ముందడుగు
(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-చిలుకూరి ఉషారాణి
ఉదయాన్నే మందుల షాపులో,
శైలు, మీకే ఫోన్ అని షాపు యజమాని పిలవగానే,
నాకా… అన్నది అనుమానంగా,
ఇక్కడ మీరొక్కరే కదా ఉన్నారు. అంటే మీరేగా శైలు. అన్నాడు షాపతను.
అవును నేనే, అని చెప్పి ఆ ఫోన్ ను అందుకుంది. బుజ్జి పాపాయికి పద్ధెనిమిదో పుట్టిన రోజు శుభాకాంక్షలు అని అట్నుంచి వినపడగానే, ఆనందంతో వెల్లి విరిసిన మోముతో, హేయ్ తేజ్, నువ్వా.. ఈ నంబరుకు ఎలా.., నేను ఇక్కడ ఉన్నానని, … అని అడిగేలోపు, నాకు అన్ని తెలుసు అని ఫోన్లో అంటుండగా, మేడం యువర్ గిఫ్ట్ అని పూల గుత్తిని అక్కడున్న బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు ఒకతను.
నచ్చిందా, నీకే, పూల లాంటి సుకుమారికి వన్ మోర్ హ్యాపీ బర్త్ డే అన్నాడు,
ఫోన్లో తేజ్.
ఆశ్చర్యచకితురాలై, పట్టరాని ఆనందంతో థాంక్యూ అన్నది.
నచ్చిందా ,
ఊ..చాలా బాగుంది.
నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని చాలా ప్రేమగా తాకింది ఆ పూలను.
మరి నేను
యూ..నాటీ అన్నది చిలిపిగా,
ఓకే సాయంత్రం వస్తున్నావుగా అన్నాడు అధికారంగా,
ఊ..చూస్తా అన్నది.
నువ్వు వస్తున్నావ్ అంతే అని ఫోన్ కట్ చేశాడు. ఫోన్ షాపతనికి ఇచ్చేసి, పూల
గుత్తిని తీసుకొని అక్కడ్నుంచి హాస్టల్ వైపు నడిచింది శైలు.
లేడీస్ హాస్టల్ అని బోర్డు ఉన్న బిల్డింగ్ లోకి ప్రవేశించింది. గది లోపలికి వస్తున్న శైలును చూసి , హ్యాపీ బర్త్ డే టూ యూ అని గట్టిగా చెప్తూ, ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావ్ అంటూ, హేయ్, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయే, ఎవరు ఇచ్చారు అంది లల్లి.
ఇంకెవరు, తన ముద్దుల ప్రేమికుడు. అంది ఇంకో స్నేహితురాలు సుష్మ.
తెల్లవార్లూ ఫోన్లో ముచ్చట్లు, తెల్లవారగానే పూల ముచ్చట్లు , మరి సాయంత్రం అయితే ఇంకేం ముచ్చట్లో అంటున్న మరో స్నేహితురాలి నోటిని తనచేత్తో మూసేస్తూ అబ్బా మొదలెట్టావా, ఆపవే, మీరనుకున్నట్లు ఏం లేదు.
మరి ఏముందో.. అన్నారు.
కాస్త తలనొప్పిగా ఉందని మందుల షాప్ కెళ్ళి ఈ టాబ్లెట్లు తెచ్చుకున్నాను. సరే ఏంటి ఈరోజు ప్రోగ్రాం అనగానే,
ఏమున్నాయి ముందుగా గుడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాలి. ఆ తర్వాత ,
సాయంత్రం పార్టీ చేసుకుందామా అని మధ్యలోనే స్నేహితులు అనగానే,
సాయంత్రం తేజ్ వస్తానన్నాడు. అంది శైలు సిగ్గుపడుతూ..
