మా కథ
రచన: దొమితిలా చుంగారా
అనువాదం: ఎన్. వేణుగోపాల్
దొమితిలా జీవితం- సైగ్లో – 20
గృహిణుల సంఘం
నన్ను ఉత్తేజ పరచిన సంగతి మరొకటుంది. ఖైదీలు మమ్మల్ని మచ్చిక చేసుకోవడానికి మాకు చాకొలెట్లు, సిగరెట్లు, క్యాండీలు ఇస్తుండేవారు. వాళ్ళు తినేటప్పుడు మేం కనబడడం తటస్థిస్తే మమ్మల్ని కూడా తిండికి ఆహ్వానించేవాళ్ళు. కొందరు అమాయకమైన స్త్రీలం వాళ్ళిచ్చేవి తీసుకున్నాం. నేను కూడా తీసుకునేదాన్నే – నేను కొన్నిసార్లు సిగరెట్లు తీసుకున్నాను. కాని ఓ రోజు జెరోమా మమ్మల్ని పిలిచి “మీరేం చేస్తున్నారో తెలుస్తోందా? మనం వాళ్ళతో కలిసి వాళ్ళ వస్తువులు పంచుకోవడానికిక్కడికి రాలేదు. వాళ్ళు మన శత్రువులనే సంగతి మీరెల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. శత్రువు నుంచి ఏమీ తీసుకోకుండా ఉండాలి” అని చెప్పి మేం వాళ్ళ దగ్గర్నుంచి తీసుకున్నవన్నీ వాళ్ళకు తిరిగి ఇప్పించింది.
ఆ రోజుల్లోనే కొందరు చర్చి మహిళలు మమ్మల్ని కలవడాని కొచ్చారు. ఆ రోజుల్లో చర్చిలు కూడా విదేశాల నుంచే నడపబడేవి. సహజంగానే ఈ చర్చి మహిళలు విదేశీయుల తరఫునే మాట్లాడారు. మమ్మల్ని నాస్తికులనీ, కమ్యూనిస్టులనీ తిట్టారు. ఏడ్చారు, మొత్తుకున్నారు. మాకారణంగా వాళ్ళు కూడా రైతుల చేతుల్లో కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తోందని మమ్మల్ని తిట్టిపోశారు. మేమూ ఘాటుగానే జవాబిచ్చాం. దాంతో వాళ్ళు తత్తరపడిపోయి “ఓరి దేవుడో! వీళ్ళు ఆడవాళ్ళు కాదురా నాయనో!” అనుకుంటూ వెళ్ళి పోయారు.
లాపాజ్ బిషప్ కూడా మాతో మాట్లాడడానికొచ్చాడు. ఆయన చాలా ఉద్రేకంగా ఆ విదేశీయులు మా కెప్పుడైనా ఏమైనా హాని చేశారా అని అడిగి, వాళ్ళనొదిలెయ్యమని హితబోధ చేసి, మేం తలబిరుసు వాళ్ళమని తిట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో చర్చి మా పట్ల ప్రవర్తించిన తీరు ఇది. 1961లో ప్రభుత్వం మమ్మల్ని మార్చి చంపుతున్నప్పుడు, స్త్రీలందరూ తమ భర్తల విడుదలను కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు బిషప్ మమ్మల్నందరినీ మతం నుంచి వెలి వేశాడు. మేం నాస్తికులమనీ, మేం ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామనీ, తిండి దొరుకుతున్న సమయంలో నిరాహార దీక్ష పూనడాన్ని దేవుడు క్షమించడనీ ఆయన ప్రకటించాడు. మేం ఏ పరిస్థితుల్లో నిరాహార దీక్షకు దిగవలసి వచ్చిందో ఆయన అర్థం చేసుకోలేదని నాకు తెలిసిపోయింది. నిజానికి మేం అప్పుడు ఉండిన భయంకర పరిస్థితుల్లో అదొక్కటే మేం చేయగలిగిన పని కాదూ? – సరే మాతో మాట్లాడాక బిషప్ మాకొక వాగ్దానం చేసిపోయాడు. మా నాయకుల్ని విడిపించడానికి లోపాజ్లో తనకు వీలయినంత ప్రయత్నిస్తానన్నాడు. ఉకురెనా నుంచి రైతులు మా ఊరి మీదికి రాబోతున్నారనే వార్త ఊరి జనాన్ని కల్లోల పరచింది. జనం తమ సామానులు సర్దుకొని లాలాగువాకు వెళ్ళడం మొదలెట్టారు. మరి కొందరు ఇంకా క్షేమంగా, ఇంకా దూరంగా ఉండేందుకు గాను అన్షియాకు కూడా తరలిపోయారు. ఒక రకమైన భయభీతావహం ఊరంతా వ్యాపించింది. వాళ్ళు మమ్మల్ని గందరగోళపరచడానికే ఆ పుకారు ప్రచారం చేశారని నేననుకుంటున్నాను. ఆ రోజుల్లో మా నాయకులు ప్రదర్శించిన ధైర్య సాహసాలే మాకు సాయపడ్డాయి. వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపించారు. మేం భయపడిన సందర్భాలు లేవనికాదు గాని చివరికి మేమందరమూ మా నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నాం.
