నిజానిజాలు
– తమిరిశ జానకి
నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు సింహాచలం. ఒకళ్ళు కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే వాడినే నమిలేసేదేమో అన్నట్టుగా పళ్ళు కొరుకుతూ చూసింది సింహాచలం భార్య తిరపతమ్మ. ఇద్దరూ యజమాని వీరభద్రయ్యకి ఎదురుగా చేతులుకట్టుకుని నిలబడిఉన్నారు. మా ఇంటి కాంపౌండ్ లోనే ఔట్ హౌస్ లో మిమ్మల్ని ఉండనిస్తూ మీ మంచీచెడ్డా మీ అవసరాలు అన్నీ చూస్తూ ఆఖరికి మీ అబ్బాయి చదువు సంధ్యలకి అయ్యే ఖర్చులన్నీ పెట్టుకుంటూ మీమీద నేనెంతో నమ్మకంతో ఉన్నట్టే మీరుకూడా ఉండాలి కదా సింహాచలం. ఏవున్నాలేకపోయినా ఏమనిషికైనా ఉండాల్సింది విశ్వాసం. నీకొడుకు నాకూతురితో షికార్లుచేస్తున్నాడుట. తన కళ్ళారా చూసిన కోటయ్య వచ్చి చెప్పాడు. మనకి తెలియనే తెలియదు. మీవాడిలో ఏ బుద్ధిపుట్టిందో.
అసలే కోటయ్య అంటే అంతగా పడదు వీరభద్రానికి. అతగాడు చూశాడు కాబట్టి రమేష్ మీద కోపం రెండింతలుగా ఉందిప్పుడు.
వీరభద్రయ్య మాట్లాడిన ఒక్కొక్క మాటా ఒక్కొక్క శూలంలా గుచ్చుకుంది సింహాచలం తిరపతమ్మల గుండెల్లో.ఎన్నేళ్ళగానో సింహాచలం కుటుంబీకులే వీరభద్రయ్య కుటుంబీకులకి పాలేర్లుగా వస్తున్నారు. నమ్మకంగా ఆఇంటిని అంటిపెట్టుకుని గడుపుకొస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఇలా ఈరోజు యజమానిచేత మాట అనిపించుకోవలసి వచ్చిందని భార్యాభర్తలిద్దరికీ చాలా బాధనిపిస్తోంది. ఔనుమరి రమేష్ అలాంటి పని చేస్తున్నాడంటే అది చిన్నా చితకా తప్పు కాదు. అయ్యగారు తమ కూతుర్ని పట్నంలో చదివించుకోడవేకాదు ఈడిని కూడా అక్కడ కాలేజీలో చదివిస్తావుంటే కళ్ళు నెత్తికెక్కినాయి కాబోలు .
ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్ళు తిరిగాయి. అయ్యగారికి ఏం జవాబు చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. వెళ్ళి మీ పన్లు చూసుకోండి వీరభద్రయ్య నోటినించి ఆ మాట రావడం ఆలస్యం బతుకుజీవుడా అని ఇద్దరూ బయటపడ్డారు. ఇంటికెళ్ళారన్నమాటేగానీ నోట్లోకి ముద్దపోలేదు ఇద్దరికీ . ఒక్కడే కొడుకని గారంగా పెంచడం తప్పయిందా అని మధనపడుతోంది తిరపతమ్మ.
అయ్యగారు తన కొడుకుని అభిమానంగా చూసుకోవడం పొరపాటైపోయిందా అని సింహాచలం ఆలోచిస్తున్నాడు.
వీరభద్రం దంపతుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. సరితని తీసుకుని సినిమాలకి షికార్లకి తిరిగేటంత చనువు ఎలా తీసేసుకున్నాడు రమేష్ అని ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి.
ఈ ఊళ్ళో చదువుకున్నన్ని రోజులూ ఎంతో మర్యాదగా సరితకి ఆమడ దూరంలో ఉండేవాడు ఎవరితోనూకూడా ఎప్పుడూ గట్టిగా మాట్లాడేవాడు కూడా కాదు . చాలా బుద్ధిమంతుడు. తన చదువే తన లోకం అన్నట్టు ఉండేవాడు. అన్ని తరగతుల్లోనూ మంచి మార్కులతో పాసయ్యేవాడు. అందుకే వాడంటే ఇష్టం వీరభద్రయ్యకి. వాడెంతవరకూ చదువుకుంటానంటే అంతవరకూ చదివిస్తానని ఎంత డబ్బయినా ఖర్చు పెడతానని వాడికి చెప్పాడు.అందుకే పట్నంలో కాలేజిలో చేర్పిచాడు వాడిని. ఇప్పుడు బి.టెక్. ఆఖరిసంవత్సరంలో ఉన్నాడు. బి.టెక్. ఆఖరి సంవత్సరంలోనే ఉంది తన కూతురు సరిత కూడా. కానీ ఇద్దరూ వేరు వేరు కాలేజీలు.