అవునులే ఏం లేదంటావ్, మళ్ళీ తేజ్ వస్తున్నాడంటావ్ ? మరి ఏమీ లేనప్పుడు ఎందుకో వెళ్ళడం అంది దీర్ఘం తీస్తూ
ష్.. ఈ ప్రేమికులు ఉన్నారే, ఎప్పుడూ స్నేహితులని అర్థం చేసుకోరు. అంటూ
సినిమా డైలాగ్స్ తో తనని ఆటపట్టిస్తుంటే, అలా సరదాగా సాగిపోతున్న ఆ సమయం ఇంకాసేపు ఇలానే ఉంటే బాగుండు అని అనిపించింది శైలుకి.
కానీ ఎవరికోసం కాలం ఆగదుకదా. త్వరగా తయారయ్యి ఆఫీస్ కు బయలుదేరింది శైలు.
తను తనేనా అని ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు తనకి. ఎక్కడో బస్సు
సౌకర్యం కూడా సరిగాలేని ఒక పక్కా పల్లెటూరు నుంచి, తనని ఇంక పెంచి
పోషించలేని పేదరికపు పరిస్థితుల నుండి, పదవ తరగతి మాత్రమే చదువుకున్న తను
తెలిసిన వాళ్ళ సాయంతో, ఉద్యోగం కోసం వచ్చింది ఈ పట్నానికి. నిజానికి ఈ
ఉద్యోగం తేజ్ వల్లనే తనకు లభించింది, చేసేది చిన్న ఉద్యోగమే అయినా అదే
తనకు పెద్ద ఆసరా ఇప్పుడు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హాస్టల్లో ఉంటూ
సాగిపోతుంది శైలు జీవితం. అలా ఆలోచనలో ఉండగానే, బస్ ఆఫీస్ దగ్గరకు చేరుకో వడం, అదే సమయంలో తేజ్ ఎదురుగా రావడం, రెండూ ఒకేసారి జరిగిపోయాయి.
దూరం నుంచి తనను చూస్తూనే, తన అందానికి మెచ్చుకోలుగా కొంటెగా కన్నుకొట్టాడు తేజ్.
ఒక్క క్షణం సిగ్గుల మొగ్గయ్యింది శైలు.
ఎన్ని కబుర్లు చెప్పినా, అన్ని ఫోన్లోనే. ఆఫీస్ లో మాత్రం ఇద్దరూ అపరిచిత వ్యక్తు ల్లాగే ప్రవర్తిస్తారు. ఒకరికి ఒకరు పరిచయం కూడా లేనట్లుగా ఉంటుంది వారి ప్రవర్తన.
ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటాయి వారి మాటలు.
హ్యాపీ బర్త్ డే శైలు అంటూ ఆఫీసులో అందరూ అభినందనలు తెలుపుతున్నారు ఒక్క తేజ్ తప్ప. ఫైల్స్ అందిస్తూ ఒకటికి రెండుసార్లు తేజ్ టేబుల్ ముందు తిరిగింది,
ఒక్కసారన్నా చూడరా బాబు, తమరు గిఫ్ట్ గా ఇచ్చిన డ్రస్సే ఇది. డ్రెస్ ఇచ్చీ, పూల గుత్తిని పంపించి, ఇంక ఈ దాగుడుమూతలు ఎన్నాళ్ళు అని మనసులో అనుకుంటూనే ఉంది.
ఒక్కసారి తన వైపు చూసే చూపు కోసం తహతహలాడిపోతుంది శైలు మనసు. ఎంత త్వరగా సాయంత్రం అవుతుందా, ఎప్పుడు తనని కలుస్తానా అని ఎదురు చూడసాగింది. ఇన్నాళ్ళ పరిచయంలో ఈరోజే మొదటిసారిగా కలుసుకోబోతున్నారు ఒంటరిగా, తనతో చాలా చెప్పుకోవాలి, తన బాధలు పంచుకోవాలని, తనను పెళ్ళి చేసుకోవాలనే కోరికను
చెప్పాలని ఇంకా.. అలా ఆలోచిస్తూనే సమయం గడిచిపోయింది.