మా నాయకులతో మాట్లాడి, నచ్చచెప్పి, వాళ్లతోనే మాకు ఉత్తరం రాయిస్తానని లెచిన్ వెళ్ళిపోయాడు. అలా మా నాయకులు మాకో ఉత్తరం రాశారు. మాకు చిరపరిచితమైన సంతకాలతో ఆ ఉత్తరాలు వచ్చాయి. ఆ ఉత్తరాల్లో మా నాయకులు తాము బతికే ఉన్నామని తెలిపి, గ్రామంలో రక్తపాతం జరగకుండా చూడమని కోరారు.
ఆ తర్వాత కార్మికుల సభ జరిగింది. ఆ సభలో యూనియన్ విదేశీయుల్ని విడుదల చేసేయాలని తీర్మానించింది. మా స్త్రీలం, యూనియన్ ఎప్పుడు ఖైదీలను అప్పగించమంటే అప్పుడు అప్పగించడానికి అంతకు ముందే నిర్ణయించుకొని సిద్ధంగా ఉన్నాం. యూనియన్ కోరిన వెంటనే “ప్రతి ఒక్క” ఖైదీని విడిచి పెట్టేసే ఒప్పందం మీద సంతకం చేశాం. మేం మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాం. నిజానికి ఖైదీల విడుదల సమస్య కార్మికుల చేతుల్లోనే ఉంది. ఖైదీలు విడుదలయ్యారు. ఇదివరకు మమ్మల్ని తిట్టిపోయిన స్త్రీలే మళ్ళీ మమ్మల్ని అవమానించడానికీ, విదేశీయుల్ని ఆహ్వానించడానికీ యూనియన్ ముఖద్వారం దగ్గరికొచ్చారు. వాళ్ళక్కడ మమ్మల్ని గేలిచేశారు. కొట్టడానికి ప్రయత్నించారు.
మేం చాలా కుంగిపోయాం. మాకిది అపజయంగానే తోచింది. మా నాయకుల విడుదలకు, విదేశీయుల విడుదలను పోటీ పెట్టాలనుకున్న మా లక్ష్యాన్ని ఇంత కష్టపడీ మేం చేరుకోలేక పోయాం . ఉకురెనా నుంచి రైతులు చాలా రోజులు ప్రయాణం చేసి సైగ్లో -20 పొలిమేరల్లోకి వచ్చారని మాకు తెలిసింది. వాళ్ళను ప్రతీకారం తీర్చుకోకుండా వెనక్కి పోయేట్లు ఒప్పించడానికి తల ప్రాణం తోకకొచ్చింది.
నాయకులు ఆ తర్వాత కూడా చాల కాలమే జైల్లో ఉన్నారు. ఒక్క మేలేం జరిగిందంటే మేం పంపిన కొందరు లోపాజ్ దాకా వెళ్ళి మా నాయకుల్ని కలిసి మాట్లాడి రాగలిగారు. ఆ తర్వాత మేం ఎప్పుడంటే అప్పుడు జైలుకు వెళ్ళి చూసే వీలు కలిగింది. వాళ్ళను సాన్ పెట్రో జైలుకు బదిలీ చేయించడంలో కూడా మేం విజయం సాధించాం. సాన్ పెడ్రో జైలు కొంచెం ఆరోగ్యకరంగా ఉండేది. ప్రతి వారమూ సైగ్లో-20 నుంచి ఒక కమిటీ లోపాజ్ వెళ్ళి, వాళ్ళను కలిసి, వాళ్ళకు ఆహారమూ, సాహిత్యమూ, ఇతర సరుకులూ ఇచ్చివస్తుండేది. వాళ్ళు ఖైదీలుగానే ఉన్నా కార్మిక నాయకులుగా గుర్తించబడ్డారు. బైట ఉన్న ఇతర నాయకులంతా తాత్కాలిక నాయకులే. అంతేకాదు, ఏ కార్మికుడైనా సెలవు మీద వెళ్ళేటప్పుడు జైలుకెళ్లి నాయకుల్ని కలిసి వచ్చేవాడు. ఫ్రెడరికో ఎప్పుడూ ప్రశ్నల వర్షం గుప్పిస్తుండే వాడు. ఆయన దగ్గర ఓ రేడియో ఉండేది. మేం తీసుకువెళ్ళే సాహిత్యంతో ఆయనకు బైట ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుస్తుండేది. ఆయన ఎప్పుడూ మాతో సమస్యల గురించీ, ఏం జరగబోతుందనే దాని గురించీ, మేం ఏం చేయాలనేదాని గురించీ, మేం ఎలా ఐక్యంగా ఉండాలనే దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయనెప్పుడూ మాతో ఐక్యత గురించే చెపుతుండే వాడు.
సరే మా నాయకులు జైల్లో అటూ ఇటూగా ఓ ఏడాది పాటు ఉన్నారు. 1964 తిరుగుబాటును అవకాశంగా తీసుకొని కార్మికులు జైల్లోకి వెళ్ళి ఇతరులతో పాటు మా నాయకుల్ని విడిపించుకొచ్చారు.
యూనియన్ భవనంలో ఖైదీల కాపలాకాస్తూ గడిపిన కాలమూ, గడించిన అనుభవాలూ నాకు జీవితాంతమూ ఉపయోగపడతాయి. ఆ అనుభవాలతోనే నేను గృహిణుల సంఘంలో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టాను. సొరా సొరా మైదానంలో 1964లో మాకు సమస్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా లోపాజ్లో కార్మిక వర్గం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒరురోలో జరిగిన ఓ ప్రదర్శన మీద కాల్పులు జరిగాయి. ఎంతో మంది విద్యార్థులు కాల్చి చంపబడ్డారు. మా సంఘ కార్యదర్శి తాత్కాలికంగా నన్ను బాధ్యతలు చూడమని చెప్పి మృతుల అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఒరులో వెళ్ళింది. ఇలా వెళ్ళిన వాళ్ళందరినీ అరెస్టుచేసి, చిత్రహింసల పాలు చేసి జైల్లో పెట్టారు.
సంఘీభావ ప్రచారాలు జరగకుండా ఆపేందుకుగాను ప్రభుత్వం గని కార్మికుల రేడియో స్టేషన్లను ఆక్రమించుకోదలిచింది. గనుల్లోకి సైన్యం ప్రవేశించబోతోందని మాకు తెలిసింది. సైగ్లో -20కి హువానుని రేడియో స్టేషన్ నుంచి సహాయం కోసం అభ్యర్థనవచ్చింది. ఎప్పటిలాగే సైగ్లో-20 కార్మికులు సహాయపడేందుకు సిద్ధమయ్యారు.
కార్మికులకూ సైన్యానికీ మధ్య ఘర్షణ జరిగిందనీ చాల మంది గాయపడ్డారనీ, ఒక ట్రక్ నిండుగా జనాన్ని నింపుకుని తీసుకుపోయారని మాకు తెలియవచ్చింది. మేం యూనియన్ భవనంలో యూనియన్ ఆస్తులకు కాపలాకాస్తున్నాం. సహాయం కోసం హువానుని వెళ్ళిన వాళ్ళ భార్యలు ఆదుర్దాతో యూనియన్ భవనం చుట్టూ గుమిగూడారు. ఏం జరిగింది, ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు గాయపడ్డారు అని వాళ్ళడగడం మొదలెట్టారు.
*****
(ఇంకా ఉంది)