ఇద్దరూ చిన్నపిల్లలేమీ కాదు నిజమే. కానీ సరిత తన స్నేహితురాళ్ళతో కలిసి సినిమాలకి హోటళ్ళకి వెళ్తుందే తప్ప మొగపిల్లలతో కలిసి వెళ్ళదు అందులో ఒంటరిగా మొగపిల్లలతో కలిసి అసలు వెళ్ళదు. అలా ఎప్పుడూ తిరగడానికి వీల్లేదని చెప్పి పంపుతూనే ఉంటాం కదా మరిప్పుడు జరిగిందేమిటి అసలు ఎన్నాళ్ళనించీ ఇలా నడుస్తోందో ఎంత ధైర్యం ఆ రమేష్ గాడికి. ఎదురుగా ఉన్నప్పుడు ఎంత భయభక్తులు చూపిస్తాడు అంతా నటనే అన్నమాట. రోజులుమారాయి నిజమేకానీ సింహాచలం కుటుంబం మీద ఇన్నాళ్ళూ ఎప్పుడూ ఏవిషయంలోనూ అపనమ్మకం లేదు తనకి. ఇప్పుడు కూడా రమేష్ అలాంటివాడంటే నమ్మాలని అనిపించట్లేదు. కానీ తన కళ్ళారా చూశానని కోటయ్య చెప్తున్నాడు కదా.
ఎడతెరిపిలేని ఆలోచన్లతో ఆరాత్రి నిద్ర కరువైంది వీరభద్రం దంపతులకి. బంధువులందరి ముందూ అవమానభారం మొయ్యాలి అంటే అది మామూలు విషయం కాదు వాళ్ళ దృష్టిలో.
ఈ రోజు ఈ సంగతి తమ చెవిన వేసిన ఆ బంధువు కోటయ్య ఆమాటా ఈమాటాగా ఇంకొందరి చెవుల్లోనూ తప్పకుండా వేస్తాడుగా . అలా అలా అందరు బంధువులకీ తెలుస్తుంది. ఊళ్ళో పెద్దరికం పలుకుబడి అన్నీ కొట్టుకుపోతాయి అనే దిగులు కమ్మేసింది వాళ్ళని.
తెల్లవారి మంచందిగుతూనే పట్నం వెళ్ళి పిల్లని కలిసొస్తాను అంటున్న భర్తవంక చూసి ఔను అదే మంచిపని అంది కామాక్షి.
పట్నం చేరాక గుబులు గుబులుగానే కూతురు దగ్గిరకి వెళ్ళాడు.
సరిత సూటిగా తండ్రి మొహంలోకి చూడలేకపోయింది. ఆకోటయ్యగారెళ్ళి ఏదో పుకారు పుట్టించే ఉంటాడని అర్ధమైపోయింది. లేకపోతే ఇంత హఠాత్తుగా ఫోన్ చెయ్యకుండా ఎందుకొస్తాడాయన. కాలేజ్ కి దగ్గర్లో దూరపుచుట్టాలింట్లో పేయింగ్ గెస్ట్ లా ఓగది అద్దెకి తీసుకుని స్నేహితురాలితో కలిసి ఉంటోంది సరిత. శ్రద్ధగా బాగానే చదువుకుంటోంది. ఆఖరి సంవత్సరంలో ఉన్న అభిలాష్ ఈమధ్య పరిచయం బాగా పెంచుకుని తరచుగా బయట ఎక్కడో అక్కడ కలుస్తూనే ఉన్నాడు సరితని. తన స్నేహితురాళ్ళతో సరదాగా ఎలా కబుర్లు చెప్తుందో అలాగే అతనితో కూడా కబుర్లు చెప్పడం అలవాటయింది ఆమెకి. అతను మాట్లాడుతుంటే అబ్బో ఎన్నెన్ని విషయాలు తెలుసు ఇతనికి అనుకుంటూ సంభ్రమంగా చూస్తుంది. తనని పల్లెటూరి బైతు అని మనసులో అతననుకుంటున్నాడని ఆమెకేం తెలుసు . మంచివాడని బాగా నమ్మింది. హోటల్లో కాఫీ తాగుదాం అని రమ్మని పిలిస్తే రెండుసార్లు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళింది. ఇంక ఆఖరి ఏడాదిలోకి వచ్చేసిందిగా అందుకే కాస్త ధైర్యం వచ్చినట్టుంది. ఇప్పటికే తన స్నేహితురాళ్ళు టచ్ మీ నాట్ అనీ అమాయకురాలనీ ఏవేవో అలాంటివే రకరకాల పేర్లు పెట్టారు. ఆ పేర్లు తుడిచెయ్యాలన్న ప్రయత్నమే ఇది.
