మార్పు
-సంధ్యారాణి ఎరబాటి
నీలి నీలి నింగికి…నేనెపుడూ
ప్రేమదాసీనే…
ఆకులతో నిండిన…పచ్చదనానికి
నేను ఎపుడూ ఆరాధకురాలినే
ఎగిరే అలల కడలి అంటే
ఎంతో ప్రాణం
రహస్యం నింపుకున్న అడవన్నా
అంతులేని అభిమానం
నింగి అందాన్ని చూడాలంటే…..
చిన్న డాబా రూపు మార్చుకుంది…..
అందనంత ఎత్తుకు
ఎదిగి పోయింది
కొబ్బరాకుల గలగలలు
కొంటె చంద్రుడి
సరాగాలు మరుగున పడ్డాయి
చెట్ల జాడలు…..నీలి నీడల్లా
మారి
చోటు తెలియని
తీరాలకు వెళ్లిపోయాయి….
గ్రీష్మపు సాయంత్రాలు…కూడా
రూక్షత్వపు
ఆహ్లాదపులయ్యాయి
ఋతువులు మారిపోయాయి
వర్షం ఎపుడో
స్నిగ్ధత్వం మరచింది
పచ్చదనం…ఖచ్చితంగా…..
చిన్నబుచ్చుకుంది..
ఈ మహానగరంలో
పేక మేడల్లాంటి ఈ కట్టడాల
పునాదుల్లో.. హరితం మౌనంగా
సమాధి అయింది….
పక్షిలా ఎగిరే నా భావాలన్నీ…. విశాలగగనం లో విహరించక ఎన్నాళ్ళయిందో
అగ్గిపెట్టేల్లా కట్టిన కాంక్రీట్ అడవిలో
ఆకాశం కనిపించడం లేదు నాకు
పక్షుల కువకువల్లేవు…
వృక్షాల పవనాలు లేవు
పూవుల మకరoదాలు
తుమ్మెదల రాగాలు
ఎక్కడికి వెళ్లాయో….
ఇపుడు….. పున్నమి అందాలు లేవు….
వెన్నెల చల్లదనం కనపడదు….
ఆకాశం అందంగా కనిపించడం లేదు నాకు
*****
ఆర్ట్: మన్నెం శారద