యాదోంకి బారాత్-25

-వారాల ఆనంద్

 

ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/ మంచిదేనేమో…..
మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు
ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు
ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు
ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే
ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది
తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది

***

          బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి మలుపులోకి ఒకింత ఉత్సాహంగానే తిరిగాను. సమయం లేదు అన్న భావనేదో లోన ఎక్కడో నాకు తెలీకుం డానే పని చేసిందేమో. మనిషిగా భౌతికంగా అనేక పరిమితులకు లోబడినప్పటికీ చిత్రంగా నా సృజనాత్మక పరుగు వేగం పెరిగింది. రాతలు, ప్రచురణలు, కాలేజీలో ఆక్టివిటీస్ కొనసాగుతూనే వచ్చాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థు లకు ఎన్నారై ల సహకారంతో ఏర్పాటు చేసిన ‘ప్రతిభాపురస్కారాల ప్రదానం’ మా స్టాఫ్ సహకారంతో కొనసాగించాము. ఒక కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యుడు శ్రీ గంగుల కమలాకర్ అతిథిగా వచ్చారు. అప్పటికి ప్రిన్సిపాళ్లుగా డాక్టర్ మురలి, డాక్టర్ మధుసూదన్ రెడ్డిలు ఉద్యోగ విరమణ చేశారు. మిత్రుడు భౌతిక శాస్త్ర విభాగం ఇంచార్జ్ శ్రీ పి.నితిన్ ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు. నితిన్ నేనూ గతంలో ఒకసారి హైదరబాద్ లోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో మూడు వారాల పాటు రిఫ్రెషర్ కోర్సు చేశాము. రూమ్ మేట్స్ గా వున్నాం. ఆయన అత్యంత నిబద్దత కలిగిన వాడు. ఉద్యోగ బాధ్యతల్లో గానీ తన జీవన సరళిలో కానీ తాను విశ్వసించిన దాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిత్వం ఆయనది. అట్లా ఆయన కాలేజీ బాధ్యతల్ని నిర్వహిస్తు న్నప్పుడే పలు కార్యక్రమాలు నిర్వహించాము. ప్రతిభాపురస్కారాల్లో భాగంగా ఒక మెడల్, సర్టిఫికేట్, అయిదు వేల నగదు ఇచ్చేవారం. మొదట అది బయట టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రారంభించి మా కాలేజీకి తెచ్చాను. ఇక నా ఉద్యోగ విరమణకు ముందు లైబ్రరీ సైన్స్ కి సంబంధించి ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. మిత్రుడు శ్రీ చేగొని రవి కుమార్ చాలా ఆక్టివ్ గా వున్నాడు. ఆయన ఒక ప్రతిపాదన తెచ్చాడు‘COLLECTION DEVELOPMENT IN OPEN ACCESS ERA’అన్న అంశం మీద రాష్ట్ర స్థాయిలో సెమినార్ నిర్వహించాలనుకున్నాం. దానికి ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ ప్రొఫెస్సర్ డాక్టర్ లక్ష్మణ రావు గారిని ప్రధాన వక్తగా పిలిచాము. ఆయన నాకు బి.ఎల్.ఐ.ఎస్సీ. ఏం.ఎల్.ఐ.ఎస్సీ రెండు కోర్సుల్లో టీచర్. కాటలాగింగ్, ఇన్ఫర్మే షన్ సైన్స్ లల్లో ప్రభావవంతంగా బోధించారు. ఆ రోజుల్లో ఏ.ఏ.ఎన్.రాజు, వేణుగోపాల్, సుదర్శన్ రావు, విశ్వమోహన్ లు ఆచార్యులుగా వుండేవారు. మా కాలేజీలో అంతకు ముందెప్పుడో నిర్వహించిన రెండు జాతీయ స్థాయి సెమినార్స్ కి కూడా శ్రీ లక్ష్మణ రావు నాకు మార్గ నిర్దేశకత్వం చేశారు. అట్లా నా రిటైర్మెంట్ కి రోజులు దగ్గరపడ్డప్పటికీ ఆరోగ్య షరతులకు జాగ్రత్తలకు లోబడి ఉత్సాహంగానే అన్ని కార్యక్రమాల్ని నిర్వహించాను. మిత్రులు ఏర్పాటు చేసిన వాటిలో క్రమం తప్పకుండా పాలు పంచుకుంటూనే వున్నాను. అదట్లా వుండగానే 2016 మార్చ్ లో హైదరబాద్ గ్లోబల్ ఆసుపత్రి నిర్వహణలో గ్లోబల్ కిడ్నీ సప్పోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేశారు. నా నెఫ్రాలజీ డాక్టర్ గందే శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన గ్రూప్లో ఉత్సాహంగా పాలు పంచుకున్నాను. కరీంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశాం. మా ఫిల్మ్ భవన్ నిర్మాణం కాక ముందు తెలంగాణ రచయి తల వేదిక ఏర్పాటుతో పాటు నా ‘సినీ సుమాలు’,’24ఫ్రేమ్స్’ పుస్తకాల ఆవిష్కరణ లాంటి అనేక సమావేశాలకు ప్రెస్ క్లబ్ ప్రధాన వేదికగా వుండేది. జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్మాణ మయి అందరికీ అందుబాటులో వున్న వేదిక ప్రెస్ భవన్. ప్రెస్ భవన్ అనగానే జీవగడ్డ విజయ్ కుమార్ గుర్తొస్తాడు.

