అస్థిమితం…..
-సుధామురళి
ఒకటే రెక్కని ఎన్నిసార్లు ఆడించను చెప్పు
ఒకటే గుండెని ఎన్నిసార్లు సర్దుకోమని సర్దుబాటు చెయ్యను చెప్పు
ఓ నిప్పు కణాన్ని వదలాలనుకుంటా
ఆ రెప్పల చాటులో నుంచి
కనుగుడ్డు ఏ మాయలో కూరుకుపోతుందో కానీ
వేడి ఆవిరి ఎప్పుడో చల్లారిపోయిన కాఫీ కప్పు అవుతుంది…..
ఓ అక్షర తూటాని లాగి పెట్టి విడవాలనుకుంటా
ఆ చేదు తేనెల కలయికల మధ్యలోనుంచి
నరంలేని అర్ధమందపు నాలుక నాకేం పట్టింది అనుకుంటుందో ఏమోగానీ
అసలు అనుకోని పదాలను వల్లెవేస్తుంది
అది నేనేనా అన్నదనే భ్రమను నాకప్పగిస్తూ….
శూన్యం నిండా ఏదో నిండుకుని ఉంటుంది
వెలితిలేని ఖాళీ తనాన్ని ఎంతో బాగా అనుభవంలోకి తెస్తుంది
రాత్రి మొత్తం ఎక్కడికో తప్పిపోతుంది
నిశి ఎప్పుడూ నీతోనే ఉంటే ఇక నీకా బెంగేముంది
చుక్కలూ సూర్యుడూ
ఎప్పటి నుంచో నేస్తాలు
తెలుసుకోవడంలో పొరపడ్డది నువ్వే
రాళ్ళూ నీళ్ళూ
తోడూ నీడలు
తేడాలు చూపించి
ఒకవైపుకే దూకింది నీ మనసే
ఈగోలూ స్నేహాలూ
ఒకే బండి చక్రాలు
నడతలో తేడా ఉందని
ఇరుసును తిట్టుకున్నది నీ తెలియని తనమే…..
*****
ఆర్ట్: మన్నెం శారద
కంగ్రాట్స్ డియర్ 👏👏👏
చుక్కలు సూర్యుడు ఎప్పటినుంచో నేస్తాలు నువ్వే తెలుసుకోవడంలో పొరపాటు పడ్డావు చాలా నచ్చింది కవిత👌👌