వెనుతిరగని వెన్నెల(భాగం-10)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-10)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)

***

వెనుతిరగని వెన్నెల (భాగం-10)

డా||కె.గీత

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయమవుతుంది. ఇరు వైపులా పెద్ద వాళ్లు  ఒప్పుకుని  ఇద్దరికీ పెళ్లి చేస్తారు. తన్మయి అత్తవారింట్లో అడుగుపెడ్తుంది.

***


తన్మయికి మొదటి రాత్రి కాళరాత్రిగా ముద్రపడింది.  శేఖర్ భయానక ప్రవర్తన వల్ల అతనంటే భయం పట్టుకుంది.

ఇంటి నిండా చుట్టాల వల్ల తల్లితో ఎక్కువ సేపు మాట్లాడడానికి కుదరలేదు. మాట్లాడిన కాస్సేపూ కూతురికి నచ్చచెపుతూనే ఉంది జ్యోతి.

తన్మయికి అర్థమైంది ఇక ఎవరితో చెప్పీ, ఏవీ లాభం లేదు. అతని నుంచి తప్పించుకోవడానికి తనకున్నవి  రెండే మార్గాలు. ఒకటి ఆ గదిలోకి ఎలాగైనా వెళ్లకుండా ఉండడం లేదా అతనితో మాట్లాడడం.

సాయంత్రం కాగానే ముస్తాబు సమయం మొదలయ్యింది. జడగంటలు, మల్లెపూలు.

అంతా ఏం చెప్తున్నా వినకుండా పంజాబీ డ్రెస్సు వేసుకుంది తన్మయి. పిన్నిలు, అత్తయ్యలు గుసగుసగా నవ్వేరు.

రాత్రి భోజనాల దగ్గిర తన్మయి అటూ ఇటూ కలిపి లేచి వెళ్లిపోయింది. శేఖర్ తో తను ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంతా గమనిస్తున్నారేమోనని అనిపించింది. అయినా వెరవకుండా జ్యోతి ఇచ్చిన పాలు తాగి పుస్తకం పుచ్చుకుని శుభ్రంగా పక్క వేసిన గదిలోకి వెళ్లి కూచుంది. అంతా గుమ్మం వరకూ వచ్చి నవ్వులు మొదలెట్టేరు. పిన్ని మాత్రం తన బాధ గమనించినట్లు వచ్చి పక్కన కూచుని వెన్ను నిమిరింది.

“ఏంటమ్మా, అస్సలు అన్నం తినలేదు. రాత్రికి ఆకలేస్తేనో!” అంది.

ఆ మాత్రపు ఆప్యాయతకే తన్మయికి కళ్లల్లోంచి బొటబొటా నీళ్లు వచ్చేయి.

ఇలారా, అంటూ పక్కకు తీసుకెళ్లింది పిన్ని.”అయ్యో, ఇదేంటమ్మా, ఏవైంది?” అంది.

“ఏం కాలేదు పిన్నీ” అని కళ్లు తుడుచుకుంటూ అంది తన్మయి.

“నాకు అర్థమయ్యిందిలే…మీ అమ్మనొదిలి వెళ్లడానికేనా ఈ బాధంతా? అయినా ఎంత దూరం మీఅత్తగారి ఊరు? దగ్గరేగా, ఎప్పుడంటే అప్పుడు రావొచ్చు. కొత్త పెళ్ళికూతురివి, ఇలా ఏడవకూడదమ్మా” అంది పిన్ని.

“ఊ …” అంటూ తలూపింది తన్మయి.

“అన్నట్లు పొద్దున్న నువ్వు నిద్ర పోతున్నపుడు మీ ప్రెండు వనజ చెల్లెలు వచ్చి ఇది నీకు ఇమ్మంది అని మడత పెట్టిన కాగితం చేతిలో పెట్టింది”

ఒక్కసారిగా తన్మయికి మనస్సులో ఉన్న బాధ మొత్తం తొలగిపోయినట్లయ్యింది.

 

ప్రియమైన తనూ!

