వెనుతిరగని వెన్నెల(భాగం-66)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయటపడు తుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవుతుంది.
***
మధ్యాహ్నానికి సెలవు చీటీ ఇచ్చి కాలేజీలోంచి బయటికొచ్చింది. ఎటు చూసినా సమస్యల సుడిగుండమైన ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. బస్టాండు దాటిపోయి రోడ్డు పక్కనే నడుస్తూనే ఉంది. ఎండ బాగా మొహమ్మీద పడుతూండడంతో కొంగు తీసి తల మీద కప్పుకుంది. యూనివర్శిటీలో చంటిపిల్లాణ్ణి ఎత్తుకుని నడిచిన జ్ఞాపకాలు తరుము కొచ్చేయి. అమ్మా, నాన్నా తనే అయ్యి ఎన్నో కష్టాలకోర్చి పెంచుకు వస్తూ ఉంది.
అడుగడుగునా తనకీ కష్టాలేవిటో!
ఇదంతా స్వయంకృతాపరాధమేనా?
ఏదేమైనా తన జీవితమంత దుర్భరమైన జీవితం ఎక్కడా ఉండదు.
కంటికి నీరలుముకుని రోడ్డు కనబడడం లేదు. పక్క నించి వెళ్తున్న షేర్ ఆటోల దుమ్ము రేగి ఒళ్లంతా పడసాగింది. కాళ్లు లాగసాగేయి. అయినా నడవసాగింది. ఎంత దూరం నడవగలదో తెలియదు.
తన మీద తనకే విరక్తి, కసి పేరుకుపోసాగేయి. తన దుస్థితికి తనే కారణమనే ఆత్మ న్యూనతా భావం తినివేయసాగింది.
ఇంతలో పక్కనే ఆగిన ఆటో లోంచి బిలబిలా నలుగురు కాలేజీ పిల్లలు దుమికి వచ్చేరు.
“మేడం ఇటేడికి నడిసి పోతున్రు?” అన్నాడు అందులో ఒక కుర్రాడు.
ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడిన తన్మయి “ఏం లేదు, ఊరికే చుట్టూ చూసొద్దామని” అంది తడబాటుగా.
“అయితే మా ఊరు రాండ్రి మేడం, తోలుకపోతాం” అన్నారు ముక్త కంఠంతో.
మారు మాట్లాడకుండా వాళ్లతో బాటూ ఆటో ఎక్కింది తన్మయి.
దాదాపు ఇరవై నిముషాల తర్వాత ప్రధాన రహదారి మీంచి డొంక రోడ్డులోకి ప్రవేశించి పడి, లేచి వెళ్లసాగింది ఆటో.
కిక్కిరిసిన జనంతో బాటూ ఇలా మారుమూల పల్లెటూరుకి వెళ్లడం మరోసారెప్పు డైనా అయితే చాలా ఆసక్తిదాయకంగా ఉండేది తన్మయికి. కానీ ఇప్పుడున్న మానసిక స్థితిలో అసలెక్కడికి వెళ్తూందో అర్థం కాకపోయినా ఇంటి నుంచి కాస్సేపైనా ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలన్న భావనొకటే మనసులో మెదులుతూ ఉంది.
అంతలోనే నవ్వొచ్చింది తన్మయికి.
కానీ తన పిచ్చి గానీ ఎక్కడికి వెళ్తుంది? తన మీదే ఆధారపడి ఉన్న ఇద్దరు పసికూనల్ని వొదిలి?
సాయంత్రమైతే తన కోసమే గేటు పుచ్చుకుని వేళ్లాడే బాబు, తల్లి ఎప్పుడొచ్చి ఒళ్లోకి తీసుకుంటుందా అని ఆత్రంగా దుమికే పసిపాప.
