నా జీవన యానంలో- రెండవభాగం- 49
-కె.వరలక్ష్మి
మెలకువ వచ్చేసరికి విండోలోంచి అద్భుతమైన దృశ్యం. మేఘాలకి పైన, 38 వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్లైట్. నీలిరంగు మీద దూది పింజలు పేర్చినట్టు, మంచుతో ఆకాశంలో పర్వతాల్ని భవనాల్ని తీర్చి దిద్దినట్టు ఉంది దృశ్యం. మొదటి సూర్యకిరణం వెనకనుంచి విమానం ఎడమ రెక్కమీద ఒక అంగుళం మేర మెరిసి క్రమక్రమంగా పెరిగింది. ‘‘మేఘాలను దాటి ఇంతపైకి వచ్చిన ఈ అనుభూతిని దాచుకోడానికి ఒక్క గుండె చాలదు’’ అన్పించింది. ఇండియన్ టైం 11 AM కి ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో దిగేను. గేట్ నెం. 55 లో చెకిన్ అయ్యి యు.యస్. వెళ్లే ఫ్లైట్ కోసం వెయిటింగ్. నన్ను ఎలాంటి చెకింగ్ చెయ్యలేదు. అలా కూర్చోమని ఎదుట ఉన్న ఛెయిర్స్ చూపించారు. తర్వాత, కొంతమందిని వాళ్లు చెక్ చేస్తున్న విధానం చూస్తే అర్థమైంది అక్కడ చెకింగ్ ఎంత స్ట్రిక్ట్ గా జరుగుతోందో! జర్మన్ టైం 9.55 AM కి 454 ఫ్లైట్ ఎనౌన్స్ చేసారు. కానీ ఎక్కేక కదలడానికి చాలా డిలే అయ్యింది. ఈసారి విండో పక్క సీటుకాక బైట ఏమీ చూడలేకపోయాను. వేళ తెలియని భోజనాలు, టిఫిన్లు, కూల్ డ్రింక్స్ తో, టైం ఛేంజ్ తో ఆకలి తెలియలేదు. అంత పుల్లగా ఉంటుందని తెలీక తాగిన ఆరెంజ్ జూస్ తో భరించ రాని వెన్ను నొప్పి పట్టుకుంది.
ఎన్నిగంటలు ఫ్లైట్ ప్రయాణించిందో తెలీలేదు. కాలిఫోర్నియన్ టైం 1.30 PM కి శాన్ ఫ్రాన్సిస్కోలో లేండైంది. చెకింగ్, లగేజ్ పికప్ కొంత టైం పట్టింది. బైటికొచ్చేసరికి గీత ఎదురొచ్చి కౌగలించుకుంది. పిల్లలు పరుగెత్తుకొచ్చారు. కోమల్ చేతులు చాచి పట్టేసుకున్నాడు, వరూధిని ఎప్పట్లాగే సిగ్గుపడుతూ కోమల్ వెనక దాక్కుంది. గీత వాళ్ల బ్లేక్ వోక్స్ వేగన్ జెట్టాలో మౌంటెన్ వ్యూ, ఈజీ స్ట్రీట్ లోని వాళ్లింటికి చేరుకున్నాం. ఇంటి పక్కనే రోడ్డు. ఆగి ఆగి వెళ్లే కార్లు. మొత్తం మీద సైలెంట్ గా ఉన్న ప్రశాంతమైన ప్లేస్.
ఢిల్లీ వదిలేక నీళ్లువాడని టాయ్ లెట్స్. ఎంత చికాకన్పించిందో చెప్పలేను. ఇంటికొచ్చాక రుద్దుకొని రుద్దుకొని వేడినీళ్ల స్నానం చేస్తేకాని నా వొళ్లు నాకే ‘యాక్’ అన్పించింది.
