జీవితమే నవీనం
అనుభవాలు -జ్ఞాపకాలు-4
-వెనిగళ్ళ కోమల
చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. చిక్కు తీసుకోలేక పీకి, కత్తిరించి పడేస్తుంటే అన్నయ్య – నీకెందుకింత చక్కని జుట్టు వచ్చిందో గాని నులకతాడు పేనినట్లు పేనుతున్నావు అని కోప్పడేవాడు. మంచి దువ్వెన తెచ్చి ఇచ్చాడు.
ఇంటర్ లో 10 మంది అమ్మాయిలం ఉండేవాళ్ళం. రాధాకృష్ణ (అతి నెమ్మదస్తురాలు, నాకు మంచి స్నేహితురాలు. ఇప్పుడు లేదామె) ప్రభల సరస్వతి, ఎల్. పద్మ, ఆర్. పద్మ బాగా గుర్తున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన తరువాత సరస్వతి నన్ను, మిగతా క్లాసు అమ్మాయిలనూ ఇంటికి ‘టీ’కి ఆహ్వానించింది. సరస్వతి తల్లి నన్నెంతగానో అభినందించారు. సరస్వతి తేజం నా మొహంలో ఉట్టిపడుతున్నదని. ఆమె పెద్ద మనసుకు చేయెత్తి నమస్కరించాను. చదువంటే కొందరికి అంత విలువ. గిరిజ, వరలక్ష్మి, వనమాల, శకుంతల, సుశీల, లలిత మాతో చదివారు.
ఆంధ్రా యూనివర్సిటీకి బి.ఎ. (ఆనర్స్)కి అప్లికేషన్ పెట్టించాడన్నయ్య. నాన్న ‘లా’ చదవమన్నారు. నేను ఇంగ్లీషు లిటరేచర్ చదువుతానంటే రెంటికీ అప్లికేషన్లు పంపాడు అన్నయ్య. రెంటిలో సీటు దొరికింది. నా మనసెరిగిన అన్నయ్య వెంట వచ్చి నన్ను బి.ఎ. (ఆనర్స్) ఇంగ్లీష్ లిటరేచర్ లో జాయిన్ చేసి, హాస్టల్లో దింపి పుస్తకాలన్నీ కొనిచ్చి వెళ్ళాడు. ఎప్పుడు హాస్టలుకెడుతున్నా కొన్ని పోస్టు కార్డుల మీద నాన్న అడ్రస్ రాసి యిచ్చి ప్రతివారం క్రమం తప్పకుండా ఉత్తరం రాయమనేవాడు. నాన్న పుష్కలంగా ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడు. లోటు రానీయలేదు. అలా అని విచ్చలవిడిగానూ ఖర్చు చేయలేదు నేను.
క్లాసులో పచ్చా కనకమణి (విజయవాడ), ఇందిర (ఒంగోలు) క్రిష్ణ (యు.పి.), లోతికా గుప్త (బెంగాల్) క్లాసుమేట్స్. సీనియర్స్ తో కలిసి క్లాసులుండేవి. వారిలో సుమిత్ర ఎన్.జి.యల్, సుశీలా పీట ర్స్ హాస్టల్ మేట్స్ గూడా. సుమిత్ర అందమైన వ్యక్తి. పెద్దజడ, చక్కని నవ్వు – నాకు యిష్టంగా వుండేది. చదువయిపోయి మొదటి సంవత్సరం ఉద్యోగం చేస్తూ మెనెంజైటిస్ వచ్చి అకాల మరణం చెందింది. ఎంతోకాలం ఆ విషాదం బాధను కలిగించింది. ఆమె తల్లిదండ్రులెలా తట్టుకున్నారో అని గుండె బరువెక్కేది.
సుశీలా పీటర్స్ విజ్ఞాన ఖని. అతి మంచి వ్యక్తి. షేక్స్ పియర్ నాటకాలు పేజీలకు పేజీలు కంఠతా వచ్చు ఆమెకు. పుస్తకం పడితే ముగించేదాకా రాత్రి తెల్లవార్లూ వదిలేది కాదు. కర్నూలు ఆమెది. ఎ.సి. కాలేజీలో కెమిస్ట్రీ బి.ఎ. చేసింది. నాకు ఇంగ్లీషు సాహిత్యం అంటే మక్కువ. ‘దుష్టీ’, ‘త్రాష్టీ’ అంటూ నన్ను ముద్దుగా పిలిచేది. చాలా కాలం టచ్ లో ఉన్నాం. ఒకటి రెండుసార్లు పరీక్షల పనుల్లో కలిశాం. ఆమె అంటే నాకు వీరారాధన ఉండేది. మనిషిగా, విజ్ఞాన ఖనిగా. ఇప్పుడిక లేరు.