ఎలా ఉన్నావు? నీతో ఎన్నో సంగతులు చెప్పాల్సినవి ఉన్నాయి. కానీ అతి తక్కువ సమయం ఉంది. ఇవేళ మేం బయలుదేరుతున్నాం. నువ్వు నాతో వచ్చేస్తే ఎంత బావుణ్ణు అని ఎన్ని సార్లు అనిపిస్తూందో తెలుసా?  ఊ.. ఏం చేస్తాం? అవన్నీ జరిగేవి కావుగా. అన్నట్లు సుధా ఎంత మంచివాడో తెలుసా! అతనితో గడిపిన మొదటి రాత్రి  అతనెంత ఉదాత్తుడో అర్థమైంది. అపరిచిత వ్యక్తితో ఎలా గడుస్తుందోనని నేను ఎంత భయపడ్డానో తెలుసా! నా భయాలన్నీ పటాపంచలు చేస్తూ అతను నాకు మంచి స్నేహితుడయ్యాడు. శేఖర్ తో నీ కలల జీవితం  ఇంత కంటే గొప్పగా ప్రారంభమయ్యి ఉంటుంది.  ఆ విశేషాలన్నీ వినాలని ఉంది.  మనిద్దరం కొత్త ప్రపంచాలలోకి వెళ్లబోతూ ఉన్నాం. కొత్త జీవితాల్ని ప్రారంభించబోతూ ఉన్నాం. నాకు ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పలేను. నీకూ అలాగే ఉంటుందని నాకు తెలుసు.  సంతోషం  వెలిగే నీ ముఖంలో మెరిసే కళ్లతో  నువ్వు నాతో నీ కొత్త జీవితపు కబుర్లు చెబ్తూంటే  వినాలని ఎంత కుతూహలంగా ఉందో చెప్పలేను.  ఎప్పుడూ ధైర్యంగా ఉండు, నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఉత్తరం రాయి. నీ నించి ఉత్తరం అందుకోగానే మళ్లీ రాస్తానూ-

ప్రేమతో

నీ

వన

ఉత్తరం మూసేక గొప్ప ధైర్యం, ఉత్సాహం వచ్చేయి తన్మయికి.

గదిలోకి  ధైర్యంగా అడుగుపెట్టింది.

శేఖర్  వస్తూనే “ఇవేళ నాకు వొంట్లో బాలేదు”. అని ఖరాఖండీగా చెప్పేసింది.

“సరే, శుభ్రంగా పడుకో, ఇప్పుడెవరు నా దగ్గిరికి రమ్మన్నారు?” అని  నవ్వేడు శేఖర్.

“మరి… నిన్నెందుకు అలా వద్దన్నా వినిపించుకోలేదు?” అంది సీరియస్ గా.

“ఊ…అదన్న మాట సంగతి, ఇవేళంతా నాతో మాట్లాడకపోవడానికి కారణం” అన్నాడు ఇంకా నవ్వుతూ.

“నీకు తమాషాగా ఉంది. నువ్వంటే భయం పట్టుకుంది తెలుసా నాకు. అసలు….అసలు….” అంటూన్న తన్మయిని మధ్యలో ఆపి

“మొదటి రాత్రి గురించి మా స్నేహితులంతా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్లందరినీ నేనిప్పుడు అధిగమించాను.” అని ఆవులిస్తూ “నీకేం, ఇంచక్కగా రోజల్లా నిద్రపోయావ్, నాకు బాగా నిద్రొస్తూంది.” అని వెనక్కు తిరిగి పడుకున్నాడు శేఖర్.

తన్మయికి సిగ్గుతో చచ్చిపోయినట్లయ్యింది.

ఇతను స్నేహితుల ముందు గొప్ప చెప్పుకోవడం కోసం తనను అలా హింస పెట్టేడా?

“నా గురించి అసలు ఆలోచించేవా?” అని వెనుతిరిగి విసురుగా అడిగింది తన్మయి.

అప్పటికే శేఖర్ నిద్రలోకి జారుకున్నాడు.

అతని ఎదురుగా ముందు రోజు రాని దు:ఖం అప్పుడు వచ్చింది తన్మయికి.

కళ్ల నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేస్తున్నా ఆగని దు:ఖంతో సతమతమయ్యింది.

