ఆమెను పట్టించుకుందాం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
-వెంకు సనాతని
పొద్దుపొడవక మునుపే
బడలికను విదిలించి
నడక మొదలుపెడుతుంది
పొద్దుపోయాక ఎప్పుడో
ఆమె పరుగుకు విరామం దొరుకుతుంది
టైము టంగుమనక ముందే
టంచనుగా పనులన్నీ చక్కబెట్టడం
ఆమెకు వెన్నతో పెట్టిన విద్య
ఇంటి పనంతా ఆమెదే,
బయట పనికి కుదిరినా కూడా…
సూర్య చంద్రులకైనా అలుపుంటుంది కానీ,
అవనికి అలంకారమైన ఆమెకు
దైనందిత జీవన గమనంలో
ఏ మలుపులోనూ అలుపుండదు
ఇష్టాయిష్టాల్ని
ఎరిగి నడుచుకోవడంలో
ఆమె తర్వాతే ఎవరైనా…!
ఆమె ఇష్టాన్ని గురించి
ఆమెకున్న కష్టాన్ని గురించి
చెప్పుకోదు మానవతి
తప్పొప్పులు సరిదిద్దుతూ
అందరి యోగక్షేమాలు వహించే ఆమెకు
నెలలో మూడు రోజులు
నెలసరి తప్పనిసరి !
సత్తువ సన్నగిల్లే సమయం
పొత్తి కడుపులో సమ్మెట పోటు సమరం
భరించలేని బాధ
సహించలేక కోపం చిరాకు
ఎవరికి చెప్తే ఏం లాభం
అంటు ముట్టు అంటూ దూరం పెడతారు
జిగుప్సతో కూడిన ముఖకవళికలతో పళ్ళికిలిస్తారు
అవసరాలను అడిగితే నామోషీగా ప్రవర్తిస్తారు
దోషిగా చూస్తారు
బహిష్టును బూతుగా భూతంగా
భూతద్దంలో పెట్టి చూసే లోకానికేం తెలుసు
అది ఓ ప్రాకృతిక ధర్మమని
అదియే మానవాకృతికి కారణమని !
ఆమె మూగ వేదన
మనకెప్పటికీ అర్థం కాదు, నిజమే !
ఆ మూడు రోజులైనా
మనల్ని పుట్టించే ఆమెను పట్టించుకుంద్దాం !!
*****