ఇప్పుడు ఇంటికి వెళ్లినా చంటిది ఉయ్యాలలో నిద్రపోతూ ఉంటుంది. బాబు స్కూల్లో ఉంటాడు. ప్రభు ఏ రాత్రికోగానీ ఇంటికి రాడు. అందుకే కనీసం సాయంత్రం వరకైనా ఇంటికి వెళ్లాలని లేదు. కాలేజీలో ఉండాలని అస్సలు అనిపించలేదు. ఇక పెందరాళే ఇంటికెళ్లి తననీ, తన కొడుకునీ ద్వేషించే ఆ మనుషుల మొహాలు చూడడం అంతకంటే ఇష్టం లేదు.
ఎవరి సాహచర్యం భరించలేకపోతూందో వారితోనే కలిసి జీవించాల్సి రావడం ఎంత దుర్భరమైన విషయమో!
తను వాళ్లకి ఏం అన్యాయం చేసింది? వాళ్ళ కొడుకు తనని పెళ్లి చేసుకుంటే తనని, తన కొడుకుని ఏడిపించడం ధర్మమేనా?
వాళ్లని దూరం పెట్టమంటే ప్రభు ఒప్పుకోడు. తనే దూరం వెళ్లిపోదామంటే ప్రభు పట్ల ప్రేమ వెనక్కి లాగుతూ ఉంది. పైగా చంటి పిల్లకి తండ్రిని దూరం చేసే హక్కు తనకి లేదనే మీమాంస. ప్రభు తల్లిదండ్రులకి ప్రభుయే చెప్పాలి. అదెప్పటికి సాధ్యమవుతుం దో, అసలు ప్రభు ఎప్పటికైనా చెప్పగలడో, లేడో! వాళ్లు తనని బాధ పెట్టడమే కాకుండా, బాబుని బాధిస్తున్నారన్నది తప్పనే ఆలోచన ప్రభుకి ఎందుకు లేదో కూడా అర్థం కావడం లేదు.
ఇవన్నీ సరిపోవన్నట్టు కొత్తగా ఇప్పుడు శేఖర్ తల్లి బెదిరింపు మనసుని రగిల్చేస్తూ ఉంది.
ఆటో పెద్ద గోతిలో పడి లేచింది. అందరూ ఒక్కసారి “ఓ” అని అరిచేరు. ఆలోచన ల్లోంచి బయటికొచ్చి తల విదిలించింది తన్మయి.
లాయరు విశ్వ గారితో మాట్లాడాలి. అవును, అదే సరైనది. వెనక్కి వెళ్లగానే ఫోను చేసి విశ్వ సలహా తీసుకోవాలి. ఇక ఈ సమస్యల గురించి భయపడకూడదు. పరిష్కారం వెతకాలి.
ఒక్కసారిగా కాస్త మనసు తేలికపడినట్లయ్యింది తన్మయికి.
తనని పిచ్చి ఆలోచనల్లోంచి మార్గం మళ్ళించి ఆటో ఎక్కించిన పిల్లల వైపు కృతజ్ఞతగా చూస్తూ “అవునూ, మీరేంటి కాలేజీ పూర్తవకుండా ఇంటికి వెళ్లిపోతున్నారు?” అంది.
“ఏం చేస్తం మేడం, స్కాలర్ షిప్పు పైసల కాడికని శాన్నాళ్లకి కాలేజీకి పొయినం. అటిండెన్సు లేనిదె పైసలు ఇచ్చేడిది లేదని ప్రిన్సిపలు మేడం ఎల్లగొట్టింది. ఆటో పైసలు గెట్లనో జమకూర్చి తెచ్చుకున్నం. మీరైనా జర చెప్పురి” అన్నారు ప్రాధేయపడ్తూ.
“ఊ… మరి కాలేజీలో స్కాలర్ షిప్పుకి కావలసిన కనీస అటెండెన్సు కూడా లేకుండా మీరేం చేస్తున్నారు?” అంది సాలోచనగా.
“ఫాక్టరీలో పనికి పోతం మేడం” అన్నారు ముక్త కంఠంతో.
