అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 22
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణు కొత్తగా పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న జంట. విష్ణు ఉద్యోగం వెతుక్కుని, ఆర్థికంగా ఇపుడిపుడే నిలదొక్కు కుంటున్నాడు. విశాల వైవాహిక జీవితంలో అడుగిడి, మరోప్రక్క కెరీర్ పై దృష్టి సారిస్తోంది. ఇద్దరూ నాలుగు రోజులు కాఫ్స్ హార్బర్ విహార యాత్రకి వెళ్ళారు.
***
భూమిపై మనిషి ప్రవేశం ఒంటరిగానే, అలాగే నిష్క్రమణ కూడా ఒంటరిగానే ముగుస్తుంది. మనిషిగా తన నడవడికతో, ఏర్పరుచుకున్న బంధుత్వాలతో బంధాలు, అనుబంధాలు ఏర్పడతాయి. కానీ మానవమాత్రుడు ప్రతి దశలోను తన ఉనికిని చాటు కోవాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఒక్కోసారి తనను ఎవరూ పట్టించుకోవట్లేదు, తను ఒంటరినని భ్రమ పడతాడు. సృష్టిలో ప్రతి జీవి ఒంటరిగానే తన పయనం కొనసాగిస్తున్న విషయం గమనించడు. తనకున్న పరిధిలో తన బాధ్యతలు నెరవేరుస్తూ పోతే అసలు ఒంటరితనమనే ప్రసక్తి రానేరాదు కదా!
విశాల విమానం ఎక్కడానికి ముందు, కడుపులో వికారంతో ఏదో తెలియని అసౌకర్యా నికి గురైంది. ఒక్కసారిగా తూలిపడబోయి, ప్రక్కనే విష్ణు భుజంపై వాలిపోయింది. విష్ణు, విశాల చేయి పట్టుకుని, అక్కడ లాంజ్ లో ఉన్న సోఫా పై కూర్చోబెట్టి, మంచినీళ్ళు త్రాగమని ఇచ్చాడు. విశాల ఐదు నిమిషాలకు కాస్త సర్దుకుని నార్మల్ అయింది. నిన్న తిన్న ఫుడ్ ఏదైనా పడలేదేమో అంది. విమాన ప్రయాణం ఒక గంట కావడంతో, ఏ ఇబ్బంది లేకుండానే సిడ్నీ చేరుకున్నారు.
తరువాత రోజు, విష్ణు విశాలను కాలేజ్ దగ్గర దిగబెట్టి, తను డ్యూటీకి మధ్యాహ్నం వెళ్ళాడు. విశాల తను ఎంచుకున్న కంప్యూటర్ కోర్స్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి, తన చేతిలో సబ్జెక్ట్ మాడ్యూల్ చూడసాగింది. మెల్లిగా మిగతా స్టూడెంట్స్ తో బాటు కోర్స్ ట్యూటర్ అందరూ అక్కడకు చేరారు. పరిచయాలు అయ్యాక, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హౌ టు ఆపరేట్ ఎట్ వర్క్ ప్లేస్, కేస్ స్టడీ సీక్వెన్స్ లో తాషా చక్కగా వివరించింది.
అలా వారంలో రెండు రోజులు విశాల కాలేజ్ కి వెడుతూ, ఆస్ట్రేలియాలో మరోసారి విద్యార్థిగా అనుభూతులని ఆస్వాదించసాగింది. ‘న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం స్థానికంగా మైగ్రేట్ అయినవారికి ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తూ, భవిష్యత్తులో ఉపాధి కి బంగారు బాట వేయటం నిజంగా అభినందనీయం కదా!’ అనుకుంది విశాల.
విశాలలో ఉన్న అద్భుతమైన విషయం, క్రొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్నాస, ఒక పట్టుకొమ్మ దొరకగానే, దాన్ని అల్లుకుంటూ, తన పరిధిని విస్తృతం చేసుకుంటూ, చాలా సమగ్రంగా సమాచారాన్ని విశ్లేషించగలదు. అంతర్జాతీయంగా వివిధ దేశాల వారు ఉన్న ఆ క్లాసులో అందరితో కలివిడిగా ఉంటూ, తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. తను నేర్చుకున్న విషయాన్ని, అతి సులభంగా అర్థమయ్యే రీతిలో తన సహచరులతో సబ్జెక్ట్ షేర్ చేసుకోవడం అక్కడ ఫాకల్టీ గమనించింది. విశాల మైక్రోసాఫ్ట్ కోర్స్ పూర్తి కావస్తుంటే, తాషా వచ్చి క్లాస్ లో అందరికీ MYOB కోర్స్ ఆస్ట్రేలియా లో అకౌంటెన్సీ జాబ్స్ కి ఉపకరిస్తుందనీ చెప్పటంతో విశాల అక్కడే అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి సబ్మిట్ చేసింది. ఒకరకంగా విశాల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, భర్త
మీద ఆధారపడకుండా ముందుకు సాగుతోంది.
