యాత్రాగీతం
నా కళ్లతో అమెరికా
అలాస్కా
-డా||కె.గీత
భాగం-4
ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో అనుకున్నట్టే విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరాం. దారిపొడవునా గడ్డి భూములు, ఎత్తైన పర్వతాలు, సరస్సులు, మంచుకొండలు గ్లాస్ డూమ్ ట్రైనులో నుంచి చూసి ఆస్వాదిస్తూ ఉంటే సమయమే తెలియలేదు.
రైలు పెట్టెలోనుంచి ఒడ్డునున్న పెద్ద క్రూయిజ్ షిప్పు చూసి సంబరపడిపోయారు పిల్లలు. తీరా చూస్తే ఇంతకీ మేం ఎక్కాల్సింది దాని కొక పక్కనున్న రెండు మూడంతస్తులతో ఉన్న పెద్ద సైజు పడవ.
రైలు దిగుతూనే రోడ్డు కెదురుగా ఉన్న షిప్ యార్డ్ లో టిక్కట్ల లైనులో నిలబడి మా రిజర్వేషను కాగితం చూపించి టిక్కెట్లు తీసుకున్నాం. అప్పటికే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న పడవలో మా కోసం కేటాయించిన నంబరు టేబులు దగ్గిర కూచున్నాం.
ఈ మొత్తం స్టెప్పులన్నీ ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా పద్ధతి ప్రకారం ఉన్నాయి.
పొద్దున్న మా రిజర్వేషను కాగితంలో విట్టియార్ కి రైలు చేరే సమయం, విట్టియార్ నుండి షిప్పు బయలుదేరే సమయం ఒక్కటే ఉండడంతో దారంతా ఒకవేళ రైలు ఆలస్యమైతే షిప్పు అందుకోగలమా అని ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఎక్కడా ఒక్క నిమిషం తేడా లేకుండా రైలు చేరడమూ, షిప్పుని అందుకోవడం వంటి వాటికి కరెక్టుగా మేచ్ అయ్యేలా ప్రీ ప్లాన్డ్ టూరు అని చేరేక అర్థమైంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల రైలు రాకపోతే షిప్పు కదలదు. అవి రెండూ ఇంటర్ కనెక్టెడ్ టూర్స్ అన్నమాట.
మా టేబులు దగ్గిర రెస్టారెంటు లో ఉన్నట్టు ఫోర్కులు, స్పూన్లు వగైరా పెట్టి ఉన్నాయి. మధ్యాహ్న భోజన సమయం కావడంతో కరకరా ఆకలేస్తోంది అందరికీ. ముందే మా మీల్ ఛాయిస్ లు కూడా టూరు బుక్ చేసినప్పుడే రాసుకున్నారు కాబట్టి కరెక్టుగా పది నిమిషాల్లో మా టేబుల్ మీద ఫుడ్ సర్వ్ చేసేరు.
ఆ రోజు సాటర్డే కావడంతో మేం వెజిటేరియన్ ఆర్డర్ చేసేం. ఏదో బీన్ సూప్, చిన్న పావ్ బ్రెడ్, కోల్స్లా అనబడే క్యాబేజీ సలాడ్ ఇచ్చేరు. పిల్లలు ఏదీ నచ్చక కొంచెం కొంచెం తిని వదిలేసేరు.
ఇక అటూ ఇటూ పచ్చని కొండల మధ్య సముద్రపు పాయలో వేగంగా దూసుకుపోతున్న పడవలో కింది అంతస్తుల్లో డైనింగు పూర్తికాగానే అంతా వరండాల్లో ఉన్న ఖాళీ స్థలాలల్లోను, పడవ ముందు వెనక గ్లాసు డోర్ల బయట ఉన్న బెంచీలమీద, అన్నిటి కంటే పై డెక్ లో ఉన్న బెంచీల మీద, అంచుల్ని ఆనుకుని నిలబడే స్థలాల్లోను చేరుకుంటున్నారు. ఆ పై డెక్ మీద విసురుగా చలిగాలి వీస్తూ ఉండడం వల్ల, సిరి రానని పేచీ పెట్టడం వల్ల మేం ఎవరో ఒకళ్ళం కింది డెక్ లో ఉండి సిరిని చూసుకుంటూ, పై డెక్ కి ఇద్దరిద్దరం వెళ్లొచ్చేం.
నిజానికి నాకు సముద్ర ప్రయాణం, అందునా బోట్ జర్నీ అస్సలు పడదు. అందుకే ఇంటి నుంచి కొని తెచ్చుకున్న సీ సిక్ నెస్ ని దూరం చేసే హ్యాండ్ బ్యాండేజ్ ఒకచేతికి పెట్టుకున్నాను. అందుకో ఏమో అసలు జర్నీలో సిక్నెస్ అనిపించలేదు.
సరిగ్గా గంట ప్రయాణం తర్వాత దూరంగా అత్యద్భుతంగా పర్వతమ్మీద నుంచి అమాంతం సముద్రంలోకి దూకుతున్నట్టున్న హిమనీనదాన్ని (గ్లేసియర్) మొదటిసారి చూసి నోటమాట రాలేదు నాకు.
దూరం నుంచి ఏదో తెల్లని పాము పర్వతాన్ని పాకుతున్నట్టున్నా దగ్గిరికి వెళ్లే కొలదీ అతిపెద్ద తెల్లని మంచు ప్రవాహం కిందికి దూకుతూ పొరల మధ్య మధ్య అతివిచిత్రమైన ఆకాశ నీలం రంగుతో మెరుస్తూ ఉన్నట్టుండి పర్వత అంచులనించి సముద్రంలోకి పెళ్లలుగా విరిగి పడుతూ అత్యంత సౌందర్యంగా ఉన్నా, భీతిగొల్పుతూ ఉంది. ఇన్నాళ్లూ హిమనీనదాన్ని ఊహించుకున్నదానికీ ఇక్కడ కనిపించేదానికి వెయ్యిరెట్లు తేడా ఉంది.
