అలవాటే ఆమె కది

– ప్రసాదరావు రామాయణం

అలవాటే ఆమేకది..
విషాదాన్ని మ్రింగి
అలవోకగా చిరునవ్వు విసరడం!
గరాళాన్ని త్రావి
గొంతులో దాచుకోవడం!!

అలవాటే ఆమేకది
విరిసీ విరియగానే
సావాసగాళ్లను దూరంపెట్టి
ఊరించడం,ఉడికించడం !

అలవాటే ఆమేకది..
పుట్టినింటి ఆత్మీయ అయస్కాంత వలయాన్ని ఛేదించుకుని
మెట్టినింటిలో క్రొత్త అనుభూతులు
వెతుకుకోవడం !

అలవాటే ఆమేకది
అత్తగారి ఎత్తిపొడుపులను
అతి సాధారణంగా అనుభవించడం !

అలవాటే ఆమేకది….
పురిటి నొప్పులలో
మరుసటి సౌఖ్యాన్ని అనుభూతించడం
పాపను చూచినంతనే
స్తన్యం చిమ్మడం !

అలవాటే ఆమేకది…
తనో మనములను పతికిచ్చి
తాను ఏమీ లేని పేదగా మిగిలి పోవడం !

అలవాటే ఆమేకది….
అర్ధాంగుడి విషాదంలో
ఆధరాలనద్ధి సాంత్వననివ్వడం
పతి కన్నీటిని జిహ్వతో తుడవడం!

అలవాటే ఆమేకది
ఆర్ధికమంత్రిగా
కూడికలూ తీసివేతలూ చేసి
భాగహారంలో శేషం మిగిల్చడం !

అలవాటే ఆమేకది…
తొలి గురువుగా తన బిడ్డలకు బోధించడం…
మాట నడక నడతలు నేర్పించడం !

అలవాటే ఆమేకది
స్వార్ధమో పరమార్థమో
సుమంగళిగానే మరణించాలని
దైవాన్ని ప్రార్ధించడం !

అలవాటే ఆమేకది..
కన్నకొడుకులు అమ్మనొకరూ
నాన్ననొకరూ పంచుకుంటే
కన్నీరు తుడుచుకుని నవ్వడం !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.