“మిమ్మల్ని కాలేజీకొచ్చి చదువుకోమనే కదా గవర్నమంటు స్కాలర్ షిప్పు ఇచ్చేది. మీరు చదువులు ఎగ్గొట్టి, కేవలం స్కాలర్ షిప్పు కోసమే కాలేజీకి వొస్తే ఎలా?” అంది తన్మయి.
“మేం కాలేజీకి ఎప్పుడో ఓ తరి పోతున్నది కరక్టే మేడమూ, కానీ సదువు సదవకుంటే కదా. ఇగో మన యెంకటేసు ఉన్నాడు సూడండి. వీనికి అన్నీ ఫస్టు మార్కులే వొస్తయి మేడం. ఈయనే మా కందరికీ రాత్రి బడి కూడా సెప్తాడు. కావాలంటే మొన్న హాఫియర్లీ పరీక్షల్లో మా మార్కులు చూడుండ్రి.” అని కాయితాలు చూపెట్టేరు.
నిజమే, వీళ్లంతా బాగా చదువుతున్న పిల్లలే.
తన్మయికి ఒక్కసారిగా యూనివర్శీటీలో ఉన్నపుడు అదే రకమైన తన పరిస్థితి జ్ఞాపకం వొచ్చింది. క్లాసులకి వెళ్లలేక, చెట్టు కింద బాబుని ఎత్తుకుని కూచుని, నోట్సులు రాసుకుంటూ, అనేక కష్టాలకోర్చి చదివి పట్టుదలగా మంచి మార్కులు తెచ్చుకున్న రోజులు జ్ఞాపకం వచ్చి కళ్లు చెమర్చాయి.
పిల్లలు గమనిస్తారేమోనని కొంగు కళ్లకి అడ్డం పెట్టుకుంటూ “అబ్బా, బాగా దుమ్ము పడుతూ ఉంది” అంది.
ఆటోలో ఎదురుగా బల్ల మీద అప్పటిదాకా ఒక మూలకి ఒదిగి సిగ్గు పడ్తూ కూచున్న వెంకటేశు తనని ఆశ్చర్యంతో గమనించడం చూసింది తన్మయి.
వెంటనే తేరుకుని “ఊ… అయితే మీరంతా మంచి మార్కులే తెచ్చుకున్నారు” అంది తలాడిస్తూ.
మట్టిలో మాణిక్యాలంటే ఈ పిల్లలే.
ముఖ్యంగా అప్పుడప్పుడూ క్లాసులకి వొస్తున్నా తను స్వంతంగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడమే కాకుండా, చుట్టూ ఉన్న పిల్లలకి కూడా సాయం చేస్తున్న వెంకటేశుపై అంతులేని వాత్సల్యం కలిగింది తన్మయికి.
ఆటో దిగేక “మేడం, మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి” అంటూ పిల్లలంతా పిలిచేరు.
ముందుగా వెంకటేశు ఇంటి వైపు దారి తీసింది తన్మయి.
దాదాపు కూలిపోబోతున్న మట్టి గోడల చిన్న ఒంటిగది పెంకుటిల్లు. వరండాలో పెళ్లలు ఊడిపోయిన గచ్చుమీద తల నెరిసిన ముసలామె చేటలో ఆకులు పేర్చుకుని బీడీలు చుట్టసాగింది.
“జేజెమ్మా, మా మేడము” అంటూ తన్మయి కూర్చుందుకు ముక్కాలి పీట ఒకటి తెచ్చి వేసి ఒక పక్కగా ఒదిగి నిల్చున్నాడు వెంకటేశు.
“గట్లనా, మంచిది బిడ్డా. కాల్లు కడుక్కో తిందువు” అంది మెల్లగా లేవబోతూ.
“అహహ, గిప్పుడొద్దులె తియ్యి, మేడముకు చాయ పట్టుకొస్త” అంటూ బయటకు పరుగెత్తేడు వెంకటేశు.