ఒకపక్క ఎండ కాస్తున్నా చుట్టూ పర్వతాల మీంచి, మంచు ప్రవాహాల మీంచి, వీస్తున్నట్టున్న అతిశీతల గాలులు.
ఆపేసి ఉండుండీ పడే మంచు పెళ్లల దృశ్యాలు ఒడిసి పట్టుకోవడాకన్నట్టు మా బోట్ ని దగ్గిరగా తీసుకెళ్లి కొంత సేపు ఆపేసేరు. అలలమీద ఉయ్యాయలలూగుతూ తళతళా మెరిసే నిశ్శబ్ద ఆకాశం కింద అలా ఆ క్షణాన హిమనీనదాన్ని కళ్లనింపుకోవడం చెరగని అనుభూతి.
బోట్ చుట్టూ వెన్నముద్దల్లా తేలుతున్న పెద్ద పెద్ద మంచుగడ్డలు. అక్కడ సముద్రఉషోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉంటుందని, పొరపాటున ఎవరైనా నీట్లో పడితే ఆ చలి తట్టుకోలేక వెంటనే మరణిస్తారని గైడు చెప్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది. ఈ మంచు ప్రవాహం మిలియన్ల ఏళ్ల కొద్దీ అతి కొంచెం కొంచెంగా కదులుతూ వస్తుందని, ఇప్పుడు మేం చూస్తున్నది ఎప్పుడో ఐస్ ఏజ్ నాటిదని చెప్తుంటే అబ్బురమనిపించింది. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల గత పదేళ్లలో అతివేగంగా మంచు కరిగి సముద్రంలోకి పడిపోతూ ఉందని, అందువల్ల సముద్రమట్టపు ఎత్తు పెరిగి ఎన్నో దీవులు నీట మునిగిపోతున్నాయని మనిషే ప్రకృతి వినాశకానికి కారణమని గైడు చెప్తున్నప్పుడు ఇవన్నీ ఇంతకు ముందే తెలిసినా గొప్ప బాధగా అనిపించింది.
ఆ మంచుగడ్డల్లో కొన్నిటిని తోడి తీసి బోట్ లో ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా కూల్ డ్రింక్స్ లో వేసి అమ్మకానికి పెట్టేరు. అతి స్వచ్ఛమైన ఆ మంచు తినడం వల్ల మంచి జరుగుతుందో, చెడు లేదో జరుగుతుందో తెలియదు కానీ గొప్ప సరదాగా, సంతోషంగా అనిపించింది.
నేను బోట్ చుట్టూ ఎక్కడ ఖాళీగా ఉన్నా ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటూ లోకాన్ని మరిచిపోయినట్టు ఎంతోసేపు తిరుగుతూనే ఉన్నాను.
“ఏమైనా స్వయంగా కంటితో చూడడమే వేరు కదూ!” అంటూ మురిసిపోతున్న నన్ను ఎప్పట్లానే స్వేచ్ఛగా వదిలేసి పిల్లల్ని భద్రంగా చూసుకుంటున్న సత్య మీద గౌరవం రెట్టింపైంది.
దాదాపు గంట తర్వాత పడవ వెనక్కి తిప్పినపుడు ఏదో దిగులు చుట్టుముట్టింది. “అయినా ఈ ప్రయాణంలో మరొక రోజు మనం స్వయంగా హిమనీ నదం మీదికి వెళ్లి దిగే హెలికాఫ్టర్ టూరు కూడా ఉంది కదా” అని సత్య సముదాయించడంతో స్థిమితపడ్డాను.
తిరిగొచ్చేటపుడు గైళ్లు పిల్లల కోసం ఏవో గేముల వంటివి పెట్టేరు. నేను సిరిని తీసుకుని వెళ్లి సరదాగా పాల్గొన్నాను. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినందుకు సిరికి ఒక గైడు కం రేంజర్ అలాస్కా బ్యాడ్జ్ ని బహూకరించేడు.
అలా ఆహ్లాదంగా ఆనాటి మా గ్లేసియర్ టూరు సాయంత్రం 5 గం.కే పూర్తయ్యింది.
విట్టియార్ నుంచి ఎంకరేజ్ తిరిగెళ్లే మా రైలు 6గం.కు కావడంతో వరు, నేను నాలుగడుగుల్లో ఉన్న ఒక చిన్న బ్రిడ్జి దాటి రెస్టారెంటు వంటి చోటికెళ్లి రాత్రి భోజనంగా బర్గర్ల వంటివి కొనుక్కొచ్చేం.
మళ్లీ ఏంకరేజ్ కు రాత్రి 9 గం. కు తిరిగొచ్చేం. రైలు స్టేషను నుంచి హోటలుకి ఊబర్ టాక్సీ లో వచ్చేసరికి పదయ్యింది. రోజల్లా అలిసిపోయినా బయట వెలుతురు సాయంత్రం నాలుగ్గంటలు అయినట్టు ఉండడంతో సిరి ముందురోజులాగే నిద్ర పోవడం మానేసి ఆట మొదలు పెట్టింది. ఇక అందరం టీవీ పెట్టుకుని కూచుని, అర్థరాత్రయినా పడుకోకుండా కబుర్లు చెప్పుకుంటూ కూచున్నాం. ఆ నిద్రలేమి మర్నాటి నుంచి బాగా దెబ్బతీసింది మా అందరినీ.
*****
(ఇంకా ఉంది)
ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి –