మాకు మీరూ మీకు మేమూ
(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-జి.యెస్.లక్ష్మి
“ఇప్పుడెలాఉంది పిన్నిగారూ..” నెమ్మదిగా కళ్ళు విప్పిన అనసూయకి తన మీదకి వంగి ఆరాగా అడుగుతున్న ప్రసన్నని చూస్తే “అమ్మయ్యా..” అనిపించింది. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆమెకి ఆసరా అందిస్తూ నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది
ప్రసన్న..
“వేడిగా కాఫీ కలిపి తెమ్మంటారా..” అనడిగిన ప్రసన్నని వద్దని చేత్తో వారిస్తూ.. హాల్ వైపు చూసింది. ఆమె ప్రశ్న తెలిసినట్టు “బాబాయిగారూ… పిన్నిగారు లేచారు..” అంటూ హాల్లో వున్నరాజారావుని పిలిచింది.
ప్రసన్న మాట విని బెడ్ రూం లో కొచ్చిన రాజారావు ముఖం అనసూయ లేచి కూర్చోవడం చూసి విచ్చుకుంది.
“అమ్మయ్య.. తెలివొచ్చిందా..కాస్త వేడిగా ఏమైనా తాగుతావా..” అడిగేడు..రాజారావు ముఖంలో అనసూయకోసం అతను పడిన ఆరాటం స్పష్టంగా కనిపించిందావిడకి.
“ఉహూ.. ఏవీ వద్దు..” అంది తను బాగానే వున్నట్టు కనిపించడానికి పెదాలమీదకి నవ్వు తెచ్చుకుంటూ..
“కొంచెం హార్లిక్స్ కలిపి తెస్తాను పిన్నిగారూ..” అంటూ ప్రసన్న అక్కణ్ణించి వంటింట్లోకి వెళ్ళింది.
“అలా పడిపోయేవేవిటీ.. ఎంత భయమేసిందో..” నెమ్మదిగా అనసూయ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగేడు రాజారావు.
“ఏవిటో..నీరసంతో కళ్ళు తిరిగినట్టనిపించిందండీ..”
ఇంతలో ప్రసన్న హార్లిక్స్ తీసుకుని రావడంతో రాజారావు అక్కణ్ణించి హాల్లోకి వచ్చేసి కుర్చీలో కూలబడ్డాడు.
ఏభైయేళ్ళ వైవాహిక జీవితం..ఇరవైయేళ్ళనించీ పిల్లలిద్దరూ అమెరికాలో వారి వారి జీవితాల్లో సెటిలయి హాయిగా వున్నారు. అప్పట్నించీ తామిద్దరే హైద్రాబాదులో పైనున్న వాటా అద్దెకిచ్చి, కింద వుంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు. ఏడాదికో రెండేళ్ళకో వీళ్ళు అమెరికా వెళ్ళినప్పుడో పిల్లలు ఇండియా వచ్చినప్పుడో మాత్రమే వాళ్లకి పండగ.ఈ మధ్య పిల్లలిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ ఎవరి సాయం లేకుండా వుంటుంటే అక్కడ వాళ్ల మనసు లకి బాగాలేదనీ, వీళ్ళు కూడా అక్కడికే వచ్చేస్తే హాయిగా బెంగ లేకుండా వుండొచ్చనీ ఒక
ప్రతిపాదన మొదలెట్టేరు. వాళ్లన్న మాట నిజవే. అక్కడ పిల్లలిద్దరూ అమెరికాలో సిటిజన్ షిప్ తెచ్చుకుని, కోటల్లాంటి ఇళ్ళు కొనుక్కుని, మళ్ళీ ఇండియా వచ్చేఉద్దేశ్యమే
