ముసురు
–మణి వడ్లమాని
వానజల్లు పడుతూనే ఉంది. ఒక్కసారి పెద్దగా, ఒక్కోసారి చిన్నగా జల్లులు పడుతూనే ఉన్నాయి.
ఎక్కడ చూసినా జనం, సందడిగా కోలాహలంగా ఉంది. కుర్చీలలో కూర్చొని కునికి పాట్లు పడేవారు కొందరు, పుస్తకాలు తెచ్చుకొని చదువుకునే వారు మరి కొందరు. చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ని వింటూ ఉండేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి ఎవరి కి వాళ్ళు యేదో రకంగా బిజీ గా ఉన్నారు.
“బయట వాతావరణం బాగా చల్ల బడి పోయింది.
“అబ్బ ముసురు…! ఆకాశానికి చిల్లుపడినట్లు… ఆగకుండా జల్లులు జల్లుగా వర్షం.. మధ్యాహ్నం నుంచి ఎక్కడా తెరిపి లేదు, ఒక్కలా కురుస్తూనే ఉంది! తుఫానుట, మూడు రోజుల వరకు తగ్గదుట, ఆ ముసురులో నే స్టేషన్ కి రావటం అబ్బ నిజంగా నరకం చూసినట్లుంది” అనుకుంది చుట్టూ చూస్తున్న మైధిలి.
కొంచెం దూరంలో నించొని ఫోన్ మాట్లాడుతున్న అతనిని ఓ సారి యథాలాపంగా చూసి అంతలోనే మళ్ళీ చూసింది, మనసు గుర్తించడానికి ప్రయత్నం చేస్తోంది. అతనేనా..పొరపాటు పడలేదు కదా ! అని మళ్లీ కొంచెం ముందుకు వెళ్లి నిశితంగా చూసింది మైథిలి.
అవును. వెనకనుంచి …. అతని లానే ఉన్నాడు. పక్కనుంచి ఆ చెంపలు. ఒక చెయ్యి ప్యాంటు జేబులోకి పెట్టుకుని ఉండటం చూస్తే అతనే అనిపిస్తోంది. ఎన్ని రోజులయింది, రోజులా… కాదు..కాదు.. కొన్ని ఏళ్లు గడిచాయి.
గుర్తు పట్టి ఉంటాడా… ఏమో, మర్చిపోయి ఉండచ్చు… అయినా తన పిచ్చి కానీ ఇన్ని ఏళ్ళ తరువాత … అస్సలు ఛాన్స్ లేనే లేదు. వెంట తెచ్చుకున్న పుస్తకం తీసింది. పట్టు మని పది నిమిషాలు కూడా చదవలేదు విసుగ్గా మూసేసింది. బాగ్ లోంచి ఫోన్ తీసింది. వాట్స్అప్ మెసేజ్ లు చూసుకుంది. కొన్నింటికి జవాబులు ఇచ్చింది. ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. నోటిఫికేషన్స్ చూసి, ఫోన్ మూసేసింది.
మళ్లీ ఆలోచనలు అతని మీదకే మళ్లాయి.
‘మీ సంబంధం బావుందని ,శాఖ భేదమైనా పరవాలేదని అన్ని నచ్చాయని’ చెప్పిన అతని పెద్దవాళ్లు,ఆ తరువాత కట్నం సరిపోలేదని వెనక్కి తగ్గారని తెలిసి , కోపం బాధ కూడా వేసింది. అతనికి తను బాగా నచ్చానని మొదటి రోజే రైలు లో అతని ప్రవర్తన, కళ్ళలో ఆ ఆరాధన చూసి తన మనసు పొంగిపోయింది. అలాంటిది పెద్దవాళ్ళతో చెప్పి ఇష్టపడిన సంబంధం కట్నం కోసం వదిలేయడం భావ్యం కాదని ఒప్పించలేనంత పిరికివాడా? ఇంకా నయం .. అనుకుని నిట్టూర్చింది.
ఇప్పుడు అతనికి పెళ్ళయి మనవలు కూడా ఉండి ఉంటారులే! కానీ ఒక్క క్షణం ఆ భావనే ముల్లులా గుచ్చింది.
“ఛీ ఛీ ,నాకేంటి తక్కువ అని మనసులోంచి అతని ఆలోచనలు తీసేయాలని మొన్నే పుట్టిన మనవరాలు ముద్దు మొహం ఫోన్ లో చూసుకుంది. తానంటే ప్రాణం పెట్టే భర్త , ఇద్దరుపిల్లలు. బాగా చదువుకొని అమెరికాలో ఉంటున్నారు. సొంత ఇల్లు కారు, బ్యాంకు లో పెద్ద హోదా, అటు పుట్టింట,ఇటు అత్తింట కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఇంతకన్నా ఏమి కావాలి అనుకుంటున్న మైథిలి. రైలు వస్తున్న అనౌన్స్మెంట్ తో ప్రవాహం లా సాగిపోతున్న ఆలోచనల నుంచి బయటకు వచ్చింది.