హఠాత్తుగా ఒకరోజు అడిగాడు నన్ను పెళ్ళి చేసుకోడం ఇష్టమేనా అని. ఇష్టమేనని తల ఊపింది. పెద్దవాళ్ళతో చెప్పాలి చెప్పకుండా మాత్రం కాదు అంది. ఈమాట అంతగా నచ్చినట్టు లేదు అభిలాష్ కి.
ఆలోచిద్దాంలే. పరీక్షలై రిజల్ట్స్ వచ్చేదాకా ఎవరితోనూ ఈసంగతి మాట్లాడకు మీవాళ్ళతోకూడా చెప్పద్దు నామనసెప్పుడెలా మారుతుందో నేనే చెప్పలేను అన్నాడు చిరాగ్గా.
అలా ఎందుకంటున్నావని ధైర్యం చేసి అడగలేకపోయింది సరిత. రెట్టించి అడిగితే కోపం వస్తుందేమో అని భయపడినమాట నిజం. పోన్లే అమ్మావాళ్ళకి పరీక్షలయ్యాకే ఈసంగతి చెప్పచ్చు కంగారేముంది అనుకుంది. కానీ ఈలోపల పరిస్థితులు ఇలా వికటిస్తాయని ఎవరూహించగలరు . అయినా ఇదీ తనమంచికేగా ఈవిదంగా జరగడంవల్ల ఆ అభిలాష్ ఎలాంటివాడో ముందే తెలిసిందిగా.
ఏవిటాలోచిస్తున్నావు రేపూ ఎల్లుండి కాలేజ్ కి సెలవేగా పద బయల్దేరు నిన్ను ఇంటికి తీసికెళ్దామని వచ్చాను. రమేష్ ని కూడా రమ్మన్నాను వస్తున్నాడు.
తండ్రి గొంతు ఖంగుమనగానే ఆలోచనల్లోంచి ఇవతలికి వచ్చింది సరిత. ఊరు చేరేవరకూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
ఇంటికి వెళ్ళేసరికి సింహాచలం తిరపతమ్మా ఇద్దరూ ఉన్న నాలుగ్గిన్నెలూ ఓ అట్టపెట్టెలో పెట్టి ఉన్న నాలుగు బట్టలూ ఓ మూటకట్టి బయల్దేరడానికి సిద్ధంగా కూచుని కనిపించారు వీధి గుమ్మంలో. ఇద్దరి మొహాల్లోనూ విచారం గూడుకట్టుకుని ఉంది.
అమ్మగారితో చెప్పడం అయింది. అయ్యగారు రాగానే చెప్పేసి దూరంగా పొలంగట్ల దగ్గిర పాకలో ఉండాలని అక్కడినించే పన్లకి ఇక్కడికి వచ్చిపోతుండాలని ఆలోచించుకున్నారు. ఇక్కడుండి అయ్యగారి మర్యాదకి లోటు రానియ్యదల్చుకోలేదు. ఆ నిర్ణయంతోనే సామాను సద్దుకుని కూచున్నారు.
ఎవరివంకా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు వీరభద్రం. అమ్మ పక్కనే కూచుని చాలా మెల్లిగా అడిగాడు రమేష్ ఏమైందమ్మా సామానుతో సహా ఇలా ఇక్కడెందుక్కూచున్నారని. తిరపతమ్మ మొహం తిప్పుకుంది మాట్లాడటం ఇష్టం లేనట్టు. తండ్రివైపు చూశాడు రమేష్.