సరిగ్గా ఆఫీసు నుండి బయలుదేరబోతుంటే, అందరూ ఏదో గుసగుసలాడుకుంటూ వాళ్ళలో కొందరు హడావుడిగా బయటకు పరిగెత్తడం చూసి తను కూడా ఏమయిందోనని గేటు దగ్గరకు వచ్చింది, ఏంటి మేడం ఏమైంది అని అడిగింది అక్కడున్న గీత మేడంని. ఆవిడ కంగారుపడిపోతూ మన తేజ సార్ కి యాక్సిడెంట్ అయ్యిందంట ఇక్కడే ఆఫీసు ఎదురుగా రోడ్డుమీద అని చెబుతున్న ఆ మాటలు వినగానే, ఏంటి ? అంటూ తూలి పడిపోబోతూ ఒక క్షణం తమాయించుకుంది. తన కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిం చింది శైలుకు.
నా తేజ్ కి ఏమయ్యింది అనుకుంటూ బయటకు పరిగెత్తింది. అప్పుడే అంబులెన్స్
లోకి ఎక్కిస్తున్నారు. ఏదో అర్జెంటు పని ఉందంటూ త్వరగా వెళ్తానన్నాడు పాపం
ఏమైందో, ఏమవుతుందో అని అక్కడ ఉన్న వారిలో ఒకతను, పక్కవారితో చెప్తున్నాడు.
శైలుకు ఏమి చేయాలో తెలీలేదు, తన ప్రాణమే పోతున్నట్లుగా అనిపించింది ఆ క్షణంలో.
హాస్పిటల్ లో కదలలేని స్థితిలో ఉన్నతనను చూసి, ఇదంతా నా వల్లే, ఈరోజు నేను రానని చెప్పి ఉంటే ఇలా జరుగుండేది కాదేమో, అయ్యో భగవంతుడా నన్ను క్షమించు, నా తేజ్ కి ఏమీ కాకుండా చూడు స్వామి అంటూ మనసులోనే దేవుళ్ళకు మ్రొక్కులు మ్రొక్కుకుంది.
ఈ సాయంత్రం తనతో సరదాగా గడపబోతుందనుకున్న సమయం, ఇలా తన తేజ్ నీ తనకి కాకుండా చేస్తుందన్న భయంతో బిక్కుబిక్కుమంటూ అలాగే ఉండిపోయింది.
తను, తనవాడని గట్టిగా చెప్పుకోలేని పరిస్థితులు. ఎందుకంటే తేజ్ ఎవరికీ మనగురించి ఆఫీస్ లో చెప్పొద్దు, చెప్తే మన బంధం విడిపోతుంది అన్న మాటను జవదాటలేదు ఇప్పటివరకు. అందుకని స్వతంత్రంగా వెళ్ళి తనకు సపర్యలు చేయలేక, దూరం నుంచి బాధపడడమే తప్ప , వేరే మార్గం లేదు తనకి.
తన స్నేహితురాలు సుష్మ ఫోను చేస్తే కానీ ఈ లోకంలోకి రాలేదు శైలు. ఫోన్లో
మాట్లాడకుండా బోరున విలపిస్తున్న శైలుకు ఏమైందో ఏమోనని, అక్కడికి చేరుకుంది
సుష్మ.
కాసేపటికి, నర్స్ వచ్చి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాలి, పేషెంట్ తాలూకు
ఎవరండీ అన్నది, అక్కడున్న వాళ్ళ బంధువలనుద్దేశించి. అక్కడ ఉన్న వాళ్ళ
బంధువులలో ఒక అమ్మాయి వచ్చి వాటిని తీసుకుంది. మీరేమవుతారండి అన్నది నర్స్.
నేను ఆయన భార్యను అని చెప్పి సంతకం చేసి నర్స్ చేతిలో పెట్టింది పెపర్స్నీ.
