మెరుస్తోన్న కలలు
– శాంతి కృష్ణ
రేయంతా తెరలు తెరలుగా
కమ్మిన కలలు
కను రెప్పలపై హిందోళం పాడుతున్నాయి….
నీ రాకను ఆస్వాదించిన గాలి
తన మేనికి ఎన్ని గంధాలు అలదుకుందో….
మగతలోనూ ఆ పరిమళం
నన్ను మధురంగా తాకిన భావన…
ఓయ్ వింటున్నావా….
ఒక్కో చినుకు సంపెంగలపై
జారుతున్న ఆ చప్పుడును….
ఇప్పుడు నా కలలకు నేపధ్య సంగీతమవే…
వర్షం ఇష్టమని చెప్పిన సాక్ష్యంలా
నీతో పాటు ఇలా ప్రతిరేయి పలుకరించే చిరుజల్లుకి…
ఋతువులతో పని ఏముంది…
వాన పాటకు కదిలే చిరుకొమ్మకు
వలపు నాట్యం నేర్పాలా…
మెరుపు తీగలను దాచుకున్న మేఘానికి
వెలుగు రేఖలు అద్దాలా…
మనసు వనంలో పూసిన పూలకు
చిరునామా వెతకడమెందుకు…
ఇపుడెన్ని కలలు తడవాలో
నీ వలపు వర్షానికి…
సుతారంగా చెంపను తాకిన
చిరు వెలుగుపై
అంత చిరుకోపమెందుకో…
తూరుపు నింగిపై
ఎన్ని కుంకుమ రేఖలో…
సిగ్గిల్లిన మోవిని అద్దంలో
చూసినట్లుగా….
ఆరు బయట అదే పనిగ
కురిసిన వర్షంలో….
మెరుస్తోన్న నా కలలు…
మనసంతా నువ్వేనని
వేడుక చేస్తున్నాయిపుడు…
తెలుసా….!!
*****
ఆర్ట్: మన్నెం శారద