టోనీ ప్రో, కాలిఫోర్నియాకు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, పెయింటింగ్ లో శిక్షణ పొందారు.
అతనివి కాల్పనిక చిత్రాలు కావు. ఊహాజనితం కావు. వాస్తవికత నిండినవి. అతను ఎప్పుడూ తన నిజ జీవితంలోని వ్యక్తులను చిత్రించాలని అనుకుంటాడు : తన అందమైన భార్య, పిల్లాడు, తన మిత్రులు, క్లబ్ లో సిగరెట్ తాగుతూ పేకాటాడేవాళ్లు..
తన చిత్రాల్లో టోనీ : వాళ్ళని ఎంత బాగా, నిజాయితీగా చూపిస్తాడంటే – ఆ బొమ్మల్లోని వ్యక్తులు కాన్వాస్ లోంచి సజీవంగా బయటకు వస్తూ వాళ్లెవరో.. వాళ్ళు ఏమనుకుంటు న్నారో ..చెప్పాలని అనుకుంటూన్నంత సహజంగా మనకు కనిపిస్తారు!
‘నేను ఏం చూస్తానో.. ఏం అనుకుంటానో.. ఎలా అనుభూతి చెందుతానో – అదే నా ఆర్ట్’ అని టోనీ అంటాడు . తన బొమ్మల్లో మనుషులను నాటకీయ రీతిలో నిలబెడతాడు. రొమాంటిక్ పోజులు అతనికి నచ్చవు.
పెయింటింగ్ లో అత్యంత ముఖ్యమైనది – సరైన రంగులు కలపడం.. కాన్వాస్ లో సరైన చోట్ల వాటిని వాడటం.. వాటితో సరైన అనుభూతిని అందించడం అని టోనీ అంటారు. సుప్రసిద్ధ చిత్రకారుడు Rembrandt ను తన మోడల్ గా తీసుకున్నాడు, టోనీ తాను ఆరాధించే గురువులా రూప చిత్రాలని గీస్తాడు, వాటిలో ఉపన్యాసకుల నోళ్లు తెరుచుకుని ఉంటాయి -మనతో ఏదో చెప్పబోతున్నట్టు.. ఆయా వ్యక్తుల ఆత్మలను అవి ప్రతిఫలిస్తుంటాయి. దీన్ని అందరూ ఆకర్షణీయ వాస్తవికత అని అంటారు, కానీ టోనీ ‘నూతన వాస్తవికత ‘ అని అంటాడు. అయినా పేరులో ఏముంది?
అజంతా గుహల్లోని కుడ్య చిత్రాల నుంచీ వస్తోంది ఒక సంప్రదాయం – అదే ఒక సన్నివేశాన్ని బొమ్మలో చిత్రించడం, కథలా చెప్పడం ! టోనీ చిత్రాల్లోని వ్యక్తులు .. మనం బాగా తరచి చూస్తే .. మనకో కథ వినిపిస్తూ ఉన్నట్టు కనిపిస్తారు – అది Trump వ్యంగ్యం చిత్రం కావచ్చు, లేదా ఇక్కడ నేను పోస్ట్ చేసిన ‘తల్లి ప్రేమ ‘ కావచ్చు.
ఈ చిత్రంకు సంబంధించిన ఒక విశేషం – ఒక పోటీలో ఇది ప్రధమ బహుమానం గెలుచుకుంది, అది మన రూపాయల్లో అక్షరాలా 8 లక్షల 40 వేలు. వేదిక మీదికి అతన్ని పిలిచినప్పుడు ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు, కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆ క్షణం అలాటిది. అయినా అప్పుడు కూడా అతనిలో హాస్య భావన తొంగి చూసింది.. తన కళ్లు తుడుచుకుంటూ ‘ నా చిత్రంలోని తల్లి చేతిలో వున్న పాప గుక్కపట్టి ఏడుస్తోంది, నేను కాదు .. ‘ అన్నాడు ఆడియన్స్ తో.
ఆ క్షణంలో టోనీ తన జీవితంలో ప్రీతిపాత్రమైన మూడూ – భార్య, కొడుకు, చిత్రకళ – ఒక చోట చేరి ఉండాలి!