యాత్రాగీతం

హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-4)
రోజు -4 రోడ్ టు హానా

-డా||కె.గీత

          మర్నాడు మావీలో తప్పనిసరిగా చూడవలసిన “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నాం.  ఉదయం ఎనిమిది గంటల కల్లా తయారయ్యి కారులో కూర్చున్నాం. అసలు మావీ ద్వీప సందర్శనకు వచ్చే వారెవరైనా తప్పనిసరిగా ఈ  “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యకుండా వెళ్లరట. అయితే అంత ప్రసిద్ధి గాంచిన దైనా, చిన్న రోడ్ల వెంట, పర్వతాల అంచుల గుండా సాగే ఈ రోడ్డు ప్రయాణం అడుగడుక్కీ ప్రమాదాలమయం అని కూడా చదివేం. 

          సత్య డ్రైవ్  చేస్తే  వేగంగా వెళ్తాడేమోనని, సాధారణంగా ఇటువంటి కష్టమైన డ్రైవ్ లు ఎప్పుడూ నేనే చేస్తూ ఉంటాను. అయితే ఈ ప్రయాణంలో సత్యతో బాటూ, కోమల్, వరులు కూడా డ్రైవ్ చేసారు.  నిజానికి  “రోడ్ టు హానా” డ్రైవ్ ఎవరికీ ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయినా కదలలేని నా పరిస్థితి వల్ల వీళ్లకి వదిలెయ్యక తప్పలేదు. ఇక నా పని డ్రైవరు పక్క  సీటులో కదలకుండా కూర్చోవడం మాత్రమే. 

          రోడ్ టు హానా దారి మొత్తం పచ్చని పర్వతారణ్యాల గుండా సాగుతుంది. ఇంత వరకు మావీ ద్వీపంలో మేం చూసిన  పిచ్చి మొక్కల ఎడారి రహదారులు, అసలు హరిత పదార్థమే లేకుండా మరో గ్రహాన్ని తలపించే  హలేకలా అగ్నిపర్వతం, మురిపించే సముద్ర తీరపు లహైనాల కంటే భిన్నమైన దృశ్యం ఇది. మావీ కాకుండా మరేదో ద్వీపానికి వచ్చినట్టు పచ్చదనంతో కళకళ్లాడి పోతూంది రహదారి. 

          అయితే ఇలా మేం ఎడారి రహదారి దాటి, పర్వత ప్రాంతానికి ప్రవేశించామో లేదో అలా వర్షం ప్రారంభమైంది. హవాయిలో ఇంతక్రితం బిగ్ ఐలాండ్ లో కూడా ఇలాగే ద్వీపానికి ఒకవైపు వర్షం ఎప్పుడూ పడుతూ ఉంటే మరోవైపు అసలు వర్షం ఎప్పుడూ పడని ఎడారి జ్ఞాపకం వచ్చింది. అందుకు కారణం ద్వీపానికి మధ్య దుర్భేద్యంగా ఉన్న ఎత్తైన పర్వతాలు సముద్రం మీంచి వచ్చే గాలుల్ని అడ్డుకోవడం వల్లనే అని ఎక్కడో చదివేను. 

          ఈ “రోడ్ టు హానా” అనేది 2000వ సంవత్సరంలో బిల్ క్లింటన్ పరిపాలనా కాలం లో ప్రాచుర్యానికి తీసుకురాబడింది. ఈ రహదారి మొత్తం పొడవు 64.4 మైళ్ళు. నిజానికి ఆ మాత్రం దూరం వెళ్ళడానికి గంట మాత్రమే పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఘాట్ రోడ్డు కావడం వల్ల ఎక్కడా ఆగకుండా వెళ్ళినా దాదాపు రెండున్నర గంటలు పడుతుంది. ఇక మార్గమధ్యంలో చూడాల్సినవి ముప్ఫయికి పైగా స్టాపులున్నాయి. అందులో ప్రధానమై నవి కొన్ని రోడ్డు నించి లోపలెక్కడికో వెళ్లి చూడాల్సినవి. 