నువ్వు చేసిన నిర్వాకవే. ఏమీ తెలియనట్టు మమ్మల్ని అడుగుతున్నావా ఎదురు ప్రశ్నించాడు సింహాచలం. అప్పుడు గొంతు విప్పింది తిరపతమ్మ ఒక్క అక్షరం పొల్లుపోకుండా వీరభద్రంగారు అన్నమాటలన్నీ కొడుక్కి చెప్పింది. నీ బుద్ధి ఇలా తగలడినప్పుడు ఇక్కడింట్లో ఎలా ఉంటాం రోజూ నీ మొహం ఎలా చూస్తారయ్యగారు. పొలందగ్గిర పాకల్లోకి పోదాం. ఆలోచిస్తూ ఉండిపోయాడు రమేష్. కొడుకు వైపు కొరకొరా చూస్తూ అన్నాడు సింహాచలం గొంతు బాగా తగ్గించి అయ్యగారు మనకి చేస్తున్న సాయానికి జన్మజన్మలకీ మనం ఋణం తీర్చుకోలేం . కనీసం ఇక్కడినించి దూరంగా పోయి ఉంటే ప్రతి నివిషం ఆయన కళ్ళపడకుండా ఉంటాం. కోపం తెప్పించకుండా ఉంటాం. అమ్మాయిగారికి నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది అర్ధమయ్యిందా ఆళ్ళ పరువు పోగొట్టకు. మౌనంగా తలఊపాడు రమేష్ అంతే తప్ప నోరువిప్పి జరిగిన విషయమేమీ చెప్పలేదు.
నువ్వూ అమ్మాయీ ఒకసారిలా రండి లోపలిగదిలోంచి వీరభద్రయ్య పిలవగానే భయంభయంగా అమ్మ వెనకే నడిచింది సరిత. అస్తిమితంగా అటూఇటూ పచార్లు చేస్తున్న భర్తని చూసి కామాక్షికి మరింత బాధనిపించింది. ఊ ఇప్పుడు చెప్పు నిన్ను సినిమాలకీ షికార్లకీ ఎప్పటినించీ తిప్పడం మొదలుపెట్టాడు ఆ రమేష్ తండ్రి సంధించిన ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పింది సరిత ఎప్పుడూ మేమిద్దరం కలిసి ఎక్కడికీ వెళ్ళలేదని. అబద్ధాలు చెప్పకు. కోటయ్య చూశాడు చెప్పాడు. నాకంతా తెలుసు. ఇంక తండ్రితో అంతా వివరంగా చెప్పాలి లేకపోతే అనవసరంగా రమేష్ మీద నిందపడుతుందనిపించింది సరితకి. అభిలాష్ తో పరిచయం స్నేహంగా మారడం అతనితో ఎప్పుడైనా హోటల్ కి వెళ్ళి తినడం మాల్స్ కి వెళ్ళి తిరగడం అతను పెళ్ళి చేసుకుంటావా అని అడగడం ఇప్పుడే ఇంట్లో ఎవరికీ చెప్పద్దని అనడం అన్నీ ఒక్కొక్కటీ చెప్తూ ఒక నిమిషం ఆగింది.
ఊహించను కూడా ఊహించలేని ఈ కొత్త సంగతికి తెల్లబోయి చూశారు కామాక్షీ వీరభద్రయ్యలు. నమ్మలేనట్టుగా ఉన్నాయి వాళ్ళ చూపులు.
ఒకరోజు హోటల్ కి రమ్మంటే వెళ్ళాను. కానీ తనెంతకీ రాలేదు. చాలా సేపు ఎదురు చూశాను. ఆ సమయంలో ఇద్దరు రౌడీలు నా వెనక చేరి పిచ్చిపిచ్చిగా వాగడం మొదలుపెట్టారు. నేను భయపడుతూ అభిలాష్ కి ఫోన్ చేశాను. తనకి ఇంకో గర్ల్ ఫ్రెండు ఉందని ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమాకి తీసికెళ్ళమంటోందని దానికి వెళ్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అభిలాష్ ని నమ్మినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. వెనక రౌడీల మాటలకి ఏడుపొక్కటే తక్కువైంది నాకు. ఆ సమయంలో సరిగ్గా అటువైపు వచ్చిన రమేష్ నా వెనక రౌడీలు వెకిలిగా నవ్వుతూ నువ్వు పిలిచినవాడు రాలేదా మేమున్నాంగా రమ్మంటావా అనడం విన్నాడు. పద వెళ్దాం అంటూ తనకోసమే నేను ఎదురు చూస్తున్నట్టుగా నా దగ్గిరకి వచ్చాడు. ఆ రౌడీలు జారుకున్నారు. అప్పుడే ఆ కోటయ్యగారటువైపు వెళ్తూ నన్నూ రమేష్ నీ చూశారు. ఇదీ జరిగిన సంగతి.
