ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులైనా , తెలుగు మీద అభిమానంతో మద్రాసు ప్రెసిడెన్సీలో ఎం . ఏ . చదివారు . ఆ తరువాత పూనా దక్కన్ కళాశాల లోను, ఉస్మానియా లోనూ భాషాశాస్త్రం అభ్యసించారు. ఉస్మానియా నుండి తనకిష్టమైన ‘ప్రాచీన చరిత్ర, సంస్కృతి, పురాతత్త్వం’ లో మరో ఎం.ఏ. చేశారు. 6వ శతాబ్ది నుండి 16వ శతాబ్ది దాకా ఉన్న తెలుగు శాసనాల సామాజిక-సాంస్కృతిక అధ్యయనం మీద పి హెచ్ డి పట్టం పొందారు.
71లో బెంగళూరు క్రైస్తవ కళాశాలలో సుమారు ఆరేళ్ళు తెలుగు లెక్చరర్ గా పనిచేసి, ఆపై తొలి ప్రపంచ మహాసభల ఫలంగా ఏర్పడ్డ పూర్వపు అంతర్జాతీయ తెలుగు సంస్థలో డెప్యూటీ డైరెక్టర్ గా 11 ఏళ్ల పాటు ఉద్యోగించి, ఆపై తెలుగు విశ్వవిద్యాలయం లో కలిసి, 15 ఏళ్ళపాటు తులనాత్మక అధ్యయన కేంద్రం కేంద్రాధిపతిగా, ఆచార్యునిగా పనిచేసి 2005లో ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సెలర్ గా నియమితులై, దానికి అప్పటిదాకా లేని యు.జి. సి. గుర్తింపును తీసుకురావడంతోపాటు, 5 విభాగాలు మాత్రమే ఉన్న సంస్థను మూడేళ్ళలో 23 విభాగాలకు పెంచి, తుళు తో కలిపి 7 భాషల్లో సుమారు వంద ప్రచురణలు వెలువరించి, ఇతర దాక్షిణాత్య రాష్ట్రాలలో 3 కేంద్రాలను, సుమారు 110 దూరవిద్యా కేంద్రాలను నెలకొల్పి, 5 సం.రాల ఇంటిగ్రేటెడ్ కోర్సులను తొలిసారిగా రాష్ట్రవిశ్వవిద్యాలయాలలో ప్రారంభించడంతో పాటు అనేక కొత్త కోర్సు రూపాలను ప్రవేశపెట్టారు. తెలుగుతో పాటు, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు విభాగాలను ప్రారంభిస్తూ, వాటిల్లో అనువాదానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చారు.
అనువాదమంటే చాల ఇష్టం. అనువాదం చేసిన వాటిల్లో సర్వజ్ఞ, జ్ఞాన పీఠీ ఇందిరా గోస్వామి అనువాదం –‘విషాద కామరూప‘, ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ‘ ముఖ్యమైనవి. పర్వ అనువాదానికి 2005లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. విశ్వనాథ సత్యన్నారాయణ గారి “కావ్యానందం” ను కన్నడం లోకి అనువదించారు. ఇతరరచనలు కూడా ఉన్నాయి. వారి మార్గదర్శకత్వంలో కొన్ని ఉత్తమ పరిశోధనలు జరిగాయి.