వ్యాధితో పోరాటం-28
–కనకదుర్గ
నా డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసి ఇంకొన్ని టెస్ట్స్ చేసి చూసాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు.
ప్రక్కన పేషంట్ని చూడడానికి చాలామంది మెడికల్, హాస్పిటల్ కౌన్సిలర్ వచ్చారు.
ఒక కర్టన్ తప్ప ఏ అడ్డం లేదు పక్క పేషంట్ కి నాకు మధ్యన. మాటలన్నీ క్లియర్ గా వినిపిస్తాయి.
“మీ పిల్లలకు ఇన్ ఫార్మ్ చేసారా?”
“లేదు. మీరేం చెబ్తారో చూసి చెప్పాలనుకున్నాం.”
“సర్జరీ తప్పకుండా చేయాలి. ఆ తర్వాత రీహాబ్ కి పంపిస్తాము. అక్కడ కోలుకోవ డానికి చాలా సమయం పడుతుంది. కోలుకున్నాక ఎలా వుంటుందో చూసాక మేము డిసైడ్ చేస్తాము, తను ఇంటికి వెళ్ళొచ్చా లేదా నర్సింగ్ హోంకి పంపించాలా అనే విషయం. అందుకే మీరు మీ పిల్లలకు చెప్పేస్తే మేము సర్జరీకి అన్నీ ప్రిపేర్ చేస్తాము మీ ఇన్స్యూరెన్స్ వాళ్ళకి కూడా చెప్పాలి, వాళ్ళ నుండి అఫ్రూవల్ తీసుకోవాలి.”
కాసేపు దంపతుల్లో ఏ ఒక్కరూ మాట్లాడలేదు.
“మీరు ఏ విషయం మాకు చెబితే అన్నీ ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతాము.”
“సర్జరీ సక్సెస్ అవుతుందా? పెద్దగా భయపడాల్సిందేమి లేదా?” అని కొంచెం కంగారుగా అడిగాడు భర్త.
” మోస్ట్ సర్జరీస్ ఆర్ సక్సెస్ ఫుల్. కోలుకోవడానికి ప్రతి ఒక్కరూ వేరు వేరుగా స్ఫందిస్తారు, కొందరు త్వరగా, పూర్తిగా కోలుకుంటే కొందరు మెల్లిగా, సరిగ్గా కోలుకోరు. అలాంటివారే చాలా వరకు నర్సింగ్ హోంలో వుండాల్సి వస్తుంది. ఇంట్లో ఒక్కరే పేషంట్ ని చూసుకోవడం కష్టం అవుతుంది.”
” ఇట్స్ ఓకే లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ రిజల్ట్, డోంట్ వర్రీ,” అని ఒక మాటనేసి వెళ్ళిపోయారు.
నేను వాళ్ళిద్దరికి ప్రైవెసీ ఇవ్వాలని వెంటనే ఏం మాట్లాడలేదు. ఆ రాత్రి పడుకునేపుడు ఆవిడతో మాట్లాడాను.
“పిల్లలకు చెప్పాము. ఇంకా ఎవ్వరూ వస్తామని అనలేదు. వాళ్ళూ అన్నీ చూసుకో వాలి కదా! సడన్ గా రావడానికి కుదరదు కదా! ఇద్దరూ వర్క్ చేసేపుడు, పిల్లలను ఎక్కడ పెట్టాలి, వర్క్ నుండి సెలవు దొరుకుతుందా లేదా చూసుకోవాలి, వారి భార్యలకు కుదరాలి. రెండ్రోజుల్లో చెబ్తామన్నారు.” అంటూ నేను చూడకుండా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది.
నాకు అమ్మా, నాన్న గుర్తొచ్చారు. ఇండియాలో అన్నయ్య, అక్క వున్నారు.
నాకన్నా చిన్న తమ్ముడొకడుండేవాడు, చిన్నోడా అని పిల్చేవాళ్ళం. వాడికి నాకు పది నెల్ల తేడానే, చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. అన్నయ్య చింటూ అని పిల్చేవాడు. ఇద్దరం ఒకటే స్కూల్, ఒకటే క్లాస్. కలసి స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, వాడు నాకంటే పొడుగ్గా ఉండేవాడు, అందుకని నేనే తన చెల్లెలని చెప్పేవాడు. నేను గొడవ పడేదాన్ని, కాదు నేనే పెద్దదాన్ని అని. ఎపుడన్నా స్కూల్ కి లేట్ అయితే నా స్కూల్ బ్యాగ్ కూడా వాడే మోసేవాడు, త్వరగా వెళ్ళడానికి. మేమిద్దరం క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాళ్ళం. ఇద్దరికీ డబుల్ ప్రమోషన్ ఇచ్చారు కూడా.