హాస్టల్లో ఉన్న మనోహరం (ముస్తాబాదు) లా చదివేది. మద్రాసులో హిందీలో క్లాసుమేట్. నేనప్పుడు మరీ చిన్నదాన్ని. అంత పరిచయం లేదు. కానీ వైజాగ్ లో నన్ను ఎంతో ఆప్యాయంగా చూచేది. బలహీనంగా ఉంటావు. తిండి సరిగా తినవు అంటూ రోజూ రెండు పచ్చి గుడ్లు బలవంతంగా గొంతులో పోసేది. నారింజలు తెప్పించి రసం తీసి తాగించేది. ఎన్.జి.రంగా గారి శిష్యవర్గం అన్నయ్య నెరుగును. తాను. జె.యస్.ఆర్. కృష్ణ అప్పుడు చదివాడు. మనోహరం ఏది కావాలన్నా తెప్పించేవాడు. పండ్ల సరఫరా గూడా ఆయనే చేయించేవాడు. నన్ను ‘కోమూ’ అంటూ పిలిచేది. ఆమె చనిపోయిన దాకా స్నేహాలు కొనసాగాయి. ఇన్నయ్యకు గూడా ఆమె పరిచితురాలే. ఆమె చిన్న చెల్లెలు విజయ భర్త మస్తాన్ చౌదరి హైదరాబాద్ లో మాకు మంచి మిత్రులు. జూబ్లీహిల్స్ లో మా యిద్దరి ఇళ్లు దగ్గర దగ్గరగానే ఉన్నాయి. ‘అక్కా’ అంటూ విజయ ఎంతో ఆప్యాయత పంచుతుంది.
హాస్టల్లో అక్తరున్నీసా బేగం సోషల్ వర్క్ స్టూడెంట్ వుండేది. స్నేహమయింది ఆమెతో. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. కోపం అంటే ఆమెకు తెలియదనే చెప్పాలి. ఆమె సహవాసంలో నాలో కోపం చాలా వరకు తగ్గిందని చెప్పాలి. హైదరాబాద్ లో గూడా ఉద్యోగరీత్యా ఉన్నాము. కలిసేవాళ్లం. తన పెళ్ళయి వెళ్ళిపోయాక మరల కలవ లేదు. కానీ ఎప్పుడూ తనను ఆనందంగా గుర్తు చేసుకుంటాను.
రాజేశ్వరి, నేను పొడవుగా పెద్ద జడలతో కలిసి కనిపిస్తుంటే కొందరు మేమిద్దరం అక్క, చెల్లెళ్ళమనుకునేవారు. హాస్టల్ (మహారాణీ పేట) నుండి యూనివర్సిటీ బస్ లో వెళుతుంటే కండక్టర్ నా పక్కన రాజేశ్వరి కనిపించకపోతే అక్కయ్యగారికి క్లాసులు లేవాండీ ఈ రోజు రాలేదు అనేవాడు. అతనికి తెలియదు మేమిద్దరం అక్క చెల్లెళ్ళం కాదని – నేను చెపితే గదా ఆ సంగతి!
క్లాసు అబ్బాయిలతో ఎప్పడూ మాట్లాడలేదు ఆ మూడేళ్ళలో. పల్లెటూరు నుండి వచ్చినదాన్ని, చొరవ చేయలేదు. వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. సీనియర్స్ లో ప్రేమ (ప్రొ.శ్రీనివాస్ అయ్యంగారి అమ్మాయి), లక్ష్మీదేవి (రెజిస్ట్రార్ కూర్మా వేణుగోపాల్ నాయుడుగారి కోడలు), జూనియర్స్ లో ఆదిలక్ష్మి (ప్రొ. ముత్తుస్వామిగారి అమ్మాయి), రాధాకృష్ణ (కృష్ణాజిల్లా) పరిచయంగా ఉండేవారు.