తెల్లవారి ఎర్రబారిన తన్మయి కళ్ళు చూసి ఇంత్లో అంతా వెనకే గుసగుసగా నవ్వుకోవడం చూసి విసుగు వచ్చింది తన్మయికి.

మూడు రాత్రుళ్లు కాగానే అత్తవారింటికి ప్రయాణం సన్నాహాలు మొదలయ్యాయి.

సారె కోసమని చలివిడి, స్వీట్లు, అరటి పళ్లు సర్దారు. తన్మయి తన సూట్ కేసులో వనజ తనకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చిన “అమృతం కురిసిన రాత్రి” మొదటగా పెట్టుకుంది. బట్టలతో బాటూ తన డైరీ, ఇష్టమైన పెన్నులు, చిన్న బుద్ధుడి బొమ్మ, నెమలి కన్ను సర్దుకుంది.

పుస్తకాల అరవైపు దిగులుగా చూసుకుంది. పెరట్లో మొక్కలన్నిటికీ దగ్గిరికి వెళ్లి వీడ్కోలు చెప్పింది. డాబా మీదికి వెళ్లి జాజి పొద దాపున కాసేపు కూచుంది. ఎందుకో బాల్యాన్ని ఆ ఇంట్లో వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్న దు:ఖం చుట్టుముట్టింది. నిస్త్రాణగా మోకాళ్ల మధ్య తల దాచుకుని వెక్కి వెక్కి పడింది. నిస్తేజంగా ఆకాశం మీంచి  భూమి వరకు పరికించింది. 

“కింద చుట్టాల్ని పెట్టుకుని అత్తవారింటికెళ్ళే ముందు ఇలా తీరిగ్గా డాబా మీదికొచ్చేవిటి?” తల్లి గదమాయింపు విని కిందికొచ్చింది.  

అత్తవారింటికి ఆ సాయంత్రం చేరుకోగానే “అలా కూచుంటావేంటి మా అమ్మ అక్కడ వంటింట్లో కష్ట పడ్తూ ఉంటే? వెళ్లు, సాయం చెయ్యి” అన్నాడు శేఖర్.

“రేపట్నుంచి చేస్తుందిలే, ఇవేళేగా వచ్చేరు” అంది దేవి మురిపెంగా కొడుకు వంక చూస్తూ.

“చెయ్యనియ్యి. వచ్చే వారంలో మేం వైజాగు వెళ్లిపోతాం కదే అమ్మా! నీకు కోడల్తో పనిచేయించే అవకాశం ఎక్కడ దొరుకుతుంది?” అన్నాడు శేఖర్.

తన్మయి శేఖర్ వైపు తెల్లబోయి చూసింది. వచ్చే వారంలో వైజాగ్ వెళ్తామన్న విషయం తనకు చెప్పనే లేదు.

“కొత్త కాపరానికి మంచాలు, కుంచాలు అవసరం రా.  మీ అత్తగారు లింగు, లింగుమని రెండు బిందెల సారె పెట్టి పంపించేసింది.” దేవి నిష్టూరాలు మొదలు పెట్టింది.

తన్మయికి అక్కడ నిమిషం కూడా ఉండాలనిపించడం లేదు. బయలుదేరే ముందు పిన్ని చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. “అక్కడ  మీ అత్తగారు వాళ్లు ఏం పరుషంగా మాట్లాడినా విననట్లు ఉండు. పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్లు కాదు. అన్నిటికీ ఓపిక పట్టమ్మా”. 

నిశ్శబ్దంగా  దేవి అప్పగించిన చపాతీల పని చేయడం మొదలుపెట్టింది తన్మయి. తన పక్కనే ఉన్న దేవి చేతల్లో విసురుతనం తన మీద ఉన్న అయిష్టత అని స్పష్టంగా తెలుస్తూంది.  

“సామాన్ల గురించి తనతో ఫోను మాట్లాడిస్తానులే….”  శేఖర్ తల్లితో మాట్లాడుతున్న మాటలు  బాధని కలిగిస్తున్నాయి తన్మయికి.

అక్కడున్న వారం రోజులూ ఉదయం నించి సాయంత్రం వరకూ దేవితో బాటూ వంటింట్లోనే  తన్మయి జీవితం. పగలల్లా శేఖర్ తండ్రితో బాటూ బయటికి వెళ్లిపోయే వాడు.

మధ్యాహ్న భోజనాలు కాగానే గిన్నెలు కడగడం, సాయంత్రం మళ్లీ రాత్రి వంటకి సన్నాహాలు.

మధ్యాహ్నం కాస్సేపు దేవి నిద్ర పోతుంది. ఆ సమయంలో తనకు దొరికే తీరికలో వనజకి ఉత్తరం రాసింది తన్మయి.

 “పోస్టాఫీసు ఎక్కడుంది అత్తయ్యా?” అంది.

దేవి ఆశ్చర్యంగా చూసి పోస్టాఫీసుకి మన ఇంట్లో ఆడవాళ్లు వెళ్లరు. శేఖర్ కి చెప్పి స్టాంపులు తెప్పించుకో. ఉత్తరం పోస్టు చెయ్యమని ఉదయం వాడికే ఇచ్చెయ్యక పోయావా?” అంది.

మర్నాడు పోస్టు చెయ్యమని శేఖర్ కి ఉత్తరం ఇచ్చింది. “ఇంత అర్జంటుగా స్నేహితురాలికి ఉత్తరాలు రాసెయ్యాలా? ఇక్కడున్నన్నాళ్లూ మా అమ్మకి సాయం చెయ్యడం తప్ప వేరే పని పెట్టుకోకు.” ఈ ఉత్తరాలు రాయడాలివన్నీ మనం వైజాగెళ్లేక తీరిగ్గా చేసుకో” అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి. 

అదెందుకంత పెద్ద సమస్యో అర్థం కాలేదు తన్మయికి. కానీ ఒక విధమైన ఉదాసీనత అలవాటు కావడం వల్లన తిరిగి ఏదీ అడక్కుండా నిశ్శబ్దంగా ఊరుకుంది. 

అత్తవారింట్లో సాయంత్రమయ్యి ఎంత పొద్దుపోయినా ఎవరూ నిద్ర పోరు.

తన్మయికి బాగా పెందరాళే నిద్ర పోవడం అలవాటేమో నిద్ర ఆపుకోవడం కష్టంగా తయారైంది.

రాత్రి భోజనాలయ్యేక ఇంటి ముందు బైకుల మీద కూచున్న మిత్రులతో గంటల తరబడి మాట్లాడుతూన్న శేఖర్ దగ్గిరికి  ధైర్యం చేసి  వెళ్లింది.

గేటు దగ్గిర తనని చూస్తూనే దగ్గిరికి వచ్చి “లోపలికి వెళ్లు, వస్తాలే” అన్నాడు మెల్లగా గొంతు తగ్గించి. 

మరో గంట తర్వాత వచ్చి “నువ్వలా పిలిస్తే  వచ్చేస్తాననుకున్నావా? నా స్నేహితులు  నన్ను పెళ్లాం కొంగు చాటు మొగుణ్ణని అనుకోరూ? ఇంకెప్పుడూ అలా నేను స్నేహితులతో మాట్లాడుతున్నపుడు మధ్యలో రాకు. నీకు నిద్రొస్తే నువ్వు పడుకో.” అన్నాడు.

“ముందు నేను పడుకోవచ్చా?” సందేహంగా అడిగింది తన్మయి. 

“ఇంచక్కగా.. మా అమ్మ పర్మిషనిస్తే ” అని వ్యంగ్యంగా నవ్వేడు.  

మర్నాడు వైజాగు వెళ్తారనగా జ్యోతి, భానుమూర్తి కూతురి కొత్తకాపురానికి సంచులతో సామాన్లు తీసుకుని  వచ్చేరు. మధ్యాహ్నం నించి భానుమూర్తి చెల్లెలు వరసయ్యే వాళ్లింటికి వెళ్లొస్తామని బయలుదేరేరు.

