బొమ్మల్కతలు-27
-గిరిధర్ పొట్టేపాళెం
ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటి లో సైతం కనిపించే నల్లదనం…ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయ మే.
బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు రంగులతోనే ఉండేవి. పిల్లలు రంగులపట్ల అంతగా ఆకర్షితులవటం ప్రకృతి సహజం.
నా మొదటి రంగుల గురుతులు మదిలో తరగని చెరగని నా బాల్యం నాటివే. నల్లని పలకపై బలపంతో దిద్దిన తెల్లని అక్షరాలు, ఆటల్లో వేళ్ళ కొసలన పట్టి వదిలిన గిర్రున తిరిగిన రంగు రంగుల గాజు గోళీలు, సన్నని పేనిన తాడుతో చుట్టి సంధించి లాగి విసిరితే సర్రున తిరిగిన రంగుల బొంగరాలు, ఉపరితలంపై రెపరెపలాడిన రంగు రంగుల కాయితపు గాలిపటాలు, మండుటెండలో పెదవుల మధ్య జిల్లుమనిపిస్తున్నా జుర్రిన రంగుల పుల్ల ఐసులు, పెరట్లో పూసిన పసుపు పచ్చ, నారింజ రంగు ముద్దబంతి పువ్వులు, ఎండాకాలపు తెల్లని మల్లెమొగ్గలు, సంక్రాంతి పండుగ ముగ్గుల వర్ణాలు, మా ఊర్లో నాన్న కట్టించిన మా కొత్తింటికి వేసిన రంగులు…ఇలా ఆటపాటల బాల్యం అంతా రంగుల మయం. ఎంతమందికి మొట్టమొదటి రంగుల అనుభూతులు ఎంతో కొంత మదిలో అప్పుడప్పుడూ సందడి చేస్తూ ఉంటాయో తెలీదు కానీ నా మటుకు నాకు మాత్రం ఇప్పటికీ కొన్ని ముదురు రంగులు చూస్తే మనసు బాల్యంలోకి పరిగెడుతుంది.
పలక పై తెల్లని అక్షరాలు దాటి కాగితంపైన రాయటం మొదలు పెట్టాక, బులుగు, నలుపు, ఎరుపు, ఆకు పచ్చ రంగుల్లో ఇంకులు ఉండేవి అప్పటి రోజుల్లో. ఎక్కువగా బులుగు రంగుఇంకే అందరూ వాడేవాళ్ళు. నాన్న టీచింగ్ నోట్స్ లో నాలుగు రంగులూ కనపడేవి. ఆకు పచ్చ, ఎరుపు రంగులతో నీటిపై అలల్లా అక్షరాల కింద చేసిన అండర్ లైన్లు ఎప్పటికీ మరువలేను. ఎర్రని ఇంక్ తో నాన్న దిద్ది మార్కులు వేసి నిలువుకి సగం మడిచి దారం కట్టిన ఆన్సర్ పేపర్స్ కట్టల గురుతులూ ఇంకా మదిలో చెక్కు చెదరనే లేదు. నాన్న తనే డిజైన్ చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ గీసి తన ప్లాన్ తో కట్టుకున్న ఇంటికి వాడిన ఆహ్లాదకరమైన పచ్చ, ఆరెంజ్, బ్లూ, లేత వంగపండు రంగులూ అంతే కొత్తగా ఇప్పటికీ మదిలో గూడు కట్టుకునే ఉన్నాయి. రంగులపై ఏర్పడ్డ మొదటి మక్కువ అంటే ఆడిన గోళీలే. రంగురంగుల గోళీల్లో కొన్ని రంగుల గోళీలు అరుదుగా వచ్చేవి. ఆ రంగుల గోళీల్ని ఆడకుండా వాడకుండా ప్రత్యేకంగా దాచుకుని పదే పదే చూసుకున్న గురుతులు ఎన్నో. తిరిగే బంగరాల ఉపరితలంపై రెండు మూడు రంగుల తిరిగే వృత్తాలు ఇప్పటికీ తలపుల్లో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి.