“ఇగో బిడ్డా, గీ పైసల్ తీసికెల్లు.. అంటూ చెంగు చివరన కట్టిన చిల్లర పైసలు తీసి ఇవ్వబోతూ అప్పటికే బయటికి పరుగెత్తిన వెంకటేశు వెళ్లిన వైపే చూసి నిట్టూరుస్తూ “ఏందో పరేషాన్ పిలగాడు. పొద్దుగాల చాయ తాగి పనికి పోయినదే. రోజల్ల తినకుంట ఇగో పొద్దుమీకి గిప్పుడు ఒక బుక్క తిని సదువుకి పోయి ఏ రాత్రో వచ్చి పంటడు. వీని కోసమే రెక్కలు ముక్కలు అయితన్నా గీ వయసుల గీ పని సేస్తండ. ఇంకెన్నాల్లు ఉంటది గీ సదువు మేడం? ఏమైన ఉద్దోగమొస్తదంటవ?” అంది ముసలామె.
తన్మయి ఏదో అనేలోగా “తల్లిదండ్రి లేని పిలగాడు మేడం. వీన్ని కని నా కూతురు గప్పుడే ఎల్లిపోయింది. వీడి నాయిన మల్లీ పెల్లి సేసుకుని ఇగ వీని మొకమే సూడలె. నేనెన్నాల్లుంటనో నాకే తెల్వది. నా సావులోగా వీనికి ఒక తొవ్వ దొరికితె సాలని శివునికి రోజు మొక్కుతాండ. ఏమైతదో ఏమో” అని నిట్టూర్చింది.
తన్మయి మనసంతా బాధ కమ్ముకుంది. కష్టాలంటే ఇవేనేమో. తినడానికి మంచి తిండి, ఉండడానికి మంచి ఇల్లు కూడా లేని జీవితం, తల్లీతండ్రీ లేకుండా పెరుగు తున్న ఒంటరితనం.
వీటితో పోలిస్తే తన కష్టాలు ఏ పాటి?
తనకి ఆర్థిక సమస్య లేదు, భవిష్యత్తు బాధ లేదు. మనుషులకూ కొదవలేదు. నిజానికి మనుషుల వల్లే బాధ.
అంతలోనే ముసలవ్వ మళ్లీ అందుకుని “మేడం! నువ్వు సిన్న పిల్లలెక్కనే కొడుతున్నావు. అయినా పెద్ద సదువు సదివినవు. నా బిడ్డని నీ సేతుల్లో పెడతండా. నాకేమైన గాని నువ్వే వీనిని కడుపునబెట్టుకోవాలె. గిప్పుడిప్పుడే పరిసయమయ్యి ఇదేమి ముసల్ది ఇట్ల అడుగుతన్నదని పరేషాన్ గాకు. నీ గురించి వాడు ఎప్పుడూ “మా మేడం, మా మేడం” అంటూ సెప్తడు. కాలేజీలో పిలగాండ్ల సదువుకి నువ్వు సాయం సేస్తవంట గదా! వీనిని గూడ దయసూడు నీ కాల్మొక్త” అంది దీనంగా.
తన్మయి పక్కనే ఉన్న పుస్తకాల మీద వెంకటేశు మార్కుల లిస్టు తీసి చూసింది. అన్నీ ఫస్టు మార్కులే.
ఇంతలో వెంకటేశు చాయి గ్లాసుతో తిరిగొచ్చేడు.
మొహమాటంగానే అందుకుని పూర్తిచేసి లేస్తూ వెంకటేశు దగ్గిరికి వెళ్లి చేతిలో అయిదు వందల కాగితం పెట్టింది.
తడబాటుగా అడ్డంగా తలాడిస్తూ “ఎందుకు మేడం” అన్నాడు.
“నీకు టెస్టుల్లో ఫస్టు మార్కులొచ్చినందుకు. ఇంతే కాదు. ఇక మీదట నీ చదువ్వు పూర్తయ్యేవరకూ అన్ని ఫీజులూ నేనే కడతాను. నువ్వు సియీసీతో చదువుతున్నావు కాబట్టి, ఇంటర్మీడియేట్ కాగానే సిటీలో మేనేజ్మెంటులో బాచిలర్స్ చెయ్యి. అందుకు అయ్యే ఖర్చు కూడా నేను పెడతాను. నువ్వు చెయ్యాల్సిందల్లా ఇలాగే అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవడం, మంచి ఉద్యోగంలో స్థిరపడడం. సరేనా?” అంది లేస్తూ.
