నా జీవన యానంలో- రెండవభాగం- 48
-కె.వరలక్ష్మి
2010 జనవరిలో కేరళటూర్ కి పిలుపు వచ్చింది. ఆ మధ్య నెల్లూరు రచయితల సమావేశానికి వచ్చిన కొందరు రచయితలు ఈ టూర్ ప్లాన్ చేసారట. ఎవరి ఖర్చులు వాళ్లేపెట్టుకోవాలి. వివరాలన్నీ ఫోన్ కి మెసేజ్ పెట్టేరు. వెళ్లాలని అన్పించింది. ఒకసారి మా ఆడపడుచు వాళ్లతోనూ, మరోసారి మా గీత తీసుకెళ్తేనూ రెండుసార్లు కేరళ వెళ్లేను. అప్పుడు చూసిన ప్రదేశాలు వేరు. సరే, వస్తానని వాళ్లకి తెలియజేసేను.
జనవరి 11 ఉదయం సామర్లకోటలో జన్మభూమి ఎక్కి మధ్యాహ్నం 12 కి విజయవాడ లో దిగి కేంటీన్లో వేడి వేడి పూరీ తిన్నాను. 7వ నెంబర్ ప్లాట్ ఫాం మీదికి వెళ్లి మిగిలిన వాళ్లను కలిసాను. నాతో కలిపి మొత్తం 9 మందిమి. 5 గురు ఆడవాళ్లం. వాళ్లలో ఎవరూ నాకు పూర్తిగా పరిచయస్తులు కారు. ఆ రోజు నెల్లూరు సభలో కలవడమే. తలా ఒక ఊరు నుంచి వచ్చారు. 2.45 కు కేరళ ఎక్స్ ప్రెస్ ఎక్కాం. డిన్నర్ అందరికీ పళ్లు, బిర్యానీ ఇచ్చారు. ఆంధ్రాలో ఉండగానే చీకటిపడింది. అలసటతో 8.30 కే నిద్రకు ఉపక్రమించేం. 12 ఉదయం 6.30 కి మెలకువ వచ్చేసరికి ట్రెయిన్ కేరళలో నడుస్తోంది. 9.30 కి ఎర్నాకుళం స్టేషన్లో దిగేం, టూరిజం ఆఫీసుకి చేరుకున్నాం. హోటల్ కార్తీక రెసిడెన్సీలో రూమ్స్ బుక్ చేసారు. స్నానాలు, భోజనాల తర్వాత కొంతదూరం నడిచీ, మరి కొంత దూరం ఆటోల్లోనూ ఎర్నాకుళం చూస్తూ తిరిగేం. 13 ఉదయం 8.30 కి బ్రెడ్ ఆమ్లెట్ & ఇడ్లీ తిని హోటల్ దగ్గరకు వచ్చిన టూరిజం బస్సు ఎక్కేం. కొచ్చిన్ హార్బర్లో దిగి బేక్ వాటర్స్ లో మోటారు బోట్లో ప్రయాణం. అద్బుతమైన జర్నీ. వొడ్డున ఉన్న బిల్డింగ్స్ ను గైడు పరిచయం చేస్తూ ఉంటే చూస్తూ – చైనీస్ ఫిష్షింగ్ నెట్స్ నీ, అరేబియా సముద్రాన్నీ తాకి వెనక్కి తిరిగివచ్చాం. మరో బోట్లో అవతలి వొడ్డుకు వెళ్లి 13వ శతాబ్దం నాటి డచ్ సిటీ అప్పటి డచ్ పీపుల్ నిర్మించుకొని నివసించిన భవనాలు, మ్యూజియమ్స్, చర్చిలు, ఆలయాలు అన్నీ చూసి తిరిగి మరో వొడ్డు కొచ్చి హోటల్లో కేరళ దుడ్డుబియ్యపు భోజనాలు చేసాం. లాంచి గైడు రామన్ కుట్టి అందరికీ ఆప్యాయంగా బైచెప్పేడు. ఉదయం మమ్మల్ని తీసుకెళ్లిన మినీ బస్సు డ్రైవరు దిల్ నాయర్ మంచి హుషారైనవాడు. ఇరవై అయిదేళ్లలోపు వయసు. స్పీడ్ డ్రైవింగ్. పాటలు, కబుర్లు, తెలుగు సినిమాల గురించి మాటలు. తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమట. మధ్యాహ్నం వేంబనది దాటి, కొచ్చిన్ దాటి ‘వల్లెత్తూర్’ చేరుకున్నాం. అక్కడ సన్నని గూటి పడవలో – అటూ ఇటూ చెట్లున్న కాలువలో ప్రయాణం. కాలువ లోంచి విశాలమైన నదిలో ప్రవేశించి, కొంతదూరం వెళ్లేక ఒడ్డున ఉన్న ‘తడవు’ విలేజ్, అక్కడి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చూసాం. పడవ నడిపిన తిలక్ మంచి సైలర్. నీటి లెవెల్లో, అంచుల వరకు మునిగిన చిన్న పడవలో ప్రయాణించడం అద్భుతమైన అనుభవం. అంత జలరాశి మధ్య ఒంటరిగా పయనిస్తే బహుశా నైరాశ్యం ఆవరిస్తుందేమో! తిరిగి దిల్ నాయరు బస్సు డ్రైవింగు. అందమైన, అద్భుతమైన ప్రాంతాలలో తిప్పి తీసుకొచ్చి గెస్ట్ హౌస్ దగ్గర దింపేడు. అందరికీ బైబైలు చెప్తూ షేక్ హేండ్స్ ఇస్తూ ఉంటే అతని కళ్లల్లో నీళ్లూరాయి. అది చూసి మా కళ్లల్లోనూ నీళ్లు.
14వ తేదీన స్థిమితంగా లేచి రెడీ అయ్యాం. 11 గంటలకి రైల్వే ట్రాక్ పక్కనున్న మ్యూజియం చూడ్డానికి వెళ్లేం. కేరళ స్టైల్ లో అద్భుతమైన ఉడెన్ కట్టడం. ఆ మ్యూజియం ఒక ప్రైవేటు వ్యక్తిది. గొప్ప అభిరుచి ఉన్న వ్యక్తి అతను, మంచి పురాతన మైన శిల్పాలు, వస్తువులు సేకరించాడు. 20 కోట్లు పైన ఖర్చైందట, డబ్బులు రావడం లేదు, ప్రభుత్వ సాయం లేదు అంటూ ఒకటే గోడు, జాలేసింది, కాని ఏం చెయ్యగలం? 3 గంటలకి గెస్ట్ హౌస్ దగ్గర్లో ఉన్న ఓ చెత్త రెస్టారెంట్లో భోజనాలు చేసి, ఇంకా మిగిలిన ఊళ్లో కాలినడకన తిరిగేం. రాత్రికి రోడ్డు పక్కన వేడి వేడిగా వేసి అమ్ముతున్న కొబ్బరి ఆపాల రుచిని ఆస్వాదిస్తూ కడుపు నింపుకొని హాయిగా నిద్రపోయాం. 15 ఉదయం 8.30 కిరూమ్స్ వెకేట్ చేసి ఎర్నాకుళం స్టేషన్లో తిరిగి ట్రైయినెక్కాం. రోజంతా కబుర్లు, కన్పించిందల్లా కొనుక్కు తినడం. ట్రెయిన్ రాత్రి 11 కి మద్రాసు వదిలేక నిద్రలకుపక్రమించేం, ఉదయం 6.45 కి విజయవాడ స్టేషన్లో దిగే సరికి ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రెడీగా ఉంది. ఆదరాబాదరా అందరికీ బైబై చెప్పేసి పరుగెత్తేను. సామర్లకోటలో దిగి బస్సు పట్టుకుని ఇంటికి చేరేసరికి 11.30 ఉదయం అయ్యింది. ఆ ప్రయాణం ఒక అందమైన అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చింది. మనసుకు గొప్ప ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇచ్చింది.