ఇంట్లో అందరికి ఏదో ఒక పని చేయడం ఉండేది. నేను రోజు ఇల్లు ఊడ్చేదాన్ని. ఎపుడన్నా నాకు జ్వరం వస్తే, కడుపు నొప్పి వస్తే, వాడు కిటికీలన్నీ మూసేసి ఇల్లు వూడ్చేవాడు నాకు తగ్గేవరకు. 1978, జనవరి నెలలో సంక్రాంతికి గాలిపటాలు ఎగేరేయ డానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు, నాన్నని మంచి “మాంజా,” గాలి పటాన్ని ఎగరేయ డానికి వాడే దారం తెమ్మని, మంచి గాలి పటాలు కావాలని రోజు చెబుతున్నాడు. నాన్న అలాగే అన్నీ తెస్తాను అని చెప్పాడు. ఒకరోజు సడన్ గా జ్వరం వచ్చింది. చల్లగా వుంది కదా అందుకే వచ్చి ఉంటుంది అనుకుని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి మందులు తెచ్చి వాడుతున్నారు. కానీ జ్వరం తగ్గటం లేదు. నేనొక్కదాన్నే స్కూల్ కి వెళుతున్నాను. అక్క స్కూల్ మా స్కూల్ దాటి వెళ్ళాలి. తను లంచ్ టైంలో ఇంటికెళ్ళి భోజనం చేసి మళ్ళీ స్కూల్ కి వెళ్ళేది. నేను మా స్కూల్ బైట నిల్చోని తన కోసం ఎదురు చూసే దాన్ని. తను మళ్ళీ స్కూల్ కి వెళ్ళేపుడు అడిగేదాన్ని ’చిన్నోడికి జ్వరం తగ్గిందా?’ అని కానీ తను, “ఇంకా తగ్గలేదని,” చెబ్తూ వెళితే నాకు గుండెల్లో ఏదో గుబులుగా ఉండేది. త్వరగా తగ్గిపో వాలని వాడికిష్టమయిన ఆంజనేయస్వామికి దండం పెట్టుకునేదాన్ని.
జనవరి 12న బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి కూర్చుంటానంటే అన్నయ్య ఎత్తుకుని తీసుకుని వచ్చి ఆరామ్ కుర్చీలో కూర్చోపెట్టాడు. అమ్మ వేడి వేడి బోర్నివిటా తీసుకొచ్చి తాగించడానికి ప్రయత్నిస్తున్నది ఇంతలో సడన్ గా మెలికలు తిరిగిపోసా గాడు ఫిట్స్ తో. మా యింటి ఎదురుగా డా. మధుసూధనరావు గారుండేవారు. నన్ను పిలిచుకురమ్మన్నగానే నేను పరిగెత్తుకువెళ్ళి ఆయనని పిల్చుకుని వచ్చాను. ఆయన షర్ట్ వేసుకుని బటన్స్ పెట్టుకుంటూనే వచ్చేసారు. చూడగానే ఆయన, “వెంటనే ఉస్మానియా హాస్పిటల్ ఎమర్జన్సీకి తీసుకువెళ్ళండి,” తొందర పెట్టారు. అన్నయ్య పరిగెత్తుకెళ్ళి ఆటో పట్టుకొచ్చాడు, అమ్మా, నాన్న చిన్నోడిని ఎత్తుకొని ఆటోలో వెళ్ళి పోయారు. అన్నయ్య వెనకే వెళుతుంటే తన ఫ్రెండ్స్ కూడా తోడు వెళ్ళారు. నేను, అక్క ఇంట్లో వున్నాము. మా ఇంట్లో పని చేసి రాములమ్మ మాతో ఉండిపోయింది. మాకు చాలా భయంవేసింది. నాకు ఏడుపొచ్చేసింది. రాములమ్మ, “ఏడ్వొద్దమ్మా! చిన్నయ్యకి ఏం కాదు, జొరమెక్కువయితే ఒకోసారి అట్నే అయితదమ్మా! రేపీపాటికి మంచిగయిపోయి వచ్చేతాడు చూడు. ఏం కాదు తల్లీ!” అని ఓదార్చింది.