          ఇక దార్లో 1910 ప్రాంతంలో నిర్మించి, ఇప్పటికీ వాడుతున్న 59 చిన్న రోడ్డు బ్రిడ్జిలు, 46 సింగిల్ రోడ్లు, అంటే ఒక్క కారే వెళ్లాల్సినంత చిన్న దార్లు ఉన్నాయి. దాదాపు 620 మలుపులున్నాయి. ఇలా చూస్తే ఒక రోజులో అన్నిటినీ చూడడం కష్టమే. ఇక అక్కడ ముఖ్యమైన చూడాల్సిన ప్రాంతాల లిస్టు కోసం, ఆయా ప్రాంతాల వివరాల్ని ఆడియోగా జీపీయస్ లొకేషన్ ని బట్టి తెలియజెప్పే యాప్ ఒకటి కొని మరీ ఇన్ స్టాల్ చేసుకున్నాడు సత్య. 

          ప్రధానంగా చూడాల్సిన వాటర్ ఫాల్స్, లావా ట్యూబ్, బ్లాక్ సాండ్ బీచ్ వంటివి తప్పనిసరిగా చూడాలని నిర్ణయించుకున్నాం. ఇక నేను ఈ వివరాలన్నీ పట్టించుకునే స్థితిలో లేకున్నా కదలకుండా కూచుని అద్దంలో నుంచి బయటికి చూస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆస్వాదించసాగేను. 

          తొమ్మిదిన్నర ప్రాంతంలో “హైకూ పవేలా” అనే చోటికి చేరేం. అక్కడ కొబ్బరి బొండాలు, పళ్లు అమ్మే దుకాణం దగ్గిర ఆగేం. ఒక  కొబ్బరి బొండం పన్నెండు డాలర్ల ఖరీదు. 

          దారి పొడవునా అంత వర్షంలోనూ అక్కడక్కడా షేవ్డ్ అయిసు అమ్ముతున్న  దుకాణాల దగ్గిర జనాలు కార్లు ఆపుకుని, లైన్లలో బారులు తీరి  ఉన్నారు. 

          ఇక దార్లో చూడాల్సిన ప్రతి పాయింటు దగ్గిరా సింగిల్ రోడ్డు కావడం వల్ల కార్లని నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో తప్ప, ఎక్కడా రోడ్డు వారగా ఆపే వీలులేదు. 

          అందువల్ల మొదటగా కనిపించిన కొన్ని పాయింట్లని మేం వదిలేయవలసి వచ్చింది. 

          దారంతా డ్రైవ్ లో ఎదురుగా వస్తూ కనబడ్డ వాహనాల వాళ్లు ఎదుటి వారికి అరచేతి సంజ్ఞతో “షకా” అంటూ పలకరిస్తూ ఉన్నారు. మధ్య మూడు వేళ్ళు మడిచి బొటనవేలు, చిటికెన వేలు పైకెత్తి చేసే “షకా” అనే ఈ సంజ్ఞకి అనేకార్థాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా “హలో” అని పలకరించుకోవడమన్నమాట. 

          పదిన్నర ప్రాంతంలో వైకామోయీ (Waikamoi) వాటర్ ఫాల్ రోడ్డు పక్కనే కనిపించింది. కానీ దిగేందుకు అవకాశం లేక కారులో నించే చూసి ఆనందించాం అందరం. గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆర్బోరేటం (Garden of Eden Arboretum) దాటి రోడ్డు పక్కనే పహోకమోవా (Puohokamoa) సెలయేరు జలజలా శబ్దం చేస్తూ రోడ్డు వారగా ప్రవహిస్తూ కొండల్లోకి జారిపోతూ కనువిందు చేసింది. దార్లో వస్తున్న విశేషాల వివరాలు యాప్ వల్ల ఆడియోగా కార్లో అందరం వింటూ ముందుకు సాగేం. 

          ఈ road to hana darlo దుకాణాల్లో అమ్మే “బనానా బ్రెడ్” చాలా ఫేమస్ కావడంతో ఆంటీ సాండీస్ అన్న bordu kanabadda చోట పక్క రహదారి తీసుకుని లోపలికి పదిహేను నిమిషాలు డ్రైవ్ చేసి వెళ్ళేం. ఆ ప్రాంతాన్ని కేనై ద్వీపకల్పం (Ke’anae Peninsula) అంటారు. అక్కడ తిన్న రుచికరమైన, వేడి వేడి బనానా బ్రెడ్ మళ్ళీ ఎక్కడా తినలేదు. బహుశా: స్థానికంగా పండే అరటి పళ్ళ రుచి అది. అయితే లైనులో చాలా మంది ఉన్నారు. మా వంతు వచ్చేసరికి దుకాణం వాళ్ళ దగ్గిర ఉన్న బ్రెడ్లన్నీ అప్పటికి అయిపోగా ఒకటి మాత్రమే కొనుక్కోగలిగేం. ఒక్కొక్కళ్ళకి చిన్న ముక్క మాత్రమే వచ్చింది. మళ్ళీ వచ్చేటపుడు తప్పనిసరిగా ఆగాలి అనుకున్నాం. 