2010 జనవరిలో మా గీత నాకొక అనుకోని సర్ర్పైజ్ ఇచ్చింది. అదేమిటంటే నన్ను అమెరికా తీసుకెళ్లాలని, ఇది మాత్రం నిజంగానే గొప్ప సర్ర్పైజ్ నాకు, ఎందుకంటే ఇద్దరమూ టీచర్సే అయినా, ఇద్దరికీ ఒకేసారి సెలవులు వచ్చినా నా భర్తగారు నన్నెప్పుడూ ఎక్కడికీ వస్తావా అని అడగలేదు. ‘ఎవరిదారి వాళ్లది’ అని పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లగలిగే ధైర్యం ఆ రోజుల్లో లేదు. ఇక పెద్దయ్యాక, పెళ్లయ్యాక మా అబ్బాయి విషయానికి వస్తే దగ్గరలో ఉన్నారు కనకో ఏమో తన భార్య పుట్టింటి వాళ్లనే తిప్పుతాడు తన కారులో. ఇప్పుడు కూతురుగా పుట్టిన గీత ఇలా అనేసరికి ‘నిజమేనా?’ అని నమ్మలేకపోయాను. మొదటిసారి ఫ్లైట్ లో దూర ప్రయాణం కాబట్టి మా అబ్బాయి కూడా నాతో వచ్చేలా వీసా ప్రాసెస్ చేసిందట, ఆ జనవరిలో మా అబ్బాయి ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నాడు. వెళ్లేను.
హైదరాబాద్ లో ఉంటూ ఏదో వ్యాపారం చేసుకుంటున్న కె. రమణ అనే అబ్బాయి నా ‘కలకానిది – విలువైనది’ కథ చదివి నన్ను చూడాలని ఫోన్ చేసి వచ్చాడు. ఒక సెల్లో పెన్, బుట్టెడు యాపిల్స్ – కమలాలు పట్టుకుని వచ్చాడు. చాలా అభిమానంగా మాట్లాడేడు. నా పుస్తకాలు ఇచ్చి పంపేను.
ఫిబ్రవరి 6న అప్పటికి బేగంపేటలో ఉన్న అమెరికన్ ఎంబసీ ఆఫీసులో మా అబ్బాయీ, నేనూ అప్లికేషన్స్ ఇచ్చాం. మా అబ్బాయికి జూబ్లీ హిల్స్ లో ఏదో పని ఉంటే అటువెళ్లేం. తన పని చేసుకుని వచ్చేవరకూ నేను ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఉందామని వెళ్లేను. వీక్లీ ఎడిటర్ వసంత లక్ష్మి ఛాంబర్ లో జగన్నాధశర్మగారు కూడా ఉంటే చాలా సేపు వాళ్లతో కబుర్లు చెప్పుకొని, టీటైంకి వచ్చిన లెమన్ టీ తాగి, అక్బరు, దేవేంద్రాచారి లాంటి తెలిసిన వాళ్లందర్నీ పలకరించి వచ్చాను.
ఫిబ్రవరి 13న బేగంపేటలోని ఉషాకిరణ్ స్టూడియోలో ‘మనలో మనం’ తరఫున డిస్కషన్స్ ఉన్నాయంటే వెళ్లి పాల్గొన్నాను. అక్కడే చెప్పేరు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘మనలోమనం’ కార్యక్రమాలు వైజాగ్ లో జరుగుతాయని. విశాఖపట్నం మా ఊరు నుంచి మూడు గంటల ప్రయాణం. అందునా అరగంటకొక బస్సు ఉంటుంది కాబట్టి 27 ఉదయాన్నే బయలుదేరి డైరెక్ట్ గా ఆంధ్రాయూనివర్సిటీ అవుట్ గేట్ దగ్గరున్న టి.ఎల్.