మల్లమ్మ
– గంటి భానుమతి
“ అమ్మా నేనెవరిని? “
నేనెవరిని అంటూ ప్రశ్నిస్తూ, తన ఉనికి తెలుసుకోడానికి ప్రశ్నించడానికి ఆమె ఓ మహర్షీ, ఓ యోగిని ఆత్మ జ్ఞాని కూడా కాదు. ఓ మామూలు పదమూడేళ్ల పిల్ల. తన లోపల జరుగుతున్న మార్పులు గమనిస్తున్న ఆమెని అలా అడిగించింది.
కూతురు ఈ ప్రశ్న వేస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా అనుకో లేదు. అందుకే జవాబులు సిద్దంగా పెట్టుకోలేదు.
“ చెప్పు, నేను మల్లమ్మనా, మల్లయ్యనా, ఈ అవతారం నేనింక వెయ్యలేను. “
ఎందుకలా జరిగిందో చెప్పాలనుకుంది .
గొంతు సవరించుకున్నా ఒక్క మాట కూడా బయటికి రాలేదు.
దిక్కులు చూసింది. ఒక్కసారి మనసులో జ్ఞాపకాల దిగులు కళ్ళల్లోకి దూరిపోయాయి. ఏం చెప్పలేక అక్కడినుంచి లేచి వెళ్లింది.
కూతురి మాటలు ఆమె చెవుల్లో పదే పదే వినిపిస్తున్నాయి.
ఆమెకు సమాధానం కావాలి. తను చెప్పాలి.
లోకానికి తెలియని ఓ భయంకరమైన నిజాన్ని బయట పెట్టాలి. ఇన్నాళ్ళు తన ఊపిరిలో భాగమైన నిజాన్ని బయటికి తీయాలి.
పొరలు పొరలుగా ఆ కుబుసాలను నిజాన్ని రాల్చాలి. సమయం వచ్చింది.
సృష్టిని సవాలు చేస్తూ కూతురి సహజత్వాన్ని చిదిమేసిన భర్త లేడు. ఇప్పుడు కూతురు తన ఉనికిని తెలుసుకోవాలనుకుంటోంది. తనెవరో లోకానికి తెలియ చేయాలనుకుంటోంది. చెరిపితే చెరిగిపోయే, కడిగితే వదిలి పోయే ఉనికిని గురించి అడుగుతోంది. చెప్పడానికి కావలసిన ధైర్యాన్ని మూట గట్టుకుంటోంది. కూతురికి ఎక్కడినుంచి చెప్పాలో కూర్చుకుంది.
ఆరోజు, గుర్తు తెచ్చుకుంది. మల్లమ్మని మల్లయ్యగా చేసిన రోజు.
భూమి ఆకాశాలు ఒక్కటై పోతున్నాయి. ఉరుములూ, మెరుపులూ, హోరున వర్షం కురుస్తోంది. ఆమెకి నొప్పులు అంతకంతకు ఎక్కువై పోతున్నాయి. ఎవరినైనా సాయానికి పిలవడానికి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి
ఆ గదిలో ఓ వారగా పాత దుప్పటీ మీద పడుకుని ఉన్న ఆమె కళ్ళు మూసుకుంది. నొప్పి. భరించలేని నొప్పి. ఆ నొప్పిని ఓ పక్కకి తోయలేక పోతోంది.
ఆ నొప్పిని చీల్చుకుంటూ బయటికి వచ్చేసే మాంసపు ముద్ద కోసం బయట ఆమె భర్త సారయ్య ఎదురు చూస్తున్నాడు. ఆ ముద్ద కొడుకే అవ్వాలి. కొడుకే పుట్టాలి. భార్య శరీరంలోంచి బయటికి వచ్చే కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు.
కూతురు పుట్ట కూడదు. పుడితే , నువ్వేం మొగాడివి కొడుకుని పుట్టించ లేక పోయావు అని అందరూ అంటారు. ఆ ఆలోచన రాగానే సారయ్య వణికి పోయాడు. గుండె పరిగెడుతోంది.
“ ఎప్పుడు పురుడొస్తుంది. ఎప్పుడు జరుగుతుంది “ తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడు లోపల ఉన్న భార్యకి వినిపించేలాగా అన్నాడు.
