జీవితం అంచున -25 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
ఇల్లంతా బంధుమిత్రులతో క్రిక్కిరిసి వుందేగాని వాతావరణం ఆనందానికి బదులు ఉద్వేగంగా వుంది. ఎవరికి వారే వారి వారి పద్దతిలో అమ్మను బయిల్దేరటానికి ప్రేరేపిస్తు న్నారు. రాత్రి పన్నెండు గంటలకు ఫ్లైట్ డిపార్చర్.. కోవిడ్ పరీక్షల నిర్ధారణ, ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ చెకింగ్ కారణంగా నాలుగు గంటలు ముందుగా రిపోర్ట్ చేయవలసి వుంది. ఇంటి నుండి ఏడు గంటలకు బయిల్దేరాలి.
వచ్చిన బంధుమిత్రులంతా భోజనం అయ్యిందనిపించారు. అమ్మ నన్ను సాగనంపాకతింటానంది. సమయం ఆరవుతోంది. అమ్మ భోజనం చేయటంగాని, బట్టలు మార్చుకోవటంగాని ఏమీ జరగటం లేదు. అందరికీ ఆందోళనగానే వుంది.
లాయరైన నా స్నేహితురాలు ఈ బిజీ కాలంలో బంధువులు, స్నేహితులు ఎంత ప్రేమ వున్నా పూర్తి బాధ్యత తీసుకోలేరని ఎనభై ఐదేళ్ళ వయసులో ఎవరైనా పిల్లల దగ్గర వుండటమే ఉచితమని నచ్చ చెప్పింది. అంతే కాకుండా ఆమె కారణంగా నా ప్రయాణ మూ ఆగి పోతుందని హెచ్చరించింది.
అందరం కలిసి ఫోటో దిగుదాము, చీర మార్చుకోమని నా చెల్లెలు అమ్మతో చీర మార్పించింది.
మా అక్క పాలబ్బాయికి ఏమయినా అందించాల్సి వుంటే, ఎవరికీ తెలియకుండా ఆ పని తను చేస్తానని వాగ్దానం చేసింది. ఎంత ప్రయత్నించినా ఎవరితోనూ తను చేయించలేని పనిని మా అక్క చేస్తాననేసరికి అమ్మలో చిన్న ఆశ చిగురించింది.
అక్క మొహంలోకి అనుమానంగా చూస్తూ నిజంగా అందిస్తావా అని అమాయకంగా అడిగింది.
“నమ్మకపోతే నేనేం చేయలేను.. నీ ఇష్టం” అంది అక్క.
వెంటనే అమ్మ బెడ్రూం తలుపులు మూసేసి, అక్కకు ఒక వెండి కంచం, గ్లాసు, ఇరవై వేల రూపాయల క్యాష్ కవరులో పెట్టి ఎవరి కళ్ళాపడనీయవద్దని చెప్పి ఇచ్చింది. పాలబ్బాయికి ఇస్తానని నమ్మిస్తే ఎవరికయినా ఎంతయినా ధారాదత్తం చేసేస్తుందని అర్ధం అయ్యింది. బహూశా ఇంట్లో పోయిన నగదు, వస్తువులు అమ్మ అలాగే ఎవరికయినా ఇచ్చేసి వుండొచ్చు.
అక్క తను తన సంచీలో పెట్టుకుంటానని అమ్మను భోజనం చేయమని చెప్పింది.
తనకు కావాల్సిన వారికి నగదు చేరుతోందనే ఆనందంలో అమ్మ లేచి గబగబా భోజనం చేసేసింది.
చీర మార్పించటం, భోజనం చేయించటం జరిగాయి…
ఎలాగోలా ఎయిర్పోర్ట్ కి క్యాబ్స్ ఎక్కించాలి. అక్కకు తనకు కావలసిన వారికి అందించమని వస్తువులు, పైకం ఇచ్చిన ఆనందంలో, ఏ కళనుందో అమ్మ క్యాబ్స్ ఎక్కేసింది. అప్పటి వరకూ నేను అనుభవించిన మానసిక వత్తిడి నుండి నాకు ఉపశమనమం కలిగింది. ఆ దేవదేవుడికి హృదయంలోనే పొల్లుదండాలు పెట్టుకుని ప్రార్ధించుకుని బయటపడ్డాను.
ఢిల్లీలో కోవిడ్ పరీక్షలు చేయించాల్సిన కారణంగా కనెక్టింగ్ ఫ్లైట్ కి రెండు రోజులు ముందుగా ఢిల్లీ వచ్చేసాము. ఒక రాత్రి గడిచే సరికి అక్క నగదు, ఆ వస్తువులు పాలబ్బా యికి ఇవ్వదేమోనని అమ్మ అనుమానపడింది. దాంతో నేను హోటల్ రూములో లేని సమయంలో అక్కకు ఫోను చేసి వస్తువులు అతనికి అంద చేసిందీలేనిదీ అడిగింది. సరిగ్గా అదే సమయానికి గదిలోకి వచ్చి అమ్మ మాటలు వినకపోతే నాకు ఆ విషయం ఎప్పటికీ తెలిసేది కాదు.
డబ్బు మహా చెడ్డది. డబ్బు అవసరం తరతమ భేదాలు లేకుండా ఎంతటి ఆత్మీయ అనుబంధాలనైనా కొల్లగొట్టేయగలదు…
రెండో రోజుకి అమ్మకు ఇంటి మీదకు దృష్టి మళ్ళిపోయింది. తనను ఢిల్లీ నుండి హైదరాబాదు ఫ్లైట్ ఎక్కించేసి నన్ను ఆస్ట్రేలియా వెళ్ళమని గొడవ మొదలెట్టింది. కోవిడ్ కాలంలో విమానాలు అలా అప్పటికప్పుడు కుదరవని, ఒక నెల్లాళ్ళు ఆస్ట్రేలియాలో వుండి తిరిగి వెళ్ళిపోవచ్చని నచ్చచెప్పి ఆ రాత్రి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఎమిరేట్స్ లో చెక్ఇన్ అయ్యాము.
ఒక్క రోజుకే హైదరాబాదు కోసం కలవరిస్తున్న అమ్మను ఆస్ట్రేలియాలో ఎన్ని కథలు చెప్పి ఎంత కాలం ఆపగలను..? కలవరపాటుతోనే ఫ్లైట్లో ఓ కునుకు తీశాను.
*****
(సశేషం)