లేదన్నట్టున్నారు. కానీ అలవాటయిన ఊరునీ, కష్టపడి కట్టుకున్న ఇంటినీ, చుట్టాల్నీ, స్నేహితులనీ వదిలేసి శాశ్వతంగా దేశం కాని దేశం వెళ్ళాలంటే ఇద్దరికీ ఎందుకో మనసు అంగీకరించక పిల్లల ప్రతిపాదనని అలా అలా నెట్టుకొస్తున్నారు. రాజారావు, అనసూయా కూడా ఈ ఇరవైయేళ్ళనుంచీ బాగానే కాలక్షేపం చేసుకుంటున్నారు. పైనున్న వాటా అద్దెతో, రాజారావు కి వచ్చే పెన్షన్ తో ఇంటా బయటా పనిచెయ్యడానికి నలుగురు మనుషులని పెట్టుకున్నారు. హైద్రాబాదులో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ హాజరవుతూ, అందరితో పరిచయం పెంచుకున్నారు. బంధుమిత్రులతో గెట్ టు గెదర్లూ అవీ చెసుకుంటూ వాళ్ళు సంతోషంగా వుంటూ, చుట్టూ వుండేవాళ్లని సంతోషంగా ఉంచుతూ కాలం గడుపుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్నంతటినీ తలకిందులు చేసి పడేసింది. ఎదురుగా మనిషి అన్నవాడు కనిపిస్తే హడిలిపోయే పరిస్థితి తెచ్చి పెట్టింది. అంతా చూస్తున్న రాజారావు, అనసూయ కూడా కొన్నాళ్ళపాటు పనిమనుషు లని మానిపించేసుకుని, మళ్ళీ అంతా చక్కబడ్దాక పెట్టుకుందాం అనుకున్నారు. కానీ అలా కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళొ తెలీకుండానే యేడాది దాటిపోయింది. ఈ యేడాదినించీ అనసూయ ఒక్కతే ఇంట్లో మొత్తం పనులన్నీ చేసుకోవడంతో అలిసిపోయింది. అక్కడికీ పాపం రాజారావు కూడా అతనికి అలవాటులేని పనులు ఎన్నో నేర్చుకుని సాధ్యమైనంత సాయం చేస్తూనే వున్నాడు. అయినాసరే శారీరకశ్రమవల్లా, వయసు ప్రభావం వల్లా
అనసూయ అలా కళ్ళు తిరిగి పడిపోయింది.
హార్లిక్స్ తాగేక అనసూయకి కాస్త ప్రాణం తెప్పరిల్లి మంచం మీద లేచి కూర్చుంది. ప్రసన్న ఆవిడ తాగిన గ్లాసు అందుకుంటూ, “ఈ పూట మీరేవీ హడావిడి పడకండి పిన్ని గారూ.. కాస్త కూరా, చారూ నేను చేసి తెస్తాలెండి.. రైస్ కుక్కర్ పెట్టేసి వెడతాను..” అంటూ వంటింటి వైపు వెళ్ళిపోయింది. అలా వెడుతున్నామెను కృతజ్ఞతాభావంతో చూస్తూండి పోయింది అనసూయ.
ఆ వారాంతంలో అమెరికా నుంచి పిల్లలు ఫోన్ చేసినప్పుడు రాజారావు అనసూయ విషయం చెప్పేడు. అది వినగానే వాళ్ళు చాలా ఖంగారు పడిపోయేరు. ఏదేమైనా సరే అమ్మానాన్నలిద్దర్నీ ఇంక హైద్రాబాదు వదిలేసి అమెరికా వచ్చి తీరాల్సిందేనని తేల్చేసేరు.
“సరే.. అలాగే చూద్దాం… ముందు ఈ మహమ్మారి గొడవలేవో తేలనీ..” అంటూ అప్పటికి ఆ ప్రసక్తికి చిన్న కామాలాంటిది పెట్టి పక్కనున్న ఈజీచైర్ లో కూలబడ్డాడే కానీ రాజారావుకి ఏంచెయ్యాలో అస్సలు తోచటంలేదు.
“ఏంటండీ ఆలోచిస్తున్నారూ! “ అంటూ వచ్చింది అనసూయ.
“అదే..పిల్లలన్న మాట గురించే.. “
“దేశంకాని దేశంలో ఎలాగండీ ఉండడం! ఏదో ఆర్నెల్లూ ఏడాదీ అయితే వేరు కానీ..”