అంతవరకు స్తబ్దుగా ఉన్న వాతవరణం లో చైతన్యం వచ్చింది. అందరు బాగ్ లు పెట్టెలు పట్టుకొని రైలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. కొద్ది క్షణాలలో రైలు రానే వచ్చింది. అంతవరకు బానే ఉన్నారు. లోపలికి ఎక్కడానికి తోపులాట, మొత్తానికి వీలు చేసుకొని లోపలకి ఎక్కింది. అది ఎసి బోగీ అవడం వల్ల లోపల కాస్త చీకటి చీకటి గా ఉంది. పూర్తిగా లైట్స్ వేసినట్లు లేదు అనుకుంటూ తన సీట్ నెంబర్ చూసి వెతుక్కుని కూర్చొంది. సైడ్ లో లోయర్ బర్త్ వచ్చింది. ఫర్వాలేదులే అనుకుంటూ ఎదురు సీట్ లో ఎవరూ లేకపోవడం తో పూర్తి బెర్త్ వేసి ఉండటం వల్ల కళ్ళు చాపుకొని సీట్ కి చేరగిలబడింది.
అప్పుడు చప్పున గుర్తుకు వచ్చింది. అతను ఎక్కడున్నాడు అని వెతుక్కుంది. కనిపించలేదు. అయ్యో అనుకుంది. ఇంతలో తన కూర్చున్నట్లుగానే తన సీటుకు కి కొంచెం ముందు ఉన్న సైడ్ బెర్త్ లో అతనూ కూర్చుని ఉన్నాడు . అంత గుర్తుపట్టలేదా? ఆ పోనీ లే అనుకుంది. అంతలోనే మనసు మార్చుకొని బాత్‌రూం కెల్దామని లేచివెళ్ళింది. నిజానికి బాత్‌రూం కి వెళ్ళడం కోసం కాదు అతని ముందు నించి వెళితే గుర్తుపట్టి పలకరిస్తాడని లోపల ఏదో ఆశ.
అంతలోకే అతను కర్టెన్ వేసేసుకున్నాడు. ఒక్క క్షణం మనస్సు చివుక్కుమంది. మైథిలికి చేసేదేమీ లేక బాత్‌రూం కి వెళ్లి వచ్చి బెర్త్ సర్దుకొని నిద్ర పోదామని ఉపక్రమించింది. అసలు నిద్ర పడితేనా, గుండె పొరలలోంచి జ్ఞాపకాలు బయట కురిసే కుండపోతలా కురుస్తున్నాయి.
***
ఒక్క సారి గతం లోకి వెళ్ళింది.
ఆ రోజు బాగా గుర్తు, ఇలాగే ముసురు, పెద్ద వాన. దాంతో పాటు బలంగా గాలులు వీయడం. భయంకరంగా ఉంది. ఆ తరువాత తెలిసింది అది అతి పెద్ద తుపాన్ అని . కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని.
బొంబాయి నుంచి జ్యోతి వదిన వచ్చిందని తెలిసి సాయంత్రం విజయవాడ వెళ్లి చూసి తిరిగి రాజమండ్రి కి బయలుదేరింది. తీరా చూస్తే రైలు తాడేపల్లి గూడెం లో ఆగిపోయింది.
బోగీలో ఎవరో అంటున్నారు.
”చాలా పెద్ద తుఫానుట. రైళ్లు కదలవుట. పట్టాల మీదకి నీళ్ళు వచ్చేసాయని”
“అయ్యో ఎలాగండి? “
“కంగారు పడకు చూద్దాం”
…. రకరకాల వాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆ మాటలకి గుండెల్లో గాభరా మొదలయింది. ఇప్పుడెలా అనుకుంటూ కంగారు పడుతోంది. ఇందాకటి నుంచే తననే గమనిస్తున్న అతను “కంగారు పడకండి మైథిలీ మరేం భయం లేదు” అన్నాడు.
తనని పేరు పెట్టి పిలిచేసరికి ఒకింత భయంగాను, మరికొంత ఆశ్చర్యంగాను చూసింది.
“అన్నట్లు చెప్పడం మరిచాను, నాపేరు శ్రీ రామ్ , నేను మీ నాన్నగారి ఆఫీస్ లో నే పని చేస్తున్నాను. మీ నాన్నగారు నాకు ఆఫీస్ లో గురువు గారి లాంటి వారు. ఆయన మీ ఫ్యామిలీ గురించి చెప్పారు. రెండు మూడు సార్లు మీ ఇంటికి వచ్చాను. కాని నువ్వు లేవు అప్పుడు. నిన్ను ఫోటో లో చూసాను.” అంటూ చనువు గా పక్కనే కూర్చొన్నాడు.