గీత, పిల్లలు నా పక్కనే కూర్చుని కబుర్లు చెప్తున్నా నాకింకా విమానంలో ఉన్నట్టే ఉంది. గీత కొసరి కొసరి తిన్పించబోయింది. ఓ గుప్పెడు అన్నం తిన్నానన్పించి కళ్లు మూతలు పడిపోతూంటే మంచం మీద వాలిపోయేను. రాత్రి పదికి, బహుశా ఇండియాలో ఉదయం 9.30 కావచ్చు మా అబ్బాయి రవి ఆన్ లైన్లో కొస్తే అందరూ మాట్లాడుతూండడంతో మెలకువ వచ్చింది. కానీ ఐదు నిమిషాలు కూడా మెలకువగా ఉండలేక మళ్లీ నిద్రపోయాను. రాత్రి 3 కి మెలకువ వచ్చేసి ఇంక నిద్ర పట్టలేదు. నేనెళ్లిన మే నెలలో అక్కడ రాత్రి 8 వరకూ చీకటి కాలేదు. 3 గంటలకే వెలుతురు వచ్చేసింది. ఇండియాలో అది 24 ఉదయం. అమెరికాలో 23 రాత్రి.
ఉదయం 8 కి సత్య, పిల్లలు బైటికెళ్లిపోయేరు. గీత చేసిన వేడి వేడి జీడిపప్పు ఉప్మా చూసి ప్రాణం లేచొచ్చింది. చెర్రీ పళ్లు తియ్యగా చాలా బావున్నాయి. అక్కడ దొరికే చిక్కని పాలలో కాఫీపొడి కలిపి చేసిన వేడి కాఫీ తాగేక ప్రయాణపు బడలిక తీరినట్టైంది, మధ్యాహ్నం 2.30 కి స్కూలుకెళ్లి వరూధినిని తీసుకొచ్చేం. సాయంకాలం 7 కి కోమల్ కాలేజ్ లో గేమ్స్ అవార్డు ఫంక్షన్ కి వెళ్లి కోమల్ అవార్డు అందుకోవడం చూసేం. అక్కడి స్కూల్స్ ఎంత నీట్ గా ఉన్నాయంటే ఒక్క కాయితం ముక్కగానీ, ఎండిన ఆకుగానీ ఎక్కడా కన్పించలేదు. గోడలు మెరిసిపోతూ ఉన్నాయి. అంతా సిస్టమేటిక్ గా ఉంది. కానీ, పిల్లలు మాత్రం – ముఖ్యంగా తెల్లవాళ్లు చాలా ఫ్రీగా ఉన్నారు. పేరెంట్స్ తెచ్చిన ఫుడ్ పేకెట్స్ విప్పుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు తినేయడమే. లెక్చరర్స్ కి గౌరవం ఇవ్వడం లాంటిదేమీ లేదు. ఎవరిష్టం వాళ్లది. బైట లాన్ లో అమ్మాయిలు అబ్బాయిలు దగ్గర దగ్గరగా పడుకొని లేదా హత్తుకుని గోడలకు చేరబడి కబుర్లు చెప్పుకోవడం. రహస్య మేమీ లేదు. కోమల్ లాంటి ఇండియన్ పిల్లలు ఎటు మొగ్గాలో తెలీక సైలెంట్ గా కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
అప్పటికే అక్కడ E మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. సత్య కంప్యూటర్ ఆర్డర్ చేస్తే ముందు కార్డు నుంచి డబ్బు కట్ చేసుకుని CPU ఒక్కటే పంపేరట. గీత 250 డాలర్లకి కొన్న వస్తువు సరైన సైజ్ ఇవ్వలేదని మార్చమంటే, అడిగిన సైజ్ లేదని 3 డాలర్లు తిరిగి ఇస్తానన్నాడట. గీత నాకు జెట్ లాగ్ లేకుండా చెయ్యడానికి, అక్కడి వాతావరణానికి అలవాటు చెయ్యడానికి మౌంటెన్ వ్యూలోని, సన్నీవేల్ లోని మాల్స్ లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రోసరీస్ కొనడానికి తన వెంట తీసుకెళ్తూ ఉండేది. అందమైన చెట్లు, బ్యూటిఫుల్ గార్డెన్స్ అండ్ ఫ్లవర్స్ తో నిండిన రోడ్లు ఎంతో బావుండేవి. ప్రశాంతమైన వాతావరణం. హాయిగా శాంతంగా ఉంది జీవితం అన్పించింది నాకైతే!