“మీరు పొద్దుగాల నుండి ఏం తినలేదు కదా, ఆకలేత్తుందేమో? అమ్ములమ్మ, నేను వంట చేయడం అన్నీ చూపిత్తాను పద!”
అన్నం ఎట్లా పెట్టాలో, పప్పు ఉడకపెట్టి, టమాటలేసి పప్పు చేయడం వంటింటి కిటికీ దగ్గర నిల్చొని చెప్పింది. మేమిద్దరం కూర్చొని తింటుంటే తనకి టీ చేసి ఇస్తే తాగుతూ కూర్చుంది.
మా అన్నయ్య 3-4 గంటల మధ్య ఇంటికి వచ్చాడు. ఢల్ గా ఉన్నాడు. మా ఇద్దరికీ అడగాలని ఉంది, చిన్నోడు ఎట్లా వున్నాడని, కానీ అన్నని అంత నిశ్శబ్ధంగా చూసి అడగ లేక పోయాము. రాములమ్మ ఇంకో ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళింది. అన్నమేము తిన్నామా, లేదా అని అడిగి, తను కంచంలో కొంచెం అన్నం పెట్టుకుని తిన్నాడు. రాములమ్మ వచ్చి, “ఎట్టున్నడయ్యా, చిన్నయ్య? జొరం కొంచెం తగ్గిందా? డాక్టరేమన్నా డయ్యా? తగ్గిపోతదన్నడా?”
అన్న మమ్మల్నిద్దర్ని చూసి, “ఇంకేం చెప్పలేదు. ఏవో టెస్ట్స్ చేస్తున్నారు, అవి వచ్చాక చెపుతారేమో! నేను కొంచెం సేపు పడుకుని మళ్ళీ పోవాలి.” అన్నాడు.
“మరి పిల్లల దగ్గర నన్నుండమంటవా? నువ్వొస్తవా రాత్రికి?”
“నేనొక గంటయ్యాక వెళతాను. నీకు వీలైతే నువ్వు ఇపుడు ఇంటికి పోయి వచ్చి నేను మళ్ళీ వచ్చేదాక ఉంటే బాగుంటది. ఉండగలవా?”
“అట్లనే అయ్యా! నువ్వు పోయ్యే లోపట వచ్చేస్త. నువ్వు కూసింత పడుకో పో బిడ్డా!” అని మా వైపు తిరిగి, “నేను ఇట్ల పోయి అట్ల వస్త బిడ్డా! భయపడకుండ్రి!” అని తొందర తొందరగా వెళ్ళిపోయింది.
అన్న ఒక గంటయ్యాక లేచి రెడీ అయ్యేవరకు రాములమ్మ వచ్చింది. అన్న వెళ్తుంటే చాలా బెంగగా అనిపించింది.
“నేను రాత్రికి వచ్చేస్తాను, ఏం భయపడకండి.” అని వెళ్ళిపోయాడు భాను అన్న.
భాను అన్న, అక్క రాధకంటే 12 ఏళ్ళు పెద్ద. అక్కకంటే నేను ఏడాదిన్నర చిన్న, చిన్నోడు, గోవింద్ నాకంటే, (కనకదుర్గ) పదినెల్లు చిన్న.
అన్న రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చాడు. “ఎట్టాగుందయ్యా చిన్నయ్యకి? కొంచెం బాగున్నడా? డాక్టర్లు ఏమంటున్నారు?” అని ప్రశ్నల వర్షం కురిపించింది రాములమ్మ.
“ఈ రాత్రి గడవాలన్నారు, రాములమ్మ!” అని నీరసంగా అన్నాడు.
“అయ్యో! అమ్మ ఎట్లున్నదయ్యా? నాన్న కూడా ఉన్నడు కదా ఆడనే?” అని అడిగింది.
“నాన్న, మా అత్తయ్య వాళ్ళు పూజ చేసే గుళ్ళో కళ్యాణాలుంటాయి కదా! ఒకసారి చూసి రావడానికి వెళ్ళాడు. ఇపుడిద్దరూ ఉన్నారు వాడి దగ్గర. రాములమ్మ బాగా లేట్ అయ్యింది కదా! ఇక్కడే పడుకో. తెల్లవారుఝామున ఇంటికెళ్ళి వచ్చేస్తే నేను మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాల్సి వస్తే నువ్విక్కడ ఉండవచ్చు.” అన్నాడు అన్న.