ఆ రోజు కోర్స్ పూర్తి అయి, ఆఖరి రోజు కావడంతో అందరూ తలొక డిష్ ఫుడ్ ఐటెమ్ తెచ్చారు. లంచ్ టైంలో అందరూ డైనింగ్ రూంలో టేబుల్ పై ఆహారాన్ని అందంగా అమర్చారు. విశాల క్యారెట్ హల్వా తయారుచేసి తీసుకువచ్చింది. మిగతావారు చిప్స్, కేక్స్, రెడీమేడ్ ఫుడ్ తేవడంతో, విశాల స్వీట్ అందరూ ఇష్టపడి, రెసిపీ అడిగారు.కబుర్లు చెప్పుకుంటూ కల్చర్, ఫామిలీ ఇత్యాది విషయాలు ఎన్నో మాట్లాడుకున్నారు.
విశాల ముఖంలోకి చూస్తూ, ఇమలీ అడిగింది, “ఐయామ్ క్యూరియస్ అబౌట్
యువర్ బిందీ. వాట్ ఈస్ ద డాట్ యు పుట్ ఆన్ యువర్ ఫోర్ హెడ్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్?”అని అడిగింది. విశాల భారతదేశాన్ని వదిలి ఆస్ట్రేలియా వచ్చినా, సాధ్యమైనంతవరకు కట్టు, బొట్టు సంప్రదాయాలను విడనాడకూడదు అనుకుంది.
ఇమలీ ప్రశ్నకు చిరునవ్వు నవ్వి, “ఇది మా హిందూ సంప్రదాయము. బొట్టు
నుదుటిన పెట్టుకోవడమనేది ఒక శుభ సూచకము. ఇంటికి వచ్చిన మహిళలకు బొట్టు పెట్టి, పూలు, పండ్లు చేతిలో ఉంచి వారు ఎల్లపుడు ఆనందంగా ఉండాలి అని సాగనం పుతారు. పూజాదికాలు చేసేటపుడు, దేవాలయాలకు వెళ్ళినపుడు భగవంతునికి అర్చన చేసి, నుదుటిన కుంకుమ ధరిస్తారు. ఆ ప్రదేశంలో ఆజ్ఙా చక్రం ఉంటుంది. ఏకాగత్ర,
ఇన్ ట్యూషన్ కేంద్రీకృతమయ్యే చోటు. అంతే కాక మహిళలకు బొట్టు అనేది అలంకార ప్రాయము” అని విశాల చక్కగా వివరించేసరికి అక్కడ అందరూ ముగ్ధులై విన్నారు.
“వ్వాట్ ఎ రిచ్ కల్చర్ అన్ద్ ట్రెడిషన్ యూ హేవ్. యూ ఆర్ ఎ కల్చరల్ ఎంబాసిడర్” అని ఇమలీ అనగానే, ఆ ప్రశంసకి విశాల ఉబ్బి తబ్బిబైంది. ‘తనకు తెలియని కొత్తకోణం, అప్రయత్నంగా దైవశక్తి తనచే మాట్లాడించిందా?’ అనుకుంది విశాల. అలా కోర్స్ చివరి రోజు అందరూ ఎన్నో విషయాలు ముచ్చటించుకుని, ఫోన్
నంబర్స్ ఇచ్చి పుచ్చుకుని, వెనుదిరిగారు.
ఈ కోర్స్ పూర్తి చేయడం వల్ల, విశాలలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇపుడు తను ఎక్కడా విదేశంలో ఉన్నాను అన్న భావనను పూర్తిగా మరిచిపోయింది. జంకు, గొంకు లేకుండా ఆస్ట్రేలియా పురవీధుల్లో కావలసిన చోటికి వెళ్ళగలుగుతోంది. వచ్చిన చిక్కల్లా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం.