***

          ఇక మా కుటుంబం విషయానికి వస్తే రేల తన సాఫ్ట్ వేర్ ఉద్యోగం క్రమబద్దంగా చేస్తూనే వుంది. ఇందిర ఎజెండా ప్రధానంగా నేనూ నా ఆరోగ్యం. అంతేకాదు ఎన్నో జాగ్రత్తలు. నిలబడితే కూర్చుంటే హెచ్చరికలు చేస్తూ నియంత్రించడం. ఎందుకంటే మనం అంత సులువయిన వాళ్ళం కాదు కదా. చెట్టు దాకా వెళ్లమంటే చెట్టు ఎక్కేసే రకం. ఆ ఏమయితదిలే అనుకునే మనస్తత్వం. ఇందిరే క్షణక్షణం కట్టె పట్టుకోకుండానే హెచ్చరికలు చేస్తూ వచ్చింది. ఇక మా అబ్బాయి అన్వేష్. హైదరబాద్ లో యింటర్ తర్వాత ఎంట్రన్స్ రాసి తిరువనంతపురంలో వున్న ఐ.ఐ.ఎస్.టి.INDIAN INSTITUTE OF SPACE SCIENCE AND TECHNALAGY లో సీటు తెచ్చుకుని ఏవియానిక్స్ లో చేరాడు. నాలుగేళ్ల చదువు పూర్తి అయిన తర్వాత నేను హాస్పిటల్ లో వుండగానే నాన్నా నేను వచ్చేస్తున్నా అన్నాడు ఫోన్లో. సరే రా అన్నాను. అముంది లాగేజీతో పాటు దిగిపోయాడు. ఏమయింది అంటే నాకా 9-5 జాబ్ ఇష్టం లేదు నేను క్రియేటివ్ రంగంలోకి వెళ్తాను అన్నాడు. ఇందిర మిగతా అంతా కంగారు పడ్డారు. నేను క్షణం ఆలోచించకుండా ఎవరయినా తన కిష్టం అయిన పనిలోనే సంతోషంగా వుంటారు. మనిషికి కావలసింది సుఖం కాదు సంతోషం అన్నాను. అప్పుడే నానిగాడి మీద ఇట్లా రాసుకున్నాను

          “ఇన్నాళ్లూ వాడు నాకార్థం కాలే/ అవును ఎవరయినా ఎందుకు అర్థం అవుతారు/ మనం ప్రయత్నిస్తే కదా/ గుండెల మీద పడుకున్ననాడూ, చిటికేన వేలు పట్టుకుని నడిచిననాడూ/ జబ్బకు సంచీ వేసుకుని స్కూలుకు వెళ్ళిన నాడూ/ ముద్దు మురిపాల ముచ్చట్లే కదా/ ఆనాడు మనకేం అర్థం అవుతాడు… పరీక్షలూ మార్కులూ సీట్లూ ఈ గొడవలో పడ్డప్పుడూ వాడు నాకార్థం కాలే/ కానీ ఇప్పుడు ‘అంతరిక్షం నుంచి సృజన వైపు వాడి ప్రయాణం/ సారీ రా నానీ నువ్వు అర్థం కాలేదనుకున్నా /కానీ నేనే నిన్నర్థం చేసుకోలేదు..