పక్క ఫ్లాట్ లోని ఇరానియన్ అండ్ మంగోలియన్ దంపతులకి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు సీనాకి 3-1/2 సం.లు. చిన్నవాడు ఆర్యకి 6 నెలలు. ఆ రోజు వరూకి మధ్యాహ్నం వరకే స్కూలు, వరూ ఇంట్లో ఉందంటే సీనా ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు, వరూ వాడికి ఫ్రిజ్ లోంచి చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ లాంటివి తీసి ఇస్తూ ఉంటుంది. ఆ రోజు వాడికి కత్తెర దొరికినట్టుంది. గీత వాళ్ల బెడ్ రూంలోకెళ్లి మంచం మీది దుప్పటిని దొరికిన చోటల్లా కత్తిరించేసాడు. గీత వరూమీద అరవబోయి దిగమింగుకుంది. అక్కడ పిల్లలమీద కోప్పడకూడదట, సీనాగాడు క్యూట్ బోయ్. వాడు కేక్స్, ఫ్రూట్స్ గీత నుంచి తీసుకోడానికి ఎన్ని మేజిక్కులైనా చేస్తాడు. ‘నేను బ్రూస్లీని’ అంటూ ఒక కాలు పైకెత్తి ఫైటింగ్ లా గెంతుతుంటాడు, చిన్ని చిన్ని మంగోలియన్ కళ్లు వాడు నవ్వితే మూసుకుపోతుంటాయి, పళ్లు పుచ్చిపోయి పై పన్ను ఒక్కటే మిగిలింది. ఎప్పుడూ ప్లెజెంట్ గా ఉండి, ఒకటే నవ్విస్తూంటాడు.
నేనెళ్లిన వారం రోజులకి కొంత ఎండ, కొద్దిగా వేడి వచ్చాయి. మధ్యాహ్నం 3 కి మౌంటెన్ వ్యూ సిటీ పబ్లిక్ లైబ్రరీకి వెళ్లేం. చాలా పెద్ద భవనంలో చక్కగా తీర్చిదిద్దినట్టు సర్దిన బుక్స్, కేసెట్లు, సిడిలు, డివిడిలు వగైరాలు, పెద్దగార్డెన్, అందమైన పరిసరాలు. లైబ్రరీలో బోలెడంతమంది జనం ఉన్నా చీమచిటుక్కుమన్నా విన్పించేంత సైలెంట్ గా ఉంది. శుభ్రత విషయం చెప్పనక్కర్లేదు, రోడ్డు మీద నడిచే వాళ్లైనా చెట్టు నుంచి రాలి పడిన ఒక ఆకు కన్పించినా తీసి డస్ట్ బిన్ లో వేస్తున్నారు, అందుకే అక్కడంత శుభ్రంగా ఉంది. మనదేశంలో తియ్యడం మాట దేవుడెరుగు చెత్తా చెదారం రోడ్లమీద వేసేస్తారు కదా! హైదరాబాద్ వంటి సిటీల్లో అయితే మరీ ఘోరంగా రోడ్లపైనా, గోడలపైనా ఉమ్ము తుంటారు. లైబ్రరీ నుంచి కొన్ని బుక్స్, సిడిలు ఇంటికి తెచ్చుకున్నాం. వాటిని తిరిగి ఇవ్వడానికి వారం రోజులు టైం ఉంటుంది. ఇంకా చదవకపోతే వారం తర్వాత వెళ్లి మళ్లీ రాయించుకోవాలి. సాయంకాలం సత్యనీ, పిల్లల్నీ ఇంటి దగ్గర దిగబెట్టి గీతా నేనూ సన్నీవేల్ టెంపుల్ హాల్లో జరుగుతున్న అన్నమాచార్య సంకీర్తన అండ్ నాట్యం కార్యక్రమానికి వెళ్లేం. ఆడవాళ్లు పట్టుచీరల్లో, మగవాళ్లు ధోవతుల్లో, పిల్లలు కూచిపూడి, భరతనాట్యం ఆహార్యాల్లో ఉన్నారు. ఆ కార్యక్రమానికి వచ్చిన సిలికానాంధ్ర ప్రెసిడెంటుకి గీత నన్ను పరిచయం చేసింది, ఆయన వెంటనే జూన్ 19న జరగబోయే సాహిత్యసదస్సు లో నన్ను వక్తగా పాల్గోమని ఆహ్వానించేరు.
