూ వుంటాయి. తను  ఎప్లైడ్‌మాథ్స్‌ ప్రొఫెసర్‌. నేను ఆర్గానిక్‌ కెమిస్ట్రీ రీడర్‌. నాకన్నా తను కొంచెం ఎక్కువ నా మనసులో ఆ భావన ఉందేమో, అప్పుడప్పుడూ మా మధ్య గొడవకు అదే కారణమై వుండొచ్చు.

          కారు యూనివర్సిటీ దగ్గరగా వచ్చేసరికి నా ఆలోచనలు బ్రేక్‌ పడ్డాయి. శారద కారు దిగుతూ నావైపు చూసి నవ్వింది. ఎందుకు నవ్విందో అర్థమయ్యే లోపు …..’ ఈ రోజు
క్యారియర్‌ లో మీకు నచ్చినవన్నీ ఉన్నాయి. మీరు తినండి. నేను లంచ్‌కు రాను. మా డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ రఘు రిటైర్‌మెంట్‌. అక్కడే నా లంచ్‌. మీరు వెళ్ళండి.’ అంటూ కారు దిగి వెళ్ళిపోయింది.

***

          ‘ రాత్రి జరిగిన దానికి సారీ శారదా; నీ వ్యక్తిత్వాన్ని తప్పుపట్టాను. నాకెందుకో కోపం ముక్కుమీద వుంటుంది. అనాలోచితంగా మాటలనేస్తాను. ఆ తరువాత ఆలోచిస్తే నేనెంత ఫూలిష్‌గా మాట్లాడానో అర్థమవుతోంది.’ అన్నాను తప్పు చేసిన వాడిలా తలదించుకుని.

          ‘ ఇలా మీరు మాట్లాడింది కొన్ని వందల సార్లు. మనకు పిల్లలున్నారు. పెద్దవాళ్ళ య్యారు. బయటికి వెళ్ళి పోయారు. వున్నది మనమిద్దరం. మరో ఐదారేళ్ళలో రిటైర్‌ అవుతాం. మన మధ్య ఇంకా నువ్వు గొప్పా? నేను గొప్పా? అన్న ఆలోచన అవసరమా?అవసరమనుకుంటే మనసులోనే వుంచుకోవాలి. బయట పడిపోవడం మెందుకు? మీరు ప్రతి చిన్నదానికి అసహనం ప్రదర్శిస్తే నేను సహనంగా ఎలా వుండగలను? అయినా వుంటున్నాను. ఎందుకో తెలుసా? మనం ఒకరకొకరం తప్ప మన మధ్య మూడో వ్యక్తిలేడు కాబట్టి. మీరు అంటుంటారే….నా సహనం కూడా మిమ్మల్ని ఇరిటేట్‌  చేస్తుందని. అదేంటో నా కిప్పటికీ అర్థం కాదు. నేను మౌనంగా ఉంటే భరించలేరు. గట్టిగా మాట్లాడితే తట్టుకోలేరు. ఇంత బలహీనమైన వ్యక్తిత్వం మీ కెప్పుడొచ్చిందో?’ శారద మాట్లాడడం ఆపి ఓ క్షణం నావైపు చూసింది…; ఆ క్షణం నేనేమి ఆలోచించే స్థితిలో లేను. శారద అంత గట్టిగా మాట్లాడేసరికి నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు.

          ‘ సరే; జరిగిందేదో జరిగింది. ఇక్కడితో ఆపేద్దాం.’ అన్నాను ముక్తసరిగా.

          ‘ మైడియర్‌ గోపాల్‌…; నిజమెప్పుడు బాధగానే వుంటుంది. కాస్త చేదుగా; మీ కన్నా వృత్తిలో నేను ముందుండే సరికి మీ ఫీలింగ్స్‌ క్షణం క్షణం మారిపోతున్నాయి. ఏం చేయమంటారు.? నా కన్నా ముందు మీరు లెక్చరర్‌ అయ్యారు. మీ డిపార్ట్‌మెంట్‌ లో అవకాశాలు మీకు రాలేదు. నాకు వచ్చాయి. అలా అని మిమ్మల్ని ఎప్పుడన్నా తక్కువ చేసి చూశానా? ఈ చిన్న తేడా వల్ల మన మధ్య అసహనం….ఆక్రోశం…ఎందుకు?ఇంటలెక్చువల్‌ లో వుండే అసూయ కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద సమస్యలకు కారణమవు తుంది. నేను మీ భార్యను. నా ప్పోగ్రెస్‌ను మీరు భరించలేకపోతే అది మీకే అవమానం. వూరికే మనశ్శాంతి పోగొట్టుకోవడం, లేనిదాన్ని అతిగా వూహించుకోవడం  , ప్రతిక్షణం టెన్షన్‌ తో ….అదే పనిగా మనసు పాడుచేసుకోవడం….ఇవన్నీ మీరు చేస్తున్న పనులు. ఆ ప్రభావం నా మీద వుండదనుకుంటున్నారా?