“మనిద్దరమే ఇక్కడుంటే చూసేవాళ్ళెవరూ లేరని పిల్లలు బెంగ పెట్టుకున్నారు..”
“ఎందుకూ బెంగా. ఇప్పుడు పైవాటాలో మంచివాళ్ళే వచ్చేరుగా. ఆ సారథి పాపం ఈ మహమ్మారి వచ్చినప్పట్నించీ మనకి బైట్నించి కావల్సినవన్నీ తెచ్చిస్తున్నాడయ్యె. ఇంక ఆ పిల్లేమో పిన్నిగారూ అంటూ పొద్దున్నా, సాయంత్రం వచ్చి నాక్కావల్సినవన్నీ అమర్చి వెడుతోందయ్యె. ఈ మహమ్మారి కాస్తా తగ్గేక ఇదివరకులాగే నలుగురు మనుషు లని పెట్టుకుంటే సరీ.”
“ఇదిప్పుడప్పుడే తగ్గేలా కనపట్టంలేదు. ఒకటి తర్వాత ఇంకోటి వస్తుందంటున్నా రు. పైగా సారథీవాళ్ళు కూడా స్వంతఫ్లాట్ కొనుక్కోవాలని చూస్తున్నారుకదా! వాళ్ళకి నచ్చింది దొరికితే వెళ్ళిపోతారు. తర్వాతవాళ్ళు ఎలాంటి వాళ్ళొస్తారో.”
రాజారావు మాటలకి అనసూయ దగ్గర సమాధానం లేకపోయింది.
నిజవే.. ఈ రెండేళ్ళ నుంచీ సారథీ వాళ్ల కుటుంబం ఈ పెద్దవాళ్లతో బాగా కలిసిపోయింది. అంతకుముందు పైన అద్దెకున్నవాళ్ళు వీళ్ళకి చాలా చిరాకు తెప్పించే సేరు. మళ్ళీ అద్దెకివ్వాలనుకున్నప్పుడు చాలా చాలా ఆలోచించి ఈ సారథీ వాళ్లకీ ఇచ్చేరు. సారథి షిఫ్ట్ సిస్టమ్ మీద నడిచే ఏదో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్. అతని టైమింగ్స్ కూడా ఒక్కొక్కసారి పొద్దున్న ఇంకోసారి సాయంత్రం ఉంటాయి. అందుకే ఎమ్మేపాసయినా ప్రసన్న సారథికున్న టైమింగ్స్ వల్ల ఎక్కడా ఉద్యోగంలో చేరలేదు. వాళ్ళ కొడుకు మురళి తొమ్మిదోక్లాసు చదువుతున్నాడు. సారథీవాళ్ళు కూడా చాలా అవసరమైతే తప్పితే కిందున్నవీళ్ళని డిస్టర్బ్ చేసేవారు కాదు. కానీ ప్రతిరోజూ ఉదయాన్నే ప్రసన్న కిందకి వచ్చి పూలు కోసి కొన్ని అనసూయకిచ్చి కొన్ని తను తీసికెళ్ళేది. మొత్తానికి సారథీ, ప్రసన్నల మీద వాళ్ళకి కాస్త మంచి అభిప్రాయం ఏర్పడే సమయానికి కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నంతా చుట్టేసి, జనాలందర్నీ భయభ్రాంతు ల్ని చేసేసింది. పెద్దవాళ్లైన రాజారావు, అనసూయల్ని ఇంట్లోంచి బయటికి కదలొద్దని సారథే వీళ్ళకి కావల్సినవన్నీ తెచ్చి పెట్టేవాడు. ప్రసన్న వచ్చి వీళ్ళ మంచీచెడ్డా కనుక్కుంటూండేది. అన్నింటికన్నా చెప్పుకోవల్సింది మురళి రాజారావుకి బాగా దగ్గరై పోయేడు. ఇంట్లోంచే క్లాసులు జరుగుతుండడంతో ఇంట్లో కూర్చుని విసుగెత్తిన మురళీ వాళ్లమ్మనాన్నల దగ్గర పేచీలు పెడుతుంటే ఏవీ తోచని రాజారావు అతన్ని ఆడుకుం దాం రమ్మని, ఎప్పుడో పిల్లలతో కలిసి ఆడుకున్న క్యారమ్ బోర్డ్, స్క్రాబుల్ బైటికి తీసి ఆడడం మొదలెట్టేడు. మధ్య మధ్య కథలు చెప్పుకుంటూ, జోక్స్ చెప్పుకుంటూ ఇద్దరూ తాతామనవళ్ళలాగ మంచి స్నేహితులైపోయేరు. వీళ్ళిద్దరినీ చూస్తున్న సారథీ, ప్రసన్న మురళీకి ఈ సమయంలో మంచిమాటలు చెప్పే తాతగారు దొరికినందుకు ఎంతో ఆనంద పడిపోయేరు.
ఇహనో ఇప్పుడో ఈ మహమ్మారి అందర్నీ వదిలిపోతుందీ మళ్ళీ హాయిగా పాత రోజుల్లోలా బంధుమిత్రులని కలవచ్చు అనుకుంటుంటే ఆ ఛాయలేవీ కనుచూపుమేరలో కనపడకపోగా అనసూయ ఇలా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడం రాజారావుని టెన్షన్ లో పడేసింది. ఇప్పుడేం చెయ్యాలి? తమకేదైనా అయితే స్నేహితులూ, చుట్టాలూ ఎవ్వళ్ళూ రారు.. ఎవరి భయం వాళ్లది. దానికి సిధ్ధపడి ఇద్దరూ బిక్కు బిక్కుమంటూ ఇక్కడే ఉండడమా లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడమా.. ఆలోచనలో మునిగిన రాజారావు దగ్గరికి “అంకుల్, ఇవిగోండి మీరు తెమ్మన్న సరుకులు.” అంటూ వచ్చేడు సారథి.
ఉలిక్కిపడి ఈ లోకంలో కొచ్చిన రాజారావు “ఏవిటి విశేషాలు. ” అంటూ అతన్ని కబుర్లలోకి దింపేరు..
“ఈపూట భోంచేసి విజయవాడ వెడదామనుకుంటున్నానండీ. ”
“ఏవిటంత అర్జెంటూ..ఇలాంటి టైములో ఊరెళ్ళడం అంత మంచిది కాదేమో..”
“నిజవేననుకోండి కానీ మా నాన్నగారు పోయేక ఊళ్ళో వున్న కాస్త పొలం, ఇల్లూ అమ్మకానికి పెట్టేం కదా.. అదేదో బేరం కుదిరిందిట. సంతకాలు పెట్టడానికి రమ్మని మా అన్నయ్య ఫోన్ చేసేడు.”
“ఓహ్.. ఇంతకీ ఆ వచ్చిన డబ్బు ఏం చేద్దావనీ!” పెద్దమనిషి తరహాగా అడిగేడు రాజారావు.
“అదేనండీ.. ఫ్లాట్ ఏదైనా కొందామని చూస్తున్నాం. ఆ డబ్బు డౌన్ పేమెంట్ చేసేస్తే
మిగిలింది బేంక్ లోన్ తీసుకుని నెల నెలా కట్టుకుందామనీ.”
“మరెక్కడైనా నచ్చింది దొరికిందా!”
“ఎక్కడండీ.. నాకూ మావాడికీ కాలేజీ, స్కూలూ దగ్గరని ఈ లొకాలిటీలో చూద్దా మంటే చాలా చెప్తున్నారు. మా బడ్జెట్ లో కావాలంటే సిటీ ఔట్ స్కర్ట్ స్ కి వెడితేకానీ దొరికేలా లేదు.” వివరంగా చెప్పి పైకి వెళ్ళిపోయేడు సారథి.