ఎన్. హాలుకి చేరుకున్నాను. ఉదయం ఇనాగరల్ పంక్షన్ జరిగింది. చాలా మంది ఉత్తరాంధ్ర సీనియర్, జూనియర్ రైటర్స్ ఇటు హైదరాబాద్ నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రచయితలంతా అటెండయ్యారు. లంచ్ టైంలో అందరూ నన్ను ఆత్మీయంగా పలకరించేరు. రాత్రి భోజనాల తర్వాత అందరికీ రూమ్స్ కేటాయించిన YMCA కి చేరుకున్నాం. నేనూ, గీతాంజలీ ఒక రూంలో ఉన్నాం. అందరం రోడ్డవతల ఉన్న బీచ్ కెళ్లి కెరటాల్లో ఆడి, తడిసి, పున్నమి వెన్నెల్లో రాత్రి ఒంటిగంట వరకూ రౌండ్ గా ఇసుకలో కూర్చుని డిస్కషన్స్ లో పాల్గొన్నాం. తెల్లవారి మేం లేచేసరికి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్లంతా సముద్ర కెరటాల్లో నానుతున్నారు. మేమూ కాస్సేపు ఇసుకలో నడిచి రూంకొచ్చి తయారై యూనివర్సిటీకి చేరుకున్నాం. కాఫీ, టిఫన్ల తర్వాత సభల్లో పాల్గొని, విని, చూసి ఎంజాయ్ చేసాం. సాయంత్రం వరకూ. సాయంకాలం మల్లీశ్వరి కూతురు చదువుతున్న స్కూలు పిల్లల ‘పల్లెల్లో సంక్రాంతి’ కార్యక్రమం చూసి రూమ్స్ కి తిరిగొచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్లంతా రాత్రి గరీబ్ రథ్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు. నేను ఆటోలో ఆర్.కె. బీచ్ కెళ్లి అక్కడి నుంచి బస్సులో సింహాచలంలోని మా ఆడపడుచుగారింటికెళ్లి రెండు రోజులుండి ఇంటికి చేరుకున్నాను. మార్చి 6వ తేదీ మధ్యాహ్నం RTV వాళ్లు ఇంటికొచ్చి మహిళాదినోత్సవం సందర్భంగా నా అభిప్రాయాలు రికార్డు చేసుకుని వెళ్లేరు. మార్చి 8న మా ఊరి MDO ఆఫీసులో UTF వాళ్లు నాతో బాటు మా ఊరి MEO, MDO, సర్పంచ్, హెడ్మాస్టర్స్ (అందరూ మహిళలే) ని సన్మానించేరు.
హైదరాబాద్ లో ఉషాకిరణ్ స్టూడియోలో షూటింగ్ కి వెళ్లినప్పుడు గుడిపాటి ‘పాలపిట్ట’ అనే కొత్త మంత్లీ ప్రారంభిస్తున్నాడని చెప్పుకొన్నారు. ఎవరో పత్రిక కోసం చందాలు కూడా వసూలు చేసారు. గుడిపాటి పాలపిట్టకోసం, ముంబైనుంచి సంగినేని రవీంద్ర ఆ ఉగాదికి తేబోతున్న కొత్త పత్రిక కోసమూ కథలు పంపమని అడిగేరు. విశాఖపట్నం నుంచి యం.వి.వి. సత్యన్నారాయణ, వాడపర్తి వెంకట్రమణగార్లు పోటీలో బహుమతి పొందిన నా ‘సహచరి’ కథ బావుందని, ఎందుకు బావుందో విశ్లేషిస్తూ ఉత్తరాలు రాసేరు.
మార్చి 17న హైదరాబాద్ లో వీసా ఇంటర్వ్యూకి అటెండయ్యాను. గీత చెప్పినట్టు చాలా ప్రిపేరై వెళ్తే రెండే ప్రశ్నలు వేసి వీసా ఓకే చేసేసారు. అమెరికా ఎందుకు వెళ్తున్నారు? మీ ఇంకో ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు? అంతే! మా అబ్బాయి రవికి మాత్రం వీసా రిజెక్టైంది. ఉద్యోగం కోసం వెళ్తే తప్ప, ఆ వయసువాళ్లకి వీసా రావడం కష్టమట.