          కొన్ని సార్లు మీ మాటను నేను కాదన్నాను. మీతో వాదులాటకు దిగాను. నేనే పై చేయిగా వున్నాను. మీరు రోజూ క్లాస్ లో చెప్పే సబ్జెక్ట్‌కు చాలాసార్లు నేను నోట్స్‌ రాసిచ్చాను. అంతమాత్రాన మిమ్మల్ని కించపరిచినట్టా? భార్యభర్తల మధ్య ఆ మాత్రం ఘర్షణ …సర్దుబాటు ఉండవా? ఇలా చెప్పుకుంటూ పోతే మనకు నచ్చని విషయాలన్నీ బయటకు వస్తాయి. ఈ వయసులో మనం వుండాల్సింది ఇలా కాదు. ఎలా వుంటే
బావుంటుందో మీకూ తెలుసు. అది సరే…;పిల్లలిద్దరూ స్టేట్స్‌ నుంచి వస్తునట్లు మెయిల్‌ చేశారు. ఫోన్‌ కూడా చేశారు. మీరు డిస్టర్బ్‌గా వున్నారని రాత్రి చెప్పలేదు. వాళ్ళముందు ఇలా వుండకండి. మీ మీద గౌరవం తగ్గి పోతుంది. రండి భోంచేద్దాం’ అంటూ లేచింది శారద.

          నేను వున్నచోటే ఆలోచనలో మునిగిపోయాను. నా బలహీనత తనకు తెలిసినంతగా నాకు తెలీకపోవడం..; శారద మాటలు సూటిగా తాకడంతో నేనేంటో ఆలోచించాను. మనసు బరువెక్కి పోయింది. 

          ‘ ఇంకా ఏం చేస్తున్నారక్కడ. రండి నాకు ఆకలేస్తోంది…..;’శారద పిలుపుకు వులిక్కిపడి డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్ళాను. ఏంటో…;అంతా కొత్తగా మొహమాటంగా వుంది. నాకు నా మనసులో వున్నదంతా శారద గ్రహించడం నాకు ఇబ్బందిగానే వుంది. మౌనంగా నాలుగు ముద్దలు తిని లేచాను.

          ఆ రోజు రాత్రి నాకస్సలు నిద్ర పట్టలేదు. శారద ప్రశాంతంగా నిద్రపోయింది. మా మధ్య మానసిక స్థిరత్వానికి వున్న తేడా అదే;

***

          పిల్లలు స్టేట్స్ నుంచి వస్తున్నారని శారద ఇల్లంతా నీట్‌గా వుంచింది. రకరకాల పిండివంటలు ,స్వీట్స్‌ తయారుచేసింది. ఇద్దరమే వున్నా పదిమంది వున్నంత సందడి. స్టేట్స్‌కు వెళ్ళిన పిల్లలు ఏడాది తరువాత ఇక్కడికి రావడం వల్ల శారదలో ఆతృత ఎక్కువయింది. నాలోనూ అదే స్థితి. తను బయట పడుతుందంతే. ఆమెకు సహకరిస్తూ నేను అందులో ఆనందిస్తున్నాను. ఎప్పుడూ అసహనంగా, అనాలోచితంగా వుండే నేను శారదతో ఇలా మాటా మాటా కలిపి పనులు చేయడం కొత్తగా అనిపించింది. చాలా ఏళ్ళు గడిచాయి. ఉద్యోగభాధ్యతల్లో సున్నితమైన భావాలన్నీ నలిగిపోయాయి. పొడిపొడి
మాటలు, లేక సూటిపోటి మాటలు తప్ప మనసును కదిలించే మాటలు లేవు. జీవితాన్ని ఇలా చూస్తుంటే తొలకరి వానలో తడిసినట్టుంది నాకు. ఎప్పటికో అర్దరాత్రికి పనులన్నీ పూర్తయ్యాక శారద నిద్రపోయింది. నాకళ్ళు మాత్రం నిద్రరాక కాస్తబాధను అనుభ వించాయి. ఆ బాధ గుండె లోతుల్లో ఎక్కడెక్కడో తడిమేసరికి నాకు నిద్రలేని రాత్రి అయ్యింది.

***

          ఇల్లంతా కోలాహలంగా ఉంది. శారద యూనివర్సిటీకి సెలవు పెట్టేసింది. నన్నూ పెట్టమంది. కానీ అడ్జస్ట్‌ చేసుకుంటానని చెప్పాను. కూతురు దివ్య, కొడుకు రమేష్‌ స్టేట్స్‌కు వెళ్ళాలన్న కలలు నెరవేర్చడానికి వాళ్ళను ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం నాకిప్పటికీ గుర్తుంది. వాళ్ళు స్టేట్స్‌ ఫ్లైట్‌ ఎక్కిన రోజు నాకు బాగా జ్ఞాపకం. శారద కళ్ళల్లో తీయటి పులకింత, కళ్ళలో ఓ సన్నటి నీటిపొర. వాళ్ళిద్దరూ శారదను వాటేసుకుని ఏడిస్తే అప్పుడు నాకూ ఏడుపు వచ్చింది. కానీ…నా దగ్గరకు వచ్చి ఒక్క మాటన్నా అన్నారా? లేదే? వెళ్ళొస్తాం నాన్నా అంటే వాళ్ళ సొమ్మేం పోతుంది. వాళ్ళను పెంచింది శారద ఒక్కర్తేనా? నా ప్రమేయం …నా బాధ్యత లేవా? వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డాను. వాళ్ళ సంతోషాన్ని నేను షేర్‌ చేసుకోలేకపోవచ్చు. నా స్వభావమే అంత. దాన్ని ఎలా మార్చుకోను. బహిరంగ పరిస్తేనే ప్రేమాభిమానాలు వున్నట్లా? వాళ్ళొచ్చి చాలా సేపయ్యింది. శారద చుట్టూ తిరుగుతున్నారే తప్ప నేనున్నానన్న ఆలోచన వాళ్ళకు లేదు. వాళ్ళ సక్సెస్స్‌ను శారద షేర్‌ చేసుకుంటుంటే నేనే ప్రేక్షకుడిలా ……పరాయివాడిలా కూర్చోవడం; ఓ తండ్రిగా సిగ్గుగా అనిపించింది. వాళ్ళ సక్సెస్‌ వెనుక శారద మాత్రమే వుందన్న వాళ్ళ ఫీలింగ్స్‌ను డిస్టర్బ్‌ చేయడం నాకు ఇష్టం లేదు. అది నా ఇల్లే. వాళ్ళు నా పిల్లలే.ఎందుకో అక్కడ వుండలేకపోయాను. భౌతికమైన ప్రవర్తన మనసుకెప్పుడూ దగ్గరగా వుండదన్న నిజం తొలిసారిగా తెలిసింది నాకు.

          ‘ మీరు మాట్లాడుకోండి. నేనలా యూనివర్సిటీకి వెళ్ళొస్తాను.’ అంటూ అక్కడ నుండి లేచాను.

          ఆ రోజు మూఢీగా వుండడంతో క్లాస్‌ తీసుకోలేకపోయాను. లైబ్రరీకి వెళ్ళి ఏదో రిఫరెన్స్‌ బుక్స్‌ తిరగేసి నోట్స్‌ రాసుకుంటూ సమయాన్ని గడిపేశాను. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. లైబ్రరీ మూసేవరకూ అక్కడే గడిపి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఇంటిలో పనమ్మాయి తప్పితే ఎవ్వరూ లేరు. నేను అడగకుండానే …అమ్మ గారు, పిల్లలు సినిమాకు వెళ్ళారయ్యా…మీరొస్తే భోజనం చేసేయమన్నారు. అంటూ తన పనిలో పడిపోయిందామె. నా అవసరం ఎంత ప్రశ్నార్థకమో అర్థమయ్యింది నాకు. మనసు కాస్త బరువెక్కింది. నాలుగు మెతుకులు తిని న్యూస్‌ పేపర్‌ చేతిలోకి తీసుకు న్నాను. రాత్రి పదింటికి ఇంటి కొచ్చారు వాళ్ళు. శారద అడిగింది…మీరు తిన్నారా; అని . నా సమాధానం కోసం ఎదురుచూడకుండానే మేం హోటల్‌ లో తినేశాం అంది. శారద మాటైనా అడిగింది. పిల్లలు మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళు. తండ్రిగా వున్న వాడికి ఇలాంటి మూమెంట్స్‌  అన్నీ బాధ కలిగిస్తాయి. నా బాధ అది కాదు. నేనెందుకు వాళ్ళకు శత్రువు నయ్యానా? అని ఆలోచిస్తూంటే …శారద వచ్చింది. బాగా తిరిగాం….నిద్రొస్తోంది.
అంటూనే కళ్ళు మూసుకుంది.

