బహుళ-3
– జ్వలిత
దాసరి శిరీష కథ “వ్యత్యాసం”
వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య జాతరలు నడుపుతూనే ఉన్నారు. కరోనా కథల సంపుటాలు వెలువడుతున్నాయి.
లిఖిత కథల ముందు మౌఖిక కథలకు చెప్పలేనంత నష్టం జరుగుతూనే ఉన్నది. లక్షల కొద్దీ రాతప్రతుల్లో, నాలుగు లక్షలకు పైగా అచ్చయిన పుస్తకాల్లో కథ తన అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఉన్నది. అయితే మౌఖిక కథకు జరిగినట్టే ‘బహుజని’ కథలకు వివక్ష ఎదురైంది. కథ సమాజంలో అంతర్భాగం. జీవితంలోని సకల కోణాలకు ప్రతిబింబం. అందువల్లనే మొదటి తెలుగు కథ బండారు అచ్చమాంబ అయినప్పటికీ, కథా సాహిత్యంలో స్త్రీకథలు పితృస్వామ్యానికి బలయినాయి, వివక్షకు గురయినాయి.
అయితే వివక్ష అనేది కులం, మతం, జెండర్ , ప్రాంతం, వర్గం, రంగు వంటి అనేక కారణాలుగా జరుగుతుందని మనకు తెలుసు. విద్యావంతులైన స్త్రీలు కూడా అనేక వివక్షలకు గురవుతున్నారు. వివక్షకు గురవుతున్న స్త్రీలు కూడా మరొకరి పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారు.
స్త్రీలలో ఒక బలహీన మానసిక స్థితి ఆధిపత్య పితృస్వామ్య భావాజాలనికి లోబడి ఉంటున్నది. తన చుట్టూ ఉన్న స్త్రీలపై, తన కుటుంబంలోని స్త్రీల పై, తమకు ఎటువంటి సంబంధలేని సమాజంలోని స్త్రీలపై తాము పని చేసే చోట స్త్రీలపై వివక్షను ప్రదర్శిసంచడానికి కారణమౌతుంది. అటువంటి వివక్షకు సాక్ష్యం చెప్పే కథ దాసరి శిరీష రాసిన “వ్యత్యాసం” .
ఇది ఆంధ్రప్రభ పత్రికలో 1980 కంటే ముందు వచ్చిన కథ. మూడు సంకలనాలలో ప్రచురితమైనది.
చాలా చిన్న కథ. అయినా చాలా గొప్పగా ఎంచుకున్న అంశాన్ని చెప్పగలిగారు.
“పిల్లల ముందు ముఖ్యంగా పనివాళ్ళముందు లోకువై పోతున్నాం”
అనే వాక్యంతో కథ మొదలవుతుంది. ఈ లోకువ అవడం, పరువు నష్టం అనడానికి ప్రత్యామ్నాయ వాక్యం. ఎవరి పరువైనా ఎందుకు పోతుంది? తమ ఆలోచనలకు, తమ అలవాట్లకు, తమ సంప్రదాయాలకు , తాము నమ్మిన సిద్ధాంతాలకు, తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఏదైనా సంఘటన జరగగానే ఆ భావన తల ఎత్తుతుంది. తమ సౌకర్యం, స్వార్థం కోసం పరువు అనే ముసుగు వేసుకుంటారు.
వారి ఆధిపత్య అహంకార ధోరణలు భంగ పడుతాయి అనుకున్నప్పుడు. భయం , ఆత్మన్యూనత కలుగుతుంది. దానితో లోకువ అయిపోతాను పరువు పోతుంది అనే ఆలోచన వారిని పలాయనవాదం లోకి ఒక్కొక్కసారి హింసాప్రవృత్తి గురిచేస్తుంది.
ఈ కథలో శారద మురళి విద్యావంతులైన దంపతులు. చదువులేని పల్లెమనిషి మురళి తల్లి. అత్త అలవాట్లు చదువుకున్న, ఆర్థిక సామాజిక స్థిరత్వం కలిగిన కుటుంబం నుండి వచ్చిన కోడలు శారదకు నచ్చడం లేదు.
అత్తను అత్త అలవాట్లను చూస్తూంటే పని వాళ్ళ ముందు, పిల్లల ముందు లోకువగా కనిపిస్తుంది. అందుకని ఆ అవమానాల నుండి తప్పించే మార్గం వెతకమని మురళి ముందు కన్నీళ్లు పెట్టుకుంది.
చాలా తక్కువ మంది భర్తల వలెనే మురళి భార్య కన్నీళ్ళకు కరిగిపోయి, కర్తవ్యం చెప్పమంటాడు.
శారద నిర్భయంగా అత్తగారిని ఇంటి నుండి పంపించే మార్గాన్ని వెంటనే బోధిస్తుంది .
