వెలుగుల రోజు

-డా.కె.దివాకరాచారి

నేను నాలాగా
ఎదిగేప్పుడు
నన్ను నడిపించి
అక్కున చేర్చుకున్న
అమ్మ ‘తులసి’ కౌగిలి
నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు
నన్ను అమ్మలా ఆదుకొని
నా దారే తన జీవనమని
నాతోనే తన జీవితమని
అందరినీ, అన్నిటినీ
వదిలి, కదిలి వచ్చి
తన చేతిని, మనసును
తలపుల్ని, బ్రతుకును
నాతో పెనవేసుకుని
తిరిగి నన్ను నిలబెట్టిన
నా నెచ్చెలి వెచ్చని
పరిష్వంగంలో ‘అమ్మ తనం’
సదా పరిమళిస్తూనే ఉంటుంది!
‘అమ్మలా’ నన్ను లాలించి
మందలించి, శాసించి,
భరించి, నన్ను నడిపిస్తూ
నాకోసం ఇద్దరు ముద్దుల
‘ చిన్నారి అమ్మల్ని’  కానుకగా ఇచ్చి
నన్ను అందరిలో
నిలబెట్టిన నా స్నేహ మంజరి
నా చేతిని తన చేతి లోకి
అందుకుని విడిపోని బంధంగా
నాలో తానై, తానే నా లోకంగా
నిలిపిన ఈ రోజున
తనకేమివ్వగలను?
‘తులసీ నందనం’
మనం కలిసి అల్లుకున్న
చిన్న ప్రేమ పొదరిల్లులో
ప్రతి వస్తువు నిన్నే పరిమళిస్తుంటే
ఆనంద పారవశ్యంలో
సేద దీరే నా అదృష్టానికి
పొంగిపోతూ, నిశ్చలంగా
నిర్మలంగా జీవితపు సంధ్యను
ఆస్వాదిస్తున్న మనం
కోరుకున్న బ్రతుకును పొందిన
ఆనందంలో మునిగి నేనున్నాను!
నలుభయ్యేళ్ళ సుదీర్ఘ
సహజీవనం తర్వాత కూడా
ఇంకా తన సాంగత్యం లో
జీవన పరిమళాలను
రోజూ నిత్య నూతనంగా ఆస్వాదిస్తూ
తన నులి వెచ్చని స్పర్శ కోసం
ఒడి లో ఒదిగి చిరు నవ్వులు
చిందించే పసిపాప నై
ఎదిరి చూస్తూ పరితపించే
నన్ను నేను తననుగా
అర్పించుకోవటం తప్ప !


*****

ఆర్ట్: చంద్ర

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.