చప్పున వంగి కాళ్లకు నమస్కరించాడు వెంకటేశు.
ముసలవ్వ రెండు చేతులూ ఎత్తి నమస్కరించబోతే వద్దని వారించింది తన్మయి.
తిరిగి వస్తూంటే ఎంతో సంతృప్తిగా అనిపించింది తన్మయికి. తన సంపాదనకు సరైన అర్థం ఇప్పటికి ఏర్పడినట్లుగా అనిపిస్తూంది.
అయితే తనకు ఒక కొత్త బాధ్యత ఏర్పడింది. ఇకమీదట తన జీతంలో నుంచి నెలనెలా కొంత తీసి ఈ అబ్బాయి చదువు కోసం పక్కన పెట్టాలి.
“ఎలాగైనా ఈ పిల్లవాడికి మంచి జీవితాన్నివ్వాలి” దృఢంగా అనుకుంది.
తిరిగి ఆటో ఎక్కించడానికి పిల్లలంతా వచ్చేరు.
తన్మయికి మనసంతా తేలికగా, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు.
“తన జీవితంలో అడుగడుగునా తనకి ఎలాగూ కష్టాలే. కనీసం ఇతరుల జీవితాల్లో నైనా సంతోషాన్ని నింపగలిగితే!” అన్న ఆలోచనే అంతకు ముందున్న దు:ఖాన్ని, నిరాశని మటుమాయం చేసింది.
***
తిరిగి కాలేజీ దరిదాపుకి వచ్చే సరికి సెల్ ఫోనులో సిగ్నలు రావడంతో లాయరు విశ్వకు డయల్ చేసింది.
ఆఫీసు మూసేసే వేళ దగ్గర పడడంతో గబగబా అడగసాగింది తన్మయి.
సమాధానంగా “కంగారు పడకండి. నాకు గుర్తున్నంత వరకు బాబును మొత్తంగా మీ దగ్గరే ఉంచుకోవడానికి మీకు రాత పూర్వకంగా హక్కులు ఇచ్చేడతను. ఇక తండ్రిగా అతను ఎప్పుడైనా వచ్చి బాబుని చూసుకునే హక్కుని మాత్రం మీరు కాదనలేరు. చట్ట ప్రకారం తల్లిదండ్రులిద్దరికీ మైనరు పిల్లల మీద సమానమైన హక్కులు ఉంటాయి. అయితే మీ ప్రైవేటు జీవితానికి భంగం వాటిల్లజేసే హక్కు అతనికి లేదు. అలాంటిదేదైనా జరిగితే మీరు కంప్లైంటు ఫైలు చెయ్యవచ్చు. మిమ్మల్ని ఈ విషయకంగా ఇబ్బంది పెట్టడం చట్టరీత్యా నేరం. అది అతనికి తెలిసేలా ఒక నోటీసు పంపించుదాం.” అన్నాడు.
తన్మయికి ఒక్కసారిగా గొప్ప రిలీఫ్ గా అనిపించింది. “థాంక్యూ విశ్వగారూ!” అంది.