అప్పటికే బోగీ అంతా నిండుగా ఉంది. హోరున వాన కురిసి పోతోంది. అసలు సాయంత్రం నుంచి మొదలయింది వాన . “బంగాళాఖాతం లో తుపాను ఉందిట అందుకే ఇంత వాన, గాలి హోరు” అని చెప్పాడు.
అతను చనువుగా మాట్లాడుతూ ఉండటం వల్ల భయం తగ్గింది. నాన్నగారు తెలుసు అనేసరికి ఏదో తెలియని దగ్గరతనం, ఆత్మీయత కలిగాయి.
రైలు ఆ రాత్రంతా స్టేషన్ లోనే ఆగిపోయింది. మిగతా చోట్ల కూడా ఎక్కడికక్కడే రైళ్లు ఆగిపోయాయిట. ఎవరి దగ్గరో ట్రాన్సిస్టర్ ఉంది ఎప్పటికప్పుడు వార్తల లో ప్రజలని బయటకు రావద్దని చెబుతున్నారు. అది వినే సరికి ఇంకా భయం వేస్తోంది.
కొంతమంది ఆ భయం పోగొట్టుకోవడానికి భజనలు చేస్తున్నారు. కొంత సేపు కరెంటు కూడా పోయింది. మరి కొంత మంది పాటలు ఎత్తుకున్నారు. పక్కనున్న శ్రీరామ్ కూడా హిందీ పాట ‘రిం జిమ్ గిరే సావన్ ‘ అనే పాట పాడాడు. తరువాత రాజేష్ ఖన్నా సినిమాలోవి ఓ రెండు పాటలు పాడాడు గొంతు యెంత బావుందో . ఆ చీకట్లో, వానలో అతని గొంతు నుంచి జాలువారే ఆ పాటలు ఆ అనుభూతి ఏదో లోకాల కి తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడు కన్ను మూత పడిందో తెలియదు. తెలివి వచ్చేసరికి అతని భుజం మీద వాలి ఉంది. వెంటనే ఉలిక్కిపడి సరిగా సర్దుకుని కూర్చోంది.
ఆ భయంకరమైన కాళ రాత్రిని చీల్చుకుంటూ ఉదయభానుడి రాక ప్రపంచమంతటా చైతన్యాన్ని నింపింది.
తరువాత కొద్ది సేపట్లోనే రైలు బయలు దేరింది. స్టేషన్ కి నాన్నగారు వచ్చారు.
నాన్నగారితో “గురువు గారు! మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చాను” అని చెప్పాడు.
నాన్నగారు కూడా చాల సంతోషంగా ఉండేవారు. చక్కగా సంబంధం కుదిరిపోయిందని . కొన్ని రోజులు గడిచాయి. శ్రీ రామ్ తల్లితండ్రులు వచ్చారు. చూసుకున్నారు. ఇంకా మిగతావి మాట్లాడుకోవాల్సి ఉంది.
రోజులు గడుస్తున్నాయి. తను కూడా పరీక్షల హడావుడి లో ఉండటం వల్ల ఇంట్లో జరిగిన విషయాల గురించి తెలియదు.
ఉన్నటుండి ఒక రోజున అమ్మ చెప్పింది “శ్రీరామ్ వాళ్ళు వేరే సంబంధం కుదుర్చుకున్నారని, కారణం శాఖ పట్టింపు, కట్నం ఈ రెండు విషయాలలో భేదాలు వచ్చాయని, శ్రీరామ్ ఆ విషయం లో ఏమి మాట్లాడ లేదని”. అది నాన్నగారికి బాధ కలిగించింది. ఆ విషయమే నాన్నగారు తనతో చెప్పమన్నారని. అవన్నీ విన్న ప్పుడు ఒక్క క్షణం ‘నేనేం ఆటబొమ్మనా ?’ అందామనుకుంది. కానీ పెదవి దాటి ఒక్క మాట రాలేదు. “సరే” అని తలూపింది.
అప్పుడు అనుభవించిన వేదన, బాధ అన్నీ గుర్తుకొచ్చి ఒక్క సారిగా కోపం ఉవ్వెత్తున ఎగిసింది. పెళ్లి కుదిరిందిన్న ఆనందం లో ఉన్న ఆడపిల్లకి ఎక్కువ కట్నం కోసమో లేదా శాఖాభేదం లాంటి కారణంతో అది కాస్త ఆగిపోయింది అంటే యెంత బాధ అనుభవిస్తుందో! అతనంటే అభిమానం పెంచుకోవడంతో అదీ రెట్టింపు అయింది. నిజానికి ఆ trauma నుంచి బయట పడటానికి సర్వశక్తులు కూడదీసుకోవలసి వచ్చింది.