***

          మూడు వారాలు గడిచిపోయాయి. మధ్యలో ఎప్పుడన్నా చిన్న పలకరింపు. తప్ప ప్రత్యేకంగా నాతో మాటలాడిన రోజు లేదు. నేను ప్రయత్నించాను. ఏవో పొడి పొడి మాటలు మనసుకు చేరని మాటలు.శారద.. …..నా దగ్గర కూర్చుంటూ …’ మరో రెండు రోజులలో పిల్లలు వెళ్ళిపోతున్నారు. మీరు కాస్త మామూలుగా ఉండండి. పట్టింపులొద్దు. ఇగోలు వద్దు. మీరు వాళ్ళ కన్నా తెలివైన వారు. వాళ్ళు తెలీక మిమ్మల్ని హర్ట్‌ చేసినా, చులకన చేసినా మీరు అవేం పట్టించుకోవద్దు. మీ పిల్లలే కదా;’ అంది. ఏమనాలో తెలీక తల ఊపాను.

          నేను నా గదిలో నోట్స్‌ తయారు చేసుకుంటుంటే పక్క గదిలోంచి మాటలు వినిపి స్తున్నాయి.’ అమ్మా; …. ఈ మనిషిని ఎలా భరిస్తున్నావు. మాతో పాటు వచ్చేయ్‌….ఓ ఏడాది పాటు వదిలేస్తే బుద్ది వస్తుంది. వయస్సు  పెరిగింది కానీ మూర్ఖత్వం మాత్రం పోలేదు…;’ అన్నారు. పిల్లలిద్దరూ.” గట్టిగా మాట్లాడకండి..ఆయన వింటే బాగుండదు.” అంది శారద వాళ్ళను వారిస్తూ.

          ‘ఛ ఛ; ఏం మనిషో; మేం ఏడాది తరువాత వస్తే మాతో ప్రేమగా వున్నారా? ఏదో బలవంతంగా నాలుగు ముక్కలు తప్ప, మా ఆలోచనలు , మా సరదాలు పంచుకున్నారా; మా ప్రోగ్రెస్‌ ను పంచుకున్నారా; ఎంత సేపూ ఆయన లోకం యూనివర్సిటీ అయితే ఎలా?ఎందుకమ్మా ఆయనతో….వచ్చేయచ్చుగా;’అంది కూతురు ముక్తాయింపుగా.

          ‘ ఆయన గురించి మీరెక్కువ మాట్లాడుతున్నారు. నేను రావాలనుకున్నప్పుడు వస్తాను. ఆయన వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం లేకపోయినా, ఆయన పెద్దరికాన్ని గౌరవించండి. సరే;ఫ్లయిట్‌కు టైం అవుతోంది.పదండి.’ అంటూ బయటకు నడిచింది. నేను బయటకొచ్చాను.

          ‘ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళొస్తాను. యూనివర్సిటీలో మీరు ఎక్కువ క్లాసెస్‌ తీసుకోవా లన్నారుగా; ప్రిపేరవ్వండి. వచ్చేస్తాను.’ అంటూ కారెక్కింది శారద. అందులో ఏ భావమూ వ్యక్తము కాలేదు. ఆ క్షణంలో నా కళ్ళ వెనుక ఉవ్వెత్తున లేచి ఆగిపోయిన భావాలు మాత్రం ఎప్పటికీ వాళ్ళకు అర్థం కావు.

***

          మరునాడు వుదయాన్నే ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్ళాము. త్వరలో ఎగ్జామ్స్‌ స్టార్ట్‌ అవుతాయి. కాబట్టి ఇద్దరికీ కాస్త పనెక్కువ. కారులో నేను శారదను గమనిస్తూనే ఉన్నాను. ఆమె ఫీలింగ్స్‌లో ఏ మార్పులేదు. ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. నాకెందుకో శారదతో ఎక్కువగా మాట్లాడాలనిపించింది. నా హృదయంలో సన్నగా రగిలిన సంఘర్షణ ఆమెకు చెప్పాలనిపించింది. ఆమెకు దగ్గరగా……..హృదయానికి చేరువగా వుండాలనుపించింది. శారద ఆలోచనల్ని ఆ క్షణంలో డిస్టర్బ్‌ చేయడం ఇష్టం లేక మౌనంగా వుండిపోయాను.

