ఈ తరం నడక – 10

కడలి – “చిక్ లిట్” (నవల)

-రూపరుక్మిణి 

 

          ఈ శీర్షిక మొదలుపెట్టి ఇప్పటికి పది నెలలు అయింది. ఒక్కొక్కటిగా చదువుతూ, కొత్తగా నిర్మించుకుంటున్న సాహిత్యదారులను వెతుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగేయడం మనసుకి భలే బాగుంది.

          “ఎవరు డిఫరెంట్ గా రేపటి కంటెంట్ ని చూపించగలుగుతున్నారు?” అని వెతుకుతున్న నన్ను “చిక్ లిట్ ” ఆకర్షించింది.
చిక్ – యంగ్ విమెన్
లిట్ – లిటరేచర్ ( abbreviation)
“ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు రాసే సరదా కథలు”

          ఇదేదో చాలా బాగుందనిపించి ఈ బుక్ ని పిక్ చేశా…

          కానీ ఈ నవల సరదాగా ఉండదు మానసిక సంఘర్షణలు ఉంటాయి, వ్యక్తి ప్రేరణ ఉంటుంది, సోషల్, పొలిటికల్ ఎలిమెంట్స్ ఉంటాయి, సామాజిక చైతన్యంలో భాగమైన వ్యక్తులు కనిపిస్తారు, వారి వ్యక్తిగత జీవితాలు మనల్ని కంపితుల్ని చేస్తాయి.

          ఈ పుస్తకాన్ని రాసిన “కడలి” సాహిత్య రంగంలో మనసుకి అంతర్లీనంగా చిత్రించబడే ఎన్నో అంశాలలోని మృదువైన భావ వైశిష్టతలో, ఉత్తేజితమైన ప్రేరణ కలిగించే రచనలు తనవి.

          “లెటర్స్ టు లవ్” అంటూ మొదలు పెట్టి తర్వాత కథలుగా, ఇప్పుడు నవలగా తన ప్రయాణ కాలాన్ని సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకంగా నమోదు చేసుకుందీ కడలి.

          కడలి తన రచనల్లో ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఆఫ్ థీమ్ ను అప్లై చేసిన లేఖలు ఓ సెన్సెషన్ తెచ్చి పెట్టాయి. అటువంటి అమ్మాయి నవల రాసింది అంటే ఎలా రాసి ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉండడం సహజమే.

          నవలలో ప్రతీ వాక్యంలో ఓ గుదిగుచ్చిన కూర్పుతో , సాధారణమైన భాషలో అందరికీ అర్థమయ్యే సొంపైన వాక్య నిర్మాణం, అందంగా మన మనసుల్ని కట్టి పడేస్తుంది.

          నిజం చెప్పాలంటే సూటిగా, సుత్తి లేకుండా ఉంటుంది.

          ఈ కథలో “షాలిని, సిద్ధార్థ్, రిషి, అశ్విని, కీర్తన, భారతి” ఈ పాత్రల మధ్య సంభాషణ మనల్ని ఏ దూర తీరాలకు ఎత్తుకెళ్లదు కానీ మన చుట్టూ ఉండే పరిస్థితులను కళ్ళకు కట్టి చూపిస్తుంది. మనలో కొన్ని ప్రశ్నలని వదిలేస్తుంది వాటికి సమాధానాలు వెతుకుతూ వెళ్తాము.

          హ్యూమన్ డిజైర్స్ మధ్య సెన్సిబిలిటీస్, ఆటిట్యూడ్ అందులో నుండి వచ్చే గ్రాటిట్యూడ్ని, డెవలప్ చేసుకుంటూ పోయే స్ట్రక్చరల్ మేనేజబుల్ కల్చర్ మనకు దర్శనమిస్తుంది.

          జెండర్ ఈక్వాలిటీని కోరుకునే సందర్భంలో ఫెమినిజం పట్ల చేసే పొరపాటు ఆలోచనలకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది కడలి రచన.