రాజారావుకి ఒక్కసారి తను ఆ వయసులో పడ్ద కష్టం గుర్తొచ్చింది. నలభైయేళ్ళ క్రితం పిల్లలింకా చిన్నక్లాసుల్లో వున్నప్పుడే తాము ఈ ఇల్లు కట్టుకుని వచ్చారు. కొత్తలో సిటీబస్ ఎక్కడానికి కిలోమీటర్ పైన నడవాల్సి వచ్చేది. పిల్లలిద్దరూ స్కూల్ కి వెళ్ళ డానికి ఆటో రానప్పుడు తనో, అనసూయో స్కూల్ కి వెళ్ళి పిల్లల్ని తీసుకు రావల్సొ చ్చేది. ఆ రోజుల్లో ఇక్కడ అసలు ముసిసిపల్ వాటర్ సప్లై కూడా ఉండేదికాదు. నలభై అడుగులపైగా లోతుకి బావి తవ్వించుకుని, మోటార్ పెట్టుకున్నారు. నెమ్మది నెమ్మదిగా సిటీ పెరుగుతుండడంతో ఈ నలభైయేళ్ళలో ఈ లొకాలిటీ మంచి సెంటర్ అయి పోయింది. ఇప్పుడు నాలుగడుగులు వేస్తే చాలు మెయిన్ రోడ్ మీద అన్నీ పెద్ద పెద్ద షాపులే. ధరలు కూడా బాగా పెరగడంతో అప్పుడు వేలల్లో కొన్న ఈ స్థలం ఇప్పుడు కోటి రూపాయిలు పలుకుతోంది.
సిటీలో వున్న చుట్టాల ఇళ్ళకి వెడుతూ వస్తూ హాయిగా కాలం గడిపేసుకుంటున్న తమకి ఈ కరోనా మహమ్మారి కాళ్ళూచేతులూ కట్టిపడేసింది. ఈ ఏణ్ణర్ధం నుంచీ తాము పడుతున్న పాట్లు ఆ భగవంతుడికే తెల్సు. ఇంకెన్నాళ్ళు ఇలా గడుపుకోవాలో!
ఆలోచిస్తున్న రాజారావుకి పోనీ పిల్లలడిగినట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతేనో అనిపించింది. కానీ మరుక్షణమే ఈ దేశం, పరిసరాలూ శాశ్వతంగా వదిలి వెళ్ళడమంటే మనసు ఎందుకో అంత సిధ్ధపడుతున్నట్టుగా అనిపించలేదు. ఒక్కసారి అతనికి తన తండ్రి గుర్తు వచ్చేరు. ఆయనని ఎన్నిసార్లు తమ దగ్గరికి వచ్చి వుండమన్నాకూడా అలవాటైన ఆ పల్లెటూరినీ, స్వంత ఇంటినీ, పరిచయస్తులనీ వదిలి రాలేననేవారు. అప్పుడు ఆయన అలా ఎందుకన్నారో ఇప్పుడు రాజారావుకి అర్ధమవుతోంది. అసలు ఈ సమస్యకి పరిష్కారం అంటూ ఏదైనా వుంటుందా అని ఆలోచనలో పడిపోయేడు రాజా రావు.
మామూలుగానే వారాంతంలో కాన్ఫరెన్స్ కాల్ చేసినప్పుడు కొడుకులిద్దరూ గట్టి పట్టే
పట్టేరు.
“ఎందుకు నాన్నా ఈ వయసులో మీరిద్దరూ అవస్థ పడడం..ఇక్కడి కొచ్చేస్తే హాయిగా కలిసుండొచ్చు. మీరెలా వున్నారోనని మాకూ ఇంక బెంగుండదు..”
“అదికాదర్రా..వచ్చి ఏఆర్నెల్లో వుండడం వేరూ.. మొత్తం ఇక్కడ చుట్టబెట్టేసి
వచ్చెయ్యమంటే కాస్త ఆలోచించుకోవాలి కదర్రా..”
“అంతాలోచనెందుకు. ఇల్లెలాగూ పాతదే. అమ్మకానికి పెట్టేస్తే సరీ. మనకి డబ్బు ముఖ్యం కాదుకదా! ఎంతో కొంతకి సెటిల్ చేసేసుకోండి.”
రాత్రంతా పిల్లలన్న విషయమే ఆలోచిస్తూ నిద్రకి కూడా దూరమయ్యేడు రాజారావు.