          పగలంతా నాకు భారంగా గడిచిపోయింది. రాత్రి పదకొండు  గంటలయ్యింది. పనులన్నీ ముగించుకొని వచ్చింది శారద. బాగా అలిసిపోయినట్లున్న ఆమె ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలనిపించింది. ఎందుకో ఆ పని చేయలేకపోయాను. ఇంకా ఏదో అస్పష్టత నాలో. నా ఆలోచనలన్నీ నిజాయితీగా ఉన్నట్టేగా; ఆ భావన నా మనసును చుట్టి నలిపేసింది.

          శారద ఏమనుకుంటోంది? నా మీద జాలిపడుతుందో? నా వ్యక్తిత్వాన్ని ఇంకా అసహ్యించుకుంటోందా? ఏమో..మాట్లాడితే సరి; ఆమె ఎలా రియాక్టయినా భరించ వచ్చు. అలా మౌనాన్ని భరించడం కష్టం. నా ఫీలింగ్స్‌ గమనించిందేమో..’ నిద్ర రావడం లేదా.? అంది నావైపు తిరిగి. ఆ క్షణంలో కాస్త కంగారు నాలో.’ అదేం లేదు’ అన్నాను.
‘ నిజం దాస్తారెందుకు.? నిద్ర పోవడానికి మీరు అవస్థపడుతున్నారు. ఏదన్నా మాట్లాడా లనుకుంటున్నారా? అంది నా కళ్ళలోచి చూస్తూ…;

          ఆ క్షణాల్ని వదులుకోవాలనిపించలేదు నాకు. వెంటనే “ ఊ” అన్నాను తలూపుతూ.

          శారద నా వైపు కళ్ళార్పకుండా చూస్తోంది.’ పిల్లలు నన్ను అసహ్యించుకుంటు న్నారా?’ అన్నాను. ఆమె చూపుల్ని తప్పించుకొంటూ. ఆమె కాస్త ఇబ్బందిగా కదిలింది.
‘ అదే…పిల్లలు నీతో మాట్లాడింది. నేను విన్నాను. నేనేమీ కానా వాళ్ళకు.; నాగుండెలో బాధ తన్ను కొచ్చింది. నా స్వభావం మారనంత మాత్రాన నా మనసు అలాగే వుంటుందా?నన్ను ఇక్కడ వదిలేసి నిన్ను రమ్మంటున్నారు. అందుకు బాధ లేదు. కానీ….నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా వుండలేను శారూ…నేను సడెన్‌గా మారిపోలేను. నాకు కొంత సమయం కావాలి. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఇబ్బంది లేదు. నువ్వు నా మాటలు నమ్మాలి. ప్లీజ్‌….. అన్నాను.

          ‘ ఎలా నమ్మమంటారు? ఇప్పటికి మీరు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. పిల్లలు వాళ్ళకు నచ్చింది మాట్లాడుతారు. మీరు నా గురించి ఆలోచిస్తున్నదేంటి? వాళ్ళు రమ్మనగానే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానా? అదేనా నా గురించి మీరు ఆలోచిస్తున్నది? నన్ను మీరు అర్థం చేసుకోలేదు. మీ మనస్సులో ఉన్నదేదో నాకు తెలీదు. పిల్లలెలా తెలుసుకుంటారు. ప్రేమ, ఆప్యాయతలు అప్పుడప్పుడు బయటకు 
వస్తేనే మీరెలాంటి వారో తెలుస్తుంది. మీరు మీ వ్యక్తిత్వాన్ని  గెలిచాననుకుంటున్నారు. నేను జీవితంలో ఓడిపోయారనుకుంటున్నాను. మీరు మారలేదు. మారుతున్నట్లు చెప్పాలనుకుంటున్నారు. అంతే’ అంటూనే తన ముఖాన్ని తిఫుకుంది శారద.

          నేను ఆతృతగా తన ముఖాన్ని నావైపు తిప్పుకున్నాను ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. నేను చలించిపోయాను. ఆ క్షణంలో నాకనిపిస్తోంది. ఒక్కటే…నా గుండెలు భళ్ళున పగిలిపోయినట్లు …..నా అహాన్ని ఎవరో చాచిపెట్టి కొట్టినట్లు; ఆ క్షణంలో మండుతున్న నా కళ్ళను మూసే ప్రయత్నం చేయలేదు. శారద ముఖాన్ని నా కళ్ళల్లో బంధించాలని చూశానంతే…

*****

Please follow and like us:

One thought on “ఇగో(అహం అడ్డు) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. ఈ కథ “అపార్థం – అసూయ ” పేరుతో జులై 17, 2024 – మన తెలుగు డాట్ కాం లో ప్రచురణ జరిగింది. నెచ్చెలి మ్యానేజ్మెంట్ గమనించ గలరు

Leave a Reply

Your email address will not be published.