మరో రోజు మా అబ్బాయి ఫోన్ చేసి ఆర్.యస్. కృష్ణమూర్తి కథల పోటీలో నా కథలకి మొదటి, మూడవ బహుమతులు వచ్చాయని కన్వీనర్ మూర్తిగారు ఫోన్ చేసి చెప్పేరని అన్నాడు.
జూన్ మొదటివారంలో నవ్య వీక్లీలో ‘నవ్య నీరాజనం’ శీర్షికలో నా ఇంటర్వ్యూ వస్తోందని, నేనిచ్చిన ‘మట్టి – బంగారం’ కథ పెద్దదిగా ఉండడం వల్ల ‘గాజుపళ్లెం’ కథను వేస్తున్నామని, కథానేపథ్యం పంపమని దేవేంద్రాచారి ఫోన్ చేసాడు. మేం అదేరోజు శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం పెట్టుకుని ఉండడం వల్ల తొందరతొందరగా ఓ నాల్గు లైన్లు రాసి పంపించేసాను. 10 AM కి బయలుదేరి వెళ్లేం. చెప్పేదేముంది! అందమైన, విశాలమైన; పరిశుభ్రమైన రోడ్లు, కొండలు, కొండలపైన బొమ్మరిళ్లలా ఇళ్లు, క్రితం వారం నేను దిగిన ఎయిర్ పోర్ట్ రోడ్డుకు పైన రకరకాల షేపుల్లో మెలికలు తిరిగిన ఫ్లై ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ దాటుకుని అందమైన శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో అడుగుపెట్టేం. గోల్డెన్ గేట్ బ్రిడ్జిని చూడడానికి వెళ్లే ముందంతా రకరకాల పూల తుప్పలతో నిండిన అడవిదారి. సన్ డే దానికి తోడు సన్నీడే. పెద్ద సంఖ్యలో కార్లు. దారంతా ట్రాఫిక్ జామ్. అతి నెమ్మదిగా కదులుతూ మా కారు గోల్డెన్ గేట్ బ్రిడ్జిని చేరుకుంది. అప్పట్లో ఈ ప్రాంతంలో బంగారం దొరుకుతూండడం వలన చాలా దేశాల వాళ్లు ముఖ్యంగా చైనీస్ అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పనిచేసారట. కొండల మధ్య నుంచి లోపలికి చొచ్చుకొని వచ్చిన పసిఫిక్ ఓషన్ మీద నిర్మించిన గొప్ప బ్రిడ్జి ఇది. మొత్తం ఐరన్ తో నిర్మించబడింది. ఎక్కడ చూసినా విరిసినపూలు; ఎర్రని హ్యూజ్ బ్రిడ్జి, కిందంతా నీలి సముద్రం పాయ. అవతలివైపు మళ్లీ కొండలు. క్రింద ఏర్పడిన ఉప్పునీటి సరస్సు మధ్యలో ఐలేండ్, దానిపైన ఎప్పుడో నిర్మించబడిన పాతకాలం నాటి జైలు. గీత ప్రెగ్నెంట్ గా ఉండి నడవలేకపోవడం వలన దూరం నుంచే అన్నీ చూసాం. అక్కడి నుంచి హార్బరుకెళ్లి షాపింగ్ కాంప్లెక్స్ లో అమెరికన్ మోనూతో లంచ్ తిన్నాం. బ్రెడ్ బౌల్ (పెద్ద సైజు గట్టి బన్ లో పైన రౌండ్ గా కట్ చేసి లోపల ఛీజ్, క్రీమ్ తో చేసిన కర్రీ ఏదో పెట్టి కట్ చేసిన బన్ను ముక్కతో మూసి ఉంది) ఫుల్ ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫిష్ బజ్జీలు, ప్రాన్స్ , స్నెయిల్ రౌండ్స్, స్వీట్ బన్స్, కేక్స్ మొ.వి తిని షాపులు చూసుకుంటూ నడిచెళ్లి కెరటాలు లేని బీచ్ లో కూర్చున్నాం. పేరెంట్స్ తో వచ్చిన చిన్న చిన్న పిల్లలు నల్లని ఇసుకలో ఒకటే ఆటలు. పసిఫిక్ సముద్రపు నీళ్లను అరచేత్తో తాకేను. జిల్లుమనే చల్లదనం. రకరకాల ప్రపంచజాతుల జనం. చాలావరకూ మిక్స్ డు జాతులు. ఇంతమందిని ఇలా ఒకే చోట చూడడం తమాషా అనుభవం. అక్కడక్కడా రెడ్ ఇండియన్స్, భారతీయ ఇండియన్స్ మిక్స్ డు ఇండియన్స్ కన్పించేరు. రంగురంగు జాతుల పసివాళ్లు రంగురంగుల పూలలా ఉన్నారు. 6 PM కి శాన్ఫ్రాన్సిస్కో నగర వీధుల్లోకి ప్రవేశించాం. కొండల్ని పగలగొట్టి నిర్మించిన ఎత్తుపల్లాల అందమైన అద్భుతనగరం. ఆ నగరాన్ని చూడడం గొప్ప అనుభూతినిచ్చే ఆనందం. అతి శుభ్రమైన, సుందరమైన సౌందర్యనగరం. చిన్ని చిన్ని పొట్టి భవనాలు మొదలు ఆకాశహర్మ్యాల వరకూ, రకరకాల చర్చిలు మొదలు రాజభవనాల్ని పోలిన రాష్ట్రపాలనా భవనాలవరకూ అన్నీ గొప్ప అందాల కట్టడాలే. నగరంలోని చాలా వీధుల్లో రాత్రి 9 వరకు తిరుగుతూనే ఉన్నాం. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన ప్రశాంత నగరమిది. మధ్యలో ఉన్నట్టుండి మాకారు పక్కనే ఒక టూరిస్ట్ బస్సు ప్రత్యక్షమైంది. సగం ఓపెన్డ్ గా ఉన్న టాప్ లేని రథం లాంటి బస్సు అది. అందులో ఉన్న 15, 16 ఏళ్ల, నల్లని సూట్లు ధరించిన తెల్లని అమ్మాయిలు, అబ్బాయిలు స్వర్గం నుంచి దిగివచ్చిన ఏంజెల్స్ లాగా ఉన్నారు. ఆ మొహాలలోని స్మైల్, షై ఎంత బావుందో! ఆ అందాలు అలా శాశ్వతంగా ఉండిపోతే బావుండును అన్పించింది, తిరిగి వచ్చి మౌంటెన్ వ్యూలోని ఇండియన్ రెస్టారెంట్ పీకాక్ లో డిన్నర్ చేసి అర్థరాత్రికి ఇంటికి చేరుకున్నాం. అప్పటికింకా నెట్ కనెక్షన్ ఇచ్చుకుని టి.విలో సినిమాలు చూసే పద్ధతి రాలేదు. లైబ్రరీ నుంచి తెచ్చుకున్న మంచి మంచి అవార్డ్ విన్నింగ్ మూవీస్ ని డివిడి ప్లేయర్ ద్వారా చూస్తూ ఉండేదాన్ని. గీత నాకు విసుగెత్తకుండా ఎక్కడికో ఒకచోటికి తీసుకెళ్తూ ఉండేది. ఒకో వీకెండ్ లో కాంపౌండ్ లోనే ఉన్న స్విమ్మింగ్ ఫూల్ దగ్గర పెద్ద వాళ్లం కూచుంటే వరుకి కోమల్ ఈత నేర్పిస్తూ ఉండేవాడు. అప్పటికింకా వరూకి స్విమ్మింగ్ సరిగ్గా రాకపోయినా వాళ్లన్నయ్య ఉన్నాడనే ధైర్యంతో నీళ్లల్లో దుమికేస్తూ ఉండేది. జూన్ 4 న మొదటి సారి ఇళ్లకు పైన వెళ్తున్న బ్లింప్ చూసాను. రెక్కలు లేని విమానం లాంటి బెలూన్ తమాషాగా ఉంది.
ఆ మర్నాడు ఉదయం ఫార్మర్స్ మార్కెట్ కి వెళ్లేం. అక్కడ ఎరువులు వెయ్యకుండా పండించిన పళ్లు, కూరగాయలు, ఆకు కూరల్తో బాటు గుడ్లు, మాంసం, రకరకాల రోటీల లాంటి వంటకాలు, బ్రెడ్స్ అమ్మతున్నారు, చిన్ని చిన్న బుట్టల్లో రెడ్, బ్లూ, రాస్, లోగన్ వగైరా రకాల బెర్రీస్, బెర్రీస్ తో బాటు యాపిల్స్, ద్రాక్ష, పైనాపిల్, పీచెస్, పియర్స్ లాంటి అక్కడ పండించిన ఫ్రూట్స్ పెట్టారు. ప్రతీ షాపులో అమ్ముతున్నవన్నీ ఒక బేస్కెట్ లో రుచి చూడడానికి పెట్టారు. అలా రుచి చూస్తూ మార్కెట్ మొత్తం నడిచేసరికి లంచ్ తిన్న ఫీల్ వచ్చేసింది. ఎక్కడి కెళ్లినా రకరకాల జాతుల జనాన్ని చూడడం గొప్ప అనుభూతి, పైగా వాళ్ల నిర్లక్ష్యపు డ్రెస్సింగ్ ఒకటి.
ఒక పెద్దావిడ బొట్టు పెట్టుకుని కన్పిస్తే పలకరించేను, ‘తెలుగా?’ అని, తమిళియన్సట, కొడుకుతో వచ్చింది. బహుశా వయసు 65 ఉండొచ్చు, ఆ వయసు ఇండియన్స్ మొహాల్లో గొప్ప అలసట. పక్కనే ఉన్న ట్రెయిన్ ప్లేస్ లో ఫోటోలు తీసుకున్నాం. అక్కడి నుంచి సన్నీవేల్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఆర్ట్ అండ్ వైన్ ఫెస్టివల్ కి వెళ్లేం. మన వైపు జరిగే తీర్థం లాంటిది. చైనీస్ అండ్ థాయ్ డిషెస్ ఫుడ్ ఆర్డర్ చేసాం కాని, తినలేకపోయాం. సత్య కొన్ని డాలర్ టిక్కెట్లు కొని వరూని ఆ గేమ్స్ అన్నిట్లో తిప్పేడు, చివర్లో రెండు టిక్కెట్లు మిగిలితే వరూతో బాటు నేను కూడా బుల్లి ట్రెయిన్ ఎక్కేను, పిల్లల కోసం ఏవేవో షాపింగులు, ఇండియన్ స్టోర్స్ లో రైస్, కూరగాయలు లాంటివి కొనుక్కుని ఇంటికొచ్చేసరికి అలసటగా అన్పించింది. గీత నన్నేపనీ చెయ్యనిచ్చేది కాదు. ఎక్కడెంత తిరిగి తిరిగి వచ్చినా నిమిషాల్లో వంట చేసేస్తుంది. నా పని నిరంతరాయంగా వచ్చే వేడినీళ్ల స్నానం చేసి, వేడి వేడి ఫుడ్ తిని, హాయిగా ఉండే మెత్తని పరుపుమీద వాలి నిద్రపోవడమే. ఇంట్లో చల్లగా ఉన్నా బైట తిరిగేటప్పుడు తెలిసింది అక్కడి ఎండలో వేడి, తీవ్రత ఉందని.