“అట్టనే అయ్యా! అములమ్మ, చిన్నమ్మ మీరు పోయి పడుకోండి. అన్న ఆస్పటల్ కి పోయే లోపల ఇంటికి దబ్బున పోయి వచ్చేస్త! మీరేమి భయపడకుండ్రి. చిన్నయ్యకి కూడా ఏం కాదమ్మా! ఆ దేవుడు సల్లగ చూస్తడు, అంత మంచే జరుగుతది.”
అన్న వచ్చిన చప్పుడుకి లేచాము నేను, అక్క. కళ్ళు నులుముకుంటూ అన్న రాములమ్మకి చెపుతున్నది వింటుంటే వెన్నెముకలో నుండి భయం మొదలయ్యింది మా ఇద్దరికీ.
అంటే ఏంటి? రాత్రి గడవాలంటే, ప్రతి రోజు గడుస్తుంది కదా! అందరికీ జ్వరం వస్తుంది, తగ్గుతుంది. చిన్నోడికి కూడా అలాగే తగ్గాలి.
“చిన్ని, అమ్ములు అన్నాలు తిన్నారా? రండి పడుకొండి. భయపడకండి, ఏం కాదు.” అంటున్నపుడు గొంతు వణికింది.
మేమిద్దరం వెళ్ళి మా పక్కలో పడుకున్నాం. “అమ్ములు చిన్నపిల్లలకు జ్వరమొస్తే తగ్గిపోతుంది కదా! వాళ్ళకి ఏం కాదు కదా!” అని భయంగా అడిగా.
“ఏం కాదు కానీ ఒకోసారి పెద్ద జబ్బొస్తే, ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాకపోతే అపుడు కష్టం. మన జాను అత్త కూతురు, చిన్నోడి కంటే ఒక ఏడాది పెద్దదో, చిన్నదో, తెల్లగా, లావుగా, బొద్దుగా వుండేది కదా! తనకి బాగున్నపుడు వాళ్ళు మనింటికి వచ్చినపుడు ఆడుకునేవాళ్ళం కదా తనతో, చిన్నోడు దాన్ని ’లటావళి,’ అని పిల్చేవాడు గుర్తుందా?”
” ఓ గుర్తుంది. తనకి బ్రేయిన్ కాన్సర్ వచ్చినపుడు నీలోఫర్ హాస్పిటల్ కి మనని కూడా ఒకసారి తీసుకెళ్ళింది, అపుడు తనకి జుట్టంతా తీసేసారు, గుండుతో వుంది.” కొన్ని నెల్ల తర్వాత తెలిసింది తను చనిపోయిందని. అత్త చాలా చాలా ఏడ్చిందట. అమ్మా, నాన్న కూడా వెళ్ళి అత్తని చూసొచ్చారు.
“కానీ చిన్నోడికి మామూలు జ్వరమే కదా! పెద్ద జబ్బు కాదు కదా! తగ్గిపోతుంది కదా!” అని అక్క చెయ్యి గట్టిగా పట్టుకుని అడిగాను.
ఇంతలో అన్న మా మాటలు వినపడ్డాయో ఏమో, ” బాగా లేటయ్యింది ఇప్పటికే పడుకోండమ్మ, పొద్దున్నే లేచి హాస్పిటల్ కి వెళ్ళాలి,” అన్నాడు.
మాటలు మానేసి నిద్రపోవడానికి విఫల ప్రయత్నం చేయసాగాము. 3- 4 గంటల తర్వాత, బయట తెల తెలవారుతుంది, ఇంటి ముందు ఒక ఆటో ఆగిన చప్పుడు, నాన్న, ఇంటి వెనక తలుపులు కొడుతూ, “భాను, భాను, తలుపు తీయండ్రా? భాను తొందరగా తలుపులు తీయరా….” అని మాట పూర్తి కాక ముందే ముగ్గురం ఉలిక్కిపడి లేచాము. అన్న పరిగెత్తికెళ్ళి తలుపు తీసాడు. ఆటో డ్రైవర్, నాన్న కలిసి నిద్రపోతున్న చిన్నోడిని తీసుకొస్తున్నారు. అన్నఆటో డ్రైవర్ చేతుల్లో నుండి చిన్నోడిని తీసుకున్నాడు. అప్పటికే పక్కింటివాళ్ళొచ్చారు, ఎదురింటి వారొచ్చారు. అమ్మ, నాన్న, అన్న ఏడుస్తున్నారు. నాకంతా అయోమయంగా అయ్యింది. చిన్నోడిని ఒక చాపవేసి పడుకోపెట్టారు. అమ్మ వాడి దగ్గర కూర్చుంది కన్నీళ్ళు ఆగటం లేదు. అమ్మ నన్ను చూసి చెయ్యి చాపింది. పరిగెత్తుకెళ్ళి అమ్మ ఒళ్ళో కూర్చున్నాను. “చిన్ని, చిన్నోడు మనకి లేడమ్మా! మన అందరినీ వదిలేసి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడమ్మా!” అని గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. అమ్ములు కూడా అమ్మ దగ్గర వచ్చి కూర్చుంది. అది కూడా ఏడుస్తుంది.