అది కళ్ళారా చూసిన సుష్మ, శైలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
అదేంటి శైలు, తనకు పెళ్ళి అయిందా ? ఆవిడ చేతిలో పాప కూడా ఉంది అంటే పెళ్ళాం, పిల్లలున్న వాడినా నువ్వు ప్రేమించింది, అని సుష్మ అనగానే, ఏమీ అర్థం కాక,
చూస్తున్నది నమ్మశక్యంగా లేక, కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది శైలు.
***
హాస్టల్ లో,
ఇంత మోసం చేస్తాడా. ఐనా రోజు ఆఫీసులో కలుసుకుంటూనే ఉంటారు కదా నీకు తెలియకపోవడం ఏంటి? అంది సుష్మ.
ఆఫీసులో మేమిద్దరం అసలు మాట్లాడు కోము అన్నది శైలు.
ఏంటి?
అవును, బ్రతుకుతెరువు కోసం, ఉద్యోగం కోసం వచ్చిన నన్ను చూసి, ఆ రోజు తనే
రికమెండ్ చేసి నాకీ ఉద్యోగం ఇప్పించాడు. అప్పటి నుంచి నాకు తనంటే గౌరవం,
ఇష్టం. తను చెప్పిన దానికి ఏనాడు ఎదురుచెప్పలేదు. అందరికీ తెలిసేలాగా మనం
మాట్లాడుకోవద్దు అన్నాడు. నేనూ అదే చేశాను. ఈ ఉద్యోగమే లేకపోతే నా గతేం కాను, అన్నది భాధగా.
సరే, సరే కానీ పెళ్ళయిన విషయం నీ దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి తనకి,
అవును ఇదీ పాయింటే అన్నది లిల్లీ.
ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప తేజ్ ఇలా చేయడు అనే బలమైన నమ్మకంతో, ఎక్కడికీ వెళ్ళలేక ఆ రోజంతా రూమ్ లోనే ఉండిపోయింది.
మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్ళక తప్పలేదు తనకు.
***
ఆఫీసుకు వచ్చిందే కానీ తేజ్ కి ఎలా ఉందోనని మనసులో ఆందోళనగానే ఉంది ఒకప్రక్క, అలాగే తన దగ్గర తనకు పెళ్ళయ్యిందన్న విషయం దాచినందుకు మరో ప్రక్క కోపంగానూ ఉంది శైలుకి. ఏదేమైనా తేజ్, బానే ఉన్నాడని ఎవరైనా చెబితే బాగుండు అని మనసు పదే పదే కోరుకుంటుంది. సాయంత్రం ఆసుపత్రికి వెళ్ళి ఒక్కసారి తనని చూడాలని నిర్ణయించుకుంది.
ఇంతలో ధబ్ మని శబ్దం రావడంతో అటుగా చూసింది, సరస్వతి మేడం ఉన్నట్టుండి కింద పడిపోయారు. అక్కడ ఉన్నవారు ఆవిడను లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ముఖం మీద నీళ్ళు చిలకరించి, ఆవిడని లేపి కుర్చీలో కూర్చో బెట్టారు. చాలా నీరసంగా, లేచి నడవలేని పరిస్థితి ఆమెది. ఆవిడని జాగ్రత్తగా ఇంటి దగ్గర
దింపడానికి తోడుగా శైలు వెళ్ళక తప్పలేదు.
సరస్వతి గారి ఇల్లు చాలా చిన్నది. ఒక పడకగది ఇంకా వంటగది అంతే ఇంట్లో పెద్దగా సామానులు కూడా ఏమీ లేవు. ఇంట్లో ఎవరూ ఉన్న అలికిడి లేదు. ఆవిడని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి, మీకేం కావాలో చెప్పండి తీసుకొచ్చి ఇస్తాను, డాక్టర్
దగ్గరికి వెళ్దామంటే వినలేదు చూడండి మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అన్నది శైలు.
దానికి ఆవిడ, కాస్త ఎలక్ట్రాల్ పౌడర్ తాగేస్తే తగ్గిపోతుందిలే, కాసేపు నాకు తోడుగా ఉండు చాలు ఇంకేం వద్దు అన్నది. ఆ పక్కనే బల్ల పైన ఉన్న చిన్న ఫోటోను చేతిలోకి తీసుకొని చూస్తున్నది శైలు. అందులో ఉన్నది నేను, మా వారు, మా పిల్లలు అన్నది సరస్వతి మేడం.