ఆమె జవాబు చెప్పాలి. ‘ ఇదిగో నువ్వు ఆడిగినట్లుగానే నీకు కొడుకునే ఇస్తున్నాను ‘ అని అనాలి. అటువంటి సమాధానం ఆమె నుంచి రావాలి.
అటుంటి సమాధానం ఎలా ఇస్తుంది? అసలు ఎవరు తన కడుపులోంచి బయటికి వస్తారో ఆమెకే తెలీదు.
ఆమె కడుపు గుహలో నుంచి, ఆ అంధకారం లోంచి వెలుగులోకి భూమ్మీదకి వచ్చి, చేసే తొలి ఆర్తనాదం కోసం సారయ్య ఎదురుచూస్తున్నాడు.
“ పైన దేవుడున్నాడు, వాడు ఎంతో గొప్పవాడు. ఏం చెయ్యాలో తెలుసు. ఎప్పుడు చెయ్యాలో తెలుసు. ఎవరిని మనకివ్వాలో కూడా తెలుసు. పైనుంచి అన్నీ చూస్తాడు. అన్నీ చేస్తాడు. “ ఈ మాటలు ఆమె తలలో రెడీగా ఉన్నాయి. కానీ ఆమె అలా అనే పరిస్థితిలో లేదు. కళ్ళు మూసుకుంది.
ఒకవేళ కొడుకు కాకపోతే , ఆ ఆలోచనకి భయం వేసింది. భయం అన్ని వేళలా గొంతు చించుకోదు. అందుకే ఆమె ఏం అనలేక పోయింది.
“ జాగ్రత్తగా విను, మా ఇంట్లో అందరికీ మొదట కొడుకులే పుట్టారు. మా తాత, మా నాయన, పెద్ద నాయన అందరికి, ఇప్పుడు నాకు కూడా కొడుకే కావాల. అదే నువ్వు కూడా చెయ్యాలి. “
ఆ మాటలు గుర్తుకు రాగానే మళ్ళీ భయం వేసింది. కొడుకు కాకపోతే తనకి బతికే అధికారమే లేదా.
మళ్ళీ నొప్పి . చేత్తో అటూ ఇటూ తడిమింది. ఓ చీర తగిలింది. దాన్ని పళ్ళ మధ్య పెట్టుకుంది. పొట్ట మీద చెయ్యి వేసి కిందకి తోస్తోంది. దేపుడిని తలుచుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న మాంసపు ముద్దని లాగుతోంది. బాధతో ఒక్కసారి ఆ ముద్దని లాగింది. అక్కడ ముందే ఉంచిన కత్తిని చేత్తో తడిమి తీసుంది. సారయ్యని వేడి నీళ్ళు అడిగింది. ఆ నీటితో కడిగింది. దేవుడుని తలుచుకుంది. కొడుకే అవాలి, బొడ్డు కోసింది. బంధం తెగుతోంది. కొడుకైనా కూతురైనా బంధం తెగింది.
ఎవరు ఈ లోకంలోకి వచ్చారో ఆమెకి తెలుసుకోవాలని ఉంది. సారయ్య చూపుని అర్థం చేసుకుంది.
నిశ్శబ్ధంగా ఉండిపోయాడు. భర్త నిశ్శబ్ధం అపశకునంలా అనిపించింది. కూతురన్నమాట.
ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం జరుగుతుంది? చంపెస్తాడా? గొంతులో వడ్ల గింజని తోస్తాడా? నేల కేసి విసిరి కొడ్తాడా? గొంతు నొక్కెస్తాడా?
ఇన్నాళ్ళూ కడుపులో భధ్రంగా హాయిగా, వెచ్చగా ఉన్న కూతురు ప్రాణం ఎదురుగా ఉన్న సారయ్య చేతిలో ఉంది. బయటి ప్రపంచం ఎంత ప్రమాదకరమైందో ఆ చిన్ని ప్రాణానికి తెలీదు. స్వంత వాళ్ళ నుంచే రక్షణ లేదు. రక్షించలేని నిస్సహాయత తో భయంగా చూసింది.
సారయ్య కళ్ళు తుడుచుకున్నాడు. భార్యని చూడకుండా తల పైకెత్తాడు.
“ కూతుర్ని కన్నావు, నిజంగా కొడుకే అయి ఉంటే నా కళ్లల్లో నీళ్ళుండేవి కావు. నువ్వు పవిత్రమైన మా కుటుంబ నిర్ణయాన్ని వ్యతిరేకించావు. “
ఆమె వింతగా చూసింది.