టీచర్స్ ఉద్దండులు – ప్రొ.శ్రీనివాస్ అయ్యంగార్ ప్రొ. కె. విశ్వనాథం, ప్రొ.ముత్తుస్వామి. డా.ఇలా సేన్, డా.ఇందుశేఖర శాస్త్రి. మూడు సంవత్సరాల చదువయిన తరువాత నా రిజల్ట్స్ అంత సంతృప్తినీయలేదు. 49 శాతం వచ్చింది. కాలేజ్ లో పనిచేయాలంటే 55 శాతం ఉండాలి. అవగాహన, ప్రెజంటేషన్ లోపమని సరిపెట్టుకున్నాను. ఆ రోజుల్లో బ్రాహ్మణ – బ్రాహ్మణేతర విచక్షణలుండేవి అని యూనివర్సిటీలో చెప్పుకునేవారు. నేనా విచక్షణకు బలి అయ్యానన్నారు కొందరు. నేనలా అనుకోలేదు.
అన్నయ్య లండన్ పంపి లింగ్విస్టిక్స్ చదివిస్తానన్నాడు. అందుకయ్యే ఖర్చు దృష్టిలో పెట్టుకుని, నాకా సబ్జక్ట్ లో అభిరుచి లేదన్నాను. అప్పుడింకా ఆ కోర్సు మన యూనివర్సిటీల దాకా రాలేదు. నాన్న నన్ను గుంటూరులో సెయింట్ జోసఫ్స్ కాన్వెంట్ లో బి.యిడి.లో చేర్పించారు. హైస్కూల్లో చదవలేదు. అక్కడి విద్యా పద్ధతులు ట్రైనింగ్ లో నేర్పిస్తారని అలా చేర్పించారు. ప్రిన్సిపల్ సిస్టర్ అన్న మరియా నెమ్మదిగా, గంభీరంగా ఉండేవారు. సిస్టర్ థెరసలీనా ఇంగ్లీషు డిపార్ట్ మెంట్ హెడ్. నన్ను దగ్గరకు పిలిచి మాట్లాడేవారు. నవ్వుతూ మాట్లాడేవారు. నేను తలవంచుకుని సమాధానం చెపుతుంటే ఎదటి మనిషి కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి అని చెప్పి నేర్పించారామె. ఆప్యాయంగా చూసుకునేవారు నన్ను. తరువాత రెండేళ్ళు వాళ్ల దగ్గర పనిచేసినప్పుడు బాగా సన్నిహితంగా మెలిగాము. అమ్మా, నాన్నా, తోడబుట్టినవారు, బంధువులు స్నేహితులు, గురువులూ నా పట్ల చూపిన ప్రేమ, ఆదరణ నా అదృష్టం అనుకొంటాను. 1959లో బి.యిడి. అయింది. ఆ కాలేజీలోనే 1959-61 వరకు పనిచేశాను. వారడిగిందీ ఆ రెండు సంవత్సరాలే. సిస్టర్ రోజీనా ఎం.ఎ. ఇంగ్లీషు పూర్తి చేసి నా స్థానంలో లెక్చరర్ గా వచ్చారు.
అదృష్టం అంటే ఒక విషయం ప్రస్తావించక తప్పదు. నాకు కుడికాలికి ఆరువేళ్ళున్నాయి. అలా పుట్టాను. నాన్న ఆ వేలు సర్జరీ ద్వారా తొలంగించ సంకల్పించారట. తాత నరసింహయ్య అలా ఉండటం పిల్లకి అదృష్టం తీయించవద్దని అడ్డు తగిలారట. రెగ్యులర్ షూ వేసుకోటానికి ఆటంకం అని నాన్న తొలంగించాలనుకొన్నారట. మరల ఇంటర్ చదివేటప్పుడు ఆ ప్రస్తావన తెచ్చాడు నాన్న. డాక్టరుతో టైము ఫిక్స్ చేసారు. ఎక్స్ రే తీసి నిర్ణయిస్తామని డాక్టరన్నారు. నాకు డాక్టర్లు, వైద్యం అంటే యిష్టం ఉండదు. అమ్మ దగ్గర ఏడ్చి గొడవ పెట్టాను. వేలు తీయించవద్దని. అమ్మ రికమండేషన్ తో ఆ పని ఆగింది. ఇబ్బందిగా ఉన్నా విద్యార్ధిగా షూ వేసుకున్నాను నాన్న సంతృప్తి కోసం. ఈ మధ్య (2013) కాలికేదో సమస్య వస్తే అమెరికాలో డాక్టరుకు చూపింది నవీన. మీ ఇంట్లో ఇంకెవరికైనా ఆరవ వేలు ఉన్నదా అని అడిగారాయన లేదన్నాను.
*****
(ఇంకా ఉంది)
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.