నేను చిన్నోడిని చూసాను. పడుకుని వున్నాడు. నిద్రపోతున్నాడేమో? నిద్రపోతే ఇంత మంది ఇంత గట్టిగా ఏడుస్తుంటే లేవడేంటీ? ఊళ్ళో వున్న చుట్టాలందరూ వస్తున్నారు. అమ్మను, నాన్నని పట్టుకుని ఏడుస్తున్నారు. నాన్న అందరికీ జ్వరం వచ్చినప్పటి నుండి నిన్న ఫిట్స్ రావడం, ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్ళడం, అక్కడ జ్వరం బాగా ఎక్కువయిపోవడం ఎమర్జన్సీలో ఐస్ పెట్టి జ్వరం తగ్గించడానికి ప్రయత్నిం చడం 108 డిగ్రీలు దాటిం తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారని చెప్పారు.
మా నాన్న అన్న దమ్ములు, ఒక అన్న, ఒక తమ్ముడు వారి కుటుంబాలతోవచ్చారు. చిన్నమామయ్య, దాశరధి రంగాచార్యులు గారు, మేనమామ తెలంగాణా నవలా రచయిత, కొడుకులు, కూతుళ్ళతో వచ్చారు. ఆర్నెల్లక్రిందనే ఆయన చిన్నకూతురి పెళ్ళయ్యింది, అందుకని ఇది మొట్టమొదటి సంక్రాంతి పండగ కొత్త దంపతులకు. మా పెద్ద అత్తయ్య, అందరికంటే పెద్ద అక్క నాన్నకు, వాళ్ళకు ఒక గుడి, ఆమె భర్త పూజ చూసేవారు. ఆయన చెల్లెలు వాళ్ళు కూడా అక్కడే ఉండి ఈయనకు పక్షవాతం వచ్చి నపుడు వాళ్ళ పిల్లలే పూజలు చేసేవారు. మా మామయ్య పోయాక ఆ గుడి పూజ వాళ్ళకు రావాలని, మా నాన్న, చిన్నాన వాళ్ళందరూ కాదు, ఆ గుడి పూజ వీళ్ళ మేనల్లుళ్ళకే రావాలని అనడంతో ఆ కేస్ కోర్ట్ కెళ్ళింది. సంక్రాంతికి ఘనంగా గోదా కళ్యాణం చేయిం చాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే నాన్న హాస్పిటల్ నుండి కాసేపు గుడికెళ్ళివచ్చారు. మా చిన్నాన్న వాళ్ళకి అక్కడ కళ్యాణానికి సమయం దగ్గర పడుతుండడంతో అందరూ పండగ రోజు కదా! పూజలు, వంటలు చేసుకోవాలని తాపత్రయ పడసాగారు. కానీ మా తమ్ముడిని అక్కడ్నుండి తీసికెళ్ళితే కానీ ఎవ్వరు కదలరు.