‘మనలో మనం’ కి ప్రగతిశీల రచయిత్రుల వేదిక (ప్రరవే) అని పేరు మార్చేరు. ఏప్రెల్ 2 న హైదరాబాద్ లో మెహదీపట్నం దాటేక పద్మనాభనగర్ లో ఉన్న సమతా రోష్ని ఇంట్లో సమావేశం జరిగింది. చాలా దూరమే అయినా మా రవి ఓపికగా తీసుకెళ్లేడు. అంత తరచుగా సమావేశాలు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ ఏప్రెల్ 7వ తేదీన ప్రఖ్యాత రచయిత భరాగో విశాఖపట్నంలో కాలధర్మం చెందారు.
నవ్యవీక్లీ ‘నవ్య నీరాజనం’ పేరుతో ప్రఖ్యాత రచయితల ఇంటర్వ్యూలు ప్రచురిస్తోంది. జగన్నాధశర్మ (ఎడిటర్ – నవ్య) నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగేరు. దేవేంద్రాచారి నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు.
విపరీతంగా ఎండలు మండిస్తున్న ఆ ఏప్రెల్ నెలలో ఒక రోజు సాయంసంధ్యవేళ ఆకాశంలో సన్నని చంద్రరేఖ, పక్కనే జ్వాజ్వల్యమానంగా మెరిసిపోతున్న నక్షత్రం… అద్భుతమైన దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. దానికిందుగా ఫేక్టరీ పొగగొట్టంలో నుంచి వస్తున్న సన్నని పొగ, ఆ కింద కొబ్బరాకులు – ఓహ్! అప్పటికి ఆ ఇంట్లోకొచ్చి ఇరవైరెండేళ్లు కావస్తోంది, నా జీవితంలోని ఎన్నెన్నో కష్టాల్ని, సుఖాల్ని పంచుకున్న ఆ ఇల్లంటే నాకందుకే చెప్పలేనంత ఇష్టం. నాకు కావాల్సిన చిన్ని చిన్ని సదుపాయాలు, నాకిష్టమైన పూలమొక్కలు, పండ్లచెట్లు, వాటిని అపురూపంగా పెంచుకోవడం, నాకిష్టమైన చోట ఎక్కడైనా కూర్చుని చదువుకోవడం, రాసుకోవడం, చాలా చిన్ని చిన్ని ప్రకృతి దృశ్యాల్ని చూసి మురిసిపోవడం – నాదొక ప్రత్యేక ప్రపంచం ఆ ఇంట్లో.
కల్వకుర్తిలోని ప్రైవేట్ స్కూల్ టీచర్ వి.టి. రాజీవ్ (కేరళియన్) నా కథ ‘కలకానిది – విలువైనది’ ని మలయాళంలోకి అనువదించాడు. అది ప్రచురింపబడిన మలయాళమేగజైన్ ని నాకు పంపేడు. ఆ భాషలో అనువదించబడిన నా మొదటి కథ అది.
2010 లో ఎండలు మండిపోయాయి. ఉదయం సూర్యోదయానికి ముందు కూడా ఒక చల్లని తెమ్మెర వీచని గాడ్పులు. ఏప్రెల్ నాటికి నీటి కరువు కూడా అలముకుంది.
డైరెక్టర్ వంశీ (పెద్ద వంశీ) ‘సరదా సరదాగా’ సినిమా షూటింగ్ మాకు దగ్గర్లోని మన్యం ప్రాంతంలో ఉన్న సింగరమ్మ చింత దగ్గర జరుగుతోందట. ఆ రోజు షూటింగ్ ముగిసేక మా ఇంటికి వచ్చేడు, కాస్సేపు కబుర్లు చెప్పి రాజమండ్రి తన బసకి వెళ్లి పోయాడు. వెళ్లిన వెంటనే మళ్లీ ఫోన్ చేసి ‘‘ఈ రోజు మిమ్మల్ని చూడడం చాలా ఆనందం కలిగించింది. టేక్ కేర్ ఆఫ్ యూ’’ అన్నాడు. మాట్లాడిన లేదా చూసిన ప్రతి ఒక్కళ్లూ చూపించే ఆ ఆత్మీయత, అభిమానం నిజంగా గొప్పబలాన్ని ఇస్తుంది.
