వాళ్ళు వచ్చేశారు
आखिर वे आ गए
హిందీ మూలం – డా. రమాకాంత శర్మ
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
అన్నయ్య ఉత్తరం చూసి నిజానికి నేను సంతోషించాలి. ఎందుకంటే ఈ చిన్న టౌన్ లో నేను ఉద్యోగంలో చేరిన తరువాత అన్నయ్య సకుటుంబంగా మొదటిసారి నా యింటికి వస్తున్నాడు. ఈవారంలో ఎప్పుడైనా ఇక్కడికి చేరుకుంటామని రాశాడు. అంటే దాని అర్థం వాళ్ళు ఇవాళ లేదా రేపటిలోపల ఇక్కడికి వస్తున్నారని. అన్నయ్య వస్తున్నా డని చదివి నాకు నిజంగా ఆనందం కలిగింది. కాని మరుక్షణమే అది ఆవిరిలాగా ఎగిరి పోయింది. ఏ సమస్యని నేను చూసీచూడనట్లు వదిలేస్తున్నానో, అది ఇంకా భయంకర మైన రూపం ధరించసాగింది. ఈ విషయం మా ఆవిడకి చెప్పినప్పుడు తన ముఖం కూడా వివర్ణమయింది. కొంచెంసేపు తరువాత తను అంది—“ఒకవేళ వాళ్ళు ఇవాళే వచ్చే స్తేనో?”
ఈ ప్రశ్నకి జవాబు నా దగ్గర కూడా లేదు. దీనినుంచి తప్పించుకునేదెలా. గడియారం చూసుకుంటే కాలేజీకి వెళ్ళే సమయం అయిందని తెలుస్తోంది. నేను లేచి నిలబడ్డాను. టై సరిచేసుకుంటూ మా ఆవిడవంక చూడకుండానే,“చూడు. ఇవాళ నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను” అన్నాను. తను ఏమీ మాట్లాడలేదు.
క్లాసులో నేను ఏం చెప్పానో నాకు జ్ఞాపకం లేదు. కాలేజీ నుంచి బయటికి వచ్చాక నేను చాలా ఆలోచించాను. కాని నాకు పరిష్కారం ఏదీ కనిపించలేదు. దిగులుతో కూడిన మనస్సుతో ఇంటికి వెడుతూ నేను ఆలోచిస్తూనే నన్ను నేనే తిట్టుకున్నాను. తన పరిమితమైన ఆదాయం, పెద్ద కుటుంబం కారణంగా లేమిని ఎదుర్కొంటూనే తండ్రిలాగా నన్ను పెంచి పోషించి, ఈ చిన్న టౌన్ లోని జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేయ డానికి యోగ్యుడిగా చేసిన అన్నయ్య తను వస్తున్నానని తెలియపరిచినప్పుడు సంతోషించడానికి బదులు, ఎలాగైనా తను రావడం వాయిదా పడితే ఎంతబాగుండునని నేను లోలోపలే మథనపడుతున్నాను.
నేను ఇదంతా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో మీకు చెబితే మీరు నమ్మగలరా? బహుశా నమ్మలేకపోవచ్చు. ఇంచుమించు ఏడు నెలలనుంచి లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ప్రస్తుత పరిస్థితిలోపాలవాడు ఉదయం అరువుగా పోసే పాలతోనే రెండు సార్లకి చాయ్ పెట్టుకుంటున్నామని, దానితోపాటే కాల్చిన శనగలు తిని కాలక్షేపం చేస్తున్నామని అంటే మీరు ఎలా నమ్మగలరు. నేనేదో అతిశయోక్తిగా చెబుతున్నానని మీకు అనిపించవచ్చు. కాని నిజం మాత్రం ఇదే. విషయం ఏమిటంటే నా అపాయింట్ మెంట్ పూర్తిగా తాత్కాలికమైంది. ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రతి మూడు నెలల తరువాత నా అపాయింట్ మెంట్ గడువుని పొడిగిస్తుంది. వారి దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఆదేశం లభించేవరకు నాకు జీతం దొరకదు. ఈసారయితే పరిస్థితి హద్దు మించిపోయింది. నా అపాయింట్ మెంట్ పొడిగిస్తున్న సూచన రెండు నెలలకన్నా ఎక్కువ సమయం గడిచినా ఇంకా రాలేదు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఇంట్లో ఒకపూటకి కూడా భోజనానికి అవకాశం లేదు. కొత్తగా పెళ్ళిఅయి వచ్చిన నా భార్య తన నగలు అమ్మడానికి, లేదా తాకట్టు పెట్టడానికి సిద్ధపడింది. కాని నా అంతరాత్మ దీనికి అంగీకరించ లేదు. ఇప్పటికే పెరిగిపోయిన అప్పు వల్ల ఇకముందు అప్పుగాని, అరువుగాని ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు మీరే చెప్పండి. అన్నయ్య వస్తున్నాడన్న వార్తతో సంతోషించనా లేక దిగులు పడనా? తను ఎంత సంతోషంగా ఎన్ని ఆశలు పెట్టుకుని మొదటిసారి ఇక్కడికి వస్తున్నాడో తెలియదు. నేను తనకి కాల్చిన శనగలు కూడా పెట్టే స్థితిలో లేను. నిజంగా ఈరోజున ఇంట్లో ఒక చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. నాకు ఏం చెయ్యాలో బోధపడటంలేదు. కొత్తచోట ఉన్నప్పుడు ఇదంతా ఎంత దుర్భరమైపోతుంది.
