కథాపరిచయం

నేను చంపిన అమ్మాయి – ఆనంద

-జానకి చామర్తి

ఆ తరం కన్నడకథకులలో మాస్తిగారి తరువాత ఎక్కువ ప్రజాదరణ పొందిన రచయిత అజ్జింపుర సీతారామం

( ఆనంద)గారు. వారు వ్రాసిన కథలలో మంచిపేరు పొందిన కథ  ‘ నాను కొంద హుడిగి’ (నేను చంపిన అమ్మాయి) . చాలా ముఖ్యమైన కథ కూడా. ఈ కథను తెలుగులోకి శర్వాణి గారు అనువదించారు.

ఇంకో వ్యక్తి నమ్మకాల పట్ల తీర్పు నివ్వడం  వల్ల కలిగిన దుష్పరిమాణాన్ని ధ్వనింపచేసే కథ అంటూ  కథలను సంకలనం చేసిన శ్రీ నాయక్ గారు ఈకథపై తన అభిప్రాయం వెలిబుచ్చారు. 

శిలా శిల్పాల వైఖరీని  ఛాయా చిత్రాల ద్వారా సంగ్రహించడం  కోసం ప్రవాసం బయలు దేరుతాడు  అతను, ( ఉత్తమపురుషలో నేను అంటూ  కథ చెపుతాడు) ప్రవాసం చినరికి  నాగవళ్ళి అనే  ఊరు చేరుకున్నాడు. ఊరి ముఖ్యులు , కరియప్పగారు , ఆయన కు పెద్ద ఇల్లు చావడి , పెద్ద కుటుంబం  , అతనికి  తన ఇంట బస ఏర్పాటు చేయడమే కాక ఎంతో ఆదరణతో చూసుకున్నారు. తన పట్ల చూపుతున్న గౌరవ మర్యాదలకు అతనెంతో సంతోషపడతాడు. 

మధ్యాన్నం పూట నీరు కావలసి వచ్చి తలుపు తీసిన అతనికి తన గది ముందు స్తంభానికి ఆనుకుని కూచున్న  అమ్మాయి కనిపిస్తుంది. కరియప్పగారి కూతురు . ఆ అమ్మయి  ‘ చెన్ని’ అని చెపుతుంది తన పేరు.

తర్వాత కూడా చెన్ని అతనికి కనిపిస్తూనే కావలసిన పనులు చేసిపెడుతుంది.అతను తన భార్య లక్ష్మికి తన పర్యటన వివరాలతో రాసిన ఉత్తరం కూడా చెన్నమ్మ తపాలాపెట్టెలో వేస్తుంది. ఇంటి వెనకాల ఉన్న తోటకు దోవ కూడా చెన్నే చూపిస్తుంది అతనికి అడిగితే.

ఆ పల్లెపడుచు  ‘ చెన్ని మందహాసాన్ని’ రచయిత ఎంత చక్కగా చెప్పారు.

“ సున్నితంగా అలవోకగా పూలగుత్తుల నుంచి పరిమళాన్ని మోసుకొచ్చే చల్లగాలిగా, హృదయంలోచిన్ని చిన్ని తరంగాలు కదిలించే లాటి మృదువైన చిరునవ్వు. “

చెన్ని మొహం లో నమ్రత,కళ్ళలో ప్రతిఫలించే ముగ్ద హృదయపు నిర్మల ఛాయ, మాటలలో పల్లెపడుచులకే పరిమితమైన ఒక లాలిత్యం, కనిపించాయట కథకునికి.

ఇంటి వెనుకున్న  తోటలోని విశాలమైన ఏతాం బావి  గట్టున కూచుని బంగారురందు సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆ తోటలో ఆ సాయంకాలపు వెలుగూ హాయి రచయితే కాదు మనమూ పొందుతాము .చదువుతుంటే శర్వాణి గారు చేసిన అనువాదంతో నేను కూడా మామూలు తోటలోకి కాదు, తెలుగుతోటలోకి వెళ్ళినట్టైంది. గ్రామ పరిసరాలు వర్ణిస్తూ  ఒక గొల్లపిల్లవాడు స్వేచ్ఛగా గొంతెత్తి

* “ లావణి” * పాటలు పాడుకుొంటున్నారని చెప్పారు రచయిత.  కుతూహలం అవేమిటో తెలుసుకున్నాను చూసి. 

బావినీళ్ళు నింపుకున్న రెండు బిందెలను ఎత్తిపెట్టుకోవడంలో సాయం చేసి, ఆ భారంతో అటూ ఇటూ ఊగుతూ వెడుతున్న చెన్నమ్మ యవ్వన సౌందర్యం మనోహరంగా తోచి, వెడుతున్న చెన్నమ్మను ఆపి తన కెమేరాలో బంధిస్తాడు అతను.

చెన్ని ఆరాత్రి పళ్ళంలో పాలు పంచదార అరటిపళ్ళు పట్టుకు, లోపలకి వచ్చి తలుపు వేయడంతో నిర్ఘాంతపోతాడు అతను. తన భార్య లక్ష్మి పట్ల తన ప్రేమ అరక్షితమైన తన మనసును కాపాడిందని చెప్పుతుంటూ పరి పరి విధాల ఆలోచనలకి గురి అవుతూ, చెన్నికి అటువంటి కోరిక ఎందుకు కలిగి ఉంటుందో తర్కించుకుంటూ , “ చెన్నమ్మా, ఇలా రావచ్చునా , మీ ఇంటో వారికి తెలిస్తే నీకూ మర్యాద కాదు నాకూ మర్యాద కాదు” అని నచ్చ చెప్పబోతాడు. చెన్ని సమాధానం విని అతనిని ఆశ్చర్యానికి అంతులేదు.”వాళ్ళేమీ అనరు దొరా, నేను బసివిని, నన్ను దేముడికి వదిలేసారు.”