ఇంకు పెన్ను తర్వాత స్కెచ్ పెన్ను వాడిన మొదటి అనుభవం స్కూల్ లో నా పదవ తరగతి నాటిది. పదవ తరగతిలో మా సైన్స్ టీచన్ “రామస్వామి సార్” స్కెచ్ పెన్నులు కొనిపించి అవి ఎంత ఎక్కువ వాడి పరీక్షలు రాస్తే అంత అదనంగా మార్కులు వేస్తూ ప్రోత్సహించేవారు. అలా సైన్సు బొమ్మలకి రంగులేయటం, బయాలజీ నోట్ బుక్ లో నోట్స్ కి హెడింగ్స్, సబ్ హెడింగ్స్ రాయటం, ఇంపార్టెంట్ పాయింట్స్ స్కెచ్ పెన్నుల్తో అండర్లైన్లు చెయ్యటం…ఇవి స్కెచ్ పెన్నుల్తో నా మొదటి అనుభవాలు.
నా బొమ్మల్లో రంగుల స్కెచ్ పెన్ను లు అడపాదడపా వాడినా వాటితోనే పూర్తిగా వేసిన బొమ్మలు మాత్రం చాలా తక్కువ. అలా వేసిన అతికొద్ది బొమ్మల్లో ఈ బొమ్మ ఒకటి. మామూలుగా ఏ బొమ్మ అయినా ఎంతకాలం తర్వాత అయినా అది వేసిన ప్రదేశం, ఆ సమయం మరపురాని నాకు ఈ బొమ్మ కూడా అంత ఖచ్చితంగానే గుర్తుంది. ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం వేసవి శలవులు. “కావలి” లో మేమప్పుడు అద్దెకుంటున్న మా నారాయణవ్వ పెంకుటిల్లు. అదే నా బొమ్మలకి పుట్టిల్లు. సమయం చీకటి పడ్డ సాయంత్రం. ట్యూబ్ లైట్ వెలుతురులో మధ్య గదిలో నేలమీద కూర్చుని నాన్న కలెక్షన్ లో మిగిలున్న కొద్ది “రీడర్స్ డైజెస్ట్” బుక్స్ తిరగేస్తున్న నన్ను ఒక “బిజినెస్ మ్యాన్” టై కట్టుకుని తల వంచుకుని కొంచెం పక్కకు తిరిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంది. అప్పటి కప్పుడు గీయ్యాలన్న కోరికతో దగ్గరున్న స్కెచ్ పెన్నుల సెట్ తీసుకుని ఉన్న నాలుగైదు రంగులతో చకచకా పేపర్ పైన గీసిన స్కెచ్ బొమ్మ ఇది. సంతకం మాత్రం ఇంకు పెన్ తో పెట్టాను. అప్పటికింకా పూర్తిగా నాదంటూ ఒక ప్రత్యేకంగా తేలని సంతకం, బొమ్మ బొమ్మ లో ఇంకా వింత వింత పోకడలు పోతూనే ఉండేది.
రీడర్స్ డైజెస్ట్ – అప్పట్లో చాలా అరుదుగా కొంతమంది దగ్గర మాత్రమే కనిపించేది. అదీ సంవత్సరం డబ్బులు కట్టి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెల నెలా పోస్ట్ లో వచ్చే ఒక చక్కని జనరల్ ఫ్యామిలీ ఇంగ్లిష్ మాస పత్రిక. చిన్న నోట్ బుక్ అంత సైజ్ లోనే ఉండేది. మంచి క్వాలిటీ పేపర్ పై, క్వాలిటీ రంగుల ప్రింట్ తో చాలా విషయాల మీద అవగాహన పెంచే ఒక మంచి మ్యాగజైన్. నాన్న కొన్ని సంవత్సరాలు ఈ బుక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంట్లో చాలా ఉండేవి. అప్పుడప్పుడూ ఏమీ పాలుపోకపోతే అటకెక్కిన గంపలోని ఈ పుస్తకాలు దించి వాటిని తిరగేయటం నాకలవాటుగా ఉండేది. అలా దించిన ప్రతిసారీ కొద్ది గంటల సమయం తెలియకుండానే గడిచిపోయేది. చిన్నప్పుడు కేవలం అందులోని బొమ్మలు మాత్రమే చూసేవాడిని. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాత్రం కొన్ని కొన్ని చిన్న చిన్న ఆర్టికిల్స్ చదివేవాడిని. ప్రతి ఎడిషన్లో మొదటి పేజీల్లో ఇంగ్లిష్ కొటేషన్స్ ఉండేవి, అవి మాత్రం ఆసక్తిగా అన్నీ చదివి వాటిని అర్ధం చేసుకుని విశ్లేషించుకునేవాడిని.
