సమన్యాయం

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-ఎ.శ్రీనివాసరావు (వినిశ్రీ)

          “నేను చెప్పిన విషయం ఆలోచించావా ఆకాష్, మనం ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. నేను ఆఫీసు వాళ్ళకు ఏ నిర్ణయమైనా ముందుగానే చెప్పాలి.”

          ఆకాష్ మెదడులో సవాలక్ష సందేహాలు మొన్న మొన్నటి వరకు తిరిగాయి. ధరణి ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు.

          “సమాధానం లేకుండా అలా మౌనంగా ఉంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆకాష్. ఔననా, కాదనా? ‘మౌనం… అర్థాంగీకారం అంటే సగం అనంగీకారం అని కూడా!’ కదా.
ఏ నిర్ణయం తీసుకోలేక మధనపడిన ఆకాష్ కు తన స్నేహితుడు అరుణ్ కొద్ది రోజులు విదేశాల నుంచి వచ్చి తన ఇంట్లో ఉండడం ఆ సందర్భంగా తనకు అరుణ్ కు మధ్య జరిగిన సంభాషణ అంతా గుర్తుకు వస్తుంది.

          “ఏంటి ఆకాష్, ధరణికి నీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా. మీరు ఇద్దరూ నా దగ్గర ఏదో దాస్తూ నటిస్తున్నట్లు అనిపిస్తుంది.” అడిగాడు అరుణ్.

          “ధరణికి ప్రమోషన్ వచ్చింది.”

          “అది సంతోషించవలసిన విషయమే కదా, దానికి ఎందుకు ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.”

          “ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ ఉంటుంది. కొత్త ఊరిలో చిన్న బాబును తను చూసుకోవడం కష్టం. నా ఉద్యోగం అక్కడికి మారదు. తనకి కెరీర్ లో తరువాత బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రమోషన్. ఓ సంవత్సరం పాటు బాబును చూసుకోగలవా అని అడుగుతుంది. బాబు చాలా చిన్నవాడు, మగాడు చంటి పిల్లలను ఎలా చూడగలడు, నా వైపు తను ఆలోచించడం లేదు. ఈ విషయమై చాలా రోజులుగా ఇద్దరి మధ్య గోడవ అనను కానీ ఓ రకమైన ఘర్షణ ఏర్పడుతుంది.”

          “అదేంటి, బాబు గాడికి నువ్వు తండ్రివే కదా. తల్లి, తండ్రి ఎవరికి వీలైతే వాళ్ళు చూడగలగాలి. పాలు పట్టడం ఒక్కటే ప్రకృతి పరంగా మగవాడు చేయలేనిది. మిగిలిన అన్ని పనులు మగాడు అయినా ఆడవారు అయినా నేర్చుకోవాల్సిందే కదా!”

          “తల్లిగా తను చేస్తున్న అన్ని పనులు నేను ఎలా చేయగలను. స్నానం చేయిం చడం, ఏడిస్తే ఓదార్చడం, డైపర్ లు మార్చడం ఇవేవీ నేను చేయలేదు. ఆడాళ్ళు అయితే అవలీలగా చేస్తారు కదా.”

          “నువ్వు చేయలేదు అన్న పనులు ధరణి కూడా ఇంతకు ముందు చేయలేదు.
తల్లి అయ్యాకే తను అన్నీ నేర్చుకుంది. అవసరం అన్నింటినీ నేర్పిస్తుంది, అయితే చేయాలన్న సంకల్పం ఎవరికైనా ఉండాలి.”

          “ఊరిలో ఉంటేనే వాడికి చిన్నది బాగు లేకపోతే తల్లడిల్లి పోతుంది. ఇంకో ఊరిలో ఎలా ఉంటుందో అని నా భయం.”

          “ఆ భయాలన్నీ పక్కన పెట్టి కెరీర్ ఎదుగుదల కోసం తాను సాహాసం చేస్తుంది. అందుకే నీ వంతు సహకారాన్ని ఆశిస్తుంది. కెరీర్ ముఖ్యం అని తాను ముందడుగు వేస్తుంటే నీకు వీలైన సహాయం చేయాలి. ఆమె సంపాదన కుటుంబానికే కదా,  ఎదుగు దల అనేది వ్యక్తిగతమైనా ఆనందించే వారిలో నువ్వూ ఉంటావు కదా?”

          “తల్లి ప్రేమ, మమకారం తండ్రిగా నేను పంచలేను కదా!”

          “స్త్రీ కే ప్రేమ, మమకారం ఉండాలి, మగవాడిది రాతి గుండె, ఇవన్నీ సమాజం మన మెదళ్ళను కండీషన్ చేసిన ఫలితం. స్త్రీ, పురుషుడు కన్నా ఒకింత ఎమోషనల్ కావచ్చు, అలాగే పురుషుడు, స్త్రీ కన్నా శారీరకంగా దృఢంగా ఉండవచ్చు. అంత మాత్రాన ఆడాళ్ళ లాగ ఏడుస్తూ ఉంటావేంటి అనడంతోనే మగాడు ఏడవలేక పోతున్నాడు.”

          “నీలో చాలా మార్పు కనిపిస్తోంది రా.”

          “ఆకాష్, ఉద్యోగ రీత్యా దేశ దేశాల తిరగడం, అక్కడ ఉన్న సంస్కృతి  సంప్రదాయా లు గమనించి అందులో మంచిని పరిశీలించడం వలన నా ఆలోచనల్లో కొంత మార్పు రావడం జరిగింది.”

          “అంత గొప్పతనం ఏమిటో?”