చాలా అందంగా ఉంది కదూ అని చెప్తున్న ఆమె కళ్ళల్లో నీళ్ళు జలజలా రాలాయి.
పచ్చని కాపురంలో రేగిన చిచ్చు దావానలంలా మారి పచ్చదనం అంతా హరించుకు పోయింది. చివరకు మోడులా మారిపోయింది. అన్నది సరస్వతి.
ఏం అర్థం కానట్టుగా చూసింది శైలు ఆవిడ వైపు.
ఆవిడ తిరిగి మళ్ళీ చెప్పసాగింది.
నేను మా వారు, మా పిల్లలు చాలా చిన్న కుటుంబం. చాలా సంతోషకరమైన కుటుంబం. ఒకరి సంపాదన సరిపోక, నేనూ ఉద్యోగంలో చేరాను. ఆఫీసులో చేరినప్పుడు కొత్త పరిచయాలు, కొత్త పలకరింపులు. కొన్ని పలకరింపుల్లో మీరు చాలా బాగున్నారని
రోజుకో కాంప్లిమెంట్స్, అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా వస్తుంటే చాలా సరదాగా గడిచిపోయే ది. కొత్త అలవాట్లు కొత్తలో బాగానే ఉండేది, పోను పోనూ నన్నో విషవలయంలోకి నెట్టే సింది. తెలుసుకునేలోపు బందీనైపోయాను. బయటికి రాలేను అలా అని లోపల ఉండలేను. చూస్తుండగానే రోజులు కరిగిపోయాయి. చివరికి ఇదిగో ఇలా మిగిలిపోయాను ఒంటరిగా.. అని భాధగా అంటున్న సరస్వతి మేడం వైపు అయోమయంగా చూస్తుంది శైలు ఏమీ అర్థం కాక.
సరస్వతి కళ్ళు తుడుచుకుని, సరే, నువ్వు చెప్పు, తేజుకి నీకు మధ్య ఏమైనా ఉందా అని అడిగింది.
అనుకోని ఆ ప్రశ్నకు ఏం బదులివ్వాలో అర్థం కాక, అలాంటిదేమీ లేదండి అన్నది
శైలు తడబడుతూ.
మీ సరస్వతి మేడంలా కాదు, మీ అక్కలాగా అనుకో నన్ను, ఇప్పుడు చెప్పు ఏదైనా
ఉంటే చెప్పు నాతో, అన్నది అనునయంగా. మీకు ఈ విషయం ఎలా తెలుసు అన్నట్లుగా చూసింది శైలు, ఆవిడ వైపు. నిన్న హాస్పిటల్ కి నేను కూడా వచ్చాను. అందరికన్నా ఎక్కువగా బాధపడుతున్న నిన్ను చూసి అనుమానం వచ్చింది అంతే. అన్నది. ఇక చెప్పక తప్పదనుకొని,
తేజ్ ని ప్రేమిస్తున్నాను అన్నది నింపాదిగా. తను కూడ నన్ను ప్రేమిస్తున్నాడు.
కానీ, తనకు పెళ్ళి అయిన విషయం నా దగ్గర ఎందుకు దాచాడో అర్థం కాలేదు. బహుశా,
అనుకోని పరిస్థితుల్లో చేసుకోవలసి వచ్చిందేమో. తనకి ఆ పెళ్ళి ఇష్టంలేదేమో, లేకపోతే నా దగ్గర తను ఆవిషయం దాచాల్సిన అవసరం ఏంటి ? నేనంటే తనకి పిచ్చి ప్రేమ అంటూ నిజాన్ని గ్రహించలేక అమాయకంగా చెబుతున్న శైలుని చూస్తూ,
పిచ్చి పిల్ల! ఇంకా నీకు అర్థం కాలేదా, బయటకు జెంటిల్ మాన్ లా కనిపిస్తూ, నిన్ను మోసం చేయాలనుకుంటున్నాడని సరస్వతి అనగానే,
లేదు లేదు, తను అలాంటివాడు కాదు అంది బలంగా, శైలు.