చెన్ని కి నాలుగేళ్ళప్రాయంలో పెద్ద జబ్బు చేసిందిట . ఆమె తల్లితండ్రులు మొక్కుకుంటారు, ఆమెకు జబ్బు నయమైతే

 “ బసివి” గా ఊరిలో వదిలివేస్తామని. అలాగే బసివిగా వదిలివేస్తారు. అదే మొక్కు చెల్లించుకునే పద్ధతి. దేవుని పేరు మీద ఈ బసివి కొంతమంది మగవారిని   ’ సేవించికుంటూ’ బతకాలి.

వేరే పెళ్ళి లాటి వ్యక్తిగత జీవితం ఉండదు.  ‘వేశ్య లాగ’ అంటే తీవ్రకోపంతో చెన్ని వప్పుకోదు. తను చేస్తున్న పని డబ్బులకోసం చేసే పని కాదని, దేవుని సేవించికోవడమే , మీరే ఇవాల్టికి నా దేముడు అంటుంది చెన్ని.

అదంతా విని , ఆమె రోజు రోజూ చేస్తున్న పాపఫలితంగా ఆమె బ్రతుక్కి ఆత్మ రూపమైన స్త్రీత్వమే నశించిపోతోందే అని తల్లడిల్లిపోయిన రచయిత ,  చెన్నికి కూచోబెట్టి వివరిస్తాడు , ఆడదానికి శీలమెంత ప్రధానమో, దేవుడి మొక్కు తీర్చుకోవడమంటూ చెన్ని చేసేది ఎంత పాపపు పనో, వేశ్యకు ఆమెకు తేడా లేదని, దేవుడు పాపం ఎన్నటికీ మెచ్చడని వివరిస్తాడు.

చెన్ని మౌనంగా అంతా వింది, వింటుంటే మొదట ఏర్పడిన భ్రాంతి కలవరపు ఛాయ వీడి , ఆ మాటలలోని నిజాన్ని ఆలోచిస్తున్న పసిపాపలాగ, ఒక ధ్యేయంతో గమ్యం చేరుకోవాలని చాలాదూరం పయనించి గమ్యం అది కాదని ఎవరో చెప్పినట్టుగానూ అయిపోయి ఉంటుంది.

చివరకు అతను అటువంటి పాపపు పని మరల చేయనని చెన్ని దగ్గర నుంచి మాటతీసుకుంటాడు.దుఃఖంతో కంపిస్తున్న స్వరంతో చెన్ని చెప్పింది “ దేవుడూ ,  ఇక మీదట ఈ పని చేయను” అంది.

గుండెల మీద పెద్ద బరువు దించినట్టుగా అతను నిద్రించాడు. చెన్నమ్మ వెళ్ళిపోయింది. తెల్లవారి కరియప్ప వచ్చి అతనిని నిద్ర లేపాడు. తోట బావి లో పడి మరణించిందని చెపుతూ దొర్లి దొర్లి ఏడుస్తాడు. పరుగున తోటలోకి వెళ్ళి చూసిన అతను తన చెన్నితో మాటాడిన తరువాతనే చెన్ని ఈ నిర్ణయం తీసుకుందని , తన వల్లనే చెన్ని మరణించిందని కుమిలి పోతాడు. పోలీసులు ఆత్మహత్య అని రికార్డు చేసుకున్నా,  అటువంటి బతుకు కన్నా చావే నయమన్న భావం కలుగ చేయడం వల్లనే ఆమె మరణించిందని , ఆమె ‘ నేను చంపిన అమ్మాయి’ అని పరి పరి విధాల బాధపడతాడు.

“ ఇంకొకరి ధర్మాధర్మాలు తూచి చూడటానికినేనెవరిని? “ అని తనని తను  ప్రశ్నించుకుంటూ  ఊరికి బయల్దేరాడు అతను , తన భార్య లక్ష్మి దగ్గరకు , వెళ్ళేముందు తోటలో తీసిన చెన్నమ్మ ఫొటోను వారింటిలో వదిలి వేసి.

ఈ కథ విషాదాంతంగా ఉండి చదవడం పూర్తయ్యేప్పటికి మనసు బరువెక్కుతుంది. బసివి లాటి ఆచారాలు కాలంతో పాటు సమసిపోవడం  మనసును తేలికచేసినా,

పరిస్ధితుల పూర్వాపరాలు,  ఆయా విషయాలలోని లోతు , మిగతావేవీ తెలుసుకోకుండా , ఒకవేళ తెలిసినా కూడా , వీలైతే పరిష్కమార్గం వెతకడానికి ప్రయత్నించాలి గాని తొందరపడి , 

ఇతరుల జీవితాలపై  ధర్మాధర్మాలపై తీర్పు ఇవ్వగలగడం ఎంతవరకూ సమంజసం అన్న  ప్రశ్న ఉదయించక మానదు.

లావణి పాటలు – 

పాటలు పాడుతూ, నాట్యం చేసే జానపద కళకు ‘లావణి’ అని పేరు. ఇటీవల కొంతకాలంగా మహారాష్ట్ర యువకులు స్త్రీ వేషధారణతో ఈ కళను పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ‘లావణి’ తో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు.ఈ నాట్యంలో ఆధ్యాత్మికత, వేదాంతం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఉంటుంది. గ్రామాలలో వారంవారం పెట్టే గ్రామసంతలో, పశువుల సంతలలో ఎక్కువమంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శిస్తారు.


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.