గమ్మత్తుగా నేను ఆంధ్ర లొయోలా కాలేజి, విజయవాడలో ఇంటర్మీడియట్ చేస్తున్న పుడు నా హాస్టల్ అడ్రెస్ కి “రీడర్స్ డైజెస్ట్” పబ్లిషర్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది, ప్రాంతాల వారీగా సెలెక్టెడ్ లిస్ట్ లో నా పేరు ఉందనీ, అందుకని నాకు డిస్కౌంటెడ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నాం అంటూ. చాలా థ్రిల్ తో అయిపోయి డబ్బులు డ్రాఫ్ట్ ద్వారా కట్టి ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాను. అప్పుడు వాళ్ళకి నా పేరూ అడ్రెస్ ఎలా దొరికిందో తెలీదు. తర్వాతా చాలా యేళ్ళకి ఆలోచిస్తే తట్టింది. నా పేరు మీద నా పదవ తరగతి మార్కుల సర్టిఫికేట్ పెట్టి ఒక నార్త్ ఇండియన్ (నాకు ఫ్రెండ్ కూడా కాదు) IIT మెటీరియల్ ఫ్రీగా తెప్పించుకున్నాడు. ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కి ఫ్రీగా IIT మెటీరియల్ ఇచ్చే ఒక కోచింగ్ సెంటర్ ఢిల్లీలో ఉందనీ నాకు తెలీదు. కేవలం నా ద్వారా అది వాడుకోవటానికి మాత్రమే నా దగ్గరకి వచ్చి అడిగిన ఆ అబ్బాయికి “నో” చెప్పొచ్చనీ తెలీదు. తర్వాత ఆ అబ్బాయి ఆ మెటీరియల్ వచ్చాక నా దగ్గరి నుంచి తీసుకెళ్ళటం తప్ప, ఒక థ్యాంక్స్ గానీ, కనిపించినపుడు పలకరించటం కానీ లేకపోయినా, అలా కూడా అవకాశం తీసుకుంటారా అన్నదీ తెలీదు. అది తెలిసిన నా ఒకరిద్దరు ఫ్రెండ్స్ మాత్రం నీ మార్కుల లిస్ట్ కాపీ అతనికి ఇవ్వకుండా ఉండాల్సింది అన్నారు. కొద్ది రోజులు మనసు భారంగా అనిపించింది. అప్పటి రోజుల్లో మన చుట్టూ ఉన్న సోషల్ (సామాజిక) వాతావరణం ఇలానే ఉండేది. బహుశా వాళ్ళ ద్వారా “రీడర్స్ డైజెస్ట్” కి నా అడ్రెస్ దొరికిందేమో.
అలా రీడర్స్ డైజెస్ట్ తో నా అనుబంధంని గుర్తు చేస్తూ అందులో ఒక ఫొటో చూసి వేసింది ఈ బొమ్మ. ఇలా ఈ స్టైల్ లో అంత త్వరగా అప్పటిదాకా ఏ బొమ్మా వెయ్యలేదు. చక చకా ఉన్న కొద్దిపాటి స్కెచ్ పెన్నుల్తో కొద్ది నిమిషాల్లోనే గీశాను. గీశాక ఇలా కూడా బొమ్మలు గియ్యొచ్చా అనిపించింది. అప్పట్లో నేరుగా పెన్ తోనే ఎ బొమ్మ వేసినా ఎక్కువగా ఏ బొమ్మలోనూ డైమన్షన్స్ తప్పేవాడిని కాదు. కారణం తపన, ఫోకస్, ఆ వయసులో వేరే లెవల్లో ఉన్న ఆసక్తి లెవెల్స్, అవే కారణం.
రంగులతో అలా పేపర్ మీద స్కెచ్చులతో మొదలయిన అనుభవాలు తర్వాత వాటర్ కలర్స్, అదీ దాటి క్యాన్వాస్ మీద ఆయిల్ దాకా వెళ్ళినా, అప్పటి బొమ్మల్లోని పూర్తి సంతృప్తి ఇప్పుడు కొరవైందా అనిపిస్తూ ఉంటుంది. సంవత్సరాలు గడుస్తూ, కాలంతో జీవితంలో ముందుకి నడిచే కొద్దీ వెనకటి కాలం అనుభవాలూ, గురుతులూ, తలపులూ ఇష్టంగా అనిపిస్తూ అపుడే చూసిన కొత్త వన్నె తగ్గని రంగుల అనుభూతుల్లా మనః ఫలకం పై ప్రతిబింబిస్తూనే ఉంటాయి…
“జ్ఞాపకాల రంగులు ఎన్నటికీ మాయవు.”
Portrait of a Businessman
Sketch pens on paper