“ ఇది నా తప్పా! దేవుడి నిర్ణయం అలా ఉంది. ఓ దేవతని పంపారు. ”
“ కాదు. దేవతని కాదు. నీ దేవుడి ఈ నిర్ణయాన్ని నేను మారుస్తాను. నీకు పుట్టింది కూతురు కాదు, కొడుకు. నా పక్కన ఎప్పుడూ నుంచుని తోడుగా ఉండే కొడుకు. “
ఆమె నోట మాట రాలేదు.
“ ఇక మీదనుంచి కూతురు పేరు మల్లమ్మ కాదు, మల్లయ్య. ఓ కొడుకు లాగా పెంచు. ఎవరికీ తెలియనీయకు.“ అని ఆమె గుండె మీద బండని పడేసాడు.
ఇది జరిగి పదమూడేళ్ళయింది.
చెప్పడం పి కూతురి కేసి చూసింది.
మల్లమ్మ అంతా వింది. ఇప్పుడు ఆమె మనసు రెండు దిమ్మల మధ్య నొక్కుకు పోయినట్లుగా , స్పర్శ కోల్పోయినట్లుగా ఉంది.
తండ్రి స్వార్థంతో తన రేపటి కోసం, నేను మొగపిల్లాడినైతే కూలీ డబ్బులెక్కవోస్తాయన్న ఆశతో, ఈ సమాజంలో తను మాత్రమే ముందుకు వెళ్ళడం కోసం, తనున్న గూడెంలో తన పరువు నిలుపుకోడం కోసం తన జీవితాన్నే వెనక్కి తోసిన, తండ్రి మీద కోపంగా ఉంది.
తన తండ్రి తెలిసో తెలియకో చేయలేదు. అమాయకత్వంతో చేయలేదు. అజ్ఞానంతో చేయలేదు. మూర్ఖత్వంతో చేసాడు. తనని బలి చేసాడు. తనని మభ్య పెట్టాడు. మోసపుచ్చాడు. ఓ అమ్మాయిగా తనలో చెలరేగే భావాలని అణిచి వేసాడు. ఓ అబద్దపు జీవితాన్ని సృష్టించాడు. జీవితాన్ని ఎడారిగా మార్చిన తండ్రి కూలికి వెళ్తూ ట్రాక్టరు ఓ పక్కకి పడిపోవడంతో అక్కడిక్కడే పోయాడు.
మల్లమ్మని మల్లయ్యగా చేసిన తండ్రి ఈనాడు లేడు. అతను పోయి తన పేరుని తనకిచ్చాడు. తనేమిటో తెలుసుకోడానికి అవకాశం కూడా ఇచ్చాడు.
గదిలో ఓ మూల కూచుని గుమ్మం దగ్గర ఉన్న దీపం కేసి చూస్తోంది. త్రిశంకుడిలా గడుపుతున్న జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలో తెలియని అయోమయ స్థితి.
దీపం కొద్ది కొద్దిగా కొడగొట్టింది. వెలుతురు మెల్లగా మసక బారింది. దిగులు ,ఆవేదన, ఏడుపు అన్నీ ఒకదాని వెనక ఒకటి పొరలుగా, ముడతలుగా ఆమెని కమ్మేసాయి.
నర్సిమ్మ గుర్తొచ్చాడు. తన ప్రాణ స్నేహితుడు, తనంటే ఎంతో ఇష్టం. కలిసి పని చేసారు. కలిసి ఆడుకున్నారు. కలిసి చెట్లెక్కారు. కలిసి కూలీకెళ్ళారు. మధ్యాహ్నాలు కలిసి రొట్టెలు తిన్నారు. ఏమాత్రం బేధం లేకుండా తిరిగారు. ఈ సమయంలో నర్సిమ్మ తన పక్కన ఉండాలి. తన బాధని చెప్పుకోవాలి.
ఇప్పుడు తను వేరు, తనలోని ఈ మార్పుల గురించి అర్థం అవుతోంది. ఈ సంగతి నర్సిమ్మ కి చెప్పాలని ఉంది. కాని ఎలా చెప్పడం? చెప్తే ఏం చేస్తాడు? విన్నాక ఏం చేస్తాడు? మోసం చేసానని అంటాడా!
తనంటే చాలా ఇష్టం. తనకి కూడా నర్సిమ్మ అంటే ఇష్టం . ఇప్పుడు నర్సిమ్మ చేయి తాకితేనే మనసు వణికి పోతోంది. అలజడి. నరాలు జివ్వు మంటున్నాయి. తెలియని భావాలు, ఆలోచనలు రాత్రీ పగలు తినెస్తున్నాయి. తనలో ఎన్నో మార్పులు .
తనేంటో ఇన్నాళ్ళూ తెలీలేదు. ఇప్పుడు తెలిసింది. తను ఓ అమ్మాయి. బయటి ప్రపంచం కోసం తనని ఓ మొగవాడిలాగా చేసిన తండ్రి ఈ లోకంలో లేడు. ఉంటే తను ప్రతిఘటించేదా !
ఈ ప్రకృతి ధర్మాలని ఎదిరించాలని లేదు. తన మొగవాడిలాగా నటిండం ఇంక కుదరదు. ఈ మొగవేషానికి ముగింపునివ్వాలి, ఓ అమ్మాయిలాగా ఉండాలి. ఓ ఆడపిల్లలాగా జీవించాలి.
అందరు అమ్మాయిలూ ఎలా ఉన్నారో తను కూడా అలాంటిదే అని నర్సిమ్మ కి చెప్పాలి. కొన్ని రోజులు పోయాకా పెళ్ళి చేసుకోమని అడగాలి.
ఆ మర్నాడే కూలి పనికి వెళ్ళినప్పుడు నిజం చెప్పింది.
“ అయితే నువ్వు మొగవాడివి కావా, ఆడదానివా, నువ్వు ఓ మొగవాడిలా నడుస్తావు, ఓ మగవాడిలాగే మాట్లాడుతావు, నాదృష్టిలో పాత మల్లయ్యవే. నీకు నాకు పెళ్ళేంటీ , “
దెబ్బ తిన్నట్టు చూసింది.
“ నాలో ఉన్న అమ్మాయంటే ఇష్టం లేదా, లేకపోతే నేను ఓ మొగవాడిననే భావం నీలో ఉందా! “
నర్సిమ్మ మౌనంగా ఉన్నాడు. ఆమె వైపు చూడలేదు.
“నువ్వు నిజంగా ఆడదానివా?” అని అన్నప్పుడు ఆకాశం వైపు చూస్తూ అడిగాడు.
“ మానాన్న తన స్వార్థంతో నాలోని అమ్మాయిని బలి చేసాడు. కొడుకే కావాలి కూతురొద్దు అనే మూర్ఖపు ఆలోచనతో చిన్నప్పటి నుంచి మొగపిల్లాడిలాగా తయారు చేసాడు. నేను పుట్టిన వెంటనే మా పల్లెని వదిలి ఇక్కడికి వచ్చాడు.
మనం ఇద్దరం చిన్ప్పటి నుంచి ఇక్కడే పెరిగాం, ఇద్దరం ఆ చిన్న కొండలూ, గుట్టలూ ఎక్కాం , కొట్టుకున్నాం. తిట్టుకున్నాం. చెట్లెక్కాం, పళ్లు కోసాం, పూలు కోసాం. అవన్నీ నీకు తెలీదా, ఒక్కసారి గుర్తు చేసుకో “
మల్లమ్మ ఇంకా అలా తన మాటల్ని కొనసాగించడం నర్సిమ్మకిష్టం లేదు. ఎక్కువ మాట్లాడ లేదు.
“ ఇంక ఏం చెప్పకు. నేను వినను. నా బాధ నీకు తెలీదు. నా అందమైన గతాన్ని నేను పోగొట్టుకున్నాను. “ అంటూ లేచాడు. ఆమె దెబ్బ తిన్నట్టు చూసింది.
ఒక్కసారి వాళ్ళ హృదయాలు పేపరులా మారిపోయాయి. అవి పెద్ద శబ్ధం చేస్తూ ఓ వెయ్యి ముక్కలయ్యాయి. ఆ ముక్కలన్నీ గాలితో కలిసి ఆ మైదానంలో చెట్లల్లో నేలలో గుట్టల పైకి, అన్నిచోట్లకి ఇష్టం వచ్చినట్లుగా ఎగిరి పోయాయి.
మల్లమ్మ తన కన్నీళ్ళని మింగలేకపోయింది. నర్సిమ్మని చూడడం మినహ మరేం చేయలేకపోయింది.
“ నన్ను వేధిస్తున్నప్రశ్న. ఇప్పుడు ఏం చేస్తావ్, అమ్మాయిలాగా ఉండి పోతావా. “
మల్లమ్మ నవ్వింది. ఆ వెంటనే ఏడ్చింది. మళ్ళీ నవ్వింది. ఇదివరకు లాగే. ఆమె కళ్ళల్లో మెరుపు. దాని వెనకాల కనిపించని బాధ.
“ సరి అయినది, నాకు నచ్చినది చేస్తాను “
“ నీకు గుర్తుందా , మనం ఆకాశంలో విమానాలని చూసినప్పుడు , అలా ఎగరాలని అనే వాడివి. అలాంటి కలలు కంటూ ఉండే వాడివి. విమానం చూసినప్పుడల్లా అలా నడిపిస్తాను అని అనే వాడివి. అదే చెయ్యి. విమానం నడిపించు. అలా నడిపిస్తే మాత్రం మన ఊరు ఈ మైదానాలని మమ్మల్ని మర్చిపోకు. “ అని నర్సిమ్మని చూసింది.
నా విషయం సరే, నువ్వేం చేస్తావ్, అది చెప్పు.
ఏం చేస్తుందో ఆమెకే తెలీదు. అందుకే ఏం అన లేదు. ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. భవిష్యత్తు లోకి తొంగి చూడడానికి ప్రయత్నిస్తోంది. అందులో ఓ వెయ్యి ప్రశ్నలు ఆమె ముందు సవాళ్ళుగా దార్లో మైలు రాళ్ళ ల్లాగా నిలుస్తున్నాయి. ఒక్క దానికి జవాబు లేదు. మూగగా నుంచుంది. చిన్నప్పుడు తండ్రి దగ్గర కూడా ఇలాగే మాటలు మర్చిపోయినట్లుగా నుంచునేది. ఇప్పుడూ అంతే.
తల్లి దగ్గర కెళ్ళి తల్లి ఒళ్ళో తల పెట్టుకుంది, వెక్కి వెక్కి ఏడ్చింది. తను మొగాడిగా ఉంటే నాన్నకిష్టం. తను మల్లయ్యగా ఉంటేనే నర్సిమ్మ కిష్టం. మరి తనకి, తన ఇష్టాయిష్టాలు అక్కర్లేదా ,
కూతురి తల నిమిరింది. తల పైన ఉన్న పాగాలా చుట్టిన తువ్వాలుని లాగి పారేసింది. కత్తిరించిన ఆ పొట్టి జుట్టు గాలికి స్వేచ్ఛగా అటూ ఇటూ ఊగింది. ఆ ఒత్తు జుట్టులో లో తన వేళ్ళు దూర్చింది.
“ ఈ పదమూడేళ్ళు ఎన్నింటికో పోరాడావు. మానసికంగా శారీరకంగా, అన్ని కూడా మీ నాన్న మూలంగా. ఇప్పుడు ఓ అమ్మాయిలా పోరాడు. నీకు పోరాడడం తెలుసు. “
ఏడ్చింది నవ్వింది. కన్నీళ్ళని మింగింది. తరవాత నవ్వింది. తొందరగా ఆగిపోయే నవ్వు కాదు. ఆమె వెంట ఎప్పటికీ ఉండే లాంటి నవ్వు.
ఓ అమ్మాయి నవ్వినట్లుగా, పకపకా నవ్వింది.
అసలైన అమ్మాయి నవ్వినట్లుగా ఉంది ఆమె నవ్వు. మల్లమ్మ నవ్వు. ఎన్నాళ్ళకో ఎన్ని ఏళ్ళకో ధైర్యంగా స్వేచ్ఛగా నవ్వింది. ఓ అమ్మాయిలాగా నవ్వింది.
******
నేను ఇంత వరకు 280 వరకు కథలు, 13 నవలలు,ఎన్నో కవతలు, వ్యాసాలు రాసాను.
ఎన్నో కథలకి, నవలలకి బహుమతులు వచ్చాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి సాహితీ పురస్కారం,
శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి గారి సాహితీ పురస్కారం అందుకున్నాను