“ఇక బాబుని చూడడానికి మీకు భంగం వాటిల్లకుండా అతను బయటెక్కడైనా కలవొచ్చు, ఏ ప్రదేశంలో, ఏ సమయంలో కలవాలి వంటి విషయాల మీద మీరిద్దరూ ఒక ఒప్పందానికి రావడమే మంచిది. సాధారణంగా ఇవన్నీ విడాకులు అయిన వెంటనే వచ్చే సమస్యలు. అతను ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు బాబుని చూడాలను కోవడం హాస్యాస్పదం. అయినా ఎందుకైనా మంచిది. అతనితో లీగల్ గానే ప్రొసీడవు దాం. ఇక ఈ మధ్య అందరూ విదేశాలకు వెళ్తున్నారు. ఇటువంటి కేసుల్లో పిల్లలకు పాస్ పోర్టు వంటివి తీసుకోవాలన్నా అభ్యంతరాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి అటువంటి అభ్యంతరాలు లేకుండా అఫిడవిట్ల మీద సంతకాలు తీసుకోవడం కూడా భవిష్యత్తులో ఉపయోగకరం. ఏమంటారు?” అన్నాడు విశ్వ.
తన్మయి ఆశ్చర్య పోయింది. తన మనసు చదివినట్టే మాట్లాడుతున్నాడు విశ్వ. తనకి చిన్నతనం నించీ యూరప్ దేశాలు చూడాలన్నది ఎంతో ఇష్టం. రాబోయే రెండు, మూడేళ్లలో డబ్బులు కూడబెట్టి వెళ్లి రావాలని ప్రభుతో ఆ మధ్య అన్నది కూడా. పాసుపోర్టులకి అప్లై చెయ్యాలని అనుకుంటూ ఉంది. బాబుకి పాసుపోర్టు తీసుకోవా లన్నా, తమతో తీసుకెళ్లాలన్నా ఇలాంటి సమస్యలు ఉంటాయని అస్సలు అనుకో లేదు.
వెంటనే గొంతు సవరించుకుని “అలాగే విశ్వగారూ! వెంటనే నోటీసు, అఫిడవిట్లు సిద్ధం చేయించండి” అని కృతజ్ఞతాపూర్వకంగా అంటూ “ఒకవేళ అతను నిరాకరిస్తే..” అంది సంశయిస్తూ.
“అప్పుడు కోర్టుకి వెళ్లి అనుమతి సంపాదించుకోవచ్చు లెండి. లాయరు ఖర్చు మిగలాలంటే బుద్ధిగా సంతకం పెట్టడమే మంచిదని అతనికి తెలియకుండా ఉంటుం దని అనుకోను.” అన్నాడు.
ఫోను పెట్టేసేక తన్మయికి ఊరటగా అనిపించింది.
అవతలి నుంచి సమస్యల్ని చట్టపరంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది కనీసం.
కానీ ప్రభు తరఫు నించి సమస్యలకి కూడా పరిష్కారం ఉందో, లేదో కూడా అర్థం కావడం లేదు.
తిరిగి ఇంటికి వస్తూ బస్సులో ఇదే విషయం తీవ్రంగా ఆలోచించసాగింది.
మనసుని తీవ్రంగా కలిచి వేస్తున్న ఆలోచనల వల్ల ధారాపాతంగా చెమటలు కారసాగేయి. పైగా సీటు దొరకక బస్సు ఊసలు పట్టుకుని వేళ్లాడుతూ నిలబడ్డం ఒకటి. గంటసేపు ప్రయాణం రోజూ ఇంతే అయినా శరీరంలో ఓపిక అంతా అయిపోయినట్టు కాళ్లు పీకసాగేయి.
అంతలో బస్సు చివరి సీటులోంచి ఎవరో చెయ్యి ఊపి “సీటు ఉంది రమ్మని” సైగ చెయ్యడం గమనించింది.
పిలిచినాయనకి కృతజ్ఞతగా నమస్కరించి, కిటికీ పక్కగా ఒదిగి కూచుంది.
అప్పటికే గొంతు పిడచకట్టుకుపోయినట్లు కావడంతో చేతికి తగిలించుకున్న వాటర్ బాటిల్ మూత తీసి నీళ్లు తాగి స్థిమితపడింది.
పక్కనున్న ఆయన్ని ఎక్కడో చూసినట్టు పరిచయమైన ముఖంలా అనిపించింది.
“మిమ్మల్ని ఎక్కడో చూశానండీ. కానీ క్షమించండి గుర్తు రావడం లేదు” అంది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.