“అరికాళ్ళ కింది మంటలు”
(శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథ పై సమీక్ష)
-జానకి చామర్తి
ఆ అమ్మాయి తీరి కూచుని తన కష్టాలు ఏమీ చెప్పుకోలేదు ఆ కథలో.
అసలు కూచోడానికి తీరికేది? ఇక ఎవరికైనా చెప్పుకోవడం కూడానూ..
పెద్దక్క పిల్లాడికి జుబ్బా , చిన్నక్క కి రవిక , అప్పటి కప్పుడు కుట్టి పెట్టాలి . పైగా వారి ఎకసెక్కపుమాటలూ పరోక్ష బెదిరింపులూ భరించాలి. మీ అమ్మనాన్నా పూసుకుంటారు ,పునిస్త్రీ సేవ చేసుకో , గంధం తీసిపెట్టు అని అమ్మమ్మ పురమాయించింది మరి. నిజమే, తీసిపెట్టాలి కదా. పైగా మాట వినకుండా పెంకెతనం చేసి చెల్లెలు ఆ గిన్నెలో గంధం పడేస్తే, గూడలు పడిపోయేలా మళ్ళా గిన్నెడు గంధం తీయాలి.ఇదంతా కుంచముడు కందులు వేయించి ముగించాకనే.
అమ్మ , అలా పెత్తనాలకు పోయొస్తాను కాస్త వంట చేయవే అంటే మడి కట్టుకోవాలి . సినిమా కి పోయే తమ్ముడు పొగరుగా , పనసపెచ్చుల పులుసులో ముక్కలు తనకు ఉంచక పోతే మక్కెలు విరగతంతానంటే మాటాడక ఊరుకోవాలి. బాధ్యత గల తండ్రే , చేతకానితనంగా ఊరుకుంటే మన్నించాలి.
ఇదంతా ఎవరు చేస్తారు ఒక పదిహేడేళ్ళ పిల్ల రుక్కు.. రుక్మిణి. ఆమె చేసిన తప్పు బాలవితంతువు అవడం. పెట్టిపుట్టలేదు కాబట్టే ఆ మొగుడు పోయాడు, ఈమె జన్మమింతే అని అమ్మమ్మగారి ఉవాచ. అమ్మమ్మ దృష్టిలో అందరి దృష్టిలో కూడా, రుక్కు ఇక సుఖాలమీద ఆశ వదులుకుని, ఇంటోవారి సేవ చేసుకుంటూ జీవితం వెళ్ళమార్చాలి. ఆ ఇల్లు మనుషులూ తప్ప వేరే దిక్కు, వేరే ప్రపంచమూ లేవు. ఉండబోవు. అసలు వేరే ఆలోచనే ఉండరాదు.
“ అరికాళ్ళ కింది మంటలు” కథ లో అప్పటి బాలవితంతువుల కష్టాలు వారి దుర్భర పరిస్ధితి కళ్ళకు కట్టినట్టు వివరించారు , శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రిగారు. వారి కథనం అపూర్వం . అద్భుతం.
రుక్మిణి దయనీయస్ధితికి మనసు కరిగి పోతుంది.
నాకు బాగా నచ్చినది రుక్కు తన కష్టాలు చెప్పుకోదు తనంతతానుగా. మిగతావారితో జరిపే సంభాషణలలోనే మనము తెలుసుకుంటాము, ఆమె ఇబ్బందులన్నీ. ఇంటో ఉన్నవారే ఆమె అరికాలికింద మంటలు ఎలా పెట్టారో చూస్తాం ఇందులో.
ఒక మూఢాచారాన్ని మూఢ నమ్మకాన్ని ఆచరించాలనుకునే సమాజానికి అసలు ఆలోచన ఉండదనిపిస్తుంది, ప్రేమాభిమానాలు కూడా పోతాయనిపిస్తుంది. కేవలం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ,
ఆ ఆచారము పెట్టబడింది కాబట్టి అనుసరించి తీరడమే తమ కర్తవ్యము అనుకుంటారు కాబోలనిపిస్తుంది. కుటుంబం లోని వారి వాత్సల్యాన్ని , మానవత్వాన్ని కూడా చంపేసే మూఢాచారాలు మీద కోపమూ, రుక్కు పరిస్ధితి మీద ఎంతో జాలి బాధ కలుగుతాయి .
చివరకు వితంతు పరిస్ధితి (దుస్ధితి) ని జుట్టు తీయించి గుండు చేయించడం ద్వారా సంపూర్ణం చేయాలి , లేకపోతే తను తలెత్తుకు తిరగలేనన్న అమ్మమ్మ ప్రతిపాదనను తండ్రి తిరస్కరించలేకపోవడం గమనిస్తుంది రుక్కు. అంతేకాదు, వీరేశలింగం పంతులుగారు తోటలో వితంతు వివాహాలు జరుగుతున్నాయని వింటుంది .ఆ రాత్రి కమ్ముకున్న ఆలోచనలలో, మంటలలో పడకుండా తేరుకున్నదానిలా గభాలున రుక్కు తలుపులు తీసుకు వీధిలోకొచ్చి పడుతుంది.
వీధిలో రుక్కు లాటి అభాగ్య వితంతు ఆడపిల్ల ఉన్న జట్కా బండి అతను , గ్రహిస్తాడు రుక్కు ఎక్కడి కెళ్ళాలనుకుంటోందో. పంతులు గారి తోటకైతే కానీ డబ్బులు తీసుకోనంటాడు, తన దగ్గర బాడుగ కి డబ్బులు లేవన్న రుక్కుతో.
రుక్కు కు పెళ్ళి అయి మంచి జీవితం అమరాలనీ , తరువాత అది తన కూతురికి కూడా మార్గం చూపాలని కోరుకుంటూ, ఆమెను పంతులుగారి తోటకు తీసుకెడతాడు. బండి మలుపు తిరిగింది అంటూ కధ ముగుస్తుంది. ఇది రుక్కులాటి బాల్యవితంతువుల జీవితానికి తిరిగిన మలుపే
ఏదో ఒకరకమైన బాధలూ కష్టాలూ సమాజం నుంచీ ఎదుర్కోవడం , ఆడవారికీ ఈనాటి వరకూ తప్పలేదు, వాటినుంచి జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్ళే , సాయం చేసే మంచి మనసున్నవారు , ఆ జట్కా బండతను వంటివారు ఇప్పుడున్నారా.. ఉంటే బావుండును కదా , అనిపిస్తుంది.రుక్కు లాగ స్వయం నిర్ణయం చేసుకోగలిగే ఆలోచన వివేకము ధైర్యము ఆడవారిలో ఉంటే బాగుండుననిపిస్తుంది.
కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారి గురించి, నేను కొత్తగా ఏమీ చెప్పే సాహసం చేయలేను ,
ఆ పుస్తకంలో ముందు మాటలో చెప్పినట్టుగా వారు
“ ఛాందస తమస్సు నుండి పుట్టిన సంస్కరణ జ్యోతి”.
వీరేశలింగం గారి సంస్కరణోద్యమాన్ని మనసారా అభిమానించి, రచనల రూపంలో విస్తృత ప్రచారం చేసిన ధన్యజీవి.
శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి కథలు- మొదటి సంపుటం.
*****
జానకి చామర్తి ( వరిగొండ)
మనసులో భావాలు మనసులోనే కధలల్లి పెట్టుకోవడం ఎప్పటినుంచో చేస్తున్నా ,
అక్షరాలలో పెట్టడం ముఖపుస్తకంలో మొదలయ్యింది. సుందరమైన తెలుగునే నమ్ముకున్నా.
అందంగా కవితలా రాయాలని , రోజూవారీ జీవితాన్నైనా
ప్రకృతి యే ఆనందం , ఇప్పటికీ చదువు చెప్పే గురువు అదే.
నిజం చదువు MA Bed, ఉపయోగపడే విద్య yoga లో చేసిన PG Diploma,.
నివాసం విశాఖపట్టణం , ఎక్కువకాలం ప్రవాసం.
ప్రస్తుత నివాసం కౌలాలంపూరు.
Very nice
ధన్యవాదాలు
చాలా బాగా రాశారు… కొనసాగించండి.
ధన్యవాదాలు