రాయేదో , రత్నమేదో.. నువ్వే నిర్ధారించుకో, ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు
ఎవరు ఏం చెప్పినా, ఎలా చెప్పినా నమ్మలేరు. ప్రేమ గుడ్డిదే కానీ ప్రేమికురాలు, అంటే నువ్వు గుడ్డిగా ఉండకూడదు. ఆకర్షణకు, ప్రేమకు వ్యత్యాసం తెలుసుకోలేని స్థితి నీ వయసుది. కానీ జీవితంలో ఏదో సాధించాలని మీ ఊరు నుంచి ఇక్కడి దాకా వచ్చావు, ఈ వయసులోనే జాగ్రత్తగా అడుగేయాలి ఎందుకంటే నువ్వు వేసే ప్రతి అడుగే, నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఇక నీ ఇష్టం అన్నది సరస్వతి.
***
వారం తర్వాత తేజ్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది, నిన్ను చూడాలని ఉంది అని. బదులు ఇవ్వలేదు. ఎన్నిసార్లు మెసేజ్ చేసినా బదులు ఇవ్వలేదు శైలు.
చిన్న దెబ్బలతోనే బయటపడడంతో ఆ మరుసటి రోజే ఆఫీసులో ప్రత్యక్ష మయ్యాడు తేజ్. నాకు దెబ్బ తగిలితే నువ్వు బక్క చిక్కిపోయావ్ అన్నాడు చలోక్తిగా, అయినా కూడా ఏమీ బదులు ఇవ్వలేదు శైలు. నా మీద కోపం పోలేదా, నా పెళ్ళి గురించి నీతో చెప్పకపోవడం నా తప్పే కానీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అని అభ్యర్థించినా ఏమీ స్పందించలేదు శైలు.
ఆ సాయంత్రం హాస్టల్ దగ్గరికి వచ్చి, నీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు. “శైలూ అప్పుడు కాదు, నువ్వు మాట్లాడకపోతే ఇప్పుడు నిజంగా చస్తాను నేను” అన్నాడు ఆవేశంగా.
వద్దులే అంత పెద్ద సాహసాలు ఏం చేయక్కర్లేదు నాకోసం అంది చిన్నగా.
హమ్మయ్య, అయితే నన్ను క్షమించినట్లేగా అని సరే పద వెళ్దాం అన్నాడు.
ఎక్కడికి అన్నది శైలు.
సర్ప్రైజ్ , ఎవ్వరికీ చెప్పకు, అరగంటలో వచ్చేద్దాం అన్నాడు.
సరే, ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను ఉండు అని హాస్టల్లో కెళ్ళి , పదినిమిషాల్లో వచ్చింది.
శైలుని చూసి, ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావ్ అన్నాడు చిలిపిగా,
నీ భార్య కన్నానా, అంది శైలు, తీక్షణంగా తేజ్ వైపు చూస్తూ.
ఒక క్షణం మొహం ఎర్రబడింది తేజ్ కి. వెంటనే, జోక్ అని నవ్వి తన వెంట బయలు దేరింది కార్లో.
ఎక్కడికి అంది శైలు.
వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడక్కూడదని తెలియదా అన్నాడు. ఏం మాట్లాడలేదు. శైలు.
కారు ఒకచోట ఆగింది. దిగబోయింది శైలు. ఇక్కడ కాదు అన్నాడు తేజ్.
అప్పుడే, ఇద్దరు వ్యక్తులు ఆ కార్ లో ఎక్కారు.
ఎవరు వీళ్ళు అన్నది, తేజ్ ను చూస్తూ. మన వాళ్ళే అన్నాడు కానీ, చూడడానికి రౌడీల్లా అన్పించి, వాళ్ళని చూస్తూ అనుమానంగా, లేదు నేను దిగిపోతాను ఇక్కడ అన్నది శైలు.