విష్ణు దగ్గర అతను నేర్చుకున్న ఇన్ స్ట్రక్టర్ ఫోన్ నంబర్ తీసుకుంది. ఐతే అతను ఈ మధ్యనే మెల్ బోర్న్ మూవ్ అయ్యాను అని చెప్పాడు. దానితో విశాల న్యూస్ పేపర్ క్లాసిఫైడ్ కాలమ్స్ లో, ఇండియన్ మ్యాగజైన్స్ లో డ్రైవింగ్ నేర్పే వాళ్ళ కోసం వెతక సాగింది. ఎలాగైతేనేం మన్సూద్ అనే డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ వద్ద క్లాసులు నేర్చుకోవడానికి కుదుర్చుకుంది. ఒకానొక శుభముహూర్తంలో రోడ్దు మీద కారు నడపాల్సిన తరుణం విశాలకు వచ్చింది. ఇంతవరకు కనీసం రోడ్డుపై సైకిల్ కూడా విశాల నడపలేదు. నెమ్మది గా రోడ్డు రూల్స్ తెలుసుకుంటూ ఒక్కొక్కమెట్టు ఎక్కసాగింది. పెద్ద పెద్ద ట్రక్స్ ప్రక్కన వెడుతుంటే కాస్త బెదురుగా ఉండేది ఆమెకు. భర్తతో తన డ్రైవింగ్ స్కిల్స్, అనుమానాలు, సందేహాలు తీర్చుకోవడానికి విశాలకు వీలు దొరికేది కాదు. ఇంటికి వచ్చి, బాల్కనీలో వచ్చి, పోయే కార్లను దీర్ఘంగా గమనించసాగేది. డ్రైవింగ్ మాన్యువల్ తీసి సందేహం వచ్చిన చోట మళ్ళీ క్షుణ్ణంగా చదివేది. ఏ రోజు కారోజు ఈ రోజు నా వీక్ నెస్ సడన్ బ్రేక్స్, మరోసారి కారు రివర్స్ చేయడం ఇలా మనసులో తన తీరు తెన్నులు విశ్లేషించుకునేది.
భర్త డే టైమ్, సాయంత్రాలు ఉండక పోవడంతో ఆ సమయాన్ని తన వ్యక్తిగత పెరుగుదల కోసం వినియోగించేది విశాల. గడచిన మూడు నెలల్లో విశాల ఆస్ట్రేలియా స్లాంగ్, దేశం లో ఎకానమీ పరిశీలిస్తూ ఇవన్నీ ఒక నోట్ బుక్ లో వ్రాసుకునేది. ఆస్ట్రేలియాలో ఏ వస్తువు కొన్నా ఆ రసీదులపై GST ఛార్జెస్ గమనించేది. GST కి సంబంధించి లైబ్రరీలో పుస్తకాలు తెచ్చుకుని అధ్యయనం చేసింది. ఆస్ట్రేలియాలో జూలై 2000లో 10% GST రేటుతో GST ప్రారంభమైంది. GSTకి లోబడి వస్తువులు మరియు సేవలలో కొన్ని మార్పులు జరిగాయి.
వస్తువులు మరియు సేవల పన్ను (GST) అనేది ఆస్ట్రేలియాలో విక్రయించే లేదా వినియోగించే చాలా వస్తువులు, సేవలు మరియు ఇతర వస్తువులపై 10% విస్తృత-ఆధారిత పన్ను అమలులో ఉంది.
భర్త ఇంట్లో లేకపోయినా, విశాల తనను తాను ఎపుడూ ఒంటరిగా ఉన్నాను అని
భావించలేదు. బోరు కొట్టడం అన్న పదానికి అర్థమే తెలియనంతగా తనను తాను అనేక పనులలో బిజీగా పెట్టుకుంది. తన చుట్టూ తనకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరుచు కుంది.
భర్త పై అనురాగాన్ని, అప్యాయతను పెంచుకుంటూ తను కొనుక్కున్న ఆర్చీస్
లెటర్ పాడ్ పై కలం పెట్టి కవితలు వ్రాయసాగింది. హాల్ లో టేబుల్ దగ్గర ఉన్న గాజు బోర్డ్ లో రాసుకున్న కవితనుఅందంగా అమర్చింది. విష్ణుసాయి నిద్రలేచి, టేబుల్ దగ్గిర కూర్చుని టీ సిప్ చేస్తూ కవితను చదివి, ఆనందానికి లోనై, విశాల పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఒకరోజు విశాల బాల్కనీలో కూర్చుని ఉంది. అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న పూజ సహాయం కావాలని పిలవడంతో బయటకు వచ్చింది. తనకు సడెన్ గా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందని, రెండు గంటలు పది నెలల పాపాయిని చూసుకోమని సహాయం అడిగింది. ముక్కు, మొహం తెలియకుండా అర్థాంతరంగా అలా అడిగితే తను ఏమి చేయగలదు. అతి కష్టం మీద తనకి వేరే పని ఉందని చెప్పి తప్పించుకుంది. ఇక్కడ న్యూ సౌత్ వేల్స్ లో పిల్లలను చైల్డ్ కేర్ లో పెట్టాలంటే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటుంది అని ఆమె మాటల ద్వారా తెలుసుకుంది.