          అక్కడ సముద్ర తీరం దిగడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద రాళ్లతో, అలలతో భీకరంగా ఉంది. 

          మళ్ళీ రోడ్డు మీదికి వచ్చి కొంత దూరంలో యూయూన హాఫ్ వే టు హానా అనే చోట మరొన్నీ బనానా బ్రెడ్లు, ఇతరత్రా కొనుక్కున్నాం. అయితే ఆ ముందు తిన్నంత బాగా అనిపించలేదు. అప్పటికే మధ్యాహ్నం పన్నెండు కావస్తుండడంతో పిల్లలంతా ఆకలితో ఆవురావురుమని తిన్నారు. 

          ఇక పచ్చని రహదారిలో  కొండల్ని అధిరోహిస్తున్నపుడు దూరంగా కనిపించే అనంత సాగర  దృశ్యం చెప్పనలవికాని సౌందర్యవంతమైనది. వ్యూ పాయింట్ల దగ్గిర కారు ఆపుకునే స్థలం దొరికినప్పుడల్లా ఆపుకుని ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగేం. 

          పన్నెండున్నర ప్రాంతంలో చిక్కని అరణ్యంలో వయాలువా ఫాల్స్ (Wailua Falls) రోడ్డు పక్కనే దర్శనమిచ్చింది. దీన్నీ త్రీ బేర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఆ దగ్గర్లో రోడ్ల పక్కనే ప్రతి రెండుమూడు మైళ్ళకీ రెండు మూడు  జలపాతాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. 

          హైకూ అనే ఊరికి ఒకటిన్నర ప్రాంతంలో చేరాం. అక్కడ ప్రముఖమైన రబ్బరు తోట ఉంది. ఆ ప్రాంతంలో ప్రయాణిస్తుంటే ఇండియాలోని కేరళలో ప్రయాణిస్తున్నట్టు అనిపించింది.  

          ఆ ప్రయాణంలో బ్లాక్ సాండ్ బీచ్ కి తప్పనిసరిగా వెళ్లి తీరాలన్నది సత్య సంకల్పం. 

          అక్కడే భోజనానికి బ్రేక్ కూడా తీసుకోవాలని అనుకున్నాం. తీరా బ్లాక్ సాండ్ బీచ్ రోడ్డు మలుపు తీసుకుని లోపలికి వెళ్లేసరికి గేటు నించే వెనుతిరగవల్సి వచ్చింది. విషయమేమిటంటే అక్కడికి వెళ్లాలంటే ప్రతి మనిషికి ఒక్కో టిక్కెట్టు ముందుగానే ఆన్ లైనులో బుక్ చేసుకోవాలి. సత్య టిక్కెట్టు కారుకి ఒకటి చొప్పున అనుకుని ఒకటే టిక్కెట్టు బుక్ చేసాడు. సాధారణంగా ఇటువంటి సముద్ర తీరపు పార్కింగుల్లో కారుకి మాత్రమే టిక్కెట్టు తీసుకోవడం అమెరికాలో అన్నిచోట్లా సర్వసాధారణం.  ఆ విషయం ముందు తెలుసుకోనందుకు సత్య ఎంతో బాధ పడ్డాడు. నేను కనీసం తననైనా వెళ్లి చూసి రమ్మని చెప్పినా “వద్దు, మరోసారి ఎప్పుడైనా వెళదా”మని అన్నాడు. 