నా కలలూ నీ కలలూ ప్రోది చేసుకుని/ విశ్వంలోకి దూసుకెళ్లు
నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు’ (మనిషి లోపల)
అన్వేష్ మొదట డ్రాయింగ్,పెయింటింగ్ తర్వాత ఎనిమేషన్ ఇట్లా దృశ్య మాధ్యమం లోనే కాలు మోపాడు. ఏనిమేషన్ లో మిత్రుడు కళ్యాణం శ్రీనివాస్ తో కొంతకాలం నడిచాడు. కానీ వాడి దృష్టి అంతా ‘మూవింగ్ ఇమేజెశ్’ పైనే. కెమెరా పట్టుకుని తిరగడం. మొదట స్టిల్ ఫోటోస్. సిరిసిల్లా వెళ్ళి మిత్రుడు జర్నలిస్ట్ టీ.వీ.నారాయణతో కలిసి తిరిగి నేత కార్మికులు నేత పని పరిశ్రమల పైన ఒక సిరీస్ తీశాడు. తర్వాత ‘తెలంగాణ పట్నం’. దాని గురించి నేనూ ఇందిర చెప్పగానే మా దగ్గరి ఫామిలీ మిత్రులు లావణ్య రాజయ్య సార్ వాళ్ళ వూరు గంగాధరలో పట్నం పండుగ బాగా చేస్తారని అనగానే రేల అన్వేష్ లు ఇద్దరూ వెంటనే అక్కడికి వెళ్లారు. పట్నం ఉత్సవాన్ని మొత్తం కలర్ ఫుల్ గా షూట్ చేశాడు. చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ మ్యూజిక్ చేశాక అన్వేష్ పైన నా నమ్మకం రెట్టింపు అయింది. ఇదిలా వుండగానే నాకు అత్యంత దగ్గరి మిత్రుడూసుప్రసిద్ద కవీ శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య పైన ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది అన్నాను. సరే వెళ్దాం అన్నాడు అన్వేష్. నేను అమెరికా వెళ్తున్నాను ఈలోగా చేయ గలిగితే చాలా బాగుంటుంది అన్నాడు దర్భశయనం. నేనూ ఇందిర అన్వేష్ హనుమ కొండ వెళ్ళాం. నిజానికి కవిత్వం రాయడం ఎంతో కవిత్వ పఠనం అంతకంటే గొప్ప కళ. అందులో ప్రతిబావంతుడు దర్భశయనం. ఇంకేముంది కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరణలోనూ, తర్వాత రామప్ప కూ వెళ్ళి షూట్ చేశాము. రామప్పకూ నేనూ ఇందిరా అన్వేష్, ధర్భశయనంలతో పాటు ఆయన సతీమణి కమల గారు కూడా వచ్చారు. అట్లా షూట్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ కూడా చేశాడు అన్వేష్. తర్వాత 8 నవంబర్ 2015 న కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో ఆవిష్కరణ చేశాము. మా మిత్రుడు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. దాస్యం సేనాధిపతి, ముజాఫ్ఫర్ తదితరులు హాజరయ్యారు. ఆ నాటి కార్యక్రమానికి మిత్రులు ఏం.గంగాధర్, అన్నవరం దేవేందర్, పొన్నం, ఆర్.వెంకటేశ్వర్ రావు తదితర మిత్రులు అనేక మంది పాల్గొన్నారు. అట్లా ఆనాటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. డాక్యుమెంటరీ ప్రొజెక్షన్ కూడా వేశాం. పట్నం,

బతుకే ఒక కళలతో అన్వేష్ ఫిల్మ్ మేకింగ్ మొదలయింది. ఆ తర్వాత హైదరబాద్ లో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్వేష్ తీసిన పట్నం డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించారు.

          ఇక తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక లఘు చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫిల్మ్ భవన్లో జరిగిన ఆ కార్యక్రమంలో ముద్దసాని రామిరెడ్డి, యాది సదాశివ, శివపార్వతులు, పట్నం ఫిల్మ్స్ ని ప్రదర్శించారు. ఆనాటి కార్యక్రమానికి డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షత వహించగా, కామారెడ్డి శంకర్, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తదితరులు హాజరయ్యారు. అదే కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక వేదికను కూడా ఏర్పాటు చేసాము.‘యవనిక’ పేర ఏర్పాటయిన ఆ వేదిక ద్వారా తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ని సేకరించాలని, ఫిల్మ్ మేకర్స్ ని ఒకే వేదిక మీదికి తేవాలని ఆలోచన చేశాం. తర్వాతి కాలంలో యవనిక ఏదో కొంత కృషి చేసినప్పటికీ అనుకున్న రీతిలో కొనసాగించలేక పోయాం. నేనేమో యవనిక పేర సమాంత సినిమాల పైన సమీక్షలు, పరిచయాలు చేసి నా యూ ట్యూబ్ చానల్ Aksharala Thera By Varala Anand లో ప్రెసెంట్ చేశాను.

          అన్వేష్ డాక్యుమెంటరీల ప్రస్థానం ఆ విధంగా మొదలయింది. కానీ సినిమాటోగ్రఫీ లో గొప్ప ఇన్సిట్యూట్ లో చదవితే కానీ ఫలితం వుండదన్నాను. దానికోసం అన్వేష్ మొదట హైదరబాద్ లోని శ్రీ వాణి గారి కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కోల్కట్టాలోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశానికి ఎంట్రన్స్ రాశాడు. రెండింటిలోనూ ప్రథముడిగా నిలిచి సీటు పొందాడు. మిత్రుల సూచన మేరకు కోల్కట్టాలో చేరాడు. ఆ వివరాలు మళ్ళీ రాస్తాను.

          ఇక నా ‘మనిషి లోపల’ కవితా సంకలనాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే పనిని ఆత్మీయురాలు బొడ్ల అనురాధ చేపట్టారు. విజయవంతంగా SIGNATURE OF LOVE పేర పుస్తకం తెచ్చారు. ఆవివరాలతో మళ్ళీ  కలుస్తాను…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.