మంచితనానికి పోయి, ముక్కు, మొహం తెలియకుండా సాయం మాట అటుంచి, కలిగే అనార్థాలే ఎక్కువ అని గ్రహించింది.
తన ఫ్రెండ్ సుమీ కి ఫోన్ చేసింది.
“హలో సుమీ! ఎలా ఉన్నారు? ఇక్కడ సిడ్నీలో చైల్డ్ కేర్ సెంటర్స్ ఎలాఉన్నాయి?”
“హాయ్ విశాలా? మేము బాగానే ఉన్నాము. ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? “ అని
సుమీ నవ్వుతూ అడిగింది.
దానికి విశాల, “అబ్బే, అదేమి లేదు. ఇందాక మా అపార్ట్మెంట్స్ లో నైబర్ తను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఒక రెండు గంటలు వాళ్ళ పది నెలల పాపను చూసుకోమని అడిగింది. నాకు ఆమెతో అంతగా పరిచయం లేదు. అందుకని తీసుకోలేదు.”
“మంచి పని చేసావు. ఇక్కడ చైల్డ్ కేర్ దొరకటం చాలా కష్టం. వెయిటింగ్ పిరియడ్ ప్లేస్ ని బట్టి ఏకంగా రెండేళ్ళు దాకా ఉంటుంది. ఐతే నాకు పాప పుట్టినపుడు మా పేరెంట్స్ వచ్చారు. నేను జాబ్ కి అప్లై చేసాను. వాళ్ళు ఇంటర్వ్యూ కి పిలిచి, సెలెక్ట్ చేసుకుని జాబ్ ఆఫర్ లెటర్ పంపారు. అప్పటికి మా పేరెంట్స్ వీసా గడువు అయిపోవ టంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఎనిమిది నెలల పాపకి చైల్డ్ కేర్ దొరకక, వచ్చిన జాబ్ వదులుకోవాల్సివచ్ఛింది” అని చెప్పింది సుమీ.
వివరాలు విని విశాల, “ఓ మై గాడ్, అంత కష్టమా చైల్డ్ కేర్ దొరకటం. అంటే
ప్రెగ్నెన్సీ రాగానే చైల్డ్ కేర్ కి అప్లికేషన్ పెట్టాలా?” అంటూ గలగలా నవ్వింది విశాల.
విష్ణు రాగానే విశాల విషయం చెప్పి, “ఈ కంట్రీలో విషయ పరిజ్ఙానం, అవగాహన లేకుండా సహాయం చేసినా, చిక్కుల్లో పడతామన్న మాట.” అంది.
“అవును విశాలా! మొన్న మా వర్క్ లో ఆపరేటర్ చెప్పాడు, వాళ్ల నైబర్ పిల్లని మండుటెండలో కారులో వదిలి వెళ్ళిందిట, ఐదు నిమిషాలలో వచ్చేస్తాను కదా అనుకుని. వెంటనే ఎవరో రిపోర్ట్ చేసారు. పిల్లలని కారులో వదలటం పెద్ద నేరం” అన్నాడు విష్ణు.
విశాలా! దీర్ఘ ఆలోచనలో పడింది.
‘రేఫు నా పరిస్థితి ఏమిటి? పిల్లలు కలిగితే, ఆడవాళ్ళు పూర్తిగా కొన్నాళ్ళు కెరీర్ వదులుకోవాల్సిందేనా? ఇన్నాళ్ళు చదువు కోసం పడే తపన, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతాయా?
భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇన్ని కష్టాలు పడుతూ దేశం కాని దేశంలో ఉండే కన్నా, భారత దేశం వెడితే, మన వాళ్ళ మధ్య పిల్లల అచ్చట ముచ్చట తీరుతుంది కదా…
* * * * *
(ఇంకా ఉంది)