ఆ మర్నాడు పొద్దున్న ప్రసన్న పూలుకోసి ఇస్తున్నప్పుడు అడిగింది అనసూయ.
“ఫ్లాట్ కొనుక్కుందామనుకుంటున్నార్ట కదా! ఈయన చెప్పేరు. మంచిపనే. ఎక్కడ
చూసుకుంటున్నారూ.”
“ఔట్ స్కర్ట్స్ లో రెండుమూడు చోట్ల చూసేవండీ.. ఏదో ఒకటి సెటిల్ చేసుకుందా వనీ.” అంది ప్రసన్న.
“ఎంత అవుతుందనుకుంటున్నారూ!”
వాళ్ళు అరవైలక్షలు చెపుతున్నారండీ. మేం యాభయ్యి కిమ్మంటున్నాం.”
“మంచిపని చేస్తున్నారు. మీలాగే మేవూ పిల్లలు చిన్నగా వున్నప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇలాగే అవస్థలు పడ్డాం..” నవ్వుతూ చెప్పింది అనసూయ.
“ఎవరైనా అంతేనండి. ఒక వయసులో అవస్థలు పడక తప్పదుకదా!” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ప్రసన్న.
అక్కడే పేపర్ చదువుకుంటూ వాళ్ళ మాటలు వింటున్న రాజారావుకి ఒక్కసారి బుర్రలోకి తళుక్కుమంటూ ఒక ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనని తిరగామరగా వేసి చాలాసేపు దానిగురించే విశ్లేషించుకుంటూ ఉండిపోయేడు రాజారావు.
ఆ మధ్యాహ్నం భోజనాలయేక అనసూయని పిలిచేడు. ఏవిటోనని వచ్చిన అనసూ యని పక్కన కుర్చీలో కూర్చోమని చెప్తూ.. “నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇద్దరం ఇలా ఇంకోళ్ళ సహాయం లేకుండా ఉండడం పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.” అన్న రాజారావు మాటలకి అవునన్నట్టు తలూపింది అనసూయ.
“మనకేమో కష్టపడి కట్టుకున్న ఈ ఇంటినీ, పరిసరాల్నీ వదిలి దేశం కాని దేశానికి పోవాలంటే మనసొప్పటంలేదు.. పోనీ ఇక్కడే ఉండిపోదామంటే ఈ మహమ్మారి వలన చుట్టాలూ, స్నేహితుల సాయం కూడా అడగలేకపోతున్నాం.”
“ప్రస్తుతం పైనున్నవాళ్ళు సాయం చేస్తున్నారు కదండీ.”
“మరి వాళ్ళు కూడా ఎక్కడో ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయే ప్రయత్నంలో వున్నారు కదా!”
“ఇంకోళ్ళ నెవర్నైనా మంచివాళ్లని తెచ్చుకుంటే సరీ..”
“ఎలా తెలుస్తుందీ ఎవరు మంచివారో.. క్రితం రెండుసార్లూ అద్దెకున్నవాళ్ళతో మనం పడ్ద అవస్థలు మర్చిపోయేవా!”
“మరేం చేద్దావంటారూ!”
“మనం ఉన్నన్నాళ్ళే ఈ ఇల్లు మనపేర ఉంటుంది. ఇప్పుడే ఈ పాతింటిని ఎంతో కొంతకి అమ్మెయ్యమనే పిల్లలు రేప్పొద్దున్న అయినకాటికి అమ్మేస్తారు. ఆ పనేదో మనం ఇప్పుడే చేసేస్తే..”
“అంటే ఇల్లమ్మేసి అమెరికా వెళ్ళిపోదావంటారా!” ఖంగారుగా అడిగింది.
“ఊహు.. మనం వుండగానే మనకి కావల్సినది వుంచుకుని పై పోర్షన్ అమ్మేద్దాం.. అదీ సారథీ వాళ్లకే.. ఎందుకంటే వాళ్ళని మనం రెండేళ్ళనించీ చూస్తున్నాం. మొగుడూ పెళ్ళాలిద్దరూ మంచివాళ్ళు. ఏవంటావూ!”