“మీ పెళ్లికి అందరూ చదివించిన  స్టీలు బొచ్చెలేవో తెచ్చిచ్చింది  మీ అత్తగారు. ఇంక వాటర్ ఫిల్టర్, కుక్కర్  లాంటివి  ఇంట్లో వాడేసిన పాతవి గామోసు తెచ్చింది. ఒక్కగానొక్క కూతురి కొత్త కాపరానికి కొత్త సామాన్లు కొనడానిక్కూడా చేతులు రావడం లేదు వీళ్లకి, ఇంక మంచాలు, కుంచాలేం పెడతారో…” అని రాగం తీసింది దేవి వాళ్లలా వెళ్లగానే.

“ఇదుగో వినబడిందా! మరో వారం రోజుల్లో వైజాగుకి మంచం, డ్రెస్సింగు టేబుల్ నవతా లో పంపమని చెప్పు మీ వాళ్లకి” అన్నాడు శేఖర్.

సాయంత్రం ఊరెళ్లే ముందు కూతురితో చెప్పెళ్లడానికి వచ్చేరు తన్మయి అమ్మా, నాన్నా.

తన్మయికి బాధని ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదు. “అదేంటమ్మా, మంచం అవీ తేలేదు? శేఖర్ వాళ్లేమో….” అనేదో చెప్పబోతుండగా 

జ్యోతి “చప్పున చేతి గాజులు తీసి కూతురి చేతిలో పెట్టి “ఇదుగో తల్లీ! మా దగ్గిర ఇక ఈ వస్తువులే మిగిలేయి. ఇవమ్మేసి మీకేం కావాలో కొనుక్కోండి.” అంది నిష్టూరంగా.

తన్మయి కళ్ళల్లో నీళ్ళు చూసి, భానుమూర్తి అనునయంగా “పిల్ల అసలే అత్తవారింట్లో బెంబేలుగా ఉంటే నీ వరసేవిటీ?”అని జ్యోతిని మందలించి “అవి మాట్లాడడానికే వెళ్లొచ్చేమమ్మా. మరో నాల్రోజుల్లో వైజాగులో మీ ఇంట్లో ఉంటాయి సామాన్లు. పరుపులూ గట్రా మీరు కొనుక్కోండి.” అన్నాడు.

“ఏం? పరుపులు ఏవన్నా మా తాత ఊరికే ఇస్తున్నాడా? చవకబారు మనుషులు” అని చీదరింపుగా అన్నాడు శేఖర్ వాళ్లు వెళ్ళేక. 

తన్మయికి దు:ఖ పడే స్థలం కూడా లేదు ఆ ఇంట్లో. మనసంతా బాధ పొరలు పొరలుగా పేరుకుపోతూంది.

తను కావాలని పట్టుబట్టి చేసుకున్న పెళ్లి గాబట్టి శేఖర్  తరఫు నించి ఏం బాధ వేసినా అంతా తనదే  తప్పన్నట్లు ఆలోచిస్తున్న తల్లిదండ్రుల మధ్య, తనని చేసుకోవడం వల్లనేదో నష్టపోయామని సాధిస్తున్న శేఖర్ వాళ్ల మధ్య అడకత్తెర లో పోక చెక్కలా నలిగిపోతూంది  తన్మయి.

వనజ గుర్తురాని క్షణం లేదు. తనూ ఇప్పుడే దూరంకావాలా తన దురదృష్టం కాకపోతే. 

మిగిలిన ఒకే ఒక్క ధైర్యమయిన కాగితం తీసుకుని  “అజ్ఞాత మిత్రమా!  నన్ను ఈ బాధల నించి బయటకు తీసుకురా” అని రాసింది. 

***

ఆ రోజు ఉదయపు రైలుకి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటల వేళకి వైజాగు చేరుకున్నారు.

“తన కలల నగరపు” స్టేషనులో దిగి నేల మీద అడుగుపెట్టగానే విచిత్ర అనుభూతికి లోనయ్యింది తన్మయి.

ఆటోలలో సామాన్లతో  శేఖర్ తాత గారి ఇంటికి వెళ్లేరు. ఆ సరికే మొహమంతా జిడ్డు పట్టినట్లయ్యింది తన్మయికి.

“ఇదేవిటీ, ఎంత తుడుచుకున్నా…” అంది అప్రయత్నంగా.

“వైజాగంటే ఏవిటనుకున్నావు మరి? ఉప్పుగాలి.” అన్నాడు శేఖర్.