వెంటనే, తన జేబులోంచి కర్చీఫ్ తీసి తన కళ్ళకు గంతలు కట్టి, నోటికి ప్లాస్టర్
వేసి, తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశాడు తేజ్. తను గిలగిలా కొట్టుకుంటున్న ఎవరికీ పట్టనట్లుగా ఉంది ఆ కార్లో ఉన్న వాళ్ళకి. అర్ధ గంట తర్వాత, కారు ఊరి చివర ఓ పాత బిల్డింగు వద్ద ఆగింది. శైలును కారులో నుంచి లోపలికి తీసుకువచ్చి, కళ్ళకు గంతలు తీసేసాడు తేజ్.
భయం భయంగా చూస్తున్న శైలు దగ్గరకు వచ్చి, సర్ప్రైజ్ బాగుందా అంటూ విషపు నవ్వు నవ్వుతూ, నువ్వేం కంగారు పడకు. ఇక నుంచి వీళ్ళు నిన్ను చూసుకుంటారు అంటూ నోటికున్న ప్లాస్టర్ను తీసేసాడు తేజ్.
ఎవరు వీళ్లు? నేనెక్కడున్నాను? ఎవరు వీళ్లంతా, ప్లీజ్ నన్ను తీసుకెళ్లి పో, ప్లీజ్ నాకు భయంగా ఉంది. నేనంటే ప్రాణం అన్నావుగా అంటూ ప్రాధేయపడుతున్న
శైలును,
చూడు బంగారం నేను నిన్ను ప్రేమించాను , అంటే నీ వయసును మాత్రమే. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా, చూడు, నీ వల్ల నాకు బోలెడు డబ్బులు కూడా వచ్చాయి. నా కన్నా వీళ్ళకే నీ అవసరం ఎక్కువగా ఉంది. అందుకే నిన్ను వీళ్ళకి అమ్మాను.
జోక్ కదా,.. అంది శైలు.
రేయ్ సరిగ్గా చూసుకోండి రా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతున్న తేజ్ ని,
రేయ్ వెధవా, నీ పెళ్ళాం పిల్లల్ని కూడా ఇంతే చేస్తావంట్రా అన్నది కోపంగా.
ఆ మాటకు, శైలు చెంప చెల్లుమనిపించాడు.
బ..రు. దానా .., అంటూ బూతులు తిడుతూ, నీకు వాళ్ళకి ఏం పోలికే , దిక్కూ మొక్కులేని దానివే నువ్వు.
ప్రేమన్నావ్, ప్రాణమన్నావ్ ! అంటే ఇదేనా అంది శైలు. అది నీ మీద నేను
పెట్టిన పెట్టుబడి. అంటూ వెకిలిగా నవ్వాడు. అంటే ఇదేనా నీ నిజ స్వరూపం. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నేను ముందే ఊహించాను రా వెధవా, గాలిస్షా!
ఆ పేరు వినగానే తేజ్ మొఖం ఎర్రబడింది. కోపంతో అంటే నీకు నా పేరు తెలుసా!
తెలుసుకున్నానురా. నువ్వు వెధవ్వే అనుకున్నా కానీ, నువ్వు ఇంత కసాయి వాడివనుకోలేదు. నేను నీతో వచ్చే ముందే, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే వచ్చాను రా, అనగానే,
ఎవరికి చెప్పావే, అని బలంగా శైలు గొంతు పట్టుకున్నాడు.
కెమెరా క్లిక్ మంది. వెనక్కు తిరిగి చూసాడు. పోలీసులు, ఆ వెనకనే మీడియా వాళ్ళు వచ్చారు.
అది చూసి, శైలును వదిలేశాడు.
ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒక క్షణం తేజ్ కు. పోలీసులు చుట్టుముట్టారు.