          ఇక చేసేదేంలేక రెండుంపావు ప్రాంతంలో కొవాలవు అనే ULlO నహికు కేఫ్ అనే చోట ఆగి ఆలస్యంగా  మధ్యాహ్న భోజనాలు కానిచ్చాము. కార్లోకే తెచ్చుకుని తిన్నాం. కోకోనట్ ష్రిమ్ప్ , ఫ్రెంచ్ ఫ్రైస్ నాకోసం తెచ్చి ఇచ్చారు. ఫుడ్ ట్రక్కుల దగ్గిర ఐస్ క్రీములు కొని తెచ్చుకున్నారు పిల్లలు. ఆ ప్రయాణంలో  ఓ పక్క వర్షం పడుతూ, ఆగుతూ ఉన్నా వేడిగా ఉండడం వల్ల ఎక్కడ  ఐస్ క్రీములు కనబడ్డా కారు ఆపసాగేరు పిల్లలు. 

          అక్కణ్ణించి మధ్యాహ్నం మూడు గంటలకి వైనాపనాపా స్టేట్ పార్కు (Wai’napanapa State Park) కు చేరుకున్నాం. అక్కడ కూడా చిన్నపాటి బ్లాక్ సాండ్ బీచ్ ఉండడంతో కిందికి దిగి పచార్లు చేసారు పిల్లలు. నా పరిస్థితి బాగా దారుణంగా ఉంది అప్పటికి. అడుగు తీస్తే అడుగు వెయ్యడానికి ఇద్దరు పట్టుకోవాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో అతికష్టమ్మీద బాత్రూములకోసం ఒకట్రెండు సార్లు దిగాల్సి వచ్చింది. ఆ మాత్రం నడవడానికి కూడా  నరకయాతన పడాల్సి వచ్చింది. 

          తరువాత నాలుగుగంటల వేళ హానా లావా ట్యూబు పాయింటు చూసిరావడానికి ఒక గంట పాటు వీళ్లు వెళ్లి వచ్చారు. సిరి, నేను యథావిధిగా కార్లో ఉండిపోయాం. 

          ఇక అక్కణ్ణించి పొద్దుపోయేలోగా తిరిగి వెళ్లాలని వెనక్కి మరలేం. 

          దాదాపు గంటన్నర తరువాత తిరిగి వచ్చే దారిలో పొద్దున్న వదిలేసిన పాయింటు వెస్ట్ వయాలువా యికి స్ట్రీమ్ అన్న చిన్నపాటి జలపాతం, మడుగు చూసి వస్తామని సత్య, వరు దిగి వెళ్ళేరు. గంట పాటు కొండ లోపలికెక్కడికో నడిచి అక్కడ మడుగులో దూకి స్నానాలుచేసి, ఈతలు కొట్టి మరీ వచ్చారు. మిగతా అందరం పొద్దుటి నించీ అలసి పోవడంతో కారు రోడ్డు పక్కన పార్కింగులో ఆపుకుని ఎక్కడివాళ్లమక్కడ పడుకుని నిద్రపోయాం. 

          ఇక వీళ్లు తిరిగొచ్చి తీసిన వీడియోలు చూస్తే మతిపోయింది. అలా లోతు తెలీని ప్రాంతంలో, చుట్టూ ఎవరూ లేకుండా ఈత కొట్టడం ఎంతో ప్రమాదకరం. కానీ వీళ్ళ సాహసాలకు అంతేదీ! 

          మొత్తానికి ఆ రోజు రోడ్ టు హానా యాత్ర ముగించుకుని, దార్లో థాయ్ డిన్నర్ తిని, ట్రాఫిక్ లో పడి తిరిగి మా బసకు చేరుకునేసరికి రాత్రి పదయిపోయింది. కారు దిగగానే పరుగెత్తుకుని వెళ్లి రిసెప్షన్ లో అడిగి వీల్ చైర్ పట్టుకొచ్చాడు కోమల్. ఇక అక్కణ్ణించి నా పని వీల్ చైర్ లో తిరగడమే అయ్యింది. ఆ ప్రయాణంలో ఎక్కడా ఎవరితోనూ నడిచి వెళ్లలేక, ఎన్నో చూడలేకయాను, అనుభూతించలేకపోయాను. మర్నాడు మేం మావీ నించి ఒవాహూ ద్వీపంలో హవాయి ప్రధాన కేంద్రమైన హనాలూలూకి వెళ్లాల్సి ఉండ డంతో వస్తూనే అందరూ అన్నీ సర్దుకుని, పడుకునేసరికి అర్థరాత్రయ్యింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.