నేను అమెరికా వెళ్లడానికి మా గీత ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసేసిందట. ఆ ప్రయాణానికి నాందిగా మే 15 సాయంత్రం ఇంట్లోనుంచి బయలుదేరేను. గౌతమీ ఎక్స్ ప్రెస్ లో 16 ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో దిగేసరికి మా రవి వచ్చి ఇంటికి తీసుకెళ్లేడు.
నా ‘అతడు – నేను’ కథల పుస్తకం మీద యం.ఫిల్ చేస్తున్న స్రవంతి, ఆమె భర్త రామసుబ్బారెడ్డి కర్నూలు జిల్లా కోయిలకుంట్ల నుంచి నన్ను కలవాలని వచ్చారు. గోదావరి జిల్లా వరకూ రానక్కర్లేకుండా నేనే ఇక్కడ కలవమని చెప్పేను. చాలా వరకూ మేటర్ నా దగ్గరున్న జెరాక్స్ ఇచ్చాను. కథల గురించి అడిగి తెలుసుకుంది. రచయిత్రి అనే భయంతో వచ్చిన వాళ్లిద్దరూ సాయంత్రం ప్లెజెంట్గా వెళ్లేరు.
మే 22న నా ప్రయాణం. ముందురోజు రచయిత అచ్యుత రామయ్య ఫేమిలీతో వచ్చి గ్రీటింగ్స్ చెప్పి వెళ్లేడు. దగ్గర్లో ఉన్న తెలిసిన రచయితలు వచ్చి వెళ్లేరు. ఆ రోజు మా చిన్న తమ్ముడు కృష్ణ కూడా ఫేమిలీతో వచ్చాడు. మా కుటుంబం, వాళ్ల కుటుంబం రెండు కార్లలో షంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాం. బైటకారిడార్లో సినిమా యాక్టర్లు మంచు మనోజ్, శింబు, భూమిక, మంజుల కూతురు శ్రీదేవి వంటి సినిమాయాక్టర్లు కన్పించేసరికి పిల్లలు ఒకటే కేరింతలు. మొదటిసారి ఇంటర్నేషనల్ జర్నీ కదా! లోపల ఏదో తెలీని చిన్న టెన్షన్. నేను చెకిన్ అయ్యేవరకూ ఉండి మా వాళ్లంతా వెళ్లేరు. తర్వాత తెలిసింది ఆ రోజే బెంగుళూరులో చాలా పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందట. నేను భయపడతానని చెప్పలేదట. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లోపలికి చెకిన్ దాటి వెళ్లడం అదే మొదటిసారి. మొదట గేట్ నెం. 28, తర్వాత 26 లో కూర్చోమన్నారు. హైదరాబాద్ వెదర్ కారణంగా 7.55 కి బదులు ఫ్లైట్ 9.30 కి బయలుదేరుతుందట, లోపలంతా ఏసి, సన్నని మ్యూజిక్ – ఆహ్లాదంగా ఉంది, నన్ను చెక్ చేసిన అందమైన అస్సామీ అమ్మాయి చిరుకోపం (నేను నా లగేజ్ వైపే చూస్తున్నానని) తర్వాత చిన్న నవ్వు కూడా అందంగానే ఉన్నాయి. నేను తాగలేదు కాని, అక్కడి కాఫీ షాపులో షుగర్ లేని హాట్ కాఫీ 69 రూపాయలట అప్పటికి. గీత తెల్లవారు ఝామునే లేచిందట. రాత్రి 8 కి ఫోన్ చేసింది. నాకు ప్రయాణాలంటే ఉండే టెన్షన్ తనకి తెలుసు, నన్ను టెన్షన్ ఫ్రీ చెయ్యాలని తన ప్రయత్నం. 9.30 కి జెట్ ఫ్లైట్ బయలుదేరింది, 12 కి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఉన్నాను. 2.45 కి లుఫ్తాన్సా బృహద్విమానం రన్ వే మీద 15 నిమిషాలు పరుగెత్తి గాలిలోకి లేచింది, ఆకాశంలో అతి దగ్గరగా కన్పిస్తూ దశమి చందమామ మా విమానంతో పోటీ పడింది. ఓపికున్నంత సేపు ఆ అందాన్ని అలా చూస్తూ ఉండిపోయాను.
నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.