నేను అమ్మ ఒళ్ళో కూర్చొని చిన్నోడినే చూస్తున్నాను. నేను స్వయంగా చిన్న పిల్లలు చనిపోతే ఎలా వుంటారో చూడలేదు. చనిపోతే నాలిక బయటకొస్తుందంటారు. వీడికి అట్లా రాలేదేంటి. ఇంత సన్నగా అయిపోయాడేమిటి? మంచి ఆరోగ్యంగా ఉండే వాడు, చాలా చలాకీగా, అల్లరిగా ఉండేవాడు. ఇపుడు ఇట్లా కదలకుండా పడుకుంటే అస్సలు బాగాలేదు. అస్సలు ఈ టైంలో ఎవరన్నా పడుకుంటారా? అవును రేపట్నుండి నేను స్కూలుకి వాడు లేకుండా వెళ్ళాలా? ఇంక ఇప్పట్నుండి ఇంట్లో ముగ్గురం కల్సి ఆడుకోవడం ఉండదా? వాడితో పాటు గోళిలాట, ఒకటేమిటి అన్నీ రకాల ఆటలాడే వాళ్ళం. కల్సి ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం, కల్సి ఇద్దరం స్కూల్ నుండి ఇంటికి, ఇంటి నుండి స్కూల్ కి పోటీలు పెట్టుకోవటం ఉండదా? అమ్ములు వేరే స్కూలు, తన ఫ్రెండ్స్ వేరు. కానీ నేను, చిన్నోడు ఎక్కువగా కల్సి సమయం గడిపేవారం. ఇపుడెలా? ఇప్పట్నుండి నేనొక్కదాన్నే స్కూల్ కెళ్ళాలి, నాతో నడుస్తూ జోక్స్ చెప్పడానికెవరూ ఉండరు. ఇపుడెలా? అలా ఆలోచించగానే అపుడు తోసుకొచ్చింది ఏడుపు, ఆగకుండా, వెక్కి, వెక్కి, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ వుంటే అన్ననన్ను ఎత్తుకుని పక్కింటికి తీసు కెళ్ళాడు. అక్కడ అన్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను ఓదార్చడానికి ప్రయత్నించ సాగారు. “నేనేం చెప్పాలి మా ఫ్రెండ్స్ కి, టీచర్స్ కి, మీ తమ్ముడేడి అంటే ఏం చెప్పాలి? నాకు చిన్నోడు కావాలి. నేను స్కూల్ కెళ్ళను ఒక్కదాన్ని, నేనేం చదువుకోను అస్సలు, నేనెక్కడికి వెళ్ళను…..” వెక్కిళ్ళు పడ్తు, ఏడుస్తూ, ఒకో మాట అంటూ మళ్ళీ ఏడవడం.
కాలనీ వాళ్ళంతా వచ్చారు. స్కూల్ వాళ్ళకి తెలియదు, భోగి, సంక్రాంతి సెలవులు. వాడితో ఆడుకునే కాలనీ ఫ్రెండ్స్, గొడవ పడే వాళ్ళు, వాడికంటే పెద్దవాళ్ళతో స్నేహం చేసేవాడు, వాళ్ళొచ్చారు.
మొత్తానికి వాడిని తీసుకెళ్ళే టైం వచ్చింది. నాకు వాళ్ళందరితో చిన్నోడితోపాటు చివరి వరకెళ్ళాలని ఉంది. కానీ ఆడవాళ్ళు, పిల్లలు రాకూడదని మమ్మల్నందరిని ఆపేసారు. మళ్ళీ గొల్లుమని ఏడ్చామందరం. కాసేపు ఏడ్పులు ఆగేవి, ఎవరైనా వస్తే మళ్ళీ గట్టిగా శోక సముద్రం ఎగసి పడినట్టు పడేది. మొదటిరోజు రాత్రి ఎపుడు తిన్నామో, ఏం తిన్నామో ఏం గుర్తు లేదు. మాకో మామయ్య వుండేవాడు, పిల్లలంటే ఇష్టమనేవాడు. చిన్నపిల్లలను దగ్గరకు తీసుకుని, ముఖ్యంగా ఆడపిల్లల పెదవులపై ముద్దులు పెట్టడం, నా బొజ్జలోకి జరిగి పడుకోవాలి, వెచ్చగా ఉంటుంది అనేవాడు. ఆ రాత్రి పిల్లలం అలసి పోయి పడుకున్నాం. ఆయన ఎపుడొచ్చాడో మా మధ్యన పడుకున్నాడు. మొగ, ఆడ పిల్లలున్నారు, పది, పదకొండేళ్ళ వయసు వారు. అందరూ పెద్దవాడు, పిల్లల్ని చూసు కుంటున్నాడని అనుకునేవారు. కాని ఆయన ముద్దు చేయడం తెల్సిన పిల్లలకు చాలా అసహ్యంగా అనిపించేది. మేం అలసిపడుకున్నాం. ఏదో పెద్ద హడావిడి వినిపించి, మళ్ళీ అమ్మ గట్టిగా ఏడవడం వినిపించి మేమంతా లేచాం. నాన్న, అన్నా, మా ఐదో అత్త అమ్మని పట్టుకుని లోపలికి తీసుకొస్తున్నారు. అదేంటీ, అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళారు? ఎక్కడి నుండి వస్తున్నారు వీళ్ళు?
