కలంతో ఆమె నేను

(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

-చిత్రాడ కిషోర్ కుమార్

ఆమె… నేను…
ఎలా ఉంటామో మాకే తెలియదు
కానీ ఆమె నన్ను చూస్తుంది
నేను కూడా ఆమెను చూస్తూనే ఉంటాను
చెట్లు చిగురిస్తున్నట్లు మాస్నేహమూ
కొత్త చిగురు తొడుగుతూనే ఉంది
కాలంతో మేమూ పరిగెడుతూనే ఉన్నాం

ఒకానొక కాలంలో
ఉత్తరాలలో కలుసుకునే వాళ్ళం
కబుర్లు కలబోసుకునే వాళ్ళం
బాధలు, బాధ్యతలు, వేడుకలూ
అన్నిమాటలూ మారాతల్లోనే…. అయినా
ఎన్నో తీపి గురుతులు
జ్ఞాపకాలుగా మా మనసుల్లో మిగిలేఉన్నాయి

ఇప్పుడు కాలం
కలుసుకునేంత దగ్గరకు చేర్చింది
ఆధునీకరణ అంతర్జాలప్రభావాలతో
మేమూ పోటీపడ్డాం
ఇప్పుడు చరవాణీలల్లో
ఉగాదులూ, ఉషస్సులూ, సందేశాలు… .అన్నీనూ
కలుసుకోవాలనిగాని చూసుకోవాలనిగాని
ఏనాడూ మాకు అనిపించలేదు
ఆ అవసరమూ రాలేదు
కానీ ఎదో తెలియని వెలితి
మదిలోకి చేరకుండానే
కాలంతో కరిగిపోతున్నాయి
ఒకప్పుడు ఒకర్నొకరం చూసుకోవాలని
అనిపించినా కలవలేకపోయాం
ఎందుకంటే ఆమె నేను చేరొకతీరం

కలంతోనే అన్నీ కలబోసుకునే మాకు
మళ్ళీ ఆ రోజులు రావని తెలిసినా
అలాంటి క్షణాల కోసం
కలంతో కాలాన్ని శాసిస్తూనే ఉన్నాం
ఒక తీరం నుండి ఆమె
మరో తీరం నుండి నేను

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.