దానికి మురళి చెల్లెలు నెలలు నిండాయని వచ్చిన ఉత్తరం ఉపయోగపడుతుంది.
అయితే తన తల్లిని పంపించెయ్యమని శారద ధైర్యంగా చెప్పడానికి గల కారణం, ఆమె తండ్రి సాయంతో మురళి పొందిన ఉద్యోగం. ఆ విషయం అతనికి అర్ధమవుతుంది.
“స్టేటస్ ఇస్తున్న మత్తులో కొన్ని వాస్తవాలు అతనికి ఇప్పుడు వికృతంగా కనిపిస్తున్నాయి. మనసు ఆరోజు ఆఫీసులో కూల్ వాటర్ ఎన్ని తాగిన లాభం లేకపోయింది. అతని అసమర్ధతను గుండె లోతుల్లోంచి ఎవరో ఎలుగెత్తి చాటుతున్నట్లు అనిపిస్తోంది”
పై వాక్యాల ద్వారా వాస్తవ సంగతులు, తల్లి పై జరుగుతున్న వివక్ష, వాటికి కారణాలు మురళి అర్థం చేసుకోగలిగినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని తెలియజేస్తాయి.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నవ్వు మొహంతో తన తల్లి, ఆమె వెనుక శారద, బ్యాగులు పట్టుకొని మల్లేష్ ఇంటి నుండి బయటికి వస్తూ కనిపిస్తారు. ఇంటి ముందు రిక్షా ఆగి ఉంటుంది. దీనిని బట్టి శారదా అనుకున్నది కార్యరూపంలో ఎంత తొందరగా పెట్టగలిగింది మురళికి అర్థమవుతుంది.
అమాయకురాలైన తల్లి మురళి వైపు చూస్తూ “అయ్యా వచ్చావా, నేనే మీ ఆఫీసు కాడ రిచ్చాని ఆపిచ్చి సెప్పెళ్ళదాం అనుకుంటున్న. పాపం మొన్న మీ సెల్లి రాసిన ఉత్తరం మళ్లీ సదివి కోడలు ఇదైపోతోంది. ఇక్కడ అంటే మీకు నేను లేకపోయినా పనిమనుషులుండారు. దానికి ఎవళ్ళున్నారు ? ఎల్లగానే సెల్లితో ఉత్తరం ఏయిస్తాలే” అని కొడుకుని ప్రేమగా చూసుకుంటూ రిక్షా ఎక్కింది తల్లి.
తన తల్లి వద్దంటున్న తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆమె చేతిలో కొన్ని నోట్లు బలవంతంగా కుక్కాడు మురళి.
అపరాధ భావంతో బస్టాండ్ వరకు తల్లితో వెళ్లాలని కూడా కనిపించలేదు అతనికి.
పేదవాని కోపం పెదవికి చేటు. మురళి
కోపం అతని సుఖానికి చేటు.
అతనికి కోపం వచ్చింది. కానీ భార్య ఇచ్చిన వేడి కాఫీ తో చల్లారిపోయింది.
శారద తండ్రి మంచి హోదాలో ఉన్న అధికారి. అతని స్నేహితులకు బిడ్డ ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేయాలని శారదతో చెప్తాడు.
ఆమె చాలా ఆనందంగా పిల్లలతో “మీ తాతగారు వస్తున్నారు” అని వారిని ఉత్సాహపరుస్తుంది. భర్తతో “వంట అవి అన్నీ నేను చూసుకోగలను. కానీ అది మాత్రం మీరే చూసుకోవాలి. ఆ పేర్లు ఏమిటో నాకు తెలియవు” అంటుంది.
అప్పుడు మురళికి కి వీపుమీద చెళ్ళున కొట్టినట్టు అనిపిస్తుంది.
తన పల్లెటూరు తల్లి చుట్ట తాగితే నామోషీగా భావించిన శారద. తన తండ్రి మిత్రుల విందులో మద్యాన్ని ఏర్పాటు చేయమని చెప్పడంలో ఉన్న వివక్ష అర్థమవుతుంది .
ఎన్నో కష్టాలు పడి తన భవిష్యత్తుకు పునాదులు వేసిన తల్లికి ఉన్న చిన్ననాటి అలవాటు, తను పడే శారీరక మానసిక శ్రమ నుండి ఊరట పొందే ఊతం అది తన తల్లికి. ఆ చుట్ట తనతల్లిని
తనతో కలిసి బ్రతకడానికి అభ్యంతరంగా నిలిచింది.
అదే తన తల్లి స్థానంలోకి తండ్రి ఉంటే శారద అడ్డు చెప్పగలిగేదా.