అమ్మని పెద్ద రూంలోకి తీసుకెళ్తుంటే మా అత్తయ్య, “డాక్టర్, ఆమె బాగా కోలుకునే వరకు తన ముందర ఎక్కువగా చిన్నోడి గురించి మాట్లాడవద్దని, లేకపోతే ఆమె మనకి దూరం కావొచ్చని చెప్పారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.’ అంది.
మా చిన్న బుర్రల్లో ఆ మాటలు గట్టిగా నాటుకున్నాయి. అమ్మో! అమ్మ దూరం కావడమంటే చిన్నోడిలా వెళ్ళిపోతుందా? చిన్నోడు లేకపోవడమే ఎంత కష్టంగా ఉందో, అమ్మో అమ్మ లేకపోతే… ఒళ్ళు జలదరించింది. ఆ ఆలోచనే తట్టుకోలేకపోయాం, అమ్ము లు, నేను. ఎప్పుడు మాకు చిన్నోడు గుర్తొచ్చినా వాడి గురించి అమ్మతో పంచుకోవా లనిపించినా మేము చెప్పేవాళ్ళం కాదు. మద్రాస్ నుండి దాశరధి మామయ్య, మా అత్తయ్యని, కొడుకుని పంపించాడు. తెల్లారే వరకు. భద్రాచలం పెద్దపిన్ని, వైజాగ్ నుండి చిన్న పిన్ని, మాకు ఆరుగురు మేనత్తలు. అందులో కొంతమంది హైద్రాబాద్లోనే వుండే వాళ్ళు, మిగతా వాళ్ళు వేరే వూళ్ళల్లో ఉండే వాళ్ళు రెండు మూడు రోజుల్లో వచ్చారు.
ఆ సంఘటనతో మా కుటుంబం బాగా దెబ్బ తిన్నది. ఇల్లంతా పిల్లల అల్లరితో, ఆటపాటలతో వచ్చేపోయే వారితో ఎంతో సందడిగా వుండేది. అలాంటిది దాదాపు ఆర్నెల్లు నిశ్శబ్ధంగా అయిపోయింది. అమ్మ ఆరోగ్యం, నాన్న ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. అమ్మ ఆరోగ్యం బాగా లేనప్పుడు, అమ్మ బాగయ్యేదాక తన బాధని దిగమ్రింగుకున్నాడు. ఆ తర్వాత నాన్న బాగా డీలా పడిపోయాడు. నాన్న సైకల్ పైన సెంట్రల్ బ్యాంక్ కోఠికి వెళ్ళేవాడు. నాన్న సైకిల్ చిన్నోడు తీసి రెడీగా పెట్టి స్కూల్ కి వెళ్ళేవాడు. వాడు పోయాక నాన్న ఇక సైకిల్ ముట్టుకోలేదు. సర్వికల్ స్పండిలోసిస్ వచ్చింది. నాన్న ఆఫీస్ కి సెలవు పెట్టేసాడు. చినమామయ్యకి తెలిసిన డాక్టర్ దగ్గరకు కింగ్స్ వేకి వెళ్ళి చూపించు కుని వచ్చేవారం. అమ్మ, అమ్మతో పాటు నేను, అమ్ములు కూడా వెళ్ళేవాళ్ళం. మెడకి, వీపుకి కరెంట్ తో కాపేవారు. అక్కడ ట్రాక్షన్ పెట్టేవారు. తర్వాత ఆ ట్రాక్షన్ ఎలా పెట్టుకో వాలో చూపించి దానికి కావాల్సినవి కొనుక్కోమన్నారు. అవి తీసుకొచ్చి రోజు ఇంట్లో నాన్నకి పెట్టేవాళ్ళం. ముందు అన్నపెట్టేవాడు ఆ తర్వాత, నేను, అమ్ములు కూడా పెట్టేసేవాళ్ళం అరగంట సేపు.
నా ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. స్కూల్ కి వెళితే ఆ టీచర్లు, హెడ్ మాష్టర్ నాకు ఇంట్రస్ట్ వచ్చి బాగా చదవాలని 5వ క్లాస్ నుండి 7 వ క్లాస్ వరకు డబుల్ ప్రమోషన్ ఇచ్చేసారు.