          “నాకేమీ మన సంస్కృతిని తక్కువ చేయాలని లేదు. ప్రతి సంస్కృతిలోనూ కొంత మంచి, కొంత చెడు ఉంటుంది. మంచిని స్వీకరించడమే మన పని. ఉదాహరణకు బాత్ రూమ్ లు కడగడం పనివాళ్ళో, ఆడవాళ్ళో మాత్రమే చేయాలని అక్కడ ఎవరూ అనుకోరు, అలాగే పిల్లలు పెంపకం కూడా.”

          “బాబు పుట్టిన వెంటనే కొన్ని రోజులు పెద్దవారు చూసారు,‌ అదీ అమ్మ, అత్త. తరువాత ధరణి. నాకెప్పుడూ పిల్లల పెంపకం గురించి కలగ చేసుకునే అవసరం రాలేదు.”

          “పెద్దవారు ఉన్నప్పుడు చేసారు సరే. ఆ సమయంలో మన దగ్గర ఈ విషయం గురించి మగాడిని కల్పించుకోనివ్వరు, సరికదా చేయకూడని పని అని నూరిపోస్తారు. అక్కడే చిక్కు సమస్య. అందుకే నీ మనసు ఈ పని చేయడానికి అంగీకరించడం లేదు.”

          “నేను నిర్ణయం తీసుకున్నా ఈ పని ఎంత వరకు చేయగలను అనేది సందేహమే. అంతేకాకుండా మా కుటుంబాలు ఎలా తీసుకుంటారనేది కూడా ఓ ప్రశ్న.”

          “నువ్వు అంత ఆలోచించనవసరం లేదు. తప్పనిసరిగా ఉండవలసిన సమయం లో నీ అవసరం రాలేదు. ఇప్పుడు అవసరమూ వచ్చింది. నువ్వు మేనేజ్ చేయగల పరిస్థితి, అంటే బాబు కొంచెం పెద్దవాడు అయ్యాడు. అందుకే నీ సహాయం అడిగి ఉంటుంది.”

          “ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు ఒప్పుకున్నా తను ఎంత వరకు ఉండగలదు అనేది తన సమస్య. ఏదో ఒకటి తేల్చి చెప్పు, పై అధికారులకు తను చెప్పుకోవాలి కదా! దాని ప్రకారం తను ప్లాన్ చేసుకొంటుంది.”

          “అరుణ్, ఉదయం లేచిన నుంచి రాత్రి నిద్రపోయే వరకూ ప్రతి సందర్భంలోనూ అవసరం ఉన్నంత మేరకు నువ్వు చేస్తున్న సహాయం చూస్తున్నా. నేను మగాడిని, ఇది నా పని కాదు, అని ఎక్కడా ఫీల్ అయినట్టు నాకైతే అనిపించలేదు. తను కూడా మొహమాటపడకుండా ఎప్పడు అవసరమైతే అప్పుడు నీకు పనులు చెప్పడం చూసాను.
అప్పటి నుంచే నాలో నాకు సంఘర్షణ మొదలైంది.”

          “నిజమే ఆకాష్, అలాంటి పరిస్థితి నీకు రాలేదు. అలవాటు కావడానికి సమయం పడుతుంది. మొత్తం బాధ్యత అంతా ఇప్పటి వరకు ధరణే తీసుకొంది. నువ్వు కేవలం ఆ స్థితిని ఆనందించే స్థాయిలోనే ఉండిపోయావు. ఇక నీ వంతు వచ్చింది.”

          అంత సమయం మాట్లాడకుండా ఆలోచనల్లో పడ్డ ఆకాష్ ను చూసి ధరణి గట్టిగా పిలిచింది. అప్పుడు తేరుకుని ఆకాష్ మాట్లాడడం ప్రారంభించాడు.

          “ధరణీ, నిన్న మొన్నటి వరకు నువ్వు చెప్పిన ప్రపోజల్ అంగీకరించే స్థాయిలో నా మనసు లేదన్నది నిజం. అరుణ్, నేను దీని గురించి అనుకోకుండా చర్చించాం. దాంతో నాకో క్లారిటీ వచ్చింది. నువ్వు అడిగేంత వరకూ చెప్పేందుకు సిద్ధంగా నేను కాలేదు. కాకపొతే ప్రిపరేషన్ ప్లాన్ చేసా. మా కొలీగ్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న పని ఆవిడతో
మాట్లాడా సహాయానికి, తను బాబు గాడిని చూడటానికి కూడా ఒప్పుకొంది. పెద్ద ఆవిడ కదా కొంత అనుభవం కూడా ఉంటుంది. నేను కొన్ని నెలలు లాస్ ఆఫ్ పే, కొంత కాలం వర్క్ ఫ్రం హోం ఇలా ఎలానో ఒకలా అడ్జస్ట్ అవుతాను. ఇంట్లో కెమెరా కూడా పెట్టిస్తున్నా, బాబు గాడిని ఆన్ లైన్ లో ఇరవై నాలుగు గంటలూ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు. కొంత అయినా దగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా! ఇది నా నిర్ణయం.”

          “ఆకాష్ ఈ మాత్రం భరోసా ఉంటే నా ఎమోషనల్ ఫీలింగ్ నుంచి కొంత బయిట పడగలను, లేదంటే కుటుంబానికి ఏదో అన్యాయం చేస్తున్నానే బాధ వెంటాడుతుంది. నాకే కాదు ఏ స్త్రీకైనా. ఇదే మేం కోరుకున్నది మగాళ్ళ నుంచి, మగడు నుంచి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.