ఎటూ తేల్చుకోలేని మనస్సుతో నేను ఇంటికి ఎప్పుడు చేరుకున్నానో తెలియదు. నా శ్రీమతి తలుపు తెరుస్తూనే నా ముఖంలోని భావాలని చూసి అంతా అర్థం చేసుకుం ది. అయినా ఏదో ఆశతో నా ముఖాన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడింది. నేను `లేదు’ అనే భావంతో తల ఆడించాను. ఇంక నిలబడలేక వెళ్ళి మంచం మీద పడ్డాను.
మావూరి నుంచి ఈ చిన్నటౌన్ వరకు రెండే రైలుబళ్ళు వస్తాయి. ఒక బండి వచ్చే సమయం అయింది. రెండోది రాత్రి పదిగంటలకి వస్తుంది. ఇవాళే రాదలుచుకుంటే వాళ్ళు ఏ బండిలోనైనా రావచ్చు. ముందు బండి వచ్చే సమయం దగ్గర పడుతున్నకొద్దీ మా గుండెలు కొట్టుకునే వేగం పెరుగుతోంది. చెయ్యడానికయితే ఏమీ లేదు. వంట చేసేది లేదు, తినేది లేదు. కేవలం ఒక కప్పు పాలు చాయ్ పెట్టుకునేందుకు మిగిలాయి. మేమిద్దరం మౌనంగా ఉన్నాం. కాని మనస్సులోనే భగవంతుడిని వేడుకుంటున్నాం – అన్నయ్య ఇవాళ రాకుండా చెయ్యి తండ్రీ అని.
బయట ఏ చప్పుడు అయినా మేము ఉలిక్కిపడుతున్నాం. నడి బజారులో బట్టలు విప్పేసే సమయం వచ్చినట్లు అనిపిస్తోంది. కాని ముందు వచ్చే బండి సమయం నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోయింది. కాస్త ఊరటతో ఊపిరి పీల్చుకున్నాం. ఇంక రెండో బండి వచ్చే సమయం గడిచిపోవడం కోసం ఎదురుచూడటం మొదలయింది. కాలం అసలు ముందుకి వెడుతున్నట్లు అనిపించడంలేదు. ఒక్కొక్క క్షణం గడుస్తున్నకొద్దీ మా ప్రార్థన ప్రగాఢమవుతోంది –“భగవంతుడా, ఏ కారణంగానైనా వాళ్లు కనీసం ఇవాళ రాకుండా చెయ్యి తండ్రీ.” రెండో బండి వచ్చే సమయం కూడా దాటిపోయింది. ఆ తరువాత కూడా మేము వీధిలో ఏదైనా గుర్రంబండి లేదా రిక్షా ఆగిన సవ్వడి అయితే ఉలికిపడుతున్నాం. బహుశా దేవుడు మనస్సులోతుల్లోంచి చేసిన మా ప్రార్థన విన్నాడేమో. తలపై నుండి బరువు దింపుకున్న అనుభూతితో మేము లేచి నిద్రపోవడానికి ఉపక్రమించసాగాం.
ఇప్పుడు ఆకలి కొంచెం ఎక్కువగానే ఎందుకు వేస్తోందో తెలియదు. నేను మా ఆవిడతో కనీసం టీ అయినా పెట్టి తీసుకురమ్మన్నాను. తను వంటింట్లోకి వెళ్ళింది. కొన్ని క్షణాలలోనే తిరిగివచ్చి నా భుజం మీద తల పెట్టుకుని వెక్కివెక్కి ఏడవసాగింది. అలా ఏడుస్తూనే పాలు కూడా విరిగిపోయాయని, మంచినీళ్ళు తప్ప ఇంకేమీ మిగల్లేదని చెప్పింది.
సానుభూతితో నేను నా చేతితో ఆమె వీపుమీద నిమిరాను. కాని నా మనస్సు చెప్పలేని విధంగా వికలమై పోయింది. నా దిగులు స్వరూపం మారింది. ప్రార్థించే పదాలు మారిపోయాయి. నేను భగవంతుడిని వేడుకున్నాను—“తండ్రీ, నా చిన్నతనం నుంచి ఈనాటి వరకు నన్ను అన్నం తినకుండా నిద్రపోనివ్వలేదు. ఈరోజున నాకు దేనికి ఈ శిక్ష విధిస్తున్నావు?” ఇబ్బంది వచ్చినప్పుడు మనం భగవంతుడితో మాట్లాడటం మొదలు పెడతాం. ఎందుకో తెలియదు.