కానీ విద్యావంతుడై హోదా ఉన్న మామగారు అతని స్నేహితులు హుషారుగా మందు కొట్టి ఎంత చెత్త వాగినా అభ్యంతరం లేదు.
అంటే ఇది కేవలం విలువలు, అలవాట్లు, ఆరోగ్యాలు, సంక్షేమానికి సంబంధించినది కాదు. కేవలం వివక్షను చూపే ఆలోచనలు మాత్రమే. మద్యం తాగినా పొగ తాగినా ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల ముందు అవి రెండూ చేయకూడదు.
కానీ ఇక్కడ పల్లెటూరి చదువులేని పేదరాలైన అత్తగారి అలవాటు నామోషీ అయ్యింది. చదువు, హోదా ఉన్న తన తండ్రి మద్యం తాగడం గౌరవప్రదం అయింది.
చదువుకున్న ఒక భారతనారి మానసిక రుగ్మత ప్రదర్శించే వివక్ష ఇది. కులాలు నశించాలి అంటూనే పేర్ల పక్కన కులాలు ప్రదర్శిస్తూ తోకలు తలిగించుకుంటారు. సమానత్వం కోసం , కుల రహిత సమాజం కోసం కులాంతర వివాహాలు జరగాలని చెప్తూ ఉంటారు.
కానీ కులాంతర వివాహం ఆధిపత్య కులాల కోడళ్ళు శూద్ర అత్తగారి పై చూపి వివక్షను ఈ కథలో కథయిత్రి దాసరి శిరీష సూక్ష్మంగా స్పష్టంగా చెప్పగలిగారు.
ఇదే వివక్ష ఆధిపత్య స్త్రీలను వివాహమాడిన ఫేక్ అంబేద్కరిష్టులు ప్రదర్శించే హింస కూడా చాలా సందర్భాల్లో సమాజంలో కనిపిస్తోంది.
కులం మతం పేరుతో మనుషులు కుటుంబాలలో సమాజంలో ఒకరిని ఒకరు ద్వేషించడం ఎక్కువైంది. దానికి తోడు టీవీ సీరియల్స్ బాధ్యత లేని మీడియా దొంగ బాబాలు దొంగ భక్తులు ఇంకా మతం కులం ఆంటూ అగ్గి పెడుతున్నారు. రచయితలు సాహితీకారులు ప్రత్యామ్నాయ సమాజం కోసం బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఇది తమ కలలను ఆ దిశగా నడిపించాల్సి ఉంది.
కథా రచయిత్రి దాసరి శిరీష గురించి
దాసరి శిరీష గారు 14 మే 1952న జన్మించారు. వీరు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు దాసరి నాగభూషణం నంబూరి పరిపూర్ణ దంపతుల కుమారై.
బ్యాంకు ఉద్యోగి గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1968లో మొదటిసారి వీరి “రాజు రాణి” కథ యువ జ్యోతి లో ప్రచురితమైంది. 1978లో ‘సమిధలు’ అనే కథ రాశారు. వీరు చక్రపాణి అవార్డు గ్రహీత. ‘సప్తస్వరాలు’ అనే కథ ఇండియా టుడేలో ప్రచురించబడింది. “దూర తీరాలు” నవల ఆంధ్రప్రభలో సీరియల్గా వచ్చింది. చిత్తూరు జిల్లాలో యూత్ వరల్డ్ అనే సంస్థను స్థాపించారు. 2001లో హైదరాబాదులో “ఆలంబన” అనే (కేర్ ఫర్ అన్ కేర్) సంస్థను మురికివాడల్లోని బాల బాలికల కోసం స్థాపించి ఇంకా నడుపుతున్నారు. యాభైకి పైగా కథలు నాలుగు నవలలు ఎన్నో కవితలు రాశారు.
*****
కలం పేరు జ్వలిత. అసలు పేరు విజయకుమారి దెంచనాల. స్వస్థలం పెద్దకిష్టాపురం,ఉమ్మడి ఖమ్మం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు.
రచనలు-
1)కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం)
2)మర్డర్ ప్రొలాంగేర్-2008 (కవిత్వం,ఆంగ్లానువాదం)
(3)సుదీర్ఘ హత్య-2009(కవిత్వం)
(4)ఆత్మాన్వేషణ -2011(కథలు )
5)అగ్ని లిపి- 2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం )
6) జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు)
7) సంగడి ముంత- 2019(కవిత్వం)
8) రూపాంతరం – 2019 (కథలు)
కథ పరిచయం ఆసక్తిగా వుంది.. కథను కూడా జత పరిస్తే బాగుండేది. జ్వలిత గారూ ధన్యవాదాలు . శిరీష గారి కథలు ఆలోచింపజేస్తాయి.
ధన్యవాదాలు వనజ మేడం