అక్కడ చిన్న పిల్లల స్కూల్స్ లో కూడా ఏదో ఒక పేరుతో ఎప్పుడూ ఏవో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. వరూ స్కూల్లో end of the year సెలబ్రేషన్ కి వెళ్లినప్పుడు గీత చుట్టు పక్కలున్న చాలా కాలనీస్ చూపించింది. చిన్న చిన్న పూర్ పీపుల్ హౌసెస్ కూడా ఎంతో బావున్నాయి. ఎక్కడా స్లమ్స్ కన్పించలేదు. నవ్య వీక్లీలో వచ్చిన నా ‘నవ్య నీరాజనం’ ఇంటర్వ్యూ చూసి ఇండియా నుంచి చాలా మంది ఫోన్లు చేసారు. కొందరైతే టైమింగ్ తేడా తెలుసుకోకుండా అర్థరాత్రీ, తెల్లవారు ఝామునా ఫోన్లు చేసేసి గీతా వాళ్లనీ విసిగించేరు.
జూన్ 12 న లాస్ ఏంజిల్స్ వెళ్లే ప్రయాణం పెట్టేరు. నా వల్లే ఆలస్యమైందని ఎవరూ ఇబ్బంది పడకూడదనే స్పృహ ఏదో ఉంటుంది నాకు ఎప్పుడూ. తెల్లవారి 4 గంటలకే లేచి రెడీ అయ్యి కూర్చున్నాను. 7.30 కి బయలుదేరేం. టౌన్ లిమిట్స్ దాటుతూనే యు.యస్.ఏ. పశ్చిమతీరం పసిఫిక్ సముద్రం తీరం వెంబడి పొడవునా ఉన్న రాకీ కొండలకు తూర్పు అంచున కిందికి సౌత్ కి ప్రయాణిస్తూ వెళ్లేం. రాకీ పర్వతాలకు దూరపుటంచుల్లో మట్టి కొండలు. మేప్ లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ దగ్గరగా కన్పించినా ఇంచుమించు 400 మైళ్ల దూరం. అక్కడక్కడ ఆగుతూ వెళ్లేం. అద్భుతమైన వేలీ. కొన్ని చోట్ల రోడ్డుకి కుడివైపునా, కొన్ని చోట్ల రెండు వైపులా మట్టిగుట్టల్లా కన్పిస్తున్న కొండలు. కొండలనిండా మూరెడెత్తున పెరిగిన బూడిదరంగు గడ్డి. అక్కడ ఆవుల్ని మాంసం కోసం పెంచుతారట. చాలా పుష్ఠిగా, ఆరోగ్యంగా ఇండియా లో గౌడు గేదెల్లా ఉన్నాయి. LA దగ్గరవుతూండగా దూరం నుంచి కొండలు కెంపురంగులో కన్పించాయి. దగ్గరకెళ్లి చూస్తే చిన్ని చిన్ని కెంపు రంగు గడ్డిపూలు కొండల నిండా అలుముకుని విరిసాయి.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.