శేఖర్ చిన్న మావయ్య భార్య లోపలి నించి వచ్చి “రండి, ప్రయాణం బాగా జరిగిందా?” అని ఇద్దరినీ పలకరించింది.

పెద్ద కాంపౌండులో  రెండు పోర్షన్ల ఇల్లు. 

“ఇందులో ఒక పోర్షనులో మా చిన్న మావయ్య, ఒక పోర్షనులో తాత గారు ఉంటారు.” అంటూ ఇంటి వెనకగా ఆనుకుని ఉన్న ఒంటిగది ఔట్ హౌసులో తెచ్చిన సామాన్లని పెట్టేడు శేఖర్.

“ఇదే మన ఇల్లు” అన్నాడు గదిని చూపిస్తూ. 

 తన్మయి చుట్టూ  చూసింది. మాసి పోయిన గోడలు, బూజు పట్టిన దూలాలతో ఉన్న చిన్న పెంకుల గది అది.

ఒక పక్కగా వంటకి గట్టు వేసి ఉంది. అటు బయట గుమ్మం దగ్గిరే కామన్ బాత్రూము కావడంతో లోపలికి వచ్చే దారి  చిత్తడిగా ఉంది.

తన్మయికి సామాన్ల వైపు తిరిగి చూసే సమయం కూడా ఇవ్వకుండా “మనమిలా వచ్చీ రాగానే గదిలో కూచుంటే బావోదు, నువ్వెళ్లి మా అత్తయ్యతో మాట్లాడుతూండు. నేను స్నానం చేసి వస్తాను. అన్నట్లు నా బట్టలు, సబ్బు, టవల్ అన్నీ బయటికి తీసిపెట్టి వెళ్లు.” అన్నాడు.

అలా జిడ్డోడుతూనే వెళ్లి “పిన్ని గారూ, నేనేవైనా చెయ్యనా?” అంది తన్మయి గొంతు సరిచేసుకుంటూ.

“హైమా ఆంటీ, అని పిలువు. ఇది వైజాగు. మీ పల్లెటూరు కాదు.” అని చిన్నగా నవ్వింది.

“ఊ…అమ్మాయ్, ఎలా ఉన్నాడు మీ ఆయన? నువ్వు చెప్పిన మాట వింటున్నాడా?” అన్నాడు అప్పుడే వచ్చిన శేఖర్ చిన్న మావయ్య శివ.

పళ్ళూడిపోయిన నోటితో గట్టిగా నువ్వుతూ “నువ్వూరుకోరా, పిల్లని మొదటే భయపెట్టకు.” అన్నాడు శేఖర్ తాతయ్య.

కొత్తా పాతా లేని వీళ్ల సంభాషణకి బిత్తర పడి కిందికి చూస్తూ నిలుచుంది తన్మయి.

“టీ తాగుతావా?” అంది హైమ గ్లాసొకటి తనకీ ఇస్తూ.

అడ్డంగా తలూపి “వద్దండీ” అంది.

అప్పుడే  స్నానం చేసి వచ్చిన శేఖర్ “థాంక్సాంటీ”  అని ఆ గ్లాసందుకుని చకచకా తాగి “రాత్రికి వస్తాను.” అంటూ బైకు స్టార్టు చేసుకుని వెళ్లిపోయేడు.

“నేనూ కాస్త స్నానం చేసి…” అని గొణిగి అక్కణ్ణించి తమ గదిలోకి వచ్చిపడింది తన్మయి.

గది తలుపు మూసుకోగానే ఎక్కడ లేని నిస్సత్తువ వచ్చినట్లయ్యింది. నేల మీద చాప వేసుకుని కూలబడింది. 

సూట్ కేసులోనుంచి డైరీ తీసి “ప్రియ అజ్ఞాత మిత్రమా! వచ్చేసేను నీ దగ్గిరికి….ఆకాశమై నా వెంట తిరిగే నీ కోసం సముద్రమై ఉప్పొంగడానికి సిద్ధమై వచ్చేసేను…అంటూ రాస్తూనే ఎలా నిద్రపోయిందో తెలీదు. 

గట్టి తలుపు చప్పుడుకి గభాలున లేచింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.