చిన్న టౌనులో రాత్రి అనేది తొందరగానే వస్తుంది. అందులో ఇప్పుడు రాత్రి పదకొండు దాటిపోయింది. మేము ఏమీ తినకుండా ఆకలితోనే పడుకున్నాం. పక్కమీద ఆటూ-ఇటూ నాలుగైదుసార్లు దొర్లిఉంటామేమో. ఇంతలోనే తలుపు మీద ఎవరో దబదబా కొట్టారు. మా యిద్దరికీ గుండె గొంతుకలో కొట్లాడింది. అనుమానంతో మేము లేచి కూర్చున్నాం. బహుశా బండి రావడం ఆలస్యం అయివుండవచ్చు. వాళ్ళు వచ్చేసి వుండవచ్చు. తలుపు తెరవడానికి మాలో ఎవరికీ ధైర్యం చాలడంలేదు. తలుపు ఇంకా గట్టిగా కొడుతున్న చప్పుడవుతోంది. ఇంక మరో మార్గం ఏదీ లేదు. నేను లేచి దడదడా కొట్టుకుంటున్న గుండెతో తలుపు తెరిచాను.
“నమస్కారం మాస్టారూ! ఇంతరాత్రివేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. కాని ఏం చెయ్యను చెప్పండి. నాన్నగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. అక్క పెళ్ళిపత్రిక నువ్వు శర్మగారికి ఇవ్వడం ఎలా మరిచిపోయావని మండిపడుతున్నా రు. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి ఆయన్ని క్షమాపణ వేడుకో. వాళ్ళ ఇంట్లో భోజనం, స్వీట్లు తీసుకెళ్లి ఇచ్చిరమ్మన్నారు.”
అన్నయ్యకి బదులుగా నా స్టూడెంటు రమేష్ ఒక చేతిలో పెద్ద టిఫిన్ క్యారియర్ పట్టుకుని నిలబడి వున్నాడు. నేను ఏమయినా చెప్పేలోపలే అతను నా చేతిలో టిఫిన్ క్యారియర్ పెట్టి మరోసారి క్షమాపణ అడుగుతూ అన్నాడు- “నేను తొందరగా వెళ్ళాలండి. టిఫిన్ క్యారియర్ తరువాత తీసుకెడతాను.” ఇది చెప్పి అతను వీధిలోని చీకట్లో కలిసిపోయాడు.
మా ఆవిడ అప్పటికే తలుపు దగ్గరికి వచ్చింది. తను కూడా అంతా వింది. టిఫిన్ క్యారియర్ నా చేతిలోంచి తీసుకొని లోపలికి వెళ్లింది. నేను తలుపు వేసి తిరిగి వచ్చేలోగా తను టిఫిన్ తెరిచింది. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన భోజనం, మిఠాయిల సువాసన గదినిండా అలుముకుంది. ఎదురుగా భోజనం అమర్చివుంది. కాని ఎందుకనో కళ్ళలోంచి నీళ్ళు మా బుగ్గలమీదుగా జారాయి. అవును, వాళ్ళు నిజంగా వచ్చారు. ఆయన మా ప్రార్థన విన్నాడు. ఇవాళ కూడా మేము ఆకలితో పడుకోవడం లేదు. మా దగ్గర ఇప్పుడు మరో అయిదుమంది వచ్చినా సరిపోయి ఇంకా మిగిలేటంత మంచి భోజనం ఉంది. వాళ్ళు రమేష్ రూపంలో మా యింటికి వచ్చారు. నిజంగా వాళ్ళు వచ్చారు.
మీకు ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. ఆ మర్నాడే కాలేజీలో డైరెక్టరేట్ నుంచి పోస్టులో నా సర్వీసు పొడిగిస్తున్నట్లు ఆర్డర్లు వచ్చాయి. ప్రిన్సిపాల్ గారికి మా ఇబ్బంది గురించిన అవగాహన ఉంది. అందువల్ల సాయంత్రంలోగానే నా జేబులో రెండునెలల జీతం వచ్చి నిలిచింది. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు నా కాళ్ళు నేలమీద నిలవడంలేదు. మా ఆవిడ ఎంత సంతోషిస్తుందోనని నేను అనుకుంటు న్నాను. మేమిద్దరం కలిసి ఇవాళ అన్నయ్య తన కుటుంబంతో సహా మొదటి బండిలోనే వచ్చేస్తే ఎంత బాగుంటుందోనని అనుకుంటాం. వాళ్ళకోసం ఎదురు చూస్తాం.
***
డా. రమాకాంత శర్మ – పరిచయం
1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత శర్మ 100కి పైగా కథలు వ్రాశారు. నాలుగు కథాసంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, నాలుగు నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాలపైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
*****
బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.