“కానీ, వాళ్ళు ఇంకెక్కడో చూసుకున్నారేమో..”
“అది దూరమౌతుందని ఆలోచిస్తున్నారు కదా! కింద ఇల్లు మనవే ఉంచుకుంటాం. మనింట్లో మనం వుంటున్న సంతృప్తి మనకుంటుంది. వాళ్లకి కూడా ఈ లొకాలిటీలో ఇల్లంటే సంతోషవే కదా! మనిల్లు మొత్తం అమ్మితే కోటిరూపాయిలు వస్తుంది. అదే పై భాగాన్ని మాత్రం అమ్మితే యాభైలక్షలే కదా! అది వాళ్ళ బడ్జెట్ లో వచ్చేస్తుంది కూడా.”
రాజారావు చెప్తున్న విషయాన్ని విన్న అనసూయ ఆలోచించడం మొదలెట్టింది.
“చూడు అనసూయా… మనం ఒక్కళ్ళం ఇలా ఉండడంవల్ల పిల్లలు బెంగ పెట్టు కుంటున్నారు. అక్కడికి వెళ్ళిపోదామంటే ఇంకా మన మనసు సర్దుకోలేకపోతోంది. పోనీ ఏదైనా ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళి మనలాంటి నలుగురితో కలిసి ఉందామనుకున్నా కూడా స్వంతిల్లు వదిలేసి వెళ్ళడం బాధగా అనిపిస్తోంది. సారథీవాళ్ళు మనకి కాస్త సాయం గానూ ఉన్నట్టుంటారు, మనింట్లో మనం ఉన్నట్టూ వుంటుంది. ఏవంటావ్..”
“కానీ ఇప్పుడు మనకి ఇల్లమ్ముకోవలసిన అవసరం లేదు కదండీ.”
“అప్పుడు డబ్బులు అవసరం కనక పైన పోర్షన్ వేసేం. కానీ ఇప్పుడు ప్రాధాన్య తలు మారేయి. ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు. తెల్లారిలేస్తే మన అజ కనుక్కునే మనుషు లు అవసరం. సారథీవాళ్ళు మనతో బాగా కల్సిపోయేరు కనక కావల్సినవాళ్లం ఒక్కదగ్గర ఉన్నట్టుంటుంది. ”
ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో వున్న అనసూయకి రాజారావు చెప్పిన ఈ ఆలోచనేదో బాగున్నట్టే అనిపించింది.
“కానీ సారథీవాళ్ళు ఈ పాతిల్లు కొంటారంటారా!”
“ఎందుకు కొనరూ.. కిందది కట్టి నలభైయేళ్ళైంది కానీ పైన వేసి పదేళ్ళేగా అయిందీ. అందులోనూ ఈ లొకాలిటీలో వాళ్లకీ ధరలో దొరకడవంటే మాట్లేంటీ!” ఖచ్చితంగా చెప్పేడు రాజారావు.
“అంతేకాదండోయ్.. మీదగ్గర మురళి మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నా డని వాళ్ళూ సంతోషపడుతున్నారు.”
“వాడిని వదులుకోలేకే కదా ఈ ఆలోచన. ఇంతకీ నువ్వేవంటావో చెప్పలేదు.” మనసులోని మాట బైటకొచ్చిన రాజారావు సీరియస్ గా భార్య నడిగేడు.
“ఏవంటానూ….మీ ఆలోచన ఉభయతారకంగా ఉందంటాను. ” అంది నవ్వుతూ.
ఆమె ముఖంమీది నవ్వు చూసేక రాజారావుకి గుండెల మీద భారం దించు కున్నట్టనిపించి మనసు శాంతపడింది.
*****
నా పేరు గరిమెళ్ళ సుబ్బలక్ష్మి. జి.యస్.లక్ష్మి పేరుతో రచనలు చేస్తుంటాను. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ , కర్ణాటకసంగీతం(వీణ)లో డిప్లొమా చేసాను. పలు పాఠకుల ప్రశంసలు పొందిన కొన్ని పురస్కారాలు, బహుమతుల వివరాలు…