మీడియా వాళ్ళు కూడా వచ్చేసారు. పోలీసులు తేజ్ నీ, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. శైలు, తేజ్ కి దగ్గరగా వచ్చి, ప్రేమ పేరుతో ఇంత మోసం చేస్తావా? ఛీ నీచుడా మనిషి రూపంలో ఉన్న మృగానివిరా నువ్వు. నీకు యాక్సిడెంట్ అవ్వడం నాకు అదృష్టమైంది. లేదంటే నీ పెళ్ళి సంగతి నాకు తెలిసేది కాదు, నీ అసలు స్వరూపం , నీ మేక వన్నె పులి గురించి తెలుసుకోలేకపోయేదాన్ని, నీ పైన అనుమానం వచ్చిన వెంటనే నీ గురించి ఆరాలు తీసాను. పేర్లు మార్చి, ఆఫీసులు మారి ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేసావురా? నీలాంటి వాళ్ళు నాలుగ్గోడల మధ్య చావకూడదు. నాపై నువ్వు మోజు పడ్డావనుకున్నాను కానీ ఇలా అమ్మాయిల్ని మోసం చేసి అమ్మేస్తా వని కలలో కూడా ఊహించలేకపోయాను. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా పాల్పడే నీలాంటి వాళ్ళు ఎంత ప్రమాదకరమో ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది.
ప్రేమ అనే పదానికే నువ్వు కళంకం. నీ బాగు కోసం, నిన్ను బతికించుకోవాలని ఎంత ఆరాట పడ్డానో తెలుసా, కానీ ఇప్పుడు ఇలాంటి వాడు బ్రతికితే, నాలాంటి
అమ్మాయకుల్ని అడ్రస్ లేకుండా చేస్తావ్ నువ్వు. అలా జరగనివ్వను నేను. ఊరు నుంచి వచ్చింది, ఏం చేసినా ఊరుకుంటుందని అనుకుంటున్నావేమో , నీలాంటి వాళ్ళని ఉరికంబం ఎక్కించేదాకా ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
శైలు నీకేం కాలేదుగా అంటూ వెనుకనే వచ్చిన సరస్వతి మేడం ఇంకా తన
స్నేహితురాళ్ళ ను చూసి, మీరే లేకపోతే నేనేమైపోయేదాన్నో అని వాళ్ళని హత్తుకొని ఏడ్చింది శైలు.
ఇన్స్పెక్టర్, శైలు దగ్గరకు వచ్చి, ఇలాంటి ముఠాను పట్టించినందుకు చాలా
థాంక్స్. మీ ధైర్య సాహసాలు అసామాన్యం. మీరు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది, ఇంకా కోర్టులో కూడా సాక్ష్యం చెప్పడానికి మీరు రావాల్సి ఉంటుంది అన్నారు పోలీస్ ఇన్స్పెక్టర్.
వస్తాను సార్. ఇలాంటి వాళ్ళకు తప్పకుండా శిక్ష పడాలి, అంటూ విజయగర్వంతో
ముందుకు అడుగేసింది శైలు.
*****
చిలుకూరుఉషారాణి విజయవాడలో ఉన్న APGENCO లో Deputy Executive Engineer గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నచిన్న కవితలు, కొన్ని కథలు రాస్తుంటాను. వాటిలో కొన్నింటికి బహుమతులువచ్చాయి.
“అందం”అనేకథ, కస్తూరి పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమై, పుస్తకరూపంలో “టీనేజ్టిక్టాక్స్” గా అమెజాన్లో అందుబాటులో ఉంది.
ముందడుగు కథ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా మోసపోతున్నారో చెప్పడమే కాక దానికి పరిష్కారాన్ని కూడా సూచించారు
చక్కగా ఉంది
అభినందనలు ఉష గారు
ధన్యవాదములు అండి 🙏
ముందడుగు కథ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా మోసపోతున్నారో చెప్పడమే కాక దానికి పరిష్కారాన్ని కూడా సూచించారు
చక్కగా ఉంది
అభినందనలు ఉష గారు