సమకాలీన కొంకణీ కథానికలు
-వసుధారాణి
సంపాదకులు:పుండలీక్ నారాయణ్ నాయక్.
తెలుగు అనువాదం: శిష్టా జగన్నాథరావు.
పుస్తకం పట్టుకున్నది మొదలు చివరివరకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన పుస్తకం.మొదటి కారణం భాష,రెండవ కారణం భాష పట్ల వారికి గల ప్రేమ ,చిత్తశుద్ధి,మూడవ ముఖ్యమైన కారణం 12వ శతాబ్దం మొదటినుంచి 18 శతాబ్దం చివరి వరకూ వివిధ కారణాల వల్ల కకావికలైన కొంకణీ భాష తిరిగి వికాసం కోసం చేసిన ప్రయత్నం.ఇక ముఖ్యమైన నాలుగవ కారణం కథానికలలోని వైవిధ్యం .తక్కువ ప్రాంతం ,తక్కువ మంది మాట్లాడే భాష నుంచి వచ్చిన రచయితలు తమ కథా వస్తువులను ఎంచుకోవటం దగ్గరనుంచి శైలి దాకా చూపిన వైవిధ్యం ముచ్చట గొలిపింది.
లిపి లేని కొంకణీ భాష అటు మహారాష్ట్రని,ఇటు కర్ణాటకని ఆధారంగా చేసుకుని మరాఠీ,కన్నడ లిపులలో తమ భాషని బతికించుకున్న తీరు ఏ సాంస్కృతిక పునరుజ్జీవనానికి తీసిపోని విధంగా అనిపించింది.18 వ శతాబ్దం చివరలో ఒక వ్యాకరణాన్ని ఏర్పరుచుకుని నెమ్మదిగా పుంజుకున్న కొంకణీ 1975లో జాతీయభాషగా గుర్తింపబడే వరకూ చేసిన ప్రయాణం , ఆ భాషాప్రియుల పట్టుదలను,భాష పట్ల వారికి గల ప్రేమ,గౌరవాన్ని తెలుపుతోంది.కథానికలను పక్కన పెట్టి ఈ సంకలనం సంపాదకులు పుండలీక్ నారాయణ్ నాయక్ రాసిన ముందుమాట ‘ప్రస్తావన’ను మాత్రమే తీసుకుని సమీక్ష రాయాలి అనిపించేంతగా భాషను గురించిన,రచయితలను వారి కృషిని గురించిన విషయాలను ఆయన ప్రస్తావించారు.భాషోద్యమ స్ఫూర్తి అందించారు.మాతృభాషను నిర్లక్ష్యం చేసే ప్రతి ఒక్కరూ కొంకణీ భాష పట్ల వారికి ఉన్న ఆపేక్షను చూసి కొంతైనా నేర్చుకోవాలి అనిపించింది.
కథానికలు:25 కథానికలు ,చివరగా రచయితల పరిచయంతో కూడిన పుస్తకం ఇది.మొదటి కథానిక ‘శ్రీ చంద్రకాంత్ కెణీ’ రచించిన ‘చాకలి బండ కింద అంకురం’.శ్రీ చంద్రకాంత్ కెణీ ముంబయి లోని ఆకాశవాణి కేంద్రంలో సంపాదక విభాగంలో పని చేసారు.గోవా విముక్తి అనంతరం గోవాలో స్థిరపడి ‘రాష్ట్ర మత్’ అనే మరాఠీ దినపత్రికకు,’సునాప్రాంత్’ అనే కొంకణీ దినపత్రికకు సంపాదకులుగా చేశారు.రెండువందలకు పైగా కథలు వ్రాసారు.వివిధ భాషలలోని కొన్ని నవలలను కొంకణీ భాషలోకి అనువాదం చేశారు.”వ్హకల్ పావణీ” (వధువుతో వచ్చిన అతిధులు) అనే కథాసంగ్రహానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1989లో లభించింది.
‘చాకలి బండ కింద అంకురం’ అనే కథానికలో గోవాకి స్వాతంత్య్రం లభించిన తరువాత జీవితంలో స్వాతంత్ర్య సైనికులు ఎదుర్కొన్న నిరాశ,అవహేళనలు ప్రతిబింబించాయి.కథ చివరలో అందించిన అంకురం ఆశాకిరణం అమూల్యం.నవ గోవా నవోదయానికి ప్రతీకగా తీసుకోవచ్చు ఈ కథానికను.