          ఫెమినిజం అనగానే పురుషద్వేషులుగా చూసే వారే ఎక్కువ. కాదు ఇది ఈక్వాలిటీ లో ఉండే కంఫర్ట్ జోన్ ని సొంతం చేసుకోవడం అని ఎందరికి అర్థమవుతుందని ప్రశ్న వేస్తుంది.

          కంఫర్ట్ లో నుండి డిస్ కంఫర్ట్ ని ఎత్తి చూపిస్తూ… పురుషులలో ఉండే సున్నితమైన జానర్ని టచ్ చేస్తూనే ఫిమేల్ వర్షన్ లో నేటి యువత సామాజికపరంగా ఎదుర్కొంటున్న సమస్యలని చర్చిస్తూనే స్టేబుల్ గా నిలబడే ఆత్మవిశ్వాసాన్ని కలిగిన పాత్రగా షాలిని పాత్రని నిలబెట్టిందీ రచయిత్రి.

          డిప్రెషన్ ఎవరికైనా వస్తుంది. ప్రేమ వల్ల,  మన కుటుంబంలోనూ స్నేహంలోనూ మనతో అతి దగ్గరైన వ్యక్తుల్ని కోల్పోవడం వలన కలిగే మానసిక కుంగుబాటుని ఎదుర్కోవడంలో నేటి తరం ఎదుర్కొంటున్న సమస్యని చాలా చక్కగా ఎలివేట్ చేసిందీ పుస్తకంలో. 

          “హెయిర్ గ్రోత్ యిన్ అండర్ ఆర్మ్స్ ఈస్ నాట్ ఆన్ ఏ ఇష్యు” అంటూ మొదలైన చర్చ, విమెన్ అబ్యూజింగ్ లో పాలుపంచుకునే అల్లరి మూకల నుండి యువత ఎలాంటి రక్షణ వలయాలు సృష్టించుకోవాలి, అబ్యూజింగ్ని ఎలా ఎదుర్కోవాలి, మెట్రోపోలిటిన్ నగరం అంచుల్లో జరిగే విమెన్ ట్రాఫికింగ్… ఇలా అనేక అంశాలను తన రచన ద్వారా మనతో అంతరాంతరాల చర్చ నడిపింది.

          స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం గురించి మాట్లాడితే ఒప్పుకోలేని ప్రపంచం ఎక్కడో కాదు ఇంటి వాతావరణంలోనే తరతరాలుగా గూడు కట్టుకుని ఉందని చెప్పే మాటల తరంగాలు తండ్రి కూతుర్ల మధ్య సయోధ్య కుదర్చడానికి తల్లి పడే ఆవేదన, అన్నింటినీ ఈ నవల ప్రత్యక్షంగా చూపించిందని చెప్పవచ్చు.

          షాలిని,అశ్విని, కీర్తన పాత్రల ద్వారా యంగ్ జెనరేషన్లో వస్తున్న ఆలోచనల్లోని మార్పుల్ని చెప్తూనే వాళ్ళకి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛని ఇవ్వమని చెప్తుంది.

          “చిక్ లిట్” తో ప్రయాణం బావుంటుంది. ఎంజాయ్ యువర్ రీడింగ్.  స్టోరీ రివిల్ చేస్తే ఈ పుస్తకం లోని త్రిల్లర్, సస్పెన్స్ మిస్ అయిపోతారని ఇక్కడితో ఆపుతున్నా. 

కంగ్రాట్స్ “కడలి “!

*****

Please follow and like us:

2 thoughts on “ఈ తరం నడక-10- చిక్ లిట్ – కడలి”

  1. యువ రచయిత్రి కడలి రాసిన చిక్ లిట్ పుస్తక పరిచయం బాగుంది. చక్కని సృజన కలిగిన రచయిత్రి. కథ ను కూడా కాస్త పరిచయం చేసి ఉంటే బాగుండేది రూప గారూ.
    నిన్ననే ఎఫ్బి లో ఒకచోట ‘చిక్ లిట్’ రివ్యూ చూశాక, ఆవిడ పేజి చూశాను. ప్రతిభ కలిగిన రచయిత్రి.
    అనేక అభినందనలు.

  2. చదవాలనిపించేలాంటి సమీక్ష. రచయిత కు,మీకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.