చెప్పడం ముగించింది సరిత. కోటయ్య చెప్పిన మాటలు పట్టుకుని నిజనిజాలు తెలియకుండా రమేష్ ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకూ వాళ్ళ అమ్మా నాన్నని నిందించినందుకూ బాధపడుతూ తనని తనే తిట్టుకున్నాడు వీరభద్రయ్య మాటల్తో వాళ్ళమనసులు గాయపరిచినందుకు. తన కుటుంబాన్ని నమ్ముకుని వాళ్ళ జీవితమే తన కుటుంబానికి అంకితం చేసిన వాళ్ళని ముందూ వెనకా ఆలోచించకుండా మాట తూలడం ఎంత తప్పు. గబగబా బయటిగుమ్మంలోకి వచ్చి ముగ్గురికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఎక్కడికీ వెళ్ళద్దు ఎప్పటిలాఇక్కడే ఉండిపొమ్మని చాలా చెప్పి చూశాడు. చివరికి ఒక మాటన్నాడు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ధనవంతులకే కాదు పేదవాళ్ళక్కూడా ఉంటాయని నాకు తెలుసు ఉండాలి కూడా అందుకే క్షమించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. వింటున్న ముగ్గురి కళ్ళల్లోనూ నీళ్ళు తిరిగాయి.
తాము వెళ్ళిపోతామన్నది అయ్యగారిమీద కోపంతో కాదు. ఆత్మాభిమానంతోనూ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికీ అన్నవిషయం అయ్యగారికి అర్ధమైంది. అది చాలు. మరొకరైతే డబ్బులేకపోయినా పొగరుకేం తక్కువలేదు వీళ్ళకి అంటూ సూటిపోటిమాటలంటారు.
బయట పెట్టిన తమ సామాను లోపలికి తీసుకెళ్ళారు ముగ్గురూ. తమని నమ్ముకున్న అయ్యగారు తాము నమ్ముకున్న అయ్యగారు…….ఒకరి సహాయసహకారాలు మరొకరికి కావాలి. అందులో తప్పులేదు. ఇద్దరిమధ్యా ఉన్నబంధంలో అపోహలూ అనుమానాలు చోటుచేసుకుంటే వాటిగురించి నిజానిజాలు తెలుసుకుని సందేహనివృత్తి చేసుకుని బంధం నిలబెట్టుకోవడంలోనూ తప్పులేదు కదా అనిపించింది సింహాచలం మంచిమనసుకి.
మంచితనమన్నది కులగోత్రాల్లో లేదు మనిషి మనసులో ఉంటుందని పూర్తిగా అర్ధమైంది వీరభద్రానికి.
******
పేరు…………..తమిరిశ జానకి
పుట్టినఊరు….మచిలీపట్నం, క్రిష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ . ( అమ్మమ్మగారి ఊరు )
తండ్రిగారి ఊరు—నర్సాపురం , పశ్చిమగోదావరిజిల్లా .
పుట్టినతేదీ——-26- 10- 1946
విద్య———–బి.ఏ.
రచనలు చేయడం మొదలుపెట్టినది 1960 లో హైస్కూల్లో చదువుతున్నప్పటినుండీ. హైస్కూల్ మేగజైన్ ,కళాశాల మేగజైన్ , చిన్నచిన్న స్థానిక పత్రికలలోనూ రచనలు చేశాను. అప్పుడు నాపేరు యర్రమిల్లి జానకి. పూర్తిపేరుతో రాయకుండా వై.జె. అనే పేరుతో రాసేదాన్ని. కళాశాలలో చదివేటప్పుడు మంజువాణి అనే పత్రికవారు అన్ని ఊళ్ళల్లోని కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు నిర్వహించిన కధలపోటీలో నా కధకు బహుమతి వచ్చింది. యువ, జ్యోతి మాసపత్రికలలోనూ, ఆంధ్రపత్రిక, చుక్కాని పక్షపత్రికలోనూ,కృష్ణాపత్రికలోనూ, ఎమ్.ఎస్.కో వారి పుస్తకప్రపంచంలోనూ వై.జె. అనే పేరుతోనూ, వై.జానకి అనేపేరుతోనూ కధలు రాసేదాన్ని. 1965లో వివాహమయ్యాక తమిరిశ జానకి పేరుతో అన్ని పత్రికలలోనూ కధలు , కవితలు , వ్యాసాలు, నవలలు రాస్తూనే ఉన్నాను.