నేను వాడు పక్క పక్కనే కూర్చునేవారం. పిల్లలు ఎవ్వరూ నాతో ఎక్కువ మాట్లాడలేదు నేను ఏడుస్తానేమోనని. మొగపిల్లలే ఆడుకునేపుడు కొంతమంది వచ్చి పిలిచేవారు. హమీద్, సురేందర్ చిన్నోడికి మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిచేవారు. క్లాస్ లో ఏమి అర్ధం అయ్యేది కాదు. కడుపులో నొప్పి, జ్వరం ఊరికే వచ్చేవి. అమ్మా, నాన్నకి నేను తుమ్మినా, దగ్గినా భయం వేసేది. ప్రతి చిన్న దానికి హాస్పిటల్ కి పరిగెత్తేవాళ్ళం. మానసికంగా వాడి గురించి మాట్లాడడానికి ఎవ్వరూ లేక, ఎలా మర్చిపోవాలో తెలీక అవస్థ పడేదాన్ని. అదే ఎన్నో రోగాల రూపంలో భయట పడేది. నాకు రాని జబ్బులు లేవు అపుడు. జ్వరమంటేనే భయం పట్టుకుంది ఇంట్లో వాళ్ళకి అట్లాంటిది నాకు టైఫాయిడ్, జాండిస్ ఇలా వారాలు, వారాలు ఇంట్లోనే వుండి పోవటం వల్ల. చదువు సరిగ్గా సాగకపోవడం వల్ల నా 7 వ క్లాస్ పబ్లిక్ పరీక్ష ఫేల్ అయ్యాను. నన్నందరూ అంటే చిన్నోడు పోయినప్పుడు ధైర్యం చెప్పిన అన్న, అన్న ఫ్రెండ్స్ ఫేయిల్డ్ గర్ల్ అని పిలవసాగారు. చాలా బాధనిపించేది, చదవడానికి ప్రయత్నిస్తే ఏమి అర్ధం అయ్యేది కాదు. పేపర్లో యాడ్ చూసి బషీర్బాగ్ లో ఒక స్కూల్ లో ఫేయిల్డ్ స్టూడెంట్స్ కి బాగా చదువు చెప్పి పాస్ చేయిస్తామని చెప్పడంతో అమ్మా, నాన్న కొత్త స్కూల్, కొత్త ఫ్రెండ్స్, బాగా చదువుకుంటాననుకుని అక్కడ చేర్పించారు. స్కూల్ డ్రస్ వేసుకుని బస్ లో మా కాలనీ పిల్లలతో పాటు వెళ్ళడం సరదాగా వుండేది. కానీ అక్కడ చదువు మాములుగానే వుండేది పెద్ద స్పెషల్ ఏమీ అనిపించలేదు. అక్కడకి దగ్గరే హైదర్ గూడా మాతృశ్రీ అపార్ట్మెంట్స్ వుండేవి. దాశరధి మామయ్య వాళ్ళు అపుడే మద్రాస్ నుండి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అపుడపుడు అక్కడికి వెళ్ళేదాన్ని. ఒకోసారి శని, ఆదివారాలు అక్కడ వుండి సోమవారం స్కూల్ కెళ్ళి, ఇంటికెళ్ళేదాన్ని.
( నాకు ఇక్కడ ఒంటరిగా ఈ జబ్బుతో పోరాటం చేస్తుంటే అనిపిస్తుంది, ఏ కష్టం వచ్చినా అమ్మ వైపు వాళ్ళు కానీ. నాన్న వైపు వాళ్ళు కానీ వచ్చేవారు. అమ్మకు సర్జరీ అయితే తెనాలిలో వున్నపుడు మా దాశరధి మామయ్య భార్య మా నాన్నకు చెల్లెలు, అచ్చకత్త వచ్చి కొన్ని నెలలుంది. ఎంతో బాగా చూసుకునేది. ఎన్నో కథలు చెప్పేది, రక రకాల పిండివంటలు చేసిపెట్టేది. అమ్మ హైద్రాబాద్లో చిన్న మామయ్య దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేది. ఆ తర్వాత మా ఆఖరి అత్త వచ్చి చూసుకుంది. ఎంతో బాగనిపించేది. అమ్మని మిస్ అయినా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. ఒకరికొకరు సాయం చేసుకునేవారు. ఇంత దూరం రావడం కష్టమేనని ఒప్పుకుంటాను కానీ వీసాలు వుండి చాలా దగ్గరివారు ఎంత పెద్ద కష్టం వచ్చినా కదలకపోతేనే మనసు విరిగిపోతుంది, చాలా బాధనిపిస్తుంది!)
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.