‘విఠూ తాళంచెవి పోయింది’ ఒక విలక్షణమైన కథానిక . రచయిత “ఆ.న మహాంబ్రే”. ఈయన కథలతోబాటు వ్యాసాలూ,నాటకాలూ వ్రాసారు.”పణ్ జీ ఆతా మ్హా తారీ జాల్యా”(పంజిం ఇప్పుడు ముసల్దియింది )అనే కథల సంపుటికి 1987లో సాహిత్య ఎకడమీ పురస్కారం లభించింది.ఈయన బాలసాహిత్యం మీద కూడా ఒక పుస్తకం ప్రచురించారు.
‘విఠూ తాళంచెవి పోయింది’ ఒక రకం ప్రత్యేకత కల కథానిక .ఇలాంటిదే’ సొరుగు తెరుచుకోవటం లేదు’ అనే కథ కూడా .మహాంబ్రే ప్రతి కథలోనూ క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేసే ప్రయోగశీల కథా రచయిత.మార్మికమైన భాషా శైలి అతని మరోగుణం.
బండోర్కర్ అన్నగారు గోవా ముఖ్యమంత్రి అయ్యారు అని రేడియోలో విన్నప్పుడు నుంచీ తన తాళంచెవి కనపడటం లేదని విఠూ గోల పెడతాడు .అతడు కొంత అమాయకుడు,వెఱ్ఱివాడు.అతను వెతికినట్లుగానే అతని భార్య,అతని తల్లి,కొడుకులిద్దరూ కూడా అదే విధంగా వెతుకుతారు ఆ చిటికిన వేలంత తాళం చెవికోసం.కథ శైలి సరదాగా అనిపిస్తూ ఉంటుంది అలా సాగిపోతాం.రచయిత తెలివి అంతా చివరన కథానిక లోని ప్రతీకాత్మకత దగ్గర పెద్ద మలుపు తిరుగుతుంది.పోయిన తాళంచెవి,దానితాలూకూ వెతుకులాట , చివరకి విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లటం, విఠూకి లభించిన నష్టపరిహారం .కళ్ళు తిరిగిపోయేలా వ్యవస్థ పోగొట్టుకున్న విలువైన తాళంచెవి ఏమిటో చెపుతారు మహంబ్రే.
ఈ రెండవ కథానిక చదివిన అనంతరం కేవలం ఈ రెండు కథానికలు ఒక చిన్న వ్యవస్థ ఏర్పడి నిలబడటం,నిలబడ్డాక పాలనలోని లోపాలు, ఆశ్రితపక్షపాతం ఎలా ఉన్నాయో , పూర్తిగా విభిన్నమైన శైలులలో చూపించాయి అనిపించింది .ఇలా ఈ కొంకణీ కథానికలు మరికొంత ఆసక్తిగా పుస్తకంలోకి, దానిద్వారా మనకి అంతగా పరిచయం లేని మరో సంస్కృతి లోకి పట్టుకెళ్తాయి.
ప్రేమనగరంలో అతిధి-అచ్యుత్ తోటకార్.ఈ కథానిక గోవాలోని దేవదాసీ పద్ధతికి సంబంధించిన కథ.
ఇంటిపెద్ద- శాంతారాం హెదో .ఈ కథ ఓ ప్రత్యేకమైన శైలితో పాటుగా’ బుడత కీచులు’అనిపిలుచుకునే పోర్చుగీస్ పాలన ,రాణె అనే వీరుడు చేసిన గెరిల్లా పోరాటం చాలా కొత్త పంథాలో చెప్పారు.
ముడుపు-దామోదర్ మాల్ జో.ఈ కథానికలో గోవాలోని ప్రాక్పశ్చిమ సంస్కృతుల మిశ్రమ సంస్కృతిని తెలిపే కథ. భగవంతుని పట్ల నమ్మకం సడలకుండా ఉండేందుకు ఓ పాద్రీ ముసలి భక్తుని నమ్మకాన్ని మానవత్వపు కోణంలో ఎలా నిలబెట్టాడు అన్న ఓ విభిన్నమైన అంశం.
కొంచెం చలి-కొంచెం వేడి-షీలా కొళంబ్ కార్.ఈ కథానికలో కళాత్మకరీతిలో మానవనైజం,అంతరంగం,లోతైన భావాలు తేటైన శైలిలో రచయిత్రి చెప్పారు.రకరకాల అందమైన పూలు ,లతల మాటున చురుకైన కత్తిని దాచే వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి శైలి ,షీలా కొళంబ్ కార్ శైలిలో నాకు తోచింది.
దేవతా వంశి- మీనా కాకోడ్ కార్ .ఈ రచయిత్రిది కూడా ఓ విలక్షణ శైలి. చిన్న మొక్కకు కాసే చిన్న చిన్న పండ్లు ఇద్దరు సమ వయస్కులైన అమ్మాయిలకు ఒకరికి చేదుగా,ఒకరికి తీపిగా ఉండటంతో కథానికను నడుపుతూ వస్తారు.ప్రతీక మాత్రమే అయిన దేవతా వంశి మొక్కను చూడాలి అనిపించింది.
పున్నమిరాత్రి గుర్తు- దత్తా శ్రీ నాయక్.ఇది కొంచెం పాతపోకడలు ఉన్న సామాన్యమైన కథ.
పెళ్ళికూతురు-ఓలి విణ్యుగోమ్ళ్ .ఈ రచయిత పేరు రాయటానికి కీ బోర్డు చాలానే పని పెట్టింది.కథానిక కూడా కొంచెం తికమక పెట్టింది .రెండవ సారి చదివినాక కానీ కథలో ,శైలిలో సౌందర్యం పట్టుపడలేదు.
ప్రేమజాతర-పుండలీ నాయక్.ఒక ప్రాదేశిక ఇతివృత్తంతో రాసిన కథ. ప్రేమ ప్రధాన అంశంగా సంవేదనతో,విశ్వజనీనత గోచరించే రచన.తోటలు,పొలాలు, సుఖః దుఃఖాలు,వ్యధలు వీటిమధ్య స్వచ్ఛమైన ప్రేమ.కథ చదివినంతసేపూ ఓ తామరకొలను ముందు కూర్చున్న భావన.
బ్యూటీఫుల్ లేడీ-ఎన్ శివాదాస్ . జీవితంలోని వాస్తవాలని తన సూక్ష్మ పరిశీలనతో కళాత్మకరీతిలో రచయిత రాసారు అనిపించింది.ఈ కథలో రచయిత ఓ ఇంటిని వర్ణించినతీరు ఆయన పరిశీలనాశక్తికి మచ్చుతునక.
అంగవస్త్రం-జయమాలా దాణాయత్ .ఫెమినిజానికి దగ్గరగా ఉన్న కథ ఐతే అందరూ భుజాలు తడుముకోవలసిన కథ. ఓ విచిత్ర వృత్తాంతం కథానిక పేరుతో సహా ఎంతో వైవిధ్యం.
25 కథానికలలో పన్నెండు కథానికల లఘు పరిచయం ఇది.ఈ సంకలనంలో ఇంకా కుంకుమ ఆధారం,లోతైన మడుగు, శవాల మిత్రుడు, భాగ్యం,అనీతా,తెప్ప ఉత్సవం,గుప్పెడుమట్టి,వైరాగ్యం,దేవుడా కాపాడు,సిండ్రెల్లా ప్రేమ కథ,కాకుల శాపం,నిక్కరు, నీడ కథానికలు ఉన్నాయి.అన్నీ ఒకదాన్ని మించి ఒకటి చదివించేవి,ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.
ఈ సంకలనంలోని రచయితలు చాలా వరకూ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలే. శ్రీ మహాబలేశ్వర్ శైల్ 2016 లో అత్యుత్తమ పురస్కారమైన సరస్వతీ సమ్మాన్ కూడా పొందారు.ఈ సంకలనంలో వీరి ‘వైరాగ్యం’ కథ అత్యున్నతంగా ఉంది.పురుళ్ళు పొసే మంత్రసాని పావలీన్ వైరాగ్యం.చివరన కొసమెరుపు మానవత్వానికి పరాకాష్టగా ఉంటుంది.
శిష్టా జగన్నాధరావు గారి తెలుగు అనువాదం సరళంగా ,కథానికల మూలాన్ని అందించటంలో సఫలీకృతం అయింది.
కొంకణీ రచయితలు వైవిధ్యంతో పాటు ,ఆలోచనలను, అనుభవాలను,వివిధ రకాలైన శైలులను అందిస్తూనే భాషా స్ఫూర్తిని కూడా రగిల్చారు.ప్రతిఒక్కరూ మాతృభాష పట్ల పెంచుకోవాల్సిన ప్రేమను,కలిగి ఉండాల్సిన గౌరవాన్ని నేర్పారు.
ఈ పుస్తకం నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారి ప్రచురణ (2001).
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.