అంతే, ఆ తరువాత ఎప్పుడూ అతన్ని చూడలేదు”
ఇదిగో- ఇన్ని రోజులు తరువాత ఆ జ్ఞాపకాలు బయటకు వచ్చాయి అనుకుంది .
***
గతం లోకి వెళ్లి ఆలోచనల ప్రవాహంలో మునిగిన మైథిలి కి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. పైగా రైలు స్టేషన్ లో ఆగడం గాని ,రఘు బోగీలోకి వచ్చి లేపేంత వరకు గానీ తెలివి రాలేదు.
“ఈ ట్రైన్ ఇక్కడితో ఆగి పోతుంది కాబట్టి సరి పోయింది. ఏంటి అంత మొద్దు నిద్ర, బాగా అలసిపోయావా? అంటున్న భర్తతో
“అబ్బే అదేం లేదు, రాత్రి ఎంతకీ నిద్ర పట్ట లేదు” అని రైలు దిగి నాలుగు అడుగులు వేసింది. అబ్బా ఈ ముసురు ఇప్పట్లో తగ్గే సూచనలే లేవు. విసుగ్గా, అనుకుంటూ అప్రయత్నంగా ఆ సీట్ వేపు చూసింది. అది ఖాళీగా ఉంది. అతను కాదేమో. ఏమో చాలా ఏళ్ళయింది కదా గుర్తుపట్టలేదేమో? పోనిలే ఒకవేళ గుర్తుపట్టినా మాటలు ఏం వస్తాయి? ఇదీ ఒకందుకు మంచిదేలే. అయినా అప్పుడప్పుడు మనసు ఇలాంటి పిచ్చి గమ్మత్తులు చేస్తుంది.
పైగా ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం మనసుపొరలలో ని జ్ఞాపకాల జల్లులు మనసు మీద కురిసి తడిపినపుడు అది కొంత సంతోషాన్ని, మరి కొంత కష్టాన్ని కూడా కలిగిస్తుంది అనుకుంది మైథిలి.
అలా వెళుతున్న ఆమెనే చూస్తూ “అవివేకం తో చేజార్చుకున్న రత్నం, ఒక్కోసారి పెద్దవాళ్ల తప్పుడు నిర్ణయాలు జీవితాలనే మింగేస్తాయి అని నిట్టురుస్తూ ,ఇంకా నయం తనని గుర్తుపట్టలేదు. ఏ కారణంతో అయితే తనకి ఆ సంబంధం వద్దన్నారో దాన్ని పక్కన పెట్టి తమ్ముడికి ,చెల్లెలికి పెళ్ళిళ్ళు జరిపించారు. ఆ తరువాత రెండు మూడు సార్లు తల్లి బాధ పడింది. ఏమిటోరా నీకు నచ్చిన ఆ అమ్మాయి తోనే పెళ్లి జరిగి ఉంటే బావుండేది. అప్పటికే వసంత కాన్సర్ తో చనిపోయింది. ఉన్న ఒక్క కూతురికి పెళ్లి అయింది. ఇదిగో ఇలా ఒంటరిగా ఉంటున్నాడు.
అయినా, ఆనాటి రూపే లేదుగా ఇంక తనని ఎలా గుర్తుపడుతుందిలే. ఇదీ ఒకందుకు మంచిదే” అనుకుంటూ అతనూ అక్కడనుంచి కదిలాడు.
*****
ఆర్ట్ : మన్నెం శారద
మణి వడ్లమాని 2010లో కథారచన మొదలెట్టి, అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలను పొందారు. అనేక చక్కని కథలు వ్రాసి వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పురస్కారాలూ పొందారు. మణి వడ్లమాని తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. “వాత్సల్య గోదావరి” అనే కథాసంపుటిని వెలువరించారు. ‘కాశీపట్నం చూడర బాబు’, ‘ప్రయాణం’ వీరి ఇతర నవలలు.
అద్భుతః మేడం గారు 🙏
Dhanyvadalu naa kadha nachhinanduku
చాలా బాగుంది కథ.
Dhanyvadalu naa kadha nachhinanduku
మణి గారు.. మీ కథ చాలా బాగుంది. మంచి ఫీల్ ఉన్న కథ. అభినందనలు.
Thank you so much
ధన్యవాదాలు నా కథ మీకు నచ్చినందుకు
బాగుంది మణి, అభినందనలు
Thank you andi
చాలా బావుందండీ.
Dhanyvadalu kadha nachhinaduuku
ధన్